మీ స్టార్టప్ ఐడియాకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావాలంటే ఇలా చేయండి..!!

మీ స్టార్టప్ ఐడియాకు ఫైవ్ స్టార్ రేటింగ్ రావాలంటే ఇలా చేయండి..!!

Wednesday February 10, 2016,

4 min Read

ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలన్న థాట్ మైండ్ లోకి వచ్చిందంటే చాలు - ఏదో తెలియని ఎగ్జయిట్మెంట్ మనల్ని వెంటాడుతుంది! నేను కూడా అలా మూడేళ్లపాటు ఉరిమే ఉత్సాహంతో ఆంట్రప్రెన్యూరియల్ చౌరస్తాలో నిలబడ్డాను! దిగితేగానీ లోతు తెలియదు! మోస్తేగానీ బరువు తెలియదు అంటారుగా!! సేమ్ నాది అదే పరిస్థితి! ఆ మూడేళ్లలో నాకు ఎన్నో విషయాలు బోధపడ్డాయి! ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలంటే ముందుగా చేయాల్సినవి ఏంటో, చేయకూడనివి ఏంటో, ఎలా చేస్తే బావుంటుందో, ఎలా వెళ్తే కంపెనీ బాగుపడుతుందో- ఇలాంటి విషయాలన్నీ వన్ బై వన్ అర్ధమయ్యాయి!! అందుకే నాకు తెలిసిన, నాకు అనుభవమైన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను! ఒక మంచి స్టార్టప్ కోసం నేను చెప్పబోయేవి పంచసూత్రాల్లాంటివి!!

image


స్టెప్ 1: అసలు మీ ఐడియా ఏంటి?

మీకు వచ్చిన థాట్ ఏంటి? ముందుగా మీకు మీరుగా విశ్లేషించుకోండి. దానికోసం కింద కొన్ని ప్రశ్నలు వేస్తున్నా.. వాటికి ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేయండి !

మీరు ఏ సమస్యను సాల్వ్ చేయాలనుకుంటున్నారు ?

ఆ సమస్య ఎక్కువగా ఎదుర్కునేది ఎవరు ?

దాన్ని ఎలా పరిష్కరించాలనుకంటున్నారు ?

ఉదాహరణకు.. నా అనుభవమే చెప్తా. ఆహార ధాన్యాలను నిల్వ చేయడమనేది మన దేశంలో అతిపెద్ద సమస్య. అదీగాక పొలంలోనే రకరకాల తెగుళ్ల బారిన పడి 40 శాతం పంట నాశనమవుతోంది. ఇక మారుమూల గ్రామాల సంగతి చెప్పనక్కర్లేదు. చేతికొచ్చిన పంట అప్పటికప్పుడు అమ్ముకోవడం తప్ప, వేరే గత్యంతరం లేదు. నిల్వ చేయడానికి సరైన గోడౌన్లు లేవు. దానికారణంగా తగిన గిట్టుబాటు ధర రావడం లేదు. చేసిన అప్పులు పూడటం లేదు. ఇలా ఒక ప్రాబ్లంతో ఇంకో ప్రాబ్లం ముడిపడి ఉంది. దీనికి పరిష్కారం వెతకాలని నా మనసులో పడింది. అలా చేయడం వల్ల రైతులు, అట్లీస్ట్ మంచి రేటొచ్చినప్పుడైనా పంటను అమ్ముకుంటారు. నాలుగు డబ్బులు చేతిలో మిగులుతాయి. వారి అప్పులైనా పూడుతాయన్నది నా అభిప్రాయం. అయితే కేవలం స్టోరేజీ మాత్రమే కాదు.. పురుగు పట్టకుండా, వర్షం ఈడ్చికొట్టినా పంట పాడవకుండా కాపాడాలన్నది నా స్టార్టప్ ఆలోచనలో భాగం.

ఈ స్టోరీ కూడా చదవండి

రైట్.. ఇప్పుడు స్టెప్ 2 విషయానికొద్దాం..

స్టెప్ 2. మీ కస్టమర్ ఎవరు?

కస్టమర్లే దేవుళ్లు అంటారు. అలాంటప్పుడు దేవుడి కోసం వెతకాలి. తప్పదు. మొదట చేయాల్సింది అదే. మీరు పెట్టాలనుకునే స్టార్టప్ ఎవరిని ఉద్దేశించింది? ఫస్ట్ ఇది తేల్చుకోవాలి. అసలైన కస్టమర్ల కోసం అంజనం వేయాలి. కంపెనీ ఎదుగదలకు వాళ్లే కీలకం. వాళ్లకున్న అవసరాలేంటి? అవి కాకపోయినా, దాని రిలేటెడ్ నీడ్స్ ఎవరికి కావాలి? అదే పాత రేటుకు మీ సరుకును అమ్మగలరా? ఒకవేళ అమ్మారే అనుకుందాం! కొనడానకి ఎంతమంది ముందుకొస్తారు? ఇదంతా తెలియాలంటే కస్టమర్ల వ్యక్తిత్వాలను, అభిరుచులను అంచనా వేయాలి. వాళ్ల నాడీ పట్టుకోవాలి. అవన్నీ తెలుసుకుని రఫ్ గా ఒక అంచనాకు రండి.

మళ్లా.. ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నా! జవాబు వెతకండి. జెన్యూన్ కస్టమర్లను దొరకబుచ్చుకోవడంలో ఎంతోకొంత హెల్ప్ అవుతుంది!

మీరు అనుకునే కస్టమర్ల ఏ వయసుకి చెందినవారు?

వాళ్లంతా మహిళలా, పురుషులా? లేక అందరా?

వాళ్ల వృత్తి, ప్ర‌వృత్తి ఏంటి?

ఏ ప్రాంతంలో నివసిస్తారు? (సిటీ, సబ్-అర్బన్, రూరల్)

వాళ్ల ఆర్ధిక స్థితిగతులేంటి?

ఇక స్టెప్ 3

కాంపిటిషన్ జోలికి పోకండి

రిస్క్ తీసుకోవాలి గానీ, పహిల్వాన్ తో ఓ పసివాడు పోటీ పడాలనుకోవడం ఆరోగ్యానికి అంతమంచిది కాదు. ఒకటి గుర్తు పెట్టుకోండి. జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదు. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్లతో పోటీయే వద్దు. వాళ్ల దారి వాళ్లది. మీ దారి మీది. సపోజ్, ఈ-కామర్స్ తురుంఖాన్లు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ కంపెనీలనే తీసుకుందాం. వాటిని పడగొట్టాలని తొడగొట్టిన ఎన్నో స్టార్టప్ లు బొక్కాబోర్లా పడ్డాయి. అయినా సరే, రంగంలోకి దిగాక పోటీ పోటీయే అనుకున్నారా? సరే, అలాగే కానీయండి. కానీ వాళ్ల ప్రాడక్ట్ కంటే మీ ప్రాడక్ట్ పది రెట్లు బెటర్ గా ఉండాలి సుమీ. ఎలా అంటే, ఉదాహరణకు ఆపిల్ ఐపాడ్ నే తీసుకోండి. దానికి పోటీగా వచ్చిన ఒక నార్మల్ ఎంపీత్రీ ప్లేయర్ ఏపాటి బాగుపడింది. ఎంతైనా ఆపిల్ ఆపిలే గురూ! అన్న భావన ప్రతీ ఒక్కరిలో ఉంది.

స్టెప్ 4 చూద్దాం..

4. గుత్తాధిపత్యం

ఒక రకంగా సమాజాన్ని గుత్తాధిపత్యం శాసిస్తుంది. చెప్పిందే రేటు. అమ్మిందే రైటు. దాన్నలా సస్టెయిన్ చేయడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. స్టార్టప్ విషయంలోనూ ఆ సూత్రం వర్తింపజేసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చదవండి. గుత్తాధిపత్యానికి వాళ్లు ఎంతటి బ్రాండ్ అంబాసిడర్లో అర్ధమవుతుంది.

ఇండియన్ రైల్వేస్, గూగుల్ సెర్చింజన్, మైక్రోసాఫ్ట్ విండోస్, డెస్క్ టాప్ ఆపరేషన్ సిస్టమ్, యునిలివర్, వాట్సాప్, ఫేస్ బుక్,.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

స్టెప్ 5. ప్లాన్ బిల్డప్

ముందుగా మీకు కంగ్రాట్స్. ఎందుకంటే మొదటి నాలుగు స్టెప్స్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడిక ఐదవ స్టెప్ ప్లాన్ బిల్డప్ సంగతి చూద్దాం.

A) ఇది ఒకరకంగా మెథోమథనం లాంటిది. బ్రెయిన్ స్టార్మింగ్ టైప్. ప్రతీ ఐడియాను ముందు పెట్టుకోండి. అందులో సిల్లీ థింగ్స్ ఉన్నా సరే. ప్రతీ ఆలోచనను జూమ్ చేసి చూడండి. ఒక లిస్టు తయారు చేసుకోండి. మీ ఐడియాతో బెనిఫిట్ పొందేవాళ్లు ఎవరు? ఎలాంటి వారికోసం మీరు స్టార్టప్ మొదలుపెట్టబోతున్నారు.

వెతికాక, ఇప్పుడేం చేస్తారంటే.. మినిమం వయబుల్ ప్రాడక్ట్ ని ఇంప్రూవ్ చేసుకోండి. అదెలా అంటే..

1. మీరే ఏం చేయాలనుకుంటున్నారో, ఎలాంటి ప్రాడక్టుని జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో రఫ్ గా ఒక పేపర్ మీద డిజైన్ చేయండి.

2. ఇప్పుడు మీరు పేపర్ మీద చేసిన రఫ్ వర్కంతా మీ వెబ్ సైట్ కు ఫస్ట్ వెర్షన్ లాంటిదని భావించండి. కానీ అదే ఫైనల్ అని కంగారు పడకండి. ఇంత దరిద్రంగా ఉందేంటని గాబరా పడకండి. బాలారిష్టాలు ఎక్కడైనా కామన్. లోటుపాట్లుంటాయి. సరిద్దుకోవచ్చు.

3. మీ రఫ్ వర్క్ ను ఇప్పుడేం చేస్తారంటే.. తీసుకెళ్లి మీ ఆఫీసులో చూపించండి. ఫస్ట్ హాండ్ రిపోర్టు తీసుకోండి.

4. మీరు చేసిన వర్క్ ను వాళ్లు ఎలా రిసీవ్ చేసుకున్నారో నిశితంగా గమనించండి. ముఖ్యంగా వాళ్ల హావభావాలు ఎలా వున్నాయో గమనిచండి. ముక్కూ మూతి విరుపులు లాంటివి గమనించండి. నవ్వారా, లేక ఆశ్చర్యపోయారా? చూడండి. ఏమైనా అడగాలంటే నిర్మొహమాటంగా అడగండి. సిగ్గుపడితే పని అవదు. వాళ్ల ఫీడ్ బ్యాకే మనకు కావాల్సింది.

5. ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత, వాళ్లు వావ్ అని చప్పట్లు చరిచారా లేక, ఇదెక్కడి తలతిక్క వ్యవహారమని చెప్పారా? ఒక క్లారిటీకి రండి. అప్పుడే స్టెప్ నెంబర్ వన్ పూర్తయినట్టు లెక్క. అలా మిగిలిన నాలుగు స్టెప్స్ క్లియర్ కావడానికి ఇదే పద్ధతి ఫాలో అవండి. అప్పుడు మీ స్టార్టప్ కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఆటోమేటిగ్గా వస్తుంది.

image


రచయిత గురించిః

సౌరభ్ సింగ్. పుస్తకాలు చదవడమంటే ఇతనికి వల్లమాలిన అభిమానం. చేతిలో ఎప్పుడూ ఒక నోట్ ప్యాడ్ ఉంటుంది. ఎప్పుడు ఐడియా వచ్చిన ఠక్కున రాసుకోడానికి వీలుంటుందని. ఒక బ్లాగ్ కూడా మెయింటెన్ చేస్తున్నాడు. కొన్ని మంచి స్టార్టప్ లకు సలహాలు ఇచ్చాడు. మాట సాయం చేయడం కంటే భాగ్యం ఏముంటుందనేది సౌరభ్ అభిప్రాయం.

Twitter: @saurabh_io | Website: http://saurabh.io

గమనిక: పైన పేర్కొన్న సూత్రాలన్నీ పూర్తిగా రచయిత సొంత అభిప్రాయాలే. అవి యువర్ స్టోరీ చెప్పినట్టుగా భావించొద్దు.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి