హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాలపాలిట అప‌ర భ‌ద్ర‌కాళి! ఆడపిల్ల‌ల‌కు కొండంత అండ‌ !!

హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాలపాలిట అప‌ర భ‌ద్ర‌కాళి!
ఆడపిల్ల‌ల‌కు కొండంత అండ‌ !!

Wednesday January 06, 2016,

2 min Read

హ్యూమ‌న్ ట్రాఫికింగ్. అమాన‌వీయంగా సాగుతున్న మాన‌వ అక్ర‌మ ర‌వాణా కాండ‌! దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో ఇదొక‌టి. ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల‌ను అంగడి బొమ్మ‌ల్లా అమ్మేస్తున్న వైనం. కరుకు గుండెను సైతం క‌న్నీళ్లు పెట్టిస్తుంది. ఆమె కూడా అంద‌రిలాగే చ‌లించిపోయారు. కానీ అక్క‌డితో ఊరుకోలేదు. భ‌ద్ర‌కాళిలా హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠాల‌పై ఉక్కుపాదం మోపారు. ఎంద‌రో ఆడ‌పిల్ల‌ల‌కు స్వేచ్ఛా వాయువులు అందించారు. ఆమె మ‌రెవ‌రో కాదు, బెంగాల్ నిప్పుక‌ణిక.. రంగుశౌర్య‌!!

రంగు శౌర్య‌

రంగు శౌర్య‌


చిన్న‌త‌నం నుంచే సేవాగుణం..

రంగు శౌర్య. పేరుకు త‌గ్గట్టే మ‌హా శౌర్య‌వంతురాలు. సామాజిక‌ కార్య‌క‌ర్త‌. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ కు ఎదురొడ్డి పోరాడిన ధైర్య శీలి. ఆమె పేరు చెప్తే ఆడ పిల్ల‌ల‌కు కొండంత భ‌రోసా. గుండెల‌నిండా ధైర్యం. ఉత్త‌ర బెంగాల్ లోని డార్జిలింగ్ హిల్స్ పానిఘ‌ట్టలో పుట్టారామె. గ్రాడ్యుయేష‌న్ దాకా చ‌దివారు. చెప్పాలంటే, సామాజిక సేవ ఆమెకు జ‌న్మ‌తః అబ్బంది. చిన్న‌ప్పుడే విరాళాలు సేక‌రించి స్కూళ్లో పేద విద్యార్థుల‌కు పుస్త‌కాలు కొనిచ్చేవారు. ఫీజులు కూడా క‌ట్టే వారు. ఆ సేవా గుణం ఆమెతోపాటే పెరిగింది. ఎక్క‌డ అన్యాయం జరిగినా స‌హించేవారు కాదు. ముఖ్యంగా ఆడ‌పిల్ల‌ల‌ను అంగ‌డి బొమ్మ‌ల్లా అమ్మేస్తున్న హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ఆమెను క‌దిలించింది. ఓసారి ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త ఇంట్లో బాండెడ్ లేబ‌ర్ గా ప్ర‌త్య‌క్ష న‌ర‌కం అనుభ‌విస్తున్న 13 ఏళ్ల బాలిక‌ను శౌర్య కొంత మందితో క‌లిసి ర‌క్షించారు. ఆ అమ్మాయి అనుభ‌వించిన క్షోభ గురించి తెలిసి చ‌లించిపోయారు. అప్పుడే శౌర్య‌కు త‌న ల‌క్ష్య‌మేంటో అర్థ‌మైంది. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ పై పోరాటానికి ఆ సంఘ‌ట‌న‌తోనే బీజం ప‌డింది. 

2004లో మొదలైన ఉద్య‌మం ఇప్ప‌టికీ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ట్రాఫికింగ్ ముఠాల చెర నుంచి వంద‌లాది మంది బాలిక‌లు, మ‌హిళ‌ల‌కు విముక్తి క‌ల్పించారు. సిక్కిం, నార్త్ బెంగాల్, అస్సాం, నేపాల్ నుంచి ట్రాఫికింగ్ ముఠాలు త‌ర‌లిస్తున్న‌500 మంది చిన్నారుల‌ను కాపాడారు. బాధితులంతా 18 ఏళ్ల లోపు బాలిక‌లే. ఆడ పిల్ల‌ల‌ను క‌ట్టు బానిస‌లుగా విక్ర‌యించ‌డం, వారి అవ‌య‌వాల‌ను అమ్ముకోవ‌డం లాంటి వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్న ముఠాల భ‌ర‌తం ప‌ట్టారు.

ఇప్ప‌టిదాకా మ‌నం చూసిన హ్యూమ‌న్ ట్రాఫికింగ్ మంచు ప‌ర్వ‌తంలో ఐస్ ముక్కంత మాత్ర‌మే. ఉత్త‌ర బెంగాల్ తేయాకు తోట‌ల నుంచి అమాయ‌క ఆడ‌పిల్ల‌ల‌ను గ‌ల్ఫ్ దేశాల‌కు అమ్మేస్తున్నారు. ఆ ముఠాల అంతు చూడ‌ట‌మే నా టార్గెట్- రంగు శౌర్య‌

ఎన్జీవో నీడ‌లో...

సిలిగుడిలోని కాంచ‌న్ జంగా ఉద్ధార్ కేంద్రం అనే ఎన్జీవో ద్వారా ఆడ పిల్ల‌ల‌కు రంగు శౌర్య‌ నీడనిస్తున్నారు. ట్రాఫికింగ్ చెర నుంచి ర‌క్షించి అక్క‌డ ఆశ్ర‌యం క‌ల్పిస్తున్నారు. శౌర్య‌ను బెదిరించిన వాళ్లూ లేక‌పోలేదు. మాఫియా బ్లాక్ మెయిల్ చేసింది. గూండాలు వార్నింగ్ ఇచ్చారు. త‌మ‌కు అడ్డు రావొద్ద‌ని డ‌బ్బు ఎర చూపారు. కానీ శౌర్య వాటికి బెద‌ర‌లేదు. హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ను ధైర్యంగా ఎదుర్కొంది. అమాన‌వీయంగా సాగుతున్న మాన‌వ అక్ర‌మ రవాణాకు పూర్తిగా అడ్డుక‌ట్ట వేయాల‌న్న‌దే శౌర్య ల‌క్ష్యం.