ఈ కామర్స్ కంపెనీలు క్యాష్ ఆన్ డెలివరీని వదిలించుకుంటాయా..?

ఈ కామర్స్ కంపెనీలు క్యాష్ ఆన్ డెలివరీని వదిలించుకుంటాయా..?

Monday April 18, 2016,

7 min Read


"నమ్మకమే సక్సెస్ కు పునాది"

ఈ కామర్స్ కంపెనీలు ప్రారంభంలో నమ్మకాన్ని పెంచుకోవడానికి వాడిన అస్త్రం క్యాష్ ఆన్ డెలివరీ. ఫ్లిప్ కార్ట్ 2007లో కార్యకలాపాలు ప్రారంభించిన కొత్తలో ఆన్ లైన్ చెల్లింపులను మాత్రమే అంగీకరించేది. 2010 వరకూ అదే విధానాన్ని ఫ్లిప్ కార్ట్ కొనసాగించింది. కానీ వ్యాపారం ఎదుగూబొదుగూ లేకుండా ఉండిపోయింది. దానికి ప్రధాన కారణం అన్ లైన్ లో కొన్న వస్తువులు మంచివా..? కావా...? అనే నమ్మకం ప్రజల్లో తక్కువగా ఉండటమే. ముందుగానే డబ్బులు చెల్లిస్తే తర్వాత ఎలాంటి వస్తువు వస్తుందో అనే సందేహం చాలా మందిని ఆన్ లైన్ కొనుగోలు వరకూ వెళ్లకుండా చేసింది. ఈ పాయింట్ ను విశ్లేషించుకున్న ఫ్లిప్ కార్ట్ 2010లో CoD ( క్యాష్ ఆన్ డెలివరి ) సర్వీస్ ను లాంచ్ చేసింది. వారి అంచనా ఏ మాత్రం తప్పు కాలేదు. ఫ్లిప్ కార్ట్ లావాదేవీలు అంచనాలకు అందని విధంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాల నుంచీ ఫ్లిప్ కార్ట్ కు ఖాతాదారులు వచ్చి చేరారు. సీవోడీ ప్రారంభించిన రెండే రెండు నెలల్లో ఫ్లిప్ కార్ట్ బిజినెస్ 30శాతం పెరిగింది. ఐదేళ్ల తర్వాత చూస్తే ఫ్లిప్ కార్ట్ బిజినెస్ లో 80శాతం లావాదేవీలు క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలోనే సాగుతున్నాయి.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత ఈకామర్స్ రంగం సీవోడీపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచుతున్నప్పటికీ.. ఆన్ లైన్ మార్కెట్ ప్లేసెస్ కి, సెల్లర్స్ కి , లాజిస్టిక్స్ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ-కామర్స్ కంపెనీలకు ఆన్ లైన్ చెల్లింపులే అన్ని విధాలుగా ప్లస్ పాయింట్లుగా ఉంటాయి. కానీ ఇప్పటికీ వినియోగదారులు సీవోడీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత రెండేళ్లలో ఈ-కామర్స్ కంపెనీలు చెల్లింపుల కోసం అనేక కొత్త పద్దతులు అందుబాటులోకి తెచ్చాయి. మొబైల్ వాలెట్స్, కార్డ్ ఆన్ డెలివరి వాటిలో ముఖ్యమైనవి. కానీ సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, వ్యవస్థలో ఉన్న లోపాల కారణంగా వాటి ఉపయోగం పరిమితంగా ఉంటోంది.

సీవోడీ వల్ల ఈకామర్స్ కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి..? వాటిని అధిగమించడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయి..?. సీవోడీ ఆప్షన్ ను తీసేయడానికి ఈకామ్ కంపెనీలు సాహసిస్తాయా..?... వీటిపై యువర్ స్టోరీ అందిస్తున్న ప్రత్యేక విశ్లేషణ.

image


ఈ-కామర్స్ రేంజ్ పెంచిన క్యాష్ ఆన్ డెలివరీ

భారత్ లో ఈరోజు ఈ కామర్స్ కంపెనీలు కాలర్ ఎగరేస్తున్నాయంటే దానికి ప్రధాన ప్లస్ పాయింట్ క్యాష్ ఆన్ డెలివరీ. వినియోగదారుల్లో నమ్మకం పెంచి.. మరుమూల ప్రాంతాలకు విస్తరించడానికి ఈ-కామ్ కంపెనీలన్నీ ఏకపక్షంగా ప్రయోగించిన అస్త్రం సీవోడి. ఏ మార్కెట్ ప్లేస్ కంపెనీకైనా ఇది బ్రహ్మస్త్రమే. దానికి తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి. మార్కెట్ అమాంతం పెరిగింది. హైవేల్యూ ట్రాన్సాక్షన్స్ లో అయితే వస్తువు చూసుకున్న తర్వాత డబ్బులు కట్టేవాళ్లు ఎక్కువ మంది. అయితే ఒకసారి నమ్మకం కుదిరిన తర్వాత రెండోసారి ఆన్ లైన్ లో చెల్లించేవారి సంఖ్య పెరుగుతుందని ఈ-కామర్స్ కంపెనీ వర్గాలు అంటున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో 72 శాతం మెట్రో నగరాల లావాదేవీలు క్యాష్ ఆన్ డెలివరీ విధానంలోనే సాగుతాయి. ద్వితీయశ్రేణి నగరాల్లోఈ పర్సంటేజీ 90శాతం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్ బేస్ పెంచుకుంటున్న ఈ కామర్స్ కంపెనీలకు సీవోడీ లావాదేవీలే ఎక్కువ. అయితే మెట్రోనగరాల్లో వినియోగదారులు వేగంగా ఆన్ లైన్ చెల్లింపుల దిశగా మారుతుండటంతో పెద్దగా తేడా ఉండటం లేదు.

" వినియోగదారుల మొదటి ఆర్డర్లు దాదాపు 60శాతం క్యాష్ ఆన్ డెలివరి విధానంలోనే ఉంటాయి. అయితే రిపీట్ కస్టమర్లు ఎక్కువ మంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీల్లోని ప్రొఫెషనల్ క్లాస్ కస్టమర్స్ ఆన్ లైన్ చెల్లింపులకు, బిజినెస్ క్లాస్ కస్టమర్స్ సీవోడీ చెల్లింపులకు ప్రాధాన్యం ఇస్తున్నారు"-లక్జోపాలిస్ ఫౌండర్ విజయ్


సీవోడీ ... అదనపు చెల్లింపులు వర్తిస్తాయి..!

సీవోడీ ఆప్షన్ కింద బుక్ అయిన ఆర్డర్స్ ను డెలివరీ చేయడానికి లాజిస్టిక్స్ కంపెనీలు ఒక్కొక్క దానికి దాదాపు రూ.40 లు వసూలు చేస్తున్నాయి. దీనికి ఇన్సూరెన్స్, క్యాష్ హ్యాండ్లింగ్ చార్జీలు అదనం. ఈ కామర్స్ కంపెనీల ఆర్డర్స్ డెలివరీలో అగ్రస్థానంలో ఉన్న లాజిస్టిక్స్ కంపెనీలు E-com ఎక్స్ ప్రెస్, గోజావాస్ తాము డెలివరీ చేసే ఐటమ్స్ 70శాతం క్యాష్ ఆన్ డెలివరీవే ఉంటున్నాయి. వీటికి ఇలాంటివి వస్తేనే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. కానీ ఆన్ లైన్ చెల్లింపులే మంచిదని లాజిస్టిక్స్ కంపెనీలు కూడా ఏకగ్రీవంగా చెబుతున్నాయి. అలా అయితేనే ఎక్కువ అటెంప్ట్స్ లేకుండానే వస్తువు డెలివరీ చేయవచ్చని లాజిస్టిక్స్ కంపెనీల ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు.

ఫ్రీ షిప్పింగ్ అనేది ఎక్కవ కాలం కొనసాగించలేని విషయం. షిప్పింగ్ చార్జీలు ఇతర దేశాల ఆన్ మార్కెట్లతో పోలిస్తే ఇండియాలో సమానం. యావరేజ్ గా ఒక్కో ప్యాకేజీ డెలివరీకి రెండు డాలర్ల వరకూ ఖర్చవుతుంది. అయితే ఇతర మార్కెట్లలో యావరెజ్ అమ్మకం ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రి షిప్పింగ్ అనేది ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి చాలా ఆకర్షణీయంగా కనిపించే అంశం. కొన్ని వెబ్ సైట్లు కార్డ్ ఆన్ డెలివరీ ఆనే ఆప్షన్ ను కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో లాజిస్టిక్స్ కంపెనీ ప్రతినిధి డెలివరీ ఇవ్వడానికి వచ్చినప్పుడు తన వద్ద ఉన్న స్వైప్ మిషన్ తో.. ఆర్డర్ ఇచ్చిన వారి కార్డుతో ధరను చెల్లించుకుంటాడు. అయితే ఈ విధానం ఇంకా పాపులర్ కాలేదు.

"కార్డ్ ఆన్ డెలివరి లావాదేవీలు కనీసం ఒక్క శాతం కూడా లేవు. కారణం.. చాలా ఈ కామర్స్ కంపెనీలు, వెబ్ సైట్లు ఇప్పటికీ దీన్ని తమ పేమెంట్ ఆప్షన్లలో పేర్కొనడం లేదుంటారు గోజావాస్ హెడ్ శోభిత్ జైన్.

రిటర్న్స్ .. ఓ పెద్ద గుదిబండ

క్యాష్ అన్ డెలివరీ విధానంలో రిటర్నులు ఓ పెద్ద గుదిబండగా మారాయి. ఉదాహరణ క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో ఓ వ్యక్తి ఓ వస్తువును ఆర్డర్ చేశారనుకుందాం. ఆన్ లైన్ మార్కెట్ ప్లేస్ తో ఒప్పందం చేసుకున్న సెల్లర్ దాన్ని వినియోగదారునికి పంపిస్తాడు. కానీ బుక్ చేసిన వ్యక్తి దాన్ని తీసుకోవడానికి నిరాకరించడం, వద్దనడం, అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల వస్తువు వెనక్కి వస్తుంది. దాని వల్ల లాజిస్టిక్స్ , హ్యాండ్లింగ్ చార్జెస్ ఇలా అన్నీ కలిపి సెల్లర్ కు రూ.300 వరకు ఖర్చవుతుంది. అసలు వస్తువు అమ్ముడుపోకపోగా.. మూడు వందల రూపాయలు బ్యాండ్. ఇలా తిరుగొస్తున్న వస్తువులు మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ లో దాదాపు ఇరవై శాతం ఉంటాయి. ముందుగా చెల్లించిన వస్తువులనే యాక్సెప్ట్ చేసేలా ఈ-కామర్స్ కంపెనీలు అంగీకరించడం లేదు.

లాజిస్టిక్స్ కంపెనీలకు కూడా ఇదే పెద్ద భారంగా మారింది. అనేక సార్లు ప్రయత్నాలు చేసినా కస్టమర్లు స్పందించడం కష్టంగా మారుతోంది. ఈ ఎఫెక్ట్ మొత్తం డెలివరీస్ మీద పడుతోంది. గోజావాస్ కంపెనీ విశ్లేషణ ప్రకారం.. ఒక్క సీవోడీ ఆర్డర్ డెలివరీ చేయడానికి సగటున 1.24సార్లు ప్రయత్నాలు చేయవలసి వస్తోంది. అంటే సీవోడీ లావాదేవీల వల్ల లాజిస్టిక్స్ కంపెనీపై అదనంగా 24 శాతం అదనపు మ్యాన్ పవర్ భారం పడుతోంది. అదే ఈ కామ్ ఎక్స్ ప్రెస్ లో అయితే ప్రిపెయిడ్ డెలివరీస్ తో పోలిస్తే సీవోడీ డెలివరీల్లో 30శాతం రిటర్న్స్ ఎక్కువ. ద్వితీయశ్రేణి నగరాల్లోనే ఇది టూమచ్.

image



మొబైల్ వాలెట్లతో ప్రయత్నం

ఆన్ లైన్ చెల్లింపుల కన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ఎక్కువగా ఉండే ఆన్ లైన్ మార్కెట్లలో భారత్ ముందు వరుసలో ఉంటుంది. ఈ విషయంలో చైనా చాలా ముందంజ వేసింది. చైనా దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీ ఆలీబాబా ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. షాపింగ్ చేసేవారి కోసం ప్రత్యేకం "అలీపే" అనే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే టెన్సెంట్ సంస్థ వియ్ చాట్ పేమెంట్ ఆప్షన్ తెచ్చింది. ఈ ఆవిష్కరణలో ఈ సంస్థలు వేసిన ముందంజ ఏమిటంటే... ఈ పేమెంట్ ఆప్షన్స్ ను తమ సైట్ లో మాత్రమే కొనుగోళ్లు చేయడానికే కాకుండా.. ఆఫ్ లైన్ మార్కెట్లలోనూ చెల్లింపులు చేసుకునే విధంగా వీటిని తీర్చిదిద్దాయి. టాక్సిలు, ఇతర సేవలకూ కూడా చెల్లింపులను ఈ పేమెంట్ ఆప్షన్స్ ద్వారానే చేస్తున్నారు. అలీబాబా ఇప్పటికే స్నాప్ డీల్, పేటీఎంలలో పెట్టుబడులు పెట్టింది. ఇలాంటి మెకానిజాన్నే ఇండియాలోనూ త్వరలో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. చైనాలో సీవోడీ లావాదేవీలు 30, 40శాతం తగ్గిపోయాయి. భారత్ లో వచ్చే ఐదేళ్లలో అరవై శాతానికి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

చైనా సంస్థలు మొబైల్ వాలెట్స్ లో ఉన్న మొత్తానికి వడ్డీ ఆఫర్ చేయడం ప్రారంభించాయి. అప్పుటి నుంచే సీవోడీ ఆర్డర్స్ తగ్గిపోవడం ప్రారంభించాయి. ఏడాదికి యాభై నుంచి అరవై శాతం మేర ఆన్ లైన్ పేమెంట్స్ చేసి షాపింగ్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి సమయంలో విప్లవాత్మక మార్పులు మొత్తం వ్యవస్థకే పిల్లర్స్ గా ఉండే పరిణామాలు తెచ్చే అవకాశం ఉంది.

పేటీఎం ఖాతాలో ఉన్న సొమ్ముపై ఏడు శాతం వడ్డీ ఆఫర్ చేస్తే ఎక్కువ మంది ఆ అకౌంట్ నుంచే కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మొబైల్ వాలెట్ లో డబ్బు ఉండటం అంటే జేబులో ఉండటమే లాంటిదే. అదే బ్యాంకులో ఉన్నట్లు ఉంటే ప్రజలను ఆకర్షించవచ్చు. ఈ మొబైల్ వాలెట్స్ అందరికీ అందుబాటులో ఉంటే పరిస్థితిలో కచ్చితంగా మార్పు వస్తుందంటారు అల్వారెజ్ అండ్ మార్సల్ కన్సల్టింగ్ ఎండీ మనీష్ సైగల్

సీవోడీకి ఛాలెంజ్ మొబైల్ వాలెట్స్

ఈకామర్స్ కంపెనీలన్నీ ... ఇప్పుడు మొబైల్ వాలెట్స్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ ను తగ్గించడానికి మొబైల్ వాలెట్స్ ప్రధాన అస్త్రంగా భావిస్తున్నాయి. ఫ్రీచార్జ్ అనే మొబైల్ వాలెట్ యాప్ ను స్నాప్ డీల్ కొనుగోలు చేసింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కూడా తమ మొబైల్ వాలెట్ బిజినెస్ లు ప్రారంభించాయి. ఇతర ఈ కామ్ కంపెనీలు ఇతర మొబైల్ వాలెట్స్ తో టైఅప్ పెట్టుకుంటున్నాయి. ఈ విషయంలో పేటీఎం అన్నింటికంటే ముందుంది. పేటీఎం ఆర్డర్స్ లో సీవోడీ ఆప్షన్ కింద ఉండేవి మూడు శాతం కన్నా తక్కువ. పైగా క్యాన్సిలేషన్స్, రిటర్న్స్ కూడా తక్కువే. అలాగే సెల్లర్స్ కు ఫాస్ట్ గా పేమెంట్స్ చేస్తోంది. లావాదేవీల విషయంలో మెట్రోలు, ద్వితీయశ్రేణి నగరాలకు పెద్ద తేడా కూడా లేదు.

హైపర్ లోకల్ మార్కెట్ ప్లేస్ ఆస్క్ మి బజార్... లోకల్ డీల్స్ కోసం ప్రత్యేకంగా ఆస్క్ మి పే పేరుతో పేమెంట్ గెట్ వే ఏర్పాటు చేసుకుంది. పరిస్థితిలో వేగంగా మార్పు వస్తోందని ఆస్క్ మి బజార్ సీఈవో అంచనా వేస్తున్నారు. వచ్చే రెండేళ్లలో 30 నుంచి 35 శాతం క్యాష్ ఆన్ డెలివరి ఆర్డర్స్ తగ్గిపోతాయి. త్వరలోనే సీవోడీ ఆర్డర్స్ లేని ఈకామ్ వ్యవస్థను మనం చూడొచ్చంటున్నారు ఆస్క్ మి బజార్ సీఈవో  కిరణ్ మూర్తి.

image


ప్రభుత్వ విధానాలతో మరింత మార్పు

ఇటీవల భారత ప్రభుత్వం కూడా డిజిటల్ జపం చేస్తోంది. వచ్చే పది పన్నెండేళ్లలో నగదు లావాదేవీలు లేకుండా కేవలం డిజిటల్ రూపంలో లావాదేవీలు ఉండేలా చూడాలనే ప్రయత్నం చేస్తున్నట్లు పదే పదే ప్రకటిస్తోంది. ఇది కూడా వినియోగదారులపై ప్రభావం చూపించనుంది. అయితే ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిపైనే మార్పులు ఆధారపడి ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై అవగాహన పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ సేవలకు ఆన్ లైన్ చెల్లింపులు జరిపినప్పుడు వేసే సర్వీస్ చార్జీలు తీసేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆస్తిపన్నులు, కరెంట్ బిల్లులు లాంటి చిన్నచిన్న పనులు కూడా ఆన్ లైన్ లో చేసేలా ప్రొత్సహిస్తే ప్రజల్లో అవగాహన కూడా పెరుగుతుంది. పేటీఎం, మోబిక్విక్ ఇలాంటి వాటిలో ముందున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన లెక్కల ప్రకారం గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ మధ్య కాలంలో డిజిటల్స్ వాలెట్స్ ట్రాన్సాక్షన్స్ 153 మిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో 2014లో ఈ సంఖ్య 65.9మిలియన్లు మాత్రమే.

పేమెంట్ బ్యాంకులు, మొబైల్ వాలెట్స్ కార్యకలాపాలు ఇప్పడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఇవే గేమ్ చేంజర్స్ గా మారనున్నాయి. మరింత మెరుగైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ , సులువైన టెక్నాలజీతో అతి త్వరలోనే రోడ్ సైడ్ కాఫీని కూడా ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ తో కొనుగోలు చేసే సమయం రావొచ్చు. దీనికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.