టెక్నాల‌జీతోనే మ‌హిళా సాధికార‌త

టెక్నాల‌జీతోనే మ‌హిళా సాధికార‌త

Tuesday January 19, 2016,

3 min Read

టెక్నాలజీతో మానవ సంబంధాలే కాదు.. సామాజిక బాధ్యత పెంచచ్చు. సామాజిక చైతన్యమూ తీసుకురావచ్చు. అలా...దక్షిణాసియా దేశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సామాజిక సాధికారత కోసం ఉపయోగించే సంస్థలను ప్రతీ ఏటా మాంధన్ అవార్డులతో సత్కరిస్తున్నారు.

ఈ ఏడాది అవార్డులు వచ్చిన ఫైనలిస్టులు అంతా ఒకచోట కలిసే వేదిక ఏర్పాటుచేశారు. టెక్నాలజీ వినియోగించుకుని సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తించడంలో.. ఎదరయ్యే సవాళ్లు, గతంలో నేర్చిన అనుభవాలు, పాఠాలు లాంటి అంశాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. FeminismInIndia.com అనే సంస్ధ విన్నర్‌గా నిలిచిన సాధికారత కేటగిరీలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చలోకి వచ్చాయి. ఇదే కేటగిరీలో యూఎన్ విమెన్, టెలినార్ ఇండియా చేపట్టిన ప్రాజెక్ట్ సంపర్క్స్ స్పెషల్ మెన్షన్ స్ధానం దక్కించుకున్నాయి.


image


సాధించిన విజయాలు

మహిళా సాధికారతపై 57 మంది రచయితలు చేసిన దాదాపు 250 కిపైగా ఆర్టికల్స్ ని FeminismInIndia.com ప్రచురించింది. ఈ సైట్ కు ట్విట్టర్ లో 2వేలు, ఫేస్ బుక్ లో దాదాపు 15 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

చాలామంది రచయితలు అజ్ఞాత పేర్లతో కాకుండా తమ సొంత పేర్లతో తమ అనుభవాలను పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు-ఫౌండర్ జప్లీన్ పస్రిచ.

మహిళా సాధికారతపై సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి ఐక్యరాజసమితి ఒక వ్యవస్థను ఏర్పాటుచేసింది. 190 దేశాల్లోని 11 వేల మంది యూజర్స్ అందులో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. పనిచేసే చోట ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి అనేక అంశాలపై ఐదు భాషల్లో రాసిన ఆర్టికల్స్ అక్కడ దొరుకుతాయి.

మొబైల్ ఆపరేటర్ టెలినార్ ఇండియా ఈ మధ్యనే సంపర్క్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మహిళలకు టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటికే 89 గ్రామాల్లో 40 వేలమంది మహిళలకు మొబైల్ ఫోన్లు అందించారు. డయిల్ పేరుతో టెలినార్ నిర్వహించే కాల్ సెంటర్లో కూడా 35 మంది మహిళలు పనిచేస్తున్నారు. 40 మంది మహిళా ప్రమోటర్లు నిత్యం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు. టెలికాం ఇండస్ట్రీతో పాటు జీఎన్ఎమ్ఏ కూడా ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నాయి.

జమ్మూ కేంద్రంగా పనిచేస్తూ తల్లులను సపోర్ట్ చేసే జామ్ అనే ఆన్ లైన్ సపోర్ట్ గ్రూప్ ఫౌండర్ రీతూ గోరాయ్..తన అనుభవాలను, అభిప్రాయాలను మంథన్ 2015 సమావేశంలో మిగతా సభ్యులతో పంచుకున్నారు. తమ సంస్థ తరఫున ఇప్పటికే పేద పిల్లలకు హెయిర్ కట్స్ తో పాటు కళ్లు లేని వారికి ఆసరా కల్పించేందుకు చేతి కర్రలను పంపిణి చేశామని ఆమె తెలిపారు.

సవాళ్లు

మంథన్ అవార్డు గెలుచుకున్న ఆంట్రప్రెన్యూర్స్ చెబుతున్నదాని ప్రకారం.. టెక్నాలజీతో సామాజిక బాధ్యత నెరవేర్చడమనేది ఛాలెంజే. మహిళలకు ప్రాథమిక అవసరాలకు దూరంగా పెడుతున్న వ్యవస్థ వల్లే ఎక్కువ నష్టం జరుగుతుందనేది వారి అభిప్రాయం. ఉదాహరణకు చాలా చోట్ల మహిళలు సొంతంగా మొబైల్ ఫోన్ వాడటాన్ని కూడా నిషేధించారు. సంస్కృతి, సంప్రదాయాల పేరుతో జరుగుతున్న ఈ దురాచారాలను అరికట్టాలని, అందుకు టెక్నాలజీని మహిళలకు చేరువ చేయడమే మార్గమని సూచించారు.

డిజిటల్ టెక్నాలజీపై ముఖ్యంగా మహిళల్లో అవగాహన కల్పించాల్సి ఉంది. ఆన్ లైన్ కమ్యూనికేషన్, మహిళలకు అవసరమైన కంటెంట్ ని తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. ఇక డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ మహిళలు పాల్గొనేలా వారిలో చైతన్యం తీసుకురావాలి. సోషల్ మీడియాపై విస్తృత ప్రచారం కల్పించాలి. అయితే, సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తి అని, చైతన్యంతో పాటు మహిళలు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నది కూడా అక్కడేనన్న వాస్తవాన్ని అందరూ అంగీకరించాలి.

అనుసరించాల్సిన విధానాలు, పద్ధతులు

ఐటీని వినియోగించుకుని మహిళా సాధాకారత సాధించే అంశంపై సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ట్వీటథాన్స్, ట్విట్టర్ చాట్స్ ద్వారా చేసే క్యాంపెయిన్లకు ఎక్కువ ఆదరణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. మహిళల కెరీర్ కు సహాయపడుతున్న షెరోస్ లాంటి సంస్థలతో పనిచేస్తే ఆ సమాచారం మరింత ఉధృతంగా చేరుతుందని అన్నారు. వీటితో పాటు వీధి నాటకాలు, కమ్యూనికేషన్ కాంపెయిన్లు ఉపయోగపడతాయి. యూత్ కమ్యూనిటీలను కలుపుకుని కార్యక్రమాలు నిర్వహిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని ఎక్కువమంది సభలో అభిప్రాయపడ్డారు. రాణి స్కూలుకు వెళ్లాలా? అనే నినాదంతో చేసిన గ్రామవాణి, మహిళలకు రక్షణగా నిలిచే సేఫ్టీ పిన్ యాప్, గ్రామాల్లో వార్తలను అందించే ఖబర్ లెహరియా లాంటి కార్యక్రమాలు సక్సెస్ అయిన విషయాన్ని గుర్తుచేశారు.

రికమెండేషన్లు

మేకర్స్, డెవలప్ మెంట్ కమ్యూనిటీ ఇచ్చిన సలహాలు, సూచనలతో మంథన్ అవార్డుల సమావేశం ముగిసింది. అన్ని కార్పొరేట్, జాతీయ పాలసీల్లో మహిళా సాధికారతకు విస్తృతంగా స్ధానం కల్పించాలని అంతా అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ గా వీటిపై సమీక్షలు నిస్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని సూచించారు. ఆ డేటా ఆధారంగా తర్వాత కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

ఇండస్ట్రీ పరంగా.. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ తో పాటు టెలికామ్ సెక్టార్ల నుంచి మరింత సహాయ సహకారాలు అందాలి. స్టెమ్ ఎడ్యుకేషన్ లో మహిళల ప్రమేయం పెరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో మరింత మంది మహిళలకు వివిధ రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారిని కమ్యూనిటీ సెంటర్లను నడపగలిగే స్థాయికి తీసుకురావాలి. ఇది జరగాలంటే కమ్యూనిటీ సెంటర్లను గుర్తించడంతో పాటు ఎవరికి ఎలాంటి పని అప్పజెప్పాలన్న అంశంపై స్పష్టత తీసుకురావాలి. మహిళలను కేవలం టెక్నాలజీ వినియోగదారుల్లానే కాకుండా.. టెక్నాలజీని అభివృద్ధి చేయగలిగే స్ధాయికి తీసుకురావాలి.

మొత్తంగా మంథన్ అవార్డలు, సదస్సులు లాంటి కార్యక్రమాలను ఢిల్లీ చుట్టూ కాకుండా.. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించాలి. అందులో జరిగిన చర్చల సారాంశాన్ని అందరికీ అర్ధమయ్యేలా స్ధానిక భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలి.