కారు సర్వీసింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్!

కారు సర్వీసింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్!

Friday January 29, 2016,

2 min Read

మొన్నటిదాకా బైక్ నిత్యావసరం. కారు లగ్జరీ. ఇప్పుడు అదే కారు నిత్యావసరమైంది. అడుగుతీసి అడుగేయాలన్నా ఫోర్ వీలర్ ఉండాల్సిందే! అది కాసేపు షెడ్డుకి వెళ్లిందంటే కాలూ చేయి ఆడదు. సర్వీసింగ్ ఇవ్వాలంటే కూడా వెనుకాముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే మళ్లీ ఎప్పుడిస్తారో తెలియదు. అనుకున్న టైంకి అందకపోవచ్చు. ఈ సిచ్యువేషన్ ప్రతీ ఒక్కరు ఏదో సమయంలో ఎదుర్కొనే ఉంటారు. మరి దానికి పరిష్కారం లేదా?

image


రాజ్ హాసన్ కు అలాంటి ఐడియానే వచ్చింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో 12 ఏళ్ల అనుభవం ఉంది. మంచి పనిమంతుడని మేనేజ్‌మెంట్ ప్రమోషన్ కూడా ఇచ్చింది. కానీ ఎందుకో తృప్తి లేదు. కారు సర్వీసుల సెగ్మెంటులో ఉన్న గ్యాప్ సవరించాలనుకున్నాడు. అలా చేయాలంటే ఉద్యోగం వదులుకోవాలి. మంచి శాలరీ. కొంత సంఘర్షణ. అయినా సరే ధైర్యంచేసి జాబ్‌ కు గుడ్‌ బై కొట్టేవాడు.

2014 జూన్‌లో బెంగళూరులో బుక్ మై కార్ సర్వీస్ లాంచ్ చేశాడు. జీఆర్ భగవాన్ రాందాస్ అవసరమైన సహకారం అందించాడు. కార్ల పరిశ్రమలో 15 ఏళ్ల అనుభవం ఉన్న రాందాస్, రాజ్ ప్రజెంటేషన్ వినగానే మరోమాట లేకుండా ఓకే అన్నాడు. ఆర్ధిక చేయూత కూడా ఇచ్చారు.

ఒప్పించడానికి పడ్డ కష్టం ఎంతంటే..!

బుక్ మై కార్ సర్వీస్ డాట్ ఇన్. రెండేళ్ల క్రితం ఇదో కొత్త కాన్సెప్ట్. సర్వీస్ అయితే లాంచ్ అయింది! కానీ ఎవరిని అప్రోచ్ కావాలి? ఎలా కావాలి? కస్టమర్లను సంపాదించడం ఎలా? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి! సర్వీస్ సెంటర్లు ఒప్పుకుంటే కస్టమర్లు వినేవాళ్లు కాదు! కస్టమర్లు ఓకే అంటే సర్వీస్ సెంటర్లు ససేమిరా అనేవి! ఆ గ్యాప్ తొందర్లోనే ఫిలప్ అయింది! నెల తిరక్కుండానే 34 సర్వీస్ సెంటర్లు బుక్ మైకార్ సర్వీసులో చేరాయి! ప్రస్తుతం వీటి సంఖ్య 570కి పైనే!!

ఎలా పనిచేస్తుందంటే...!!

బుక్ మైకార్ సర్వీస్ వెబ్ సైట్లో అనుసంధానమైన అన్ని సర్వీస్ సెంటర్లను లిస్ట్ చేస్తారు. వాటిద్వారా దగ్గర్లో ఉన్న సర్వీస్ సెంటరుకు కస్టమర్ వెళతాడు. కారు ఓనర్ అవసరాన్ని బట్టి సైట్ నిర్వాహకులు సర్వీస్ సెంటర్లకు ముందుగానే సమాచారం అందిస్తారు. ఈ సేవలన్నింటికీ నామమాత్రపు ఫీజు. కస్టమర్‌ను ఆకట్టుకోవాలంటే తప్పదు. ప్రస్తుతం 12 మంది సిబ్బందితో కర్నాటక అంతటా సేవలందిస్తోంది. కస్టమర్ల డిమాండ్ ను బట్టి వాళ్ల ఇళ్లకే మెకానిక్ లను పంపుతారు.

సర్వీస్ ప్రొవైడర్లు-వినియోగదారుల మధ్య క్వాలిటీ కోసం బుక్ మైకార్ సర్వీస్- కస్టమర్ కేర్ కూడా తీసుకుంటోంది. సర్వీసు తర్వాత కస్టమర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. లోటుపాట్లు తెలుసుకుంటారు. ఫిర్యాదులుంటే రిపీట్ కాకుండా చూసుకుంటారు. సర్వీస్ మోటివ్‌తో పని చేయడంతో ఇప్పటివరకూ అందిన కంప్లయింట్లు తక్కువే అంటున్నారు రాజ్.

భవిష్యత్‌పై ఎన్నో ఆశలు

ఇండియాలో కార్ల రిపేర్ పరిశ్రమకు సరైన వేదిక లేదు. సర్వీస్ సెంటర్ గురించి వాళ్లూ వీళ్లూ చెప్తేగానీ తెలియదు. అందుకే ఇలాంటి సేవలను ఆన్ లైన్‌లో అందించాలనే ఉద్దేశంతోనే బుక్ మై కార్ సర్వీస్ మార్కెట్‌లోకి తెచ్చాం అంటున్నారు రాజ్‌. ఇప్పటికే మేరీకార్.కామ్, స్పేర్స్ హబ్.కామ్, 3ఎంకార్ కేర్, క్రాస్ రోడ్స్, మైటీవీఎస్, కార్జ్, కార్జ్ కేర్, హెల్ప్ ఆన్ వీల్స్.ఇన్ లాంటి స్టార్టప్ కంపెనీలు మార్కెట్‌ని షేర్‌ చేసుకుంటున్నాయి.

ఇక బుక్ మై కార్ సర్వీస్ విషయానికొస్తే, ఈ స్టార్టప్ కంపెనీకి నెలకు 600 వరకు ఆర్డర్లు వస్తున్నాయి. భవిష్యత్‌లో వీటి సంఖ్య వెయ్యికి చేరే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు 4,700 లకు పైగా కస్టమర్లు ఉన్నారని రాజ్ అంటున్నారు. బుక్ మైకార్ సర్వీస్ రెవెన్యూ కూడా ఆశాజనకంగానే ఉంది. ఇప్పటికే రూ.20 లక్షల మార్కును దాటిపోయింది. ఈ ఏడాది రూ.15 మిలియన్లు సాధించాలన్నది సంస్థ ఫ్యూచర్ ప్లాన్.