మహిళా పారిశ్రామికవేత్తలు అలవర్చుకోవాల్సిన 10 లక్షణాలు

మహిళా పారిశ్రామికవేత్తలు అలవర్చుకోవాల్సిన 10 లక్షణాలు

Tuesday January 26, 2016,

4 min Read

అందరూ పారిశ్రామికవేత్తలు కాలేరు. ఇబ్బందులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండడంతో పాటు రిస్క్ తీసుకోవడం కూడా వాళ్లకు అలవాటైపోవాలి. అందుకే చాలా తక్కువ మందే ఈ రంగంలోకి దిగుతారు, వాళ్లలో కూడా కొద్దిమందే విజయం సాధిస్తారు. ఇక మహిళల సంఖ్య ఇందులో మరీ తక్కువగా ఉంటుంది. సాధారణంగా మహిళలు సేఫ్ గేమ్ ఆడతారు. బిజినెస్‌లో వాళ్లకు ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. కిరణ్ మజుందార్ షా, సిమోన్ టాటా, ఏక్తా కపూర్, మంజూ భాటియాలను చూడండి. నేను ఏం చెబ్తున్నానో మీకు అర్థమవుతుంది.

ఓ సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్ అయ్యేందుకు కొన్ని అంశాల్లో నిపుణత అవసరం. ఓ మహిళా ఆంట్రప్రెన్యూర్‌ ఈ పది అంశాల్లో తన నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటే విజయం సాధించేందుకు మార్గం సుగమం అవుతుంది.

image


1. నెట్‌వర్కింగ్ - పరిచయాలు పెంచుకోండి

ఓ విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అన్నింటికంటే ముఖ్యం నెట్వర్కింగ్. కొత్త వాళ్లతో కలవడం వాళ్లతో మాట్లాడడం వంటివి మీకు ఉపకరిస్తాయి. ఎవరితో కలవకుండా కూర్చోవడం వల్ల మీకు ఒనగూరేది ఏమీలేదు. ఇతరులతో నెట్వర్క్ పెంచుకోవడం వల్ల మీకు లాభం ఉంటుందో ఉండదో తెలియదు కానీ నష్టమైతే ఉండదు కదా.. ? ఎంత ఎక్కువ మందితో కలిస్తే.. అంత ఎక్కువగా మీ అవకాశాలు పెరుగుతాయి. బలమైన పరిచయాలు ఉన్న వాళ్లతో స్నేహం చేయండి. తరచూ వాళ్లతో టచ్‌లో ఉండండి. సభలు, సమావేశాలు, కాన్ఫరెన్సులకు హాజరుకండి. మీ ఆలోచనలు పంచుకోండి. నెట్వర్కింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. అది ప్రయాణిస్తున్న బస్సులో కూడా కావొచ్చు. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.

2. బాధ్యతలు పంచండి

పని చేసే విధానం సరిగ్గా లేకపోవడం వల్లే చాలా మంది ఫెయిల్ అవుతారు. అన్ని పనులూ వాళ్లే దగ్గరుండి చూసుకోవాలనే తాపత్రయపడ్తారు. బాధ్యతలను ఇతరులకు పంచడం కూడా ఓ విజయవంతమైన బిజినెస్‌మెన్‌ కళ. అది మీ ఇంటినుంచే మొదలుపెట్టండి. ఓ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గా నడిపించడం మీ ఒక్కరివల్లే ఎప్పటికీ సాధ్యం కాదు. మీ ఆలోచనలు అర్థం చేసుకునే వాళ్లను నమ్మి, వాళ్లకూ కొన్ని బాధ్యతలు అప్పగించాలి. వాళ్లలో ఉత్సాహం నింపి పనులు చేయించుకోవాలి.

3. ధృడంగా ఉండండి

వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాక మీరు మరింత ధృడంగా మారాలి. ఊరికే చీటికీ మాటికీ.. చిన్నచిన్న వాటికి కదిలిపోకూడదు. వ్యాపారంలో అనేక ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే కోలుకుని సాధారణ స్థితికి వచ్చేలా ఉండాలి. మానసికంగా మరింత టఫ్‌గా మారి ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. మీకు ప్రయోజనమనిపించిన పనిచేయండి, ఎవరో గురించి ఆలోచించడం మానేయండి.

4. మీ ప్రోడక్ట్‌ను మీరు అమ్ముకోండి

ఆడా, మగా తేడాలేకుండా ప్రతీ ఒక్క ఆంట్రప్రెన్యూర్ అలవర్చుకోవాల్సిన ముఖ్య లక్షణమిది. మహిళలు ఈ విషయంలో కొద్దిగా అధిక శ్రద్ధ తీసుకుని మరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకు మార్కెటింగ్ అవసరం ఎంతో ఉంటుంది. కానీ అవి సేల్స్‌ ఫిగర్స్‌లో ప్రతిబింబించినప్పుడే ప్రయోజనం. అమ్మకాలే మీ విజయానికి మచ్చుతునక. ఎందుకంటే మీ కంపెనీకి డబ్బులు తెచ్చేవి అవే. మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఆంట్రప్రెన్యూర్స్ అంతా సేల్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవారే అనే విషయం గమనంలో ఉంచుకోండి.

5. కమ్యూనికేషన్ - మాటే మంత్రం

నోరు పెగలకపోతే పరిచయాలు పెరగవు, అమ్మకాలూ జరపలేదు. అనుకున్నది సరిగ్గా అవతలి వాళ్లకు చెప్పలేనప్పుడు మనకు ఎంత టాలెంట్ ఉన్నా అది నిష్ప్రయోజనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు ఏం అనుకుంటున్నారో అవతలి వాళ్లకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి. మీ క్లైంట్స్, ఉద్యోగులు, కస్టమర్లతో సంభాషించేందుకు సన్నద్ధమై ఉండాలి. మీ మాటల వల్లే ఉద్యోగుల్లో నమ్మకం పెరిగి, మీవెంటే ఉండేలా చేస్తాయి. కస్టమర్లు మళ్లీమళ్లీ వచ్చేలా చేయడానికి మాటను మంత్రంగా వాడండి. మీ ఆలోచనలను స్పష్టంగా పంచుకున్నప్పుడే ఇన్వెస్టర్లలో కూడా నమ్మకం పెరుగుతుంది.

6. బేరాలాడండి

ప్రపంచంలోనే ఇదో అద్భుతమైన కళ. ప్రతీ దశలోనూ మీ బేరామాడేందుకు మొహమాటపడొద్దు. ఉద్యోగులు, క్లైంట్లు, ఇన్వెస్టర్లు, వెండార్స్.. ఇలా ఎవరైనా కావొచ్చు. ఎంతగా బేరమాడితే కంపెనీకి అంత ప్రయోజనం. తక్కువ ధరకు సరుకులు ఇచ్చేలా వెండార్లతో, ఎక్కువ ధర ఇచ్చి కొనేలా కస్టమర్లతో, మెరుగైన వేల్యుయేషన్ ఇచ్చేందుకు ఇన్వెస్టర్లతో బేరమాడండి. మీరు ఇందులో వీక్ అయితే.. నేర్చుకోండి. ఆ గుణాన్ని మీలో నిబిడీకృతం చేసుకోండి.

7. మార్కెట్ పరిశీలన

ఓ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు, లేకపోతే.. ఆ సదరు వ్యాపారం ఎలా ఉందో పరిశీలించేందుకు మార్కెట్ పరిశోధన చాలా ముఖ్యం. సదరు రంగంలో ఉన్న అవకాశాలు, ట్రెండ్స్ పరిశీలించేందుకు తప్పకుండా మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. పోటీ ఎలా ఉంది, కస్టమర్లు ఏం కోరుకుంటున్నారు వంటి డెమోగ్రాఫిక్స్, ప్రొఫైల్స్ కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి.

8. బిజినెస్‌ప్లాన్ రూపొందించండి

మీరు ఆంట్రప్రెన్యూర్‌ ఎదగాలనుకుంటే బిజినెస్‌ ప్లాన్స్ రూపొందించడం కూడా మీకు వచ్చి ఉండాలి. ఇన్వెస్టర్లు చూపించడానికి మాత్రమే కాదు.. వ్యక్తిగతంగా మీకు ఉన్న లక్ష్యాలపై కూడా స్పష్టత వస్తుంది. ప్రారంభంలో మీరు రూపొందించుకునే బిజినెస్ ప్లాన్‌.. భవిష్యత్తుపై మీకు ఉన్న స్పష్టతను తెలియజేస్తుంది. ఒకవేళ పరిస్థితులు తారుమారైనప్పుడు సరిదిద్దుకునేందుకూ మార్గం ఉంటుంది. మారుతున్న మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది.

9. నిత్యవిద్యార్థిగా ఉండండి

ప్రతీ ఒక్కరికీ అన్నీ విషయాలు తెలిసే అవకాశమే లేదు. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోండి. తెలియని విషయాన్ని ఎవరు చెప్పినా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇతరుల నుంచి నేర్చుకోవడంతో పాటు పరిశ్రమలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోండి. అప్పుడే మీరు సుదీర్ఘకాలం పాటు వ్యాపారంలో ఉండగలరు.

10. విజయ సారధి మీరే

మీకు మీరే మాస్టర్, విజయం వచ్చినప్పుడు స్వేచ్ఛగా ఆనందించండి. ఎవరికో క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆత్మస్థైరాన్ని పెంచుకోండి. మీలో అంత సత్తాలేకపోతే ఇన్వెస్టర్లు మీ సంస్థలో పెట్టుబడి పెట్టరనే విషయాన్ని గ్రహించండి. మహిళా ఆంట్రప్రెన్యూర్లకు వ్యాపారం ఎప్పుడూ అంత సులువైన వ్యవహారం కాదు. అందుకే మీలో కొరవడిన నైపుణ్యాలను పెంచుకునేందుకు ఎక్కువగా కష్టపడండి. భయాలను అధిగమించండి. అప్పుడు విజయం మీ పాదాల చెంత ఎందుకు ఉండదో చూడండి.

image


గెస్ట్ రచయిత

- డా. సోమ్‌ సింగ్, మేనేజ్‌మెంట్- మార్కెటింగ్ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. కార్పొరేట్ రంగంలో దశాబ్ద కాలంపాటు పనిచేసిన తర్వాత అనేక ఎంఎన్‌సి సంస్థల్లో పనిచేశారు. ఆమె ఇప్పుడో స్టార్టప్ అడ్వైజర్, ఏంజిల్ ఇన్వెస్టర్, నాస్కామ్ 10k మెంటార్.

(Disclaimer: The views and opinions expressed in this article are those of the author and do not necessarily reflect the views of YourStory)

(image credit- Shutterstock)