అడిగిన పని కాదనకుండా చేసి పెడ్తూ.. జనాలకు దగ్గరవుతున్న 'డ్యూడ్ జీనీ'

అడిగిన పని కాదనకుండా చేసి పెడ్తూ.. జనాలకు దగ్గరవుతున్న 'డ్యూడ్ జీనీ'

Saturday October 10, 2015,

3 min Read

అబ్బా... రోజుకు 24 గంటలు ఏం సరిపోవట్లేదు. దేవుడు రోజుకు ఇంకో 12 గంటలు ఇచ్చున్నా బావుండు అన్న డైలాగులు ఈ బిజీ లైఫ్‌లో చాలా వినిపిస్తుంటాయి. కారణం... పనులు ఎక్కువ... సమయం తక్కువ . పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవితాలు. ఉదయాన్నే రెడీ అవడం, ఆఫీసుకెళ్లడం, రాత్రి వరకు ఉద్యోగం చెయ్యడం, నిద్రపోవడం, మళ్లీ లేవడం... ఇదే రొటీన్ జీవితం. మధ్యలో మార్కెట్లు, కూరగాయలు, కిరాణా సామాన్లు ఇలాంటివి అదనపు పనులు. ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండట్లేదని ఫీలయ్యేవాళ్లు చాలామంది ఉంటారు. ఇలా ఇబ్బందులు పడేవారికి నేనున్నానంటోంది 'డ్యూడ్ జీనీ'

ఏ పని చెప్పినా చెయ్యడానికి నేను రెడీ అంటోంది. మీరు కూర్చున్న దగ్గర్నుంచి ఆర్డర్ ఇస్తే చాలు మీకు ఏం కావాలన్నా చేసిపెడతానంటోంది. ఉరుకులు పరుగుల మీ జీవితంలో విలువైన సమయాన్ని ఆదా చెయ్యడమే డ్యూడ్ జీనీ లక్ష్యం. అల్లావుద్దీన్ అద్భుత దీపం గురించి కథల్లో చదువుకున్నాం కదా. అలాంటి క్యారెక్టరే డ్యూడ్ జీనీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్లావుద్దీన్ చేతిలో అద్భుతదీపం లాంటిది ఈ అప్లికేషన్. అల్లావుద్దీన్ కోరిన కోరికలను అద్భుత దీపం తీర్చినట్టు 24 గంటలు అందుబాటులో ఉంటూ డ్యూడ్ జీనీ మీ అవసరాలను తీరుస్తుందన్నమాట.

image


జస్ట్ ఛాట్

డ్యూడ్ జీనీ... బెంగళూరుకు చెందిన సంస్థ. ఇది ఓ ఛాట్ అప్లికేషన్. కస్టమర్ల రోజువారీ సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ముగ్గురు ఐఐటి-బాంబే గ్రాడ్యుయేట్స్- అభినవ్ అగర్వాల్, రిక్షవ్ బోరా, షౌనక్ దాస్‌లు ఈ సంస్థను ప్రారంభించారు. డ్యూడ్ జీనీ... పర్సనల్ అసిస్టెంట్ యాప్ లాంటిది. వినియోగదారులకు వారి రోజువారీ అవసరాలైన సరుకులు కొనడం, భోజనం ఆర్డర్ చేయడం, ఫ్లవర్ బొకేలు పంపడం, లాండ్రీలో దుస్తులు తీసుకురావడం, సినిమా టికెట్లు, ట్రావెల్ టికెట్లు బుక్ చెయ్యడం లాంటివన్నీ చేసిపెట్టడమే ఈ సంస్థ పని. ఇలాంటి చిన్నచిన్న పనులతో సమయం వృథా చేసుకోకుండా యూజర్ల జీవితాల్ని మరింత సరళతరం చేయడమే మా లక్ష్యం అంటోంది ఈ సంస్థ. ఈ మధ్య కాలంలో భారతదేశంలో కొత్తకొత్త యాప్స్ చాలా పుట్టుకొచ్చాయి. గ్రాసరీ, గిఫ్ట్స్, ఫుడ్, మూవీ, ట్రావెల్... ఇలా రోజువారీగా ఉపయోగపడే యాప్స్ చాలా ఉన్నాయి. కానీ డ్యూడ్ జీనీ వీటన్నింటికంటే భిన్నమైనది. చిన్నచిన్న పనులతో విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా... ఆ పనుల్ని మాకు అప్పగిస్తే చేసిపెడతామంటోందీ సంస్థ.

ముచ్చటగా మూడు లక్ష్యాలు

ఏప్రిల్ 2015లో వాట్సప్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది డ్యూడ్ జీనీ. కిరాణాషాపులు, యాప్ బేస్డ్ మార్కెట్ పెరగడం వల్ల మార్కెట్ చెల్లాచెదురుగా కనిపిస్తోందని తమ పరిశీలనలో తేలిందంటారు ఫౌండర్లు. చెల్లాచెదురైన మార్కెట్ ను అధ్యయనం చేసి, పరిశీలించి డ్యూడ్ జీనీని ప్రారంభించారు. "డెమో ప్రారంభించిన తర్వాత వాట్సప్, ఆండ్రాయిడ్ బేస్డ్ అప్లికషన్ ద్వారా 20 వేల యూజర్లకు మా సేవలు అందించాం" అంటారు అభినవ్. బెంగళూరులోని కొడిహల్లిలో ప్రారంభమైన డ్యూడ్ జీనీకి మూడు లక్ష్యాలున్నాయి. సౌలభ్యం, వినియోగదారుడి కేంద్రీకృత విధానం, విశ్వసనీయత తమ లక్ష్యాలంటారు ఫౌండర్లు. బ్రాండ్ లోగోగా జీనీని సెలెక్ట్ ఎందుకు చేశారంటే... అడిగినది కాదనకుండా చేసిపెట్టడమే. ఈ క్యారెక్టర్‌కు ఉన్న ఔదార్యం, అసమానమైన శక్తిసామర్థ్యాలు, లక్షణమే కారణమంటారు. యూజర్ల జీవితంలో ఓ భాగమైపోవాలన్నది డ్యూడ్ జీనీ లక్ష్యం.

image


మార్కెట్లో ఈ సర్వీస్ రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

  • 1. ఆర్డర్ ఇవ్వడం దగ్గర్నుంచి డెలివరీ వరకు జరిగే ప్రక్రియను మరింత సులభతరం చెయ్యడం.
  • 2. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతర కృషి చేయడం. అంటే... వినియోగదారులకు కాల్ లేదా ఛాట్ రెండిట్లో ఏది సౌకర్యవంతంగా ఉంటే దాన్ని ఎంచుకునే అవకాశం కల్పించడం.

డ్యూడ్ జీనీ మాత్రం ఛాట్‌నే ఉపయోగిస్తోంది. ఎందుకంటే... ఛాట్ బేస్డ్ అప్లికేషన్ ద్వారా సౌకర్యవంతమైన, అవాంతరాల్లేని, సంపూర్ణ అనుభవం సాధ్యమంటారు రిక్షవ్. అందుకే తాము ఛాట్ బేస్డ్ సర్వీసును అందిస్తున్నామంటారు.

"ఆర్డర్ చేయడం, సర్వీసులు పొందడం, సర్వీసులు అందించడం లాంటి వాటన్నిటికీ ఒకే వేదిక ఉండాలని మేం అనుకున్నాం. ఈ ఐడియాపై బాగా వర్కవుట్ చేసిన తర్వాత ఛాట్ బేస్డ్ సర్వీస్ చేయాలని నిర్ణయించుకున్నాం. మిగతా కమ్యూనికేషన్ పద్ధతులకంటే ఛాట్ ఎందుకు ఎంచుకున్నామంటే ఈ రోజుల్లో చాలామంది ఛాటింగ్‌కు అలవాటుపడ్డారు. అదే సౌలభ్యం కూడా. మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. లొకేషన్ నుంచే ఇమేజెస్ షేర్ చేసుకోవడం సులువు" అంటారు రిక్షవ్.

ఇలాంటి సేవలు అందించే మరికొన్ని సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. హెల్ప్ ఛాట్, హ్యాప్టిక్, గుడ్ సర్వీస్ లాంటివి డ్యూడ్ జీనీకి కాంపిటీటర్స్. ఇతర కాంపిటీటర్స్‌తో పోలిస్తే తమ మోడల్ దే పైచేయి అంటారు డ్యూడ్ జీనీ ఫౌండర్లు. "కస్టమర్ల సంతృప్తి, కార్యనిర్వాహక సామర్థ్యం పైనే తమ దృష్టి ఉంది. ఎంత చేశావు అన్నది కాదు... ఎంత బాగా చేశావన్నదే మాకు ముఖ్యం. మా టీమ్ లో అలా పనిచేసేవాళ్లే ఉన్నారు. కొద్ది రోజుల్లోనే మా సామర్థ్యాన్ని నిరూపించుకున్నాం" అంటారు అభినవ్.

image


డ్యూడ్ జీనీ ఫ్యూచర్

ప్రస్తుతం టీమ్ సైజ్ 45 మంది. వేర్వేరు డొమైన్లల్లో విస్తరించేందుకు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సీడ్ రౌండ్ ఫండింగ్ వచ్చింది. యూజర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ ఉపయోగించేందుకు మరిన్ని నిధులు సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్కెట్లో తమదైన ముద్ర వేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

" సౌలభ్యం, సంతృప్తి, సామర్థ్యంతో ఇండియాలో ఛాట్ బేస్డ్ కస్టమర్ సర్వీస్‌కు సరికొత్త నిర్వచనం ఇవ్వడమే మా అంతిమ లక్ష్యం. మా సేవల్ని మరిన్ని నగరాలకు విస్తరించాలనుకుంటున్నాం. వేగంగా, సమర్థవంతంగా స్పందించేందుకు మా టీమ్‌ను మరింత పటిష్ట పర్చుకోవాలనుకుంటున్నాం " అని అంటున్నారు షౌనక్.