ఆన్ లైన్ లో ఉద్దెర బేరం.. రిటైలర్లకు గొప్ప వరం

25 రోజుల్లో 25 వేల మంది కస్టమర్లు! 

ఆన్ లైన్ లో ఉద్దెర బేరం.. రిటైలర్లకు గొప్ప వరం

Wednesday March 16, 2016,

5 min Read


కంప్యూటర్‌ ముందు కూర్చొని మౌస్‌ క్లిక్‌తో ఆర్డరిస్తే చాలు కోరుకున్న వస్తువు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యే రోజులివి.. ఫుడ్‌ ఐటెమ్స్‌ నుంచి ఫ్యాన్సీ డ్రెస్సుల వరకు ఇలా ఒక్కటేమిటి సమస్తం ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. ఈ కామర్స్‌ కు ఆదరణ పెరుగుతుండటంతో కొత్త కొత్త స్టార్టప్‌లు ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్ మొదలుకొని పోపుల డబ్బాలో ఉండే మసాలాలు అందించే స్టార్టప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కూడా బిజినెస్‌ టు కస్టమర్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. అదే ఓ రిటైలర్‌ సరుకు కొనాలంటే ఈ సైట్లలో అవకాశం ఉండదు. పైగా డిస్ట్రిబ్యూటర్లలా అరువు బేరం కుదరదు. ఇలాంటి సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టేందుకు పుట్టుకొచ్చిందే జస్ట్‌ బై లైవ్‌.

ఇదీ నేపథ్యం

సాహిల్‌ సానీ, బోస్టన్‌ కాలేజ్‌ గ్రాడ్యుయేట్‌. స్టడీస్‌ కంప్లీట్‌ అయ్యాక ఇండియాకు తిరిగొచ్చిన సాహిల్‌ తమ ఫ్యామిలీ బిజినెస్‌ అయిన డిస్ట్రిబ్యూషన్‌ రంగంలో 15 ఏళ్ల పాటు పనిచేశారు. వారి ఫ్యామిలీ కేవలం హర్మాన్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్ట్స్‌ ను మాత్రమే పంపిణీ చేసేది. అయితే సాహిల్‌కు మాత్రం ఒక్క బ్రాండ్‌కే పరిమితం చేయడం ఇష్టం ఉండేదు కాదు. బిజినెస్‌ ఎక్స్‌పాండ్ చేయాలన్న కోరికతో మార్కెట్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన సాహిల్‌ చాలా విషయాలు తెలుసుకున్నారు. అదే కొత్త స్టార్టప్‌ ప్రారంభించేందుకు కారణమైంది.

image


దేశంలో ఈ కామర్స్‌ రంగం ఇప్పుడిప్పుడే డెవలప్‌ అవుతోంది. మార్కెట్‌ అధ్యయనంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. బడా బడా ఈ కామర్స్‌ పోర్టల్స్‌ B2C ఫార్ములాపైనే ఫోకస్‌ చేస్తున్నాయని అర్ధమైంది. మరి రిటైలర్ల సంగతేంటి? డిస్ట్రిబ్యూషన్‌ కోసం కంపెనీలు ఈ కామర్స్‌ టెక్నాలజీని ఎందుకు వాడుకోకూడదు. ఇదే ఆలోచన వచ్చింది వారికి. 

”రిటైలర్లతో నాకు మంచి సంబంధాలున్నాయి. లక్షలాది మంది చిన్న కిరాణా వ్యాపారులను డిజిటల్‌ వేవ్‌లోకి తీసుకురావాలనుకున్నాను. రిటైలర్ల ఇబ్బందులు, కష్టాలను అధ్యయనం చేసిన తర్వాత 2015లో జస్ట్‌ బై లైవ్‌ ఏర్పాటు చేశా” -సాహిల్‌.

రిటైలర్లు 40-50 మంది డిస్ట్రిబ్యూటర్లలో డీల్‌ చేయాల్సి వస్తుంది. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌ ఒక కంపెనీ ప్రొడక్ట్స్‌ను మాత్రమే పంపిణీ చేస్తారు. డిస్ట్రిబ్యూటర్లు దయపైనే రిటైలర్లకు స్టాక్‌ అందుతుంది. క్రెడిట్‌ ఫెసిలిటీ ఇస్తారు. అయితే తమకు సరైన ధరకే తమకు సరుకు అందుతోందా? కంపెనీ ఇచ్చే ఆఫర్లు, స్కీంలు తమ దాకా చేరుతున్నాయా అనే సందేహం రిటైలర్లలో ఉంటుంది. 

 సరిగ్గా ఇవే సందేహాలతో ఇండియన్‌ ఫైనాన్స్‌ ఇండస్ట్రీలో గొప్ప పేరున్న భరత్‌ బాలచంద్రన్‌ను కలిశారు సాహిల్‌. దేశంలో అప్పులిచ్చే అతి పెద్ద సంస్థను నడుపుతున్న ఆయన.. కొన్ని బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ చేస్తున్నారు. బాలచంద్రన్‌ నుంచి ఫైనాన్స్‌ కిటుకులు తెలుసుకున్నారు. అవే జస్ట్‌ బై లైవ్‌ స్టార్టప్‌ ఏర్పాటుకు ఎంతో ఉపయోగపడ్డాయంటారు సాహిల్‌.

జస్ట్‌ బై లైవ్‌లో వివిధ రకాల బ్రాండ్‌ ప్రొడక్ట్స్‌ను అందుబాటులో ఉంచారు. రిటైలర్లకు వాటిలో అవసరమైన వస్తువుల్ని ఎంపిక చేసుకుని అవసరమైన క్వాంటిటీలో ఆర్డర్‌ చేయొచ్చు. హైపర్‌ లోకల్‌ గ్రోసరీ యాప్స్‌ లాగే జస్ట్‌ బైలోనూ బ్రాండ్‌ నేమ్‌, లోగోల ఆధారంగా ప్రొడక్ట్స్‌ను లిస్టు చేశారు. రిటైలర్లు అందులోంచి ఈజీగా ప్రొడక్ట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

“డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థను మెరుగుపరిచేందుకు టెక్నాలజీని ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా సంప్రదాయ విధానాన్నే అనుసరిస్తున్నారు.” -సాహిల్‌

ఈ కొత్త విధానంలో సరుకు కొనుగోలు చేసేందుకు రిటైలర్లను ఒప్పించడం కత్తిమీద సామే అవుతుందని అనుకున్నారు సాహిల్‌. కానీ అదృష్టవశాత్తూ పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. 1000 మందితో కలిసి టీంను ఏర్పాటు చేసి రిటైలర్లను ప్రత్యక్షంగా కలిసి జస్ట్ బై లైవ్ గురించి వివరిస్తున్నారు. జస్ట్ బై లైవ్ పై అవగాహన కల్పించడంతో పాటు వారి ప్రొఫైల్ లు సెట్ చేసేందుకు సాయం చేస్తున్నారు. జస్ట్ బైలో ఎలా ఆర్డర్ ఇవ్వాలో నేర్పుతున్నారు.

ఉత్పత్తిదారుల నుంచి ఆదరణ

జస్ట్‌ బై లైవ్‌ రిటైలర్లకే కాదు మానుఫ్యాక్చర్లకు కూడా ఎంతో లాభసాటి అంటున్నారు సాహిల్‌. ఉత్పత్తి అయిన వస్తువును కన్జ్యూమర్లకు చేరవేసే ప్రక్రియలో ఉన్న దశలు తగ్గిపోయాయి. డిస్ట్రిబ్యూటర్ల స్థానంలో కొత్త వ్యవస్థ వచ్చింది. మధ్యవర్తులు లేకపోవడంతో రిటైలర్లతో పాటు ఉత్పత్తిదారుల లాభం 5 నుంచి 10శాతం వరకు పెరిగింది. అయితే మ్యానుఫ్యాక్చర్లను జస్ట్ బైలో సరుకు అమ్మేలా ఒప్పించేందుకు కొంచెం కష్టపడాల్సి వచ్చిందంటారు సాహిల్.

జస్ట్ బై వల్ల కలిగే లాభాలను ఉత్పత్తిదారులకు అర్థమయ్యేలా వివరించడంలో సక్సెస్‌ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్ల స్థానంలో నమ్మదగ్గ ప్రత్యామ్నాయంగా నిలిచారు. రిటైలర్లతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించారు. సరకు రవాణాకు సంబంధించి పక్కా ప్లాన్ తో రిటైలర్లకు అనుకున్న సమయంలోగా వస్తువులు డెలివర్ అయ్యేలా చేశారు. డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడకుండా మ్యానుఫాక్చరర్లు నేరుగా ఫీడ్ బ్యాక్ తీసుకునే అవకాశం కల్పించారు.

హిందుస్థాన్ యూనిలీవర్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఐటీసీ ప్రొడక్ట్స్‌ను, కోక్‌ డిస్ట్రిబ్యూటర్‌ పెప్సీ ఉత్పత్తులను పంపిణీ చేయడమన్నది కలలో కూడా జరగదు. కానీ ప్రపంచంలోనే అలాంటివి సరఫరా చేసే మొట్టమొదటి డిస్ట్రిబ్యూటర్లుగా జస్ట్ బై నిలిచింది. దేశ, విదేశీ బ్రాండ్లను ఒకే గొడుకు కిందకు తెచ్చి రిటైలర్లకు అందిస్తున్నారు.

2015 నవంబర్‌లో బాంబే, ఢిల్లీ, బెంగళూరులో జస్ట్‌ బై లైవ్‌ బేటా వెర్షన్‌ లాంఛ్‌ అయింది. 1000 మంది రిటైలర్లతో ప్రారంభించిన ట్రయల్‌ బీభత్సంగా సక్సెస్‌ అయింది. 2016 జనవరి 1 నుంచి ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ డివైజ్‌లలో యాప్‌ ఓన్లీ సర్వీసులు ప్రారంభించిన ఈ స్టార్టప్‌ నెల రోజుల వ్యవధిలోనే 15 సిటీల్లో 25వేల మంది రిటైలర్లకు దగ్గరైంది. ఇదే సమయంలో కంపెనీకి మైలురాయి లాంటి ఫండింగ్‌ను సాధించగలిగింది. ఆల్ఫా క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 20మిలియన్‌ డాలర్ల సీరీస్‌ A ఫండింగ్‌ పొందింది జస్ట్‌ బై.

జస్ట్‌ బై లైవ్‌ కు నిత్యం వెయ్యి మంది రిటైలర్లు యాడ్‌ అవుతున్నారు. ఇప్పటి వరకు నెలనెలా 300శాతం గ్రోత్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం వెయ్యి బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్‌ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ స్టార్టప్‌కు ప్రస్తుతం 15 వేర్‌ హౌస్‌లున్నాయి. కంపెనీ సగటు లావాదేవీల మొత్తం 200 డాలర్లు కాగా... జస్ట్‌ బై 10శాతం మార్జిన్‌ తీసుకుంటోంది. ఇప్పటి వరకు జస్ట్‌ బైలో రిజిస్టర్‌ అయిన రిటైలర్లలో 67శాతం మంది రెండోసారి ఆర్డర్‌ ఇచ్చారు.

“మార్చి 31నాటికి లక్ష మంది రిటైలర్లు జస్ట్‌ బై కస్టమర్లుగా మారుతారని ఆశిస్తున్నాం. 2016 డిసెంబర్‌ నాటికి 10లక్షల మంది రిటైలర్లతో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలన్నది ప్లాన్‌” అంటారు సాహిల్.

ఉదార్‌కు ఊపిరి

“డిస్ట్రిబ్యూటర్లు రిటైలర్లకు అరువుపై సరుకు ఇస్తారు. రిటైలర్లకు దగ్గరయ్యేందుకు, వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జస్ట్ బై లైవ్ కూడా ఇదే పద్ధతి అనుసరించింది. మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రోస్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ ప్రైజెస్‌ కోసం దేశంలోనే మొదటిసారిగా క్రెడిట్‌ డెప్లాయిట్‌మెంట్‌ ప్రొడక్ట్‌ యాప్‌ను డెవలప్‌చేశారు. పాన్‌వాలా, కిరాణా కొట్టు యజమానులకు అప్పులిస్తున్నారు. బిజినెస్‌ సరిగ్గా జరగనప్పుడే అప్పు తిరిగి చెల్లించడంలో రిటైలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటారని సాహిల్ అంటున్నారు.

“రిటైలర్ల కష్టాలను దూరం చేసేందుకు రెలిగేర్‌ ఫిన్వెస్ట్‌ లిమిటెడ్‌తో కలిసి ఉదార్‌ ను ఏర్పాటు చేశాం. రిటైలర్లకు అప్పులిచ్చే సంస్థ ఇది. కిరణా వ్యాపారికి అవసరమైన పెట్టుబడి దొరికితే వారు ఎప్పుడు, ఎవరి నుంచి ఏం కొనాలో ఎంచుకునే వీలుంటుంది. కంపెనీలిచ్చే ఆఫర్లు, క్యాష్‌ డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే వాళ్ల లాభాలు పెరుగుతాయి.”సాహిల్‌
image


యువర్‌ స్టోరీ టేక్‌

హైపర్‌ లోకల్‌ మార్కెట్ల ద్వారా కస్టమర్లకు సేవలిందించే స్టార్టప్‌లే తప్ప రిటైలర్లకు సాయపడే కంపెనీలు ఇప్పటి వరకు లేవు. పంపిణీ వ్యవస్థలో ఉన్న లోపాలతో నష్టపోవడమే కాకుండా డిస్ట్రిబ్యూటర్ల దయా దాక్షిణ్యాలపైనే వారు ఆధారపడుతున్నారు. ఈ సంప్రదాయ వ్యవస్థలో ఎన్నో పరిమితులుంటాయి. డిస్ట్రిబ్యూటర్ల వద్ద భారీ మొత్తంలో పెట్టుబడి, గోడౌన్లు, స్టాఫ్‌ లేకపోవడంతో వివిధ రకాల బ్రాండ్ల ఉత్పత్తులు పంపిణీ చేసే అవకాశం దొరకడం లేదు. డబ్బుల్లేని కారణంగా వారు వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టరు. అదే ఆన్‌లైన్‌లో అయితే అలాంటి సమస్యలేవీ ఉండవు. జస్ట్‌ బై లైవ్‌ లాంటి స్టార్టప్‌లు రిటైలర్లతో పాటు మ్యానుఫ్యాక్చర్లకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. పంపిణీ వ్యయం తగ్గడంతో ఆ లాభం రిటైలర్లకు బదిలీ అవుతోంది. రిటైలర్లకు సేవలందించే ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన జస్ట్‌ బై లైవ్‌ తప్పక విజయం సాధించాలని యువర్‌ స్టోరీ మనస్పూర్తిగా కోరుకుంటోంది.