ఇంగ్లిష్ నేర్చుకోవడానికి.. రోజూ హిందూ పేపర్ కోసం నాలుగు కి.మీ.లు నడిచా !

హిందూ పేపర్ కోసం రోజుకు 4 కిలోమీటర్ల నడక..రెపిడెక్స్ ఇంగ్లీష్ బుక్‌తో కుస్తీ..ఆంగ్లంపై మమకారంతో రెండేళ్లపాటు ఒంటరి విద్యార్ధి జీవితం..ఆ రెండేళ్లు గుర్తుకొస్తే నిద్రలోనూ ఉలిక్కి పడతానంటున్న సంతోష్..గూగుల్‌లో ఉద్యోగం వదిలేసి ఇంగ్లీష్ పాఠాలు..మేరాఇంగ్లీష్ ఫౌండర్ సంతోష్ జీవితమంతా ఇంగ్లీష్‌తో ప్రయాణమే..

ఇంగ్లిష్ నేర్చుకోవడానికి.. రోజూ హిందూ పేపర్ కోసం నాలుగు కి.మీ.లు నడిచా !

Tuesday July 14, 2015,

7 min Read

రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్... 80ల్లో దాదాపు అందరి ఇళ్లలోనూ కనిపించిన ఓ లావుపాటి బౌండ్ బుక్... మీకు గుర్తుందా ? ఇది సంతోష్ కర్ణానంద ఇంట్లోనూ ఒకటి ఉండేది. ముగ్గురు ఇంగ్లీష్ మీడియం పిల్లలున్న ఇల్లు కావడంతో... వీరితోనే కుటుంబ పోషణతోనూ సరిపోయేది ఆ తండ్రికి. దీంతో రెపిడెక్స్‌ బుక్‌తో ఇంగ్లీష్ నేర్చుకుని, పిల్లలకు నేర్పే బాధ్యత సంతోష్ తల్లి తీసుకున్నారు. నిజానికి ఆయన ఒక ఇంట్లోనే కాదు... దాదాపు అన్ని గృహాల్లోనూ ఇంగ్లిష్ వింగ్లిష్ కథ నడించింది అప్పట్లో.

హిందీ, ఉర్దూ, బంగ్లా, తమిళ్, గుజరాతీ, తెలుగు సహా.., అనేక భాషల్లో లభ్యమయ్యేది. అనేక మందిని 30రోజుల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకునేందుకు ప్రోత్సహించింది కూడా. ఇతరులకు కనపడకుండా దాచుకుని మరీ చదువుకునేవారు జనాలు. ఆ పుస్తకం గొప్పదనం కంటే... రెపిడెక్స్‌తో కపిల్‌దేవ్ ఎండార్స్‌మెంట్ కుదుర్చుకున్నాక దీన్ని ప్రజలందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

ఈ రెపిడెక్స్‌తో మన దేశంలో ఇంగ్లీష్ కథ అయిపోలేదు. అసలు చెప్పాలంటే విస్తృత స్థాయిలో మొదలైంది ఇక్కడే. అనధికారిక అంచనాల ప్రకార మన దేశ జనాభాలో 10శాతం మంది ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడగలరు. అంటే పన్నెండున్నర కోట్ల మందికి పైగా ఆంగ్లం తమ భాష కాకపోయినా నేర్చుకున్నారు. అందుకే రెపిడెక్స్‌ను ప్రింట్ చేసే పుస్తక్ మహల్... ఇప్పటికీ దాన్ని రీప్రింట్ చేస్తూనే ఉంది. బెస్ట్‌సెల్లర్‌‌గా ఆ బుక్ టాప్ లిస్ట్‌‌లోనే ఉంది.

image


ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా... చదువుల్లో మేటిగా ఉన్న విద్యార్ధులు.. ఈ పోటీ ప్రపంచంలో సరైన ఉద్యోగాలు సాధించలేకపోవడానికి కారణం.. వారికి ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం లేకపోవడమే. ఇంకా చెప్పాలంటే ఇప్పటి రోజులకు... ఇది డిగ్రీ కంటే చాలా ముఖ్యం కూడా. ఇంగ్లీష్ భాషను ధారాళంగా మాట్లాడాలని కోరుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తమ పిల్లలే కాదు... తాము కూడా ఆంగ్లంలో గడగడా మాట్లాడాలని భావిస్తున్నారు పేరెంట్స్.

ఇంగ్లీష్.. వాక్ అండ్ టాక్

తమిళనాడులోని మధురై సమీపంలోని ఓ చిన్న పట్టణం దిండిగల్‌లో జన్మించారు సంతోష్. 'ది హిందూ' పేపర్ కొని చదివేందుకు ప్రతీ రోజూ 4 కిలోమీటర్ల పాటు నడిచేవారు ఆయన. అది కూడా అతని పాకెట్ మనీతో. ఇంగ్లీష్‌తో సమయం, డబ్బు.. రెండూ వృథా అని భావించడంతో.. దీనికి సంతోష్ తల్లిదండ్రుల నుంచి అంగీకారం ఉండేది కాదు. 

“మా ఇంట్లో నేనే తొలితరం ఇంగ్లీష్ మాట్లాడగలగిన వ్యక్తిని. దిండిగల్‌లో నేను నివసించిన సమయంలో... తమ క్లాస్ బుక్స్‌లో ఉండేది కాకుండా.. ఒక్క ముక్క ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒకరు కూడా ఉండేవారు కాద”ని చెప్తారు మేరాఇంగ్లీష్.కాం ఫౌండర్ సంతోష్ కర్ణానంద.

27 ఏళ్ల వయసున్న సంతోష్... ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ చదవడం ద్వారా తనకు తానే కమ్యూనికేషన్ స్కిల్స్ అలవర్చుకున్నారు. అంతేకాదు... ఓ ప్రొఫెషనల్ ట్రైనర్‌గా ఎదిగి.. ఇప్పుడు మేరాఇంగ్లీష్.కాం వెబ్‌సైట్ ఏర్పాటు ద్వారా.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా మారారు. ఈ పోర్టల్ ఆంగ్లం నేర్పించదు. పదాలను సరిగా ఉపయోగించడంపైనే ఇది దృష్టి పెడుతుంది.

ఉదాహరణకు... మన దేశంలో ఏర్పడిన ఇంగ్లీష్ భాష ట్రెండ్‌ను denounce(నిందించేలా) చేయడం.

ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలనే తపనను renounce(త్యజించేట్టు) చేయడం.

చూశారుగా ఒక అక్షరమే తేడా. పదాల ఉపయోగం ఎంత అందంగా, పొందికగా ఉందో... అదే మేరాఇంగ్లీష్ గొప్పదనం.

ఇలాంటి ఏకరూపత కలిగిన పదాలను ఉపయోగించడంపై... తగిన సూచనలు, సలహాలు అందిస్తుంది మేరాఇంగ్లీష్.కాం వెబ్‌సైట్.

ఈ వెబ్‌సైట్ ద్వారా మొత్తం 44 విద్యాసంస్థల్లో(ఎక్కువ తమిళనాడులోనివే) 40వేల మందికి పైగా విద్యార్ధులకు శిక్షణ ఇచ్చారు సంతోష్. ఈ సైట్ ఉచితంగానే సర్వీసులు అందిస్తుంది. MyGRE, MyGMAT కోర్సులతోపాటు, స్కూల్ విద్యార్ధులకు, కార్పొరేట్లకు ఇంగ్లీష్ మాట్లాడ్డం, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్‌పై ట్రైనింగ్ ఇస్తారు సంతోష్. ‘Learn 1000 words in 6 hours’ పేరుతో ఇంగ్లీష్ నేర్చుకోవడంపై ఓ పుస్తకం కూడా రాశారు ఈయన.

మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి

సంతోష్ దిండిగల్‌లో ఉన్నపుడు.. ఇంగ్లీష్‌లో మాట్లాడ్డానికి ఒక వ్యక్తి కూడా లేరు. “అలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు. అయితే... నాకు ఇంగ్లీష్ భాషంటే తగని మక్కువ. క్లాస్‌మేట్స్‌తోను, తెలిసినవారితోనూ ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించి నవ్వుల పాలయ్యేవాడిని. ఒకవేళ మీకు తమిళనాడులోని మిలీ అనే చిన్న టౌన్ తెలిస్తే... అక్కడ అందరూ నన్ను పీటర్ అంటారు. ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే.. వారిని వెక్కిరిస్తూ పెట్టే ముద్దుపేరు అది. అక్కడి జనాలంతా... నేను బిల్డప్‌కోసం షో చేస్తున్నాను అనుకునేవారు” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు సంతోష్.

స్కూల్‌‍లో ప్రైజ్ తీసుకుంటున్న సంతోష్

స్కూల్‌‍లో ప్రైజ్ తీసుకుంటున్న సంతోష్


చదువుకునేప్పుడు జరిగిన క్విజ్ పోటీల్లో.. స్కూల్ తరఫున ఎన్నో కాంపిటీషన్స్‌‌లో నెగ్గారు సంతోష్. “నేను క్విజ్‌లలో తరచుగా పాల్గొనేవాడిని. ఎప్పుడూ తర్వాతి పోటీ కోసం సిద్ధమవుతూనే ఉండేవాడిని. ఆ సమయంలో ఇతర వెక్కిరింతలు, వేళాకోళాలను పట్టించుకునేందుకు అంతగా సమయం ఉండేది కాద”ని చెప్పారు సంతోష్.

నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు.. తన స్కూల్‌ తరఫున, రాష్ట్రం తరఫున ఇంటర్ స్టేట్ కాంపిటీషన్‌లో పాల్గొని.. విజయం సాధించారు. “ఎన్నిసార్లు గెలిస్తే... అంతగా నాపై నాకు నమ్మకం పెరిగేది. అయితే... అప్పటికి ఇంగ్లీష్ మాట్లాడడం మాత్రం నాకు చాలా పెద్ద సమస్య” అన్నారు సంతోష్.

దిండిగల్‌లో సీబీఎస్ఈ సిలబస్‌తో, ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ చదివినవారు కూడా... తర్వాతి క్లాస్‌లకు స్టేట్ బోర్డ్‌కు వెళ్లిపోయేవారు. “దీనికి కారణం తేలిగ్గా స్కోర్ చేసే అవకాశం ఉండడం. ఇంజినీరింగ్, మెడిసిన్ చేయాలని అనుకునేవారికి... ఇది ఎవరూ విధించని నిబంధన, ట్రెండ్‌గా ఉండేది. నా క్లాస్‌మేట్స్ అందరూ ఇదే చేశారు. స్టేట్ బోర్డ్ ఆధ్వర్యంలోని వేరే విద్యాసంస్థలకు వెళ్లిపోగా... మా బ్యాచ్‌లో అదే స్కూల్‌లో 12 పూర్తి చేసినవాడిని నేను ఒక్కడినే”అని సంతోష్ తెలిపారు.

తన జీవితంలో అత్యంత కష్టకాలం, క్లిష్టకాలం ఇదేనని సంతోష్ అంటున్నారు. “ఆ రోజులను గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ నేను నిద్రలో కూడా ఉలిక్కి పడి లేస్తాను. అయితే ఇవాళ నేను ఏదైనా చేస్తున్నాను, సాధిస్తున్నాను అంటే మాత్రం... అందుకు కారణం నా ఆ రెండేళ్ల జీవితమే. నేను ఒక్కడినే ఉండాల్సి వచ్చేది. కోర్స్ టీచర్స్ మినహాయిస్తే... నా డౌట్స్ గానీ, అభిప్రాయాలు గానీ పంచుకునేందుకు ఒకరంటే ఒక్కరు కూడా లేరు. ”

సంతోష్ అనుభవించిన ఈ ఒంటరితనం, దాని నుంచి నేర్చుకున్న జీవితం... స్థిరమైన అలవాట్లను చేసింది. తాను అనుకున్నది చేసే దిశగా నడిపించింది. బహుశా గూగుల్ లాంటి సంస్థను వదిలేసి... సొంతగా ఏదైనా చేయాలనే ఆలోచన రావడానికి కూడా... ఈ రెండేళ్లే కారణం కావచ్చు అంటున్నారు సంతోష్.

గూగుల్‌ వరకూ ప్రయాణం

ఒక అర్ధవంతమైన జీవితం గడపాలనే తపన.. ఒంటరిగా ఉన్నపుడు సంతోష్‌కు కలిగేది. ప్రపంచంలో ఉద్యోగులందరూ బెస్ట్ ఎంప్లాయర్‌‌గా భావించే, ఉద్యోగం సాధిస్తే చాలని కలలు కనే సంస్థగా పేరుపొందిన, గూగుల్ వైపు అడుగులు వేశారు. తాను ఇప్పుడున్న స్థాయికి చేరుకునేలోపు... అనేక కఠినమైన బాటలను దాటాల్సి వచ్చిందని చెప్పారు సంతోష్. స్టేట్ బోర్డ్ సిలబస్‌కు మారాలని, ఇంజినీర్‌, డాక్టర్ వంటి కోర్సులు చేయాలనే ఒత్తిడి ఎదురైంది ఇంటి నుంచి.

“నా ఇంగ్లీష్ నైపుణ్యాన్ని మరింత సమర్ధవంతంగా నాకు నేనే తీర్చిదిద్దుకున్న సమయం అది. అప్పుడు సంపాదించిన నాలెడ్జ్‌తోనే మేరా ఇంగ్లీష్ సైట్ లాంఛ్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ పోర్టల్ కోసం నేను కంటెంట్ రాశాను. ఉద్యోగులను తీసుకున్నాను. ఇదంతా నాకు తేలికగానే అనిపించడానికి కారణం.. నేను నేనుగా బతికిన ఆ రెండేళ్లే”అన్నారు సంతోష్
తన సోదరీమణులతో సంతోష్

తన సోదరీమణులతో సంతోష్


2002-03 నాటికి దిండిగల్ లాంటి ప్రాంతాలకు ఇంటర్నెట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. విద్యార్ధులకు చదవడం కానీ, ఆడుకోవడం గానీ మాత్రమే కాలక్షేపాలు. ఆటల్లో ఎంత చురుగ్గా పాల్గొనేవారో... చదవులో అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారు. “అప్పట్లో ఇండియాటుడే మేగజైన్‌లో చెన్నైలోని లయోలా కాలేజ్ గురించి చదివాను. ఆ కాలేజ్‌లో చదవాలని కలలు కనేవాడిని. అక్కడ చేరేందుకు నాకు అందరూ ఇచ్చిన ఏకైక సలహా... కష్టపడి చదవాలని. ట్వెల్త్ స్టాండర్డ్‌లో 85శాతం స్కోర్ చేసి... లయోలాలో సీట్ సాధించా”నని చెప్పారు సంతోష్.

పెనంపై నుంచి పొయ్యిలోకి

పెనం మీద నుంచి జారి పొయ్యిలో పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించారా ? మహానగరంలోని ప్రసిద్ధి చెందిన కాలేజ్‌లో చేరిన సంతోష్‌కి ఈ ఉపమానం సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. “దిండిగల్‌లో ఉన్నపుడు ఒకడినే ఉన్నానని అనుకునేవాడిని. చెన్నై వచ్చాక ఈ ఒంటరితనం మరింతగా పెరిగిపోయింది. తోటివారిని స్నేహితులుగా చేసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక్కడ ఇంగ్లీష్ బాగా వస్తేనే... మనల్ని వారితో ఉండేందుకు అంగీకరిస్తారు. అందుకే వారి చుట్టూ తిరగడంతో అయినా.. ఇంగ్లీష్ మాట్లాడ్డం నేర్చుకోవచ్చు అనుకునేవాడిని. నాకు కరెంట్ అఫైర్స్‌పై పట్టు ఉండడంతో... నాలెడ్జ్ ప్రదర్శించేందుకు అవకాశం అప్పుడప్పుడూ అవకాశం వచ్చేది. మెల్లగా నేను వారితో మసలగలిగాను. నాగురించి వారికి తెలియచేస్తూ... నా మనసులోని అడ్డంకులను ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటూ వచ్చాను. ఏదైనా పనిని పలుమార్లు చేస్తే.. దానిలో ప్రావీణ్యత సాధించచ్చు. గూగుల్ మా క్యాంపస్‌కు వచ్చినపుడు నాకు ఉపయోగపడింది అదే” అన్నారు సంతోష్.

2007లో అకౌంట్ అసోసియేట్‌గా... గూగుల్‌లో జాయిన్ అయారు సంతోష్. "నా జీవితంలో అతి పెద్ద సంఘటన అదే. వాస్తవంగా మాట్లాడుకుంటే... గూగుల్ జాబ్ నా జీవితానికి సరిపోతుంది. నా ఉద్యోగంపై నేను మరింతగా ఆలోచించిన క్షణం ఏదీ లేద"ని సంతోష్ అన్నారు.

రెండేళ్ల పాటు జాబ్ చేశాక... సంతోష్ మనసులో అస్తిత్వానికి సంబంధించిన ఒక ప్రశ్న మొదలైంది. అది అందరి జీవితాల్లోనూ ఏదో ఓ సమయంలో ఎదురయ్యేదే. 'జీవితంలో నేనేం సాధించాలని అనుకుంటున్నాను.'అని. దీనికి సంతోష్ తనకు తాను ఇచ్చుకున్న సమాధానం. “నా సామర్ధ్యాన్ని విస్తృతమైన స్థాయిలో ఉపయోగించుకోవాలి.”

రూట్ మారింది ఇక్కడే

ఒకరోజు ఉదయం జిమ్ చేసి ఇంటికి వస్తున్న సమయంలో... సంతోష్ ఒక ట్రైనింగ్ క్లాస్‌కు వెళ్లారు. విద్యార్ధులకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లలో ఇంటర్వ్యూలకు హాజరవడంతోపాటు, ఆప్టిట్యూట్ టెస్ట్‌లు రాయడంలో కోచింగ్ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ అది. తాను జీమ్యాట్, జీఆర్ఈలకు హాజరవడంతో... ఆ నాలెడ్జ్‌ను విద్యార్ధులకు నేర్పాలని అనుకున్నారు సంతోష్. ఆ సంస్థ కొన్ని క్లాసులు తీసుకునేందుకు సంతోష్‌‌కు అవకాశం ఇచ్చింది. గూగుల్ నుంచి బయటకు వచ్చాక.. ఏడాదిన్నరపాటు ఫ్రీలాన్సర్‌గా విధులు నిర్వహించారు కూడా.

“నేను విద్యార్ధులకు సక్రమంగా ఆలోచించాలని నేర్పుతుంటాను, అయితే నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలు మాత్రం అలాంటివి కాదు.”

కాలమే మంచి టీచర్

ప్రొఫెషనల్‌గా విజయం సాధించడంలో ప్రజలకు సహాయం చేయడాన్ని తన గోల్‌గా ఎంచుకున్నారు సంతోష్. “తమిళనాడు అంతా చాలా విస్తృతంగా పర్యటించాను. వేలకొద్దీ విద్యార్ధినీ, విద్యార్ధులతో కలిసి మాట్లాడాను. వారంతా నాలాగే ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించాను. అందుకే గూగుల్‌లో నేను సంపాదించిన దాంట్లోంచి దాచిన మొత్తంతో.. మేరాఇంగ్లీష్ ప్రారంభించాను”అని చెప్పారు సంతోష్.

ట్రైనింగ్ సెషన్‌లో సంతోష్

ట్రైనింగ్ సెషన్‌లో సంతోష్


“దీన్ని ప్రారంభించినపుడు... ఆదాయ మార్గాలేంటో నాకు తెలీదు. నాకు తెలిసినదల్లా కంటెంట్ రాయడం ఒకటే. 2013నుంచి మాత్రమే నాకు ఈ సైట్ ద్వారా రెవెన్యూ వస్తోంది. ఇప్పుడు మేరాఇంగ్లీష్‌కు 11మంది ట్రైనర్స్, రైటర్స్‌తోపాటు... చెన్నైలో ఆఫీస్,క్లాస్‌రూమ్ కూడా ఉన్నాయ”న్నారు సంతోష్.

పెళ్లి చేసుకోవాలంటూ కుటుంబం నుంచి ఒత్తిడి వస్తున్నా... తన వ్యాపారంలో తగిన విజయం సాధించేవరకూ వివాహ ప్రస్తావనను వాయిదా వేసుకున్నారు. “దీన్ని ప్రారంభించిన మూడేళ్ల తర్వాత.. మా గ్రాండ్ పేరెంట్స్‌ను కలిసేందుకు దిండిగల్ వెళ్లినపుడే... మొదటిసారి మూడు రోజుల బ్రేక్ తీసుకున్నాను. నా ఆలోచన ఎప్పుడూ... తర్వాత క్లయింట్‌ను ఎలా పొందాలనే అంశంపైనే ఉండేది. ఆంట్రప్రెన్యూర్‌షిప్ అంటే... అది ఫుల్ టైం జాబ్ లాంటిది. దాన్ని మనం కావాలి అనుకున్నా కూడా వదిలేయలేం. 2013 నాటికి నేను విపరీతంగా బరువు పెరిగిపోవడానకి కారణం... నేను హెల్త్, డైట్‌లను కూడా పట్టించుకోకపోవడమే. ఇప్పుడంత కష్టం లేదు. రెగ్యులర్‌గా జిమ్‌కి వెళుతున్నాను కూడా”అని చెబ్తున్నారు సంతోష్.

ఆంట్రప్రెన్యూర్ జీవితం కారణంగా.. తన షార్ట్ టెంపర్ కూడా తగ్గిందంటున్నారు సంతోష్. “నాకు గతంలో విపరీతంగా కోపం వచ్చేసేది. ఇప్పుడు చాలా నెమ్మదస్తుడిగా మారిపోయా. బహుశా ఎక్కువగా నేర్చుకోవడం కారణంగానే అయుంటుంది. అనేక అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కున్నా.. నాకు రాత్రి పూట మాత్రం చక్కగా నిద్ర పడుతుంది. ఎన్ని టెన్షన్స్ ఉన్నా... పొద్దున ఫ్రెష్‌గా నవ్వుతూ ఆఫీస్‌కి వచ్చేస్తున్నాను. అలాగే కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కూడా గతంలో కంటే బెటర్. మొదట్లో తొందరగా అలిసిపోయేవాడిని, ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైంది. నిర్ణయాలు తీసుకోవడంలో చేసే ఆలస్యం... మన శక్తిని హరించేస్తుందని తెలిసింది”అన్నారు సంతోష్.

image


తాను ఇచ్చే ట్రైనింగ్ సెషన్స్‌లో ప్యాషన్‌ను అందుకోవడంతోపాటే... డబ్బులు సంపాదించుకోవాలని కూడా చెబ్తుంటారు ఆయన. హేతుబద్ధంగా ఆలోచించినా... కీలక సమయాల్లో విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతుంటారు. కొన్నిసార్లు మన మెదడును ఇలాంటి నిర్ణయాలు నియంత్రణలో ఉంచగలుగుతాయి. అయితే.. వాటిని అలా వదిలేయకుండా... వీలైనంత కాలం గుర్తుంచుకుని, ఆచరణలో పెట్టడం కూడా ముఖ్యమే. ఇలాంటి మనస్తత్వమే తనను ఇంత దూరం తెచ్చిందని.. ఆలస్యంగా తెలుసుకున్నాను అని సంతోష్ అంటున్నారు. ఒక సిద్ధాంతానికి నమ్మితే, దానికే కట్టుబడాల్సిందే. ప్రజలు కొంతకాలం తర్వాతే నమ్మడం ప్రారంభిస్తారు. కాలం గడిచే కొద్దీ ప్రతికూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయన్న విషయాన్ని... ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ అంగీకరిస్తారు కూడా.

http://www.meraenglish.com/