ఒకప్పుడు సాధారణ కూలీ.. ఇప్పుడు అమెరికాలో మిలియన్ డాలర్ల కంపెనీ.. తెలంగాణ ఆడపడుచు జ్యోతిరెడ్డి ప్రస్థానం!

ఒకప్పుడు సాధారణ కూలీ.. ఇప్పుడు అమెరికాలో మిలియన్ డాలర్ల కంపెనీ.. తెలంగాణ ఆడపడుచు  జ్యోతిరెడ్డి ప్రస్థానం!

Monday March 07, 2016,

4 min Read


టెన్త్ పాస్ అయ్యాక పెళ్లి చేశారు. జీవితం ఉమ్మడి కుటుంబంతో సాగిపోవాలని పెద్దవాళ్లు చెప్పారు. పేదరికానికి, నిరక్ష్యరాస్యత తోడైంది. జీవితం అక్కడితో ఆగిపోయింది. కానీ జ్యోతిరెడ్డి ఆగిపోవాలని అనుకోలేదు. కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. అది ఎక్కడి దాకా అంటే, అమెరికాలో ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్కడి వారికి ఉద్యోగాలిచ్చే దాకా. ఈ సుదూరప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు, మరెన్నో మైలురాళ్లు.

“పొలంలో పనిచేస్తూ విమానం చూసి, జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కగలనా అనుకున్నా,” జ్యోతి రెడ్డి

జ్యోతిరెడ్డి మొదటి అమెరికా ప్రయాణంలో.. ఆనాడు పొలంలో పనిచేస్తూ విమానం వైపు చూస్తూ చేతులూపిన రోజులు గుర్తొచ్చాయట.. చెప్పుకుంటూ నవ్వుకున్నారు.

సెమీ ఆర్ఫాన్ స్కూళ్లో విద్యాభ్యాసం

ఇంట్లో చదివించడానికి స్థోమత లేక జ్యోతిరెడ్డి తోపాటు వాళ్ల చెల్లిని ఓ సెమీ ఆర్ఫాన్ స్కూల్లో జాయిన్ చేశారట.“పిల్లలకు అమ్మ లేదని మా నాన్న అబద్దం చెప్పారట. ఈ అబద్దాన్ని ఆరేళ్లు మోసానని ఆమె అన్నారు. అమ్మ అనే పదం చెప్పడానికే భయపడుతూ గడిపారట. అప్పట్లో ఆ ఆర్ఫాన్ స్కూల్ లో ఉండలేక జ్యోతిరెడ్డి వాళ్ల చెల్లి ఇంటికి తిరిగి వెళ్లిపోయారట. ఎలాగోలా టెన్త్ పూర్తి చేశారు. ఆ స్కూల్ పరిస్థితులే తాను జీవితంలో ఈ స్థాయికి రాడానికి కారణమయ్యాయని చెప్పుకొచ్చారు. ఆ సంఘర్షణ, జీవితాంతం కొనసాగేలా చేసిందని అన్నారు.

image


తెలిసిన వాళ్ల అబ్బాయితో వివాహం

చదువుకుంటానని ఎంత మొత్తుకున్నా ఇంట్లో పెద్దోళ్లు వినలేదు. ఇంటర్మీడియెట్ జాయిన్ అయినా పట్టించుకోకుండా పెళ్లి చేసేసారు. ఇద్దరు పిల్లలు. ఉమ్మడి కుటుంబానికి తోడైన పేదరికం. ఈ పరిస్థితుల్లో రోజూ వ్యవసాయం పనులకోసం పొలానికి వెళ్లడమే జ్యోతి రెడ్డి దినచర్య. సాయంకాలానికి ఇంటికి చేరి పిల్లలతో గడపడమే తెలుసు. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబం వేరుపడింది.

“నా భర్త అన్నిపనులు నన్నే చూసుకోమని బాధ్యతల నుంచి తప్పుకున్నారు,” జ్యోతిరెడ్డి

చంటి పిల్లలతో ఇంటి బాధ్యత ఎత్తుకున్న జ్యోతిరెడ్డికి నెహ్రూ యువ కేంద్ర అనే ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా దారి కనపడింది. ఆ సంస్థ పల్లెల్లో నైట్ స్కూళ్లు ఏర్పాటు చేసింది. దాంట్లో టీచర్ గా అవకాశం వచ్చింది. అప్పుడు జ్యోతి రెడ్డి జీతం నెలకి 120 రూపాయలు. ఆ తర్వాత అదే సంస్థలో ప్రమోషన్. ఉన్న ఊరు మారాల్సి వచ్చింది. జ్యోతిరెడ్డి కుటుంబం హన్మకొండకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ ఈ మార్పు ఆమె భర్తకు నచ్చకుండానే జరిగింది. హన్మకొండ నుంచి వేరు వేరు ఊళ్లకు ప్రయాణించడంలో తన జీవిత ప్రయాణం వెతుకున్నారు జ్యోతి. అప్పుడే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాసయ్యారు. ఆ తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది. జీవితం లో పెద్ద మార్పంటూ వచ్చింది అక్కడే. ట్రెయిన్లో చీరలు అమ్మారు. స్కూల్ టీచర్ గా తన కెరీర్ కొనసాగించారు.

హఠాత్తుగా అమెరికా అవకాశం

అమెరికా నుంచి తెలిసిన వాళ్ల అమ్మాయి హన్మకొండ వచ్చారు. తాను అమెరికాలో నెట్టుకురాగలనా అని ఆమెతో జ్యోతి రెడ్డి అడిగారట. ఎందుకు కాలేరని ఆమె చెప్పిన మాటలు జ్యోతిరెడ్డి జీవితాన్ని మర్చేసింది.

“అమెరికా వెళ్లాలి, కానీ ఎలా?కనీసం కంప్యూటర్ నాలెడ్జి లేదు,” జ్యోతిరెడ్డి

అప్పటికే టైపింగ్ నేర్చుకున్న జ్యోతి, కంప్యూటర్ పాఠాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో కంప్యూటర్ కోర్స్ లో జాయిన్ అయ్యారు. పాస్ పోర్ట్ కూడా అప్లై చేశారు. అమెరికా వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మనం ప్రయత్నం చేస్తే దేవుడు అవకాశం ఇస్తాడనేది తాను నమ్ముతానని చెమ్మగిల్లిన కళ్లతో అన్నారామె. కానీ మొదటిసారి వీసా రిజెక్ట్ అయింది. ఇదెంతో బాధ పెట్టిందట. ప్రయత్నంలో లోపం లేదు కనక మరోసారి ప్రయత్నించడంలో తప్పులేదని అనుకున్నారు.

“విజిటింగ్ వీసాలో అమెరికా పంపడానికి తెలిసిన వాళ్లు ఒప్పుకున్నారు,” జ్యోతి

నేను జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది శ్రీకాంత్ అన్నయ్యకే అంటారామె. ఆయనే లేకపోతే తాను అమెరికా వచ్చుండేదాన్ని కాదని అన్నారామె. ప్రతికూల పరిస్థితుల్లో తనకు ఎవరో ఒకరు సాయం చేశారు. అది వాళ్లకి చిన్నది కావొచ్చు. కానీ తన విషయంలో అది ఎంతో గొప్పదని అంటారామె.

image


క్యాసెట్ షాప్ లో మొదటి ఉద్యోగం

అమెరికా అయితే చేరుకున్నారు కానీ ఏం పని చేయాలి? ఇప్పటి వరకూ పడిన కష్టం ఒక ఎత్తయితే, అమెరికాలో మొదటి నుంచి జీవితం ప్రారంభించడం మరో ఎత్తు. క్యాసెట్ షాప్ లో సేల్ గాళ్ గా జాయిన్ అయ్యారు. రోజుకి 5 డాలర్ల ఉద్యోగం. అలా జ్యోతి అమెరికా కెరీర్ ప్రారంభమైంది. ఆ షాప్ కి వచ్చిన ఓ వరంగల్ ఎన్నారై ఆమెను చూసి మీరు టీచర్ కదా అని అడిగారు. మీరిక్కడ ఏం చేస్తున్నారు.. మీ స్కిల్ కి ఇది తగిన ఉద్యోగం కాదని చెప్పేసి వెళ్లిపోయారు. అప్పుుడ జ్యోతిరెడ్డి మనసులో సంఘర్షణ మొదలైంది.

కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి జ్యోతిరెడ్డికి ఫోన్ చేసి రిక్రూటర్ ఉద్యోగం ఉందని చేస్తారా అని అడిగారు. కానీ తనకి ఇంగ్లీష్ అంతగా రాదని ఆమె నిరాకరించారు. ట్రెయినింగ్ ఇస్తారని ఆయన కన్విన్స్ చేశారు. అలా రెండువేల డాలర్ల ఉద్యోగం విత్ అకామడేషన్. ఆ క్షణంలో తనకు పరిచయం అయిన ఓ తమిళ అమ్మాయి తన గురించి ప్రేయర్ చేసిందట. అది గొప్పసాయం కాకపోవచ్చు. కానీ తనకోసం ఎలాంటి స్వార్థం లేకుండా ఆమె చూపించిన ఎఫెక్షన్ మర్చిపోలేనని అంటారు జ్యోతిరెడ్డి.

ఉద్యోగం తర్వాత వ్యాపారం

సాఫీగా సాగుతున్న ఉద్యోగం. ఇంతలో 5 వేల డాలర్ల ఆఫర్. దీంతో నో చెప్పలేకపోయానని జ్యోతి అన్నారు. అప్పుడే ఓ బంపర్ ఆఫర్ వచ్చిందట. ఓ రిక్రూట్మెంట్ కంపెనీలో 50 శాతం షేర్ ఇస్తామన్నారు. కెరీర్ లో నిలదొక్కుకుంటున్న క్షణంలో ఇలాంటి ఆఫర్ రావడం నిజంగానే గొప్పవిషయం. ఎలాంటి ఆలోచన చేయకుండా ఉద్యోగానికి రిజైన్ చేసి అక్కడకి వెళ్లిపోయారు. సౌత్ కొరొలినా నుంచి వర్జీనియా బస్ లో వెళ్లారు. ఏకంగా 27 గంటల జర్నీ. తీరా వెళ్లాక తెలిసింది. ఆ కంపెనీ వాళ్లు లాభాల్లో యాభై శాతం అన్నారు. దీంతో డీల్ వర్కవుట్ కాలేదు.అప్పటికి వర్జీనియాలో నెలకి 5వేల డాలర్ల ఉద్యోగం పోయి, ఇటు డీల్ జరక్క ఏం చేయాలో పాలుపోలేదట ఇక ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. జీవితం చీకట్లోకి వెళ్లిపోయింది. సేవింగ్స్ డబ్బులున్నాయి. కానీ చేయడానికి పనిలేదు. ఒక్క క్షణంలో అమెరికాతో రుణం తెగిపోయింది. అమెరికా విడిచిపెట్టాల్సిన సమయం వచ్చిందేమో అనుకున్నారు. అప్పుడే పిల్లలు గుర్తొచ్చి ఇక్కడికి వచ్చారు. తిరిగి అమెరికా బయలుదేరినా ఏం పనిచేయాలో అర్థం కాలేదు .

ఫినిక్స్ ప్రారంభం

ఇండియాలో తాను నమ్మే ఓ జ్యోతిష్యుడు వ్యాపారం కలసి వస్తుందని చెప్పడంతో కంపెనీ ప్రారంభానికి పనులు మొదలుపెట్టారు. అలా ఫీనిక్స్ మొదలైంది. ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. ఏటికేడు ప్రయాణం.. ఒక్కో మజిలీ దాటుతూ వచ్చింది. ఇప్పుడు ఫినిక్స్ మిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించింది. ఇద్దరు పిల్లలకు పెళ్లిళ్లయ్యాయి. పూర్తిస్థాయి సేవకార్యక్రమాలకు జ్యోతి టైం కేటాయిస్తున్నారు. ఆర్ఫాన్ స్కూళ్ల ఏర్పాటుపై పోరాటం చేస్తున్నారు. తనతో కలసి వచ్చేవారికి ఆహ్వానం పలుకున్నారు. కంపెనీ పెట్టిన తర్వాత ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఎన్నారై సంఘాల్లో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

“జీవితంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, సక్సెస్ అయ్యాను, అంతకంటే ఈ గుర్తింపులు, అవార్డులు విలువైనవి కావని ముగించారు జ్యోతిరెడ్డి”