కశ్మీర్ విద్యార్థుల పాలిట ఆశాదీపం ముబీన్ మసూద్

కశ్మీర్ విద్యార్ధులకు ఉన్నత స్దాయి విద్యావకాశలను చూపుతున్న ‘రైజ్’దేశంలోని ఉన్నత స్దాయి విద్యావ్యవస్ధ వైపు ఆకర్శిస్తున్న ముబీన్ మసూదీ.

కశ్మీర్ విద్యార్థుల పాలిట ఆశాదీపం ముబీన్ మసూద్

Sunday April 26, 2015,

4 min Read

ఎప్పుడూ సమస్యలతో సతమతమవుతూ ఉండే కశ్మీరీ లోయలో, విద్యా రంగానికి ఓ ఆశను వెలిగించారు ముబీన్ మసూదీ. ముఖ్యంగా జేఈఈ (మెయిన్స్, అడ్వాన్స్డ్) వైపు వెళ్లే వారి కోసం ప్రత్యేక పర్యవేక్షణతో పాటు కోచింగ్ ఇచ్చే ‘రైజ్’ (RISE) అనే సంస్ధను ఏర్పాటు చేసారు.

అక్టోబర్ 2012 లో ప్రారంభమైన ‘రైజ్’ ను ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్ ముబీన్ మసూదీ ప్రారంభించారు. కశ్మీరీ యువకుల్లో సానుకూల ప్రభావం ఏర్పాటు చేయడమే ‘రైజ్’ ఉద్దేశమంటున్నారు ముబీన్.

యువర్ స్టోరీ తో తన అనుభవాలు పంచుకున్న ముబీన్, కశ్మీర్ లో విద్యా విధానాన్ని బలపరచడంతో పాటు అవగాహన పెంచడం, అవకాశాలు, వనరుల సమీకరణ వంటి అంశాలపై దృష్టి సారించినట్టు తెలిపారు.

ముబిన్ మసూది

ముబిన్ మసూది


యువర్ స్టోరీ: ‘రైజ్’ ఇన్‌స్టిట్యూట్ గురించి చెప్పండి ?

ముబీన్ : కశ్మీర్‌లోని హై స్కూల్ పిల్లలకు సమానమైన విద్యావకాశాలు కల్పించే లక్ష్యంతో, శ్రీనగర్ మరియు జమ్ము కశ్మీర్‌లో మెంటారింగ్ మరియు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌గా ‘రైజ్’ ప్రారంభమైంది. ఈ ఇన్‌స్టిట్యూట్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్ కోసం సరైన మర్గదర్శకంగా పని చేస్తుంది. ప్రస్తుతానికి జాతీయ స్దాయిలో జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్, బిట్ సాట్ వంటి పోటీ పరిక్షలతో పాటు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు కూడా కోచింగ్ ఇస్తున్నాము.


యువర్ స్టోరీ: మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, రైజ్ ప్రారంభించడానికి మిమ్మల్ని ప్రోత్సహించిందెవరు ?

ముబీన్: 2011 లో ఐఐటీ బాంబే నుండి బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చేసాను. ఆ తరువాత గుర్గావ్‌లో సంవత్సరం పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెన్సీ కంపెనీలో ఉద్యోగం చేసాక, ఏమాత్రం సంతృప్తి కలగలేదు. ఆ ఉద్యోగం ముఖ్యమైనదిగా, లేదా ప్రభావం చూపే విధంగా కనిపించలేదు. నిత్యం అదే పని బోరింగ్‌గా అనిపించింది. ఇదంతా నాకు నచ్చలేదు. ప్రజలపై ప్రభావం చూపే పని చేయాలని ఆలోచించాను.

కశ్మీర్ లోని స్కూల్స్‌తో పనిచేయడానికి 2012 ఆగస్టులో ఉద్యోగానికి రాజీనామ చేసాను. అక్కడ స్కూల్స్‌లో విద్యా విధానం సరిగా లేక, ఎంతో తెలివైన విద్యార్ధలకు కూడా టాప్ కాలేజీల్లో అడ్మిషన్లు దొరకడంలేదు. ఇక అవగాహన ఉన్న మరి కొంత మందికి సరైన గైడెన్స్ లేకపోవడంతో వారు కూడా అదే పరిస్థితులు ఎదురుకుంటున్నారు. ఐఐటీ బాంబేలో చదువుకున్న మా బ్యాచ్లో ఏకైక కశ్మీరీ విద్యార్దిని నేను, అది కూడా నా స్కూలింగ్ దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగినందుకు ఐఐటీ వరకు వెళ్లాగలిగానేమో, అదే కశ్మీర్లో చదివి ఉంటే బహుశా ఆ అవకాశం రాకపోయేది.

నెల పాటు ప్లానింగ్ చేసి 2012 అక్టోబర్‌లో ‘రైజ్’ ఇన్ స్టిట్యూట్ పారంభించాను, మొదట్లో ప్రభుత్వంతో పని చేయాలనుకున్నా.... వారి నుండి సరైన సహకారం లేకపోవడంతో నా సొంతంగా ఈ ఇన్‌స్టిట్యూట్‌ని ప్రారంభించాను.

యువర్ స్టోరీ: కశ్మీర్ లో ఇలాంటి ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించడానికి మీరు ఎదురుకున్న సవాళ్లు ఎంటి ?

ముబీన్: మొదట్లో జేఈఈ కోసం కోచింగ్ ప్రారంభించిన మాకు, హైస్కూల్ విద్యార్ధులు, టీచర్ల మధ్య అవగాహన పెంచడం సవాలుగా మారింది. ముందు స్థానిక పత్రికల్లో కొన్ని ఆర్టికల్స్ రాయడంతో పాటు, కొన్ని స్కూల్స్‌లో ఇలాంటి అవకాశాలపై సెమినార్లు నిర్వహించాము. ఓ పది మంది విద్యార్ధుల బ్యాచ్‌తో ఇన్‌స్టిట్యూట్ మొదలు పెట్టాము.

దురదృష్టవశాత్తు, కశ్మీర్ లో పిల్లలను వారి సమర్ధత తెలుసుకునే అవకాశం కల్పించరు. దాని వల్ల తల్లిదండ్రులతో పాటు అక్కడి టీచర్స్ కూడా వారిని ప్రోత్సహించకపోవడం బాధాకరం. ఈ అంశాలనే సవాలుగా తీసుకుని, విద్యార్ధులను ముందు వారిని వారి సామర్ధ్యం గురించి తెలియజేస్తాం. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని వారికి గుర్తింపజేస్తాం. ఇవి గుర్తెరిగి విద్యార్థి రెడీగా ఉంటే మిగితా పనులు సులువుగా జరుగుతాయి.

ఇక మిగిలిన సవాల్ స్థానిక ప్రభుత్వ అధికారుల అవినీతి. గత ఏడాది కశ్మీర్‌ లోయలో టాలెంట్ సెర్చ్ నిర్వహించి, సామర్ధ్యం ఉన్న విద్యార్దులకు ఉచిత ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి కోర్సులకు కోచింగ్ ఇవ్వాలని ప్రయత్నించాం. కానీ సంబంధిత అధికారులు లంచం ఆశించడంతో ఆ ప్లాన్‌ను ఆపాల్సివచ్చింది.

2014 సెప్టెంబర్ వరదల కారణంగా భారీ నష్టాలను ఎదురుకున్నాం. ఇన్‌స్టిట్యూట్ గ్రౌండ్ ఫ్లోర్ 15 రోజుల పాటు నీళ్లతో మునిగిపోయింది. మా లైబ్రరీలో ఉన్న 4 వేల పుస్తకాల్లో కేవలం 200 పుస్తకాలను మాత్రమే కాపాడుకోగలిగాము. దేవుడి దయవల్ల అంతా సద్దుమణిగాక మళ్లీ కోర్సులను ప్రారంభించాము.

యువర్ స్టోరీ: మీరు ఈ ఇన్‌స్టిట్యూట్ ఎంత మందితో ప్రారంభించారు, ఇప్పుడు మీతో ఉన్నది ఎంత మంది?

ముబీన్ : ప్లానింగ్‌లో తనుజ్ భోజ్వాని నాకు సహకరించారు. ఇన్‌స్టిట్యూట్ ప్రారంభమయ్యాక కశ్మీర్‌లో నేనొక్కడినే ఉన్నాను. తనుజ్ తన సొంత వ్యాపారంలో బీజీ కాగా, గత రేండేళ్లలో ఇద్దరు ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్ధులు ఇమ్బెసత్ అహ్మద్, సవూద్ నజీర్ మాతో పార్ట్ టైమర్స్‌గా చేరారు. ఆ ఇద్దరు కూడా వారి ఐఐటీ పూర్తయ్యాక 2015-2016 లో ఫుల్ టైమర్స్‌గా ‘రైజ్’ లో చేరబోతున్నారు.

యువర్ స్టోరీ : ఇప్పటి వరుక ఎంత మంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చారు. వారి నుండి స్పందన ఏ విధంగా ఉంది ?

ముబీన్ : ఇప్పటి వరకూ సుమారు 100 మందికి కోచింగ్ ఇచ్చాము. కశ్మీర్లో ఐఐటీ గురించి ఇప్పుడిప్పుడు అవగాహన పెరుగుతోంది. గత రెండేళ్లలో మా రిజల్ట్స్ చూసి స్కూల్స్ నుండి మంచి స్పందన ఉంది. మా మొదటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ఈ సంవత్సరం జేఈఈ పరీక్షల కోసం సిధ్ధమవుతోంది. ఫలితాలు బాగా వస్తే జూనియర్స్‌కి ప్రోత్సహం కూడా దొరుకుతుంది.

యువర్ స్టోరీ : ఈ ఇన్‌స్టిట్యూట్ కోసం పెట్టుబడి రాబట్టడం, లాభాలు సంపాదించడంలో మీ ప్రయత్నం ఎలా ఉంది.

ముబీన్ : ప్రారంభంలో మార్కెటింగ్, మరియు ఇన్ స్టిట్యూట్ కార్యకలాపాల కోసం సొంతంగా నా డబ్బును ఖర్చు పెట్టాను, తరువాత విద్యార్ధులు రావడం మొదలు పెట్టాక ఇన్ స్టిట్యూట్ నడిపేందుకు అయ్యే ఖర్చులు సరిపోయేది, ప్రస్తుతానికి అన్ని ఖర్చులు పోను, నా జీతం కూడా సరిపోతుంది, ముందు ముందు ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నాను.

యువర్ స్టోరీ : మీ ప్రస్తుత లక్ష్యాలు, భవిష్యత్తు ప్లాన్స్ ఏంటి..?

ముబీన్ : ప్రస్తుత లక్ష్యం వీలైనంత మంది ఐఐటీ సెలక్షన్స్‌లో రాణించడం, వాటి వల్ల వాళ్లంతా మిగతా వారికి రోల్ మోడల్స్‌గా నిలుస్తారు. ఓ సారి ఇలాంటి రోల్ మోడల్స్‌ని తయారు చేస్తే మిగితా వారికి లక్ష్యం సాధించడం పెద్ద కష్టం కాదనే నమ్మకం కలుగుతుంది.

విద్యార్ధుల కోసం ఓ యాప్‌ని కూడా కనిపెట్టాము. దీని వల్ల విద్యార్ధుల ప్రిపరేషన్స్ , టీచర్ల టీచింగ్‌కు కూడా ఉపయోగపడుతుంది. మా స్టూడెంట్స్‌కు ట్యాబ్లెట్స్ ఇవ్వబోతున్నాము. అందులోనే ఈ యాప్ ఇన్‌స్టాల్ అయిఉంటుంది. కశ్మీర్ లాంటి ప్రాంతంలో రాజకీయ పరిణామాల వల్ల వారాలపాటు కొన్నిసార్లు ఇన్‌స్టిట్యూట్ మూసి వేసే పరిస్ధితులు ఏర్పడుతాయి. అలాంటప్పుడు అవసరమైన సిలబస్‌తో ఈ యాప్ విద్యార్ధులకు ఉపయోగపడుతుంది.

దీనితో పాటు శ్రీనగర్ లోని ఓ స్కూల్‌తో పొత్తు కూడా పెట్టుకున్నాము. అక్కడి టీచర్లు, విద్యార్ధులతో పని చేస్తూ, అక్కడి విద్యా వ్యవస్ధను పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాము.

అవసరమైన గైడెన్స్‌తో పాటు వనరులు కల్పించగలిగే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ గా ఎదగాలనేదే మా లక్ష్యం, ఇలా జరగడానికి విద్యా సంస్ధల సహకారం కూడా ఎంతో అవసరం, అంతే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వ సహకారం కూడా దొరుకుతుందని, కశ్మీరీ విద్యార్ధులు కూడా ఉన్నతమైన స్దానాల్లో ఉంటారని ఆశిస్తున్నాను.