రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌

 రియోకు ‘దీప’పు వెలుగులు

రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్‌

Tuesday April 19, 2016,

4 min Read


భారత క్రీడారంగంలో సరికొత్త చరిత్రకు తెరలేసింది. జిమ్నాస్ట్ విభాగంలో ఓ మహిళా క్రీడాకారిణి భారత్ తరఫున ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. రియోలో జరిగిన అర్హత పోటీల్లో నాలుగో స్థానంలో నిలిచి తిప్రుర జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఆగస్టులో జరిగే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయింది.

రొమానియన్ జిమ్నాస్ట్ నడియా కామెన్సీ 1976 మాంట్రెల్ ఒలింపిక్స్‌లో అద్భుత పెర్ఫార్మెన్స్‌తో చరిత్ర సృష్టించింది. పదికి పది పాయింట్లు సాధించి అరుదైన రికార్డు లిఖించింది. ఇప్పుడు దీప కర్మాకార్ కూడా అదే బాటలో పయనించాలనుకుంటోంది. ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అర్హత సాధించింది దీపా. రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున క్వాలిఫై అయిన తొలి జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. 

ఫ్లెక్సిబిలిటీ, కంట్రోల్, స్ట్రెంగ్త్. ఈ మూడింటి కలయికే జిమ్నాస్టిక్స్. అవన్నీ పక్కన పెడితే లయబద్ధంగా జిమ్నాస్ట్‌ల రింగ్‌లో కదులుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. దేశం తరఫున దీప ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో ఇప్పుడు క్రీడాభిమానులందరి చూపు రియో వైపు మళ్లింది.

దీప ఈశాన్య రాష్ట్రం త్రిపుర రాజధాని అగర్తలకు చెందిన క్రీడాకారిణి. ఆదివారం రియో డి జెనీరోలో జరిగిన తుది అర్హత పోటీల్లో విజయం సాధించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మహిళల ఆర్టిస్టిక్ కేటగిరీలో అత్యంత క్లిష్టమైన వాల్ట్స్ ప్రొడునోవా విభాగంలో 15.066 పాయింట్లతో 14 మంది ప్రత్యర్థులను ఢీకొని అగ్రస్థానంలో నిలిచింది. కానీ బార్స్‌ విభాగలో 11.700 పాయింట్లు మాత్రమే సాధించింది. బీమ్, ఫ్లోర్ విభాగాల్లో వరుసగా 13.366, 12.566 పాయింట్లు గెలుచుకుంది. మొత్తం 52.698 పాయింట్లతో రియో ఒలింపిక్స్‌కు బెర్త్ కన్ఫమ్ చేసుకుంది దీప. 

 అర్హత పోటీల్లో దీప (ఇమేజ్ క్రెడిట్ మిడ్ డే)

అర్హత పోటీల్లో దీప (ఇమేజ్ క్రెడిట్ మిడ్ డే)


వాస్తవానికి గత ఏడాది నవంబర్‌లోనే దీప రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాల్సింది. గ్లాస్గోలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలవడంతో తృటిలో అవకాశం కోల్పోయింది. దీంతో తన చివరి అర్హత పోటీల్లో రాణించి ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంది.

ఆరేళ్ల వయసులోనే..

అన్ని క్రీడలతో పోలిస్తే జిమ్నాస్టిక్స్ కాస్త విభిన్నంగా ఉంటుంది. శరీరాన్ని విల్లులా వంచాలి. ఇందుకోసం చిన్నప్పటి నుంచే కఠోర శ్రమ అవసరం. అందుకే చాలామంది చిన్నవయసులోనే జిమ్నాస్టిక్స్‌ వైపు దృష్టిసారిస్తారు. దీప కూడా ఆరేళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కోచ్ బిశ్బేశ్వర్ నంది పర్యవేక్షణలోనే శిక్షణ పొందుతోంది.

ఎన్నో అడ్డంకులు..

జిమ్నాస్ట్ కావాలన్న స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు చిన్న వయసు నుంచే దీప కఠోర శ్రమ చేసింది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంది. దీప పాదం అందరిలా ఎత్తు ఒంపుల మాదిరిగా కాకుండా సమాంతరంగా ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫీట్ క్రీడల్లో అంతగా సహకరించదు. ముఖ్యంగా జిమ్నాస్టిక్స్‌లో అస్సలు ఉపయోగపడదు. జంప్ చేసే సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అయితే కోచ్, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దీప తీవ్రంగా శ్రమించింది. వాస్తవానికి ఆమె జిమ్నాస్ట్ కావాలనుకోలేదు. కానీ దీప తండ్రి, వెయిట్‌ లిఫ్టింగ్ కోచ్ దులాల్ తన కూతురిని జమ్నాస్ట్ చేయాలన్న ఉద్దేశంతో నంది పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించారు. 2007లో 14 ఏళ్ల వయసులో జూనియర్ నేషనల్స్ విజయం సాధించి దేశం చూపును తనవైపు తిప్పుకుంది. 2011 వచ్చేసరికి వాల్ట్, బీమ్ బ్యాలెన్స్, ఫ్లోర్, అన్ ఈవెన్ బార్స్ వంటి విభాగాల్లో ఐదు స్వర్ణపతకాలు గెలుచుకుని తానేంటో ప్రూవ్ చేసింది. హిరోషిమాలో 2015 జూన్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో దీప కాంస్యం గెలుచుకుని సంచలనం సృష్టించింది. 2007 నుంచి ఇప్పటివరకు వివిధ పోటీల్లో 67 స్వర్ణ పతకాలు, సహా మొత్తం 77 పతకాలు గెలుచుంది.

గ్లాస్గోలో 2014లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం సాధించి సత్తా చాటింది దీప. ప్రొడునోవా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వాల్ట్‌లో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో కేవలం ఐదుగురు మహిళా జిమ్నాస్టులు మాత్రమే సాధించిన అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐదుగురు ప్రత్యర్థుల్లో 15.100 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రొడునోవా వాభాగంలో డిఫికల్టీకి 7.00, ఎగ్జిక్యూషన్‌కు 8.1, పెనాల్టీకి 0.1 రేటింగ్ ఇస్తారు. జిమ్నాస్టిక్‌లో ఇది చాలా క్లిష్టమైన అంశం. కొద్దిగా అటు ఇటయినా తీవ్ర గాయాలు తప్పవు. సామాన్యంగా ఇలాంటి విభాగాన్ని ఎవరూ ఎంచుకోరు. రష్యా, చైనాలాంటి దేశాల్లో మంచి వసతులు, శిక్షణ కారణంగా అక్కడి క్రీడాకారులు రాణిస్తారు. కానీ భారత్‌లాంటి దేశాల్లో ఇలాంటి విభాగాన్ని ఎవరూ ఎంచుకోరు. అందుకు కారణం సరైన వసతులు లేకపోవడమే. కాని దీప మాత్రం చాలా రిస్క్ తీసుకుని ఈ విభాగాన్ని ఎంచుకుని చరిత్ర సృష్టించింది.

సచిన్ ప్రశంసలు..

పెద్దవాళ్లిచ్చే చిన్న ప్రశంస చాలు.. స్ఫూర్తి నింపేందుకు. దీప ఇప్పుడు ఈ స్థాయిలో రాణించిందంటే అందుకు కారణం టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలే. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన భారత బృందానికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో దీపపై సచిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దీపలాంటి క్రీడాకారిణిని చూస్తుంటే గర్వంగా ఉందని సచిన్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఆమెలో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. సచినే కాదు సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, చెస్ దిగ్గజం ఆనంద్, శాయ్, క్రీడామంత్రి సోనోవాల్‌ కూడా దీపను మనసారా అభినందించారు.

సౌకర్యాలు నిల్..

భారత్‌లో క్రికెట్ అనేది అనేది మర్రి చెట్టులాంటిది. దాని నీడలో ఇతర క్రీడలు చిన్న మొలకల్లాంటివి. అవి బతకడం కష్టం. హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్‌లాంటి క్రీడల్లో ఒకరో ఇద్దరో వెలుగులోకి వస్తున్నా, జిమ్నాస్టిక్స్‌లాంటి వాటిని ఎవరూ ఎంచుకోవడంలేదు. అందుకు కారణం చేయూత, ఎంకరేజ్ లేకపోవడమే. అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలంటే ఎంతో డబ్బు కావాలి. మంచి కోచ్ కావాలి. అదంతా జరగని పని. దీప కోచ్ నంది కూడా చాలాసార్లు వసతులు కల్పించాలని కనిపించిన అధికారులందరినీ వేడుకుంది. కానీ ప్రయోజనం లేకపోయింది. అయినా అన్ని అడ్డంకులను ఎదుర్కొని కఠోరంగా శ్రమించి రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఈ మెగా ఈవెంట్‌కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పుడైనా భారత క్రీడాప్రాధికార సంస్థ (శాయ్), భారత ఒలింపిక్స్ అసొసియేషన్ అధికారులు ముందుకొచ్చి దీపకు సహకారమందిస్తే, రియోలో దేశ పతాకం రెపరెపలాడటం ఖాయం. ఎవరి సాయంలేకుండానే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీప.. రియోలో కూడా మెడల్ సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేయాలనియువర్‌స్టోరీ ఆశిస్తోంది. ఆల్ ది బెస్ట్ టు దీప కర్మాకర్.