లగ్జరీ మార్కెట్‌పైనా కన్నేసిన స్టార్టప్స్ !!

లగ్జరీ మార్కెట్‌పైనా కన్నేసిన స్టార్టప్స్ !!

Sunday January 24, 2016,

5 min Read

హీరోయిన్ల చేతుల్లో మెరిసిపోయే హ్యాండ్ బాగులు, కార్పొరేట్ బాసుల ఖరీదైన వాచ్‌ల తళతళలు చూసి.. మిడిల్ క్లాస్ జనాలంతా నోరెళ్లబెట్టి చూస్తూ ఉంటారు. కానీ, కాస్తకూస్తో సంపాదిస్తున్న వాళ్లు మాత్రం ఎలాగోలా బ్రాండెడ్ వస్తువులను లైఫ్‌లో ఒక్కసారైనా కొనాలని తాపత్రయపడ్తూ ఉంటారు. కొద్దికాలం క్రితం వరకూ లగ్జరీ గూడ్స్ అనేవి కేవలం సెలబ్రిటీలు, మల్టీమిలయనీర్లకే సొంతమనుకునే వాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. కొత్త కొత్త స్టార్టప్స్ పుట్టుకురావడంతో ఇప్పుడు కాస్ట్‌లీ వస్తువులు కూడా మామూలు జనాల దగ్గరకు వచ్చేస్తున్నాయి. వాళ్లు కొంటారా లేదా అనేది తర్వాతి ప్రశ్న. కనీసం ఆ ప్రోడక్ట్ ఇలా ఉంటుందా అని చూసి, తెలుసుకునేంత యాక్సెస్ వచ్చేసింది.

యూరోమానిటర్ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం భారత్‌లో లగ్జరీ మార్కెట్ జోరు అనూహ్యంగా పెరుగుతోంది. ఏటా 225 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1500 కోట్లు) మార్కెట్‌గా ఇండియా దూసుకుతోంది. ఇది సింగపూర్, ఆస్ట్రేలియా కంటే మన దగ్గరే వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. ఇంటర్నెట్ పరిధి విస్తరించడం, జనాల ఆదాయం పెరగడం, ఆన్‌లైన్ సెగ్మెంట్లోకి కొత్త స్టార్టప్‌లు పుట్టుకురావడం కూడా ట్రెండ్ మారేందుకు కారణమవుతోందనేది రిపోర్ట్ విశ్లేషిస్తోంది.

image


''రూ.1 లక్ష ఖరీదు పలికే లూయిస్ విట్టన్ బ్యాగ్ కోసం ఎప్పుడూ 30-35 మంది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. అంతగా లగ్జరీ గూడ్స్‌కు డిమాండ్ పెరిగింది'' - కాన్ఫిడెన్షియల్ కౌచర్ ఫౌండర్ అన్వితా మెహ్రా

టార్గెట్ అప్పర్ క్లాస్

తాజాగా అసోచామ్ ప్రచురించిన ఓ నివేదిక ప్రకారం అధికాదాయ వర్గాలు (హెచ్ఐజి) తమ ఆదాయంలో నెలకు 40 శాతం వరకూ ఇలాంటి లగ్జరీ బ్రాండ్లకు ఖర్చు చేస్తే, మిడిల్ క్లాస్ కన్స్యూమర్లు మాత్రం 8-10 శాతానికి పరిమితమవుతున్నారు.

ఈ సెగ్మెంట్‌కి హై నెట్వర్త్ ఇండివిడ్యుయల్సే టార్గెట్. ఫ్లాగ్‌షిప్‌ స్టోర్లతో పోలిస్తే ఆన్‌లైన్‌లో అదే ప్రోడక్ట్ తక్కువ ధరకు దొరుకుతుంది. రూ.6000కుపైగా ఖర్చు చేసే ఫస్ట్ టైం బయర్స్‌ మా లక్ష్యం అంటారు డార్వేస్ అనే సంస్థ ఫౌండర్ నకుల్ బజాజ్. తక్కువ ధరలు ఉంటాయని కొంత మంది మాత్రమే డిసెంబర్ సీజన్‌లో విదేశాలకు వెళ్తారు. అలాంటి వాళ్ల పనని మేం మరింత సులువు చేస్తాం. ఎక్కడెక్కడో తిరిగి షాపింగ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే అన్నీ డోర్ డెలివరీ తెప్పించుకునేలా చేస్తున్నామంటున్నారు నకుల్.

ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి సంస్థలకే పండుగల సీజన్ తాకిడి ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ ఏడు నెలల క్రితం మొదలైన జుకోడో అనే స్టార్టప్ మాత్రం అదేమీ నిజం కాదని రుజువు చేస్తోంది. కార్పొరేట్లు, ఇండివిడ్యుయల్స్‌కు ఈ సంస్థ గిఫ్ట్ ఓచర్లను అందిస్తుంది. దీపావళి సీజన్‌లోనే ఈ గిఫ్ట్‌ ఓచర్లకు చాలా బిజినెస్ ఉంటుంది అంటున్నారు జుకోడో వ్యవస్థాపకులు యశ్ మెహతా. గిఫ్టింగ్ కోసం రూ.500-2000 విలువ చేసే ఓచర్లను కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఉద్యోగులకు ఇస్తున్నాయని చెబ్తున్నారు యశ్.

లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్ సాధారణంగా మగాళ్ల కంటే ఆడవాళ్లకే ఎక్కువ ప్రాధాన్యమిస్తుంది. 20 వయస్సులో ఉన్న మహిళలనే మొదటగా టార్గెట్ చేస్తామని చెబ్తున్నారు Zapyle అనే ప్రీ ఓన్డ్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఫౌండర్ రాషీ మెందా. ఏటా రూ.5 లక్షలకు మించి ఆదాయం ఉన్న మహిళలనే ఎంపిక చేసుకుంటామని చెబ్తోంది స్టైల్ ట్యాగ్ అనే సంస్థ. డిజైనర్లు రీతూ కుమార్, గౌరీ, నైనికాలు ప్రారంభించిన కిడాలజీ (Kidology)అనే బ్రాండ్ అయితే కేవలం చిన్న పిల్లల దుస్తులనే డిజైన్ చేస్తుంది. డబ్బు ఎక్కువ - టైం తక్కువ ఉండే పేరెంట్స్ ఈ మధ్య విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. వాళ్ల స్థాయికి తగ్గట్టు పిల్లలు బట్టలు కూడా ఉండాలనుకుంటున్నారు అని వివరిస్తున్నారు కిడాలజీ సహ వ్యవస్థపాకులు నేహా మిట్టల్.

ఇది చాలా ప్రత్యేకమైన మార్కెట్ అయినప్పటికీ, ప్రతీ రోజూ తనలాంటి సైట్‌కే లక్ష మంది విజిటర్స్ వస్తారని చెబ్తున్నారు రాక్ అండ్ షాప్ (RockNShop) ఫౌండర్ ప్రియ సచ్‌దేవ. నెలకు 25 లక్షలకు మించి ఆదాయం ఉన్నవాళ్లే తమ సైట్‌ చూసేందుకు వస్తూ ఉంటారని, ప్రీ ఓన్డ్ గూడ్స్ లేకపోయినప్పటికీ 25 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు ప్రియ.

image


విభిన్నమైన బిజినెస్ మోడల్స్

ఈ-కామర్స్ రంగంలో లగ్జరీ సెగ్మెంట్ అనేది ఇప్పటికీ పసిపాప లాంటిది. కానీ స్టార్టప్స్ మాత్రం విభిన్నమైన,వినూత్నమైన్ మోడల్స్ ఎంపిక చేసుకోవడం వల్ల మార్కెట్ పరిధి పెరుగుతోంది. ఉదా. జుకోడో (Zukodo) సంస్థ ద్వారా గిఫ్ట్ ఓచర్లు కొనుగోలు చేసి ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు. వాటిని లగ్జరీ మాల్స్, ఫ్లాగ్‌షిప్ స్టోర్లలో షాపింగ్ కోసం ఉపయోగించవచ్చు. ఇక వాడిన వస్తువులను అమ్మకానికి పెట్టేందుకు ఉపయోగపడ్తోంది జాపిల్ (zapyle) అనే స్టార్టప్. బెంగళూరుకు చెందిన రష్మి పౌల్ అనే రీసెర్చర్ లూయిస్ వుట్టన్ క్లచ్‌ను జాపిల్ ద్వారా రూ.17 వేలకు కొనుగోలు చేసింది. అది కూడా వారెంట్ కార్డుతో సహా. ఆ పర్స్‌లోపల మాజీ ఓనర్ రాసిన ఓ చిన్న నోట్‌ తనతో సంతోషాన్ని రెట్టింపు చేసిందని చెప్తారు రష్మి. అదే క్లచ్‌ను లూయిస్‌ షోరూమ్‌లో కొనాలంటే మాత్రం రూ.78000 దాకా ఖర్చు పెట్టాల్సి వచ్చేది అంటారు రష్మి. త్వరలో తన టామ్ ఫోర్డ్ సన్‌గ్లాసెస్‌ను కూడా జాపిల్‌లో అమ్మకానికి పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు చెబ్తున్నారు. త్వరలో కొత్త బ్రాండెడ్ వస్తువులను అమ్మేందుకు కూడా ప్రణాళికలు రచిస్తోంది జాపిల్.

జొకూడో (Zokudo) అనే స్టార్టప్ మాత్రం పాత వస్తువుల అమ్మేందుకు ససేమిరా అంటోంది. హెచ్ఎన్ఐ కస్టమర్లకు లగ్జరీ ఎక్స్‌పీరియన్స్ అందివ్వడమే తమ లక్ష్యంగా చెబ్తోంది. ఎలాంటి లోపం లేని ఉత్పత్తిని కస్టమర్లకు అందివ్వడం వల్లే వాళ్లతో రిలేషన్ బలపడ్తుందని నమ్ముతోంది. తమ దగ్గర స్వాపింగ్, మ్యారేజ్ రిజిస్టరింగ్, గ్రూప్ గిఫ్టింగ్ లాంటి సేవలను కూడా అందిస్తున్నట్టు జుకూడో చెబ్తోంది.

కొన్ని ఫ్లాగ్‌షిప్ స్టోర్స్ ఉన్నప్పటికీ.. పరిధిని విస్తరించుకునేందుకు ప్రధాన ఈకామర్స్ పోర్టల్స్, పేటిఎం లాంటి మార్కెట్ ప్లేస్‌లలో తమ ప్రోడక్ట్స్ అమ్మేందుకు చూస్తోంది కిడాలజీ సంస్థ. అపెరల్ స్టోర్స్ ద్వారా విదేశాల్లో కూడా తమ బ్రాండ్స్‌ను అమ్ముతున్నట్టు చెబ్తున్నారు కిడాలజీ ఫౌండర్ నేహ.

బయటా మార్కెట్ ఉంది

ఎ టి కీర్నే అనే సంస్థ అంచనా ప్రకారం కూడా లగ్జరీ మార్కెట్ విషయంలో భారత్‌ వేగంగా విస్తరించనుంది. అయితే ఇక్కడ వాటిని చేరుకునేందుకు ప్రధాన సమస్య అంటున్నారు. కోటక్ వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రచురించిన టాప్ ఆఫ్ ది పిరమిడ్ 2015 రిపోర్ట్ ప్రకారం మల్టీ మిలయనీర్స్‌లో 44 శాతం మెట్రోస్ బయటే ఉన్నారు.

అయితే ఇదే సమయంలో ఏ చిన్న ఊళ్లోనో.. నగరంలోనో లగ్జరీ షాప్ ఏర్పాటు చేయడం కుదరని పని. అందుకే ఆన్‌లైన్‌దే భవిష్యత్తు అంటున్నారు రాక్ అండ్ షాప్ ఫౌండర్ ప్రియ. చెన్నై, పూణే, కోచి, ఒరిస్సాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్టు వివరించారు. జపాన్, సింగపూర్, మిడిల్ ఈస్ట్, యూరోప్‌లో కూడా తమకు కస్టమర్లు ఉన్నట్టు చెబ్తున్నారు.

దీపావళి సీజన్‌లో ప్రపంచం వ్యాప్తంగా ఉన్న చాలా ప్రదేశాల నుంచి తమకు ఆర్డర్లు వస్తాయని కిడాలజీ సంస్థ చెబ్తోంది. అక్కడ ఇండియన్ ఔట్‌ఫిట్స్ దొరకకపోవడం వల్ల ఎన్ఆర్ఐలు తమ ప్రోడక్ట్స్ కూడా ఆత్రంగా ఎదురుచూస్తారని కిడాలజీ చెబ్తోంది.

image


సవాళ్లు

సాధారణంగా లగ్జరీ గూడ్స్ విషయంలో తప్పులకు అసలు తావుండదు. హెచ్ఎన్ఐలతో వ్యవహారం కాబట్టి ఒక్క చిన్న తప్పు జరిగినా అదే వాళ్లతో ఆఖరి డీలింగ్ అంటారు జుకూడో ఫౌండర్ యష్. అన్నింటింకంటే అవి ఒరిజినలా కాదా.. అని కనుక్కోవడమే పెద్ద సమస్య అంటారు. తమ దగ్గరకు వచ్చే ఐదు ఐటెమ్స్‌లో ఒక్కటైనా ఫేక్ ప్రోడక్ట్ ఉంటుందని చెప్తున్నారు కాన్ఫిడెన్షియల్ కౌచర్ ఫండర్ అన్విత. ఒక్కో ప్రోడక్ట్‌ను 80 యాంగిల్స్‌లో ఫోటోలు తీసి వాటిని అమెరికాలో ఉన్న 'అథెంటికేట్ ఫస్ట్' అనే సంస్థకు పంపుతామని, వాళ్లు ఇమేజ్ రికగ్నిషన్ ప్రాసెస్‌లో దాని ఒరిజినాలిటీ ధృవీకరించిన తర్వాతే ప్రోడక్ట్ అమ్ముతామని నేహ వివరిస్తున్నారు. చివరకు కస్టమర్ నమ్మకంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఏదైనా తేడా వచ్చిందనిపిస్తే 24 గంటల రిటర్న్ పాలసీ కూడా ఉందంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ మార్కెట్‌ను ఇంత వరకూ ఏ ఆన్‌లైన్ మార్కెట్ కూడా పూర్తిగా కైవసం చేసుకున్న దాఖలాలు లేవు అంటారు నీలేష్. ఆఫ్‌లైన్ షాపులు తమ కస్టమర్లకు అధిక ప్రాధాన్యమివ్వడం, షాపింగ్‌ను ఓ ప్రత్యేకమైన అనుభూతిగా మారుస్తారని చెబ్తున్నారు. అందుకే లగ్జరీ కస్టమర్లు ఎప్పుడూ ఆన్‌లైన్ కంటే ఆఫ్‌లైన్‌వైపే ఇష్టత చూపుతారని వివరిస్తున్నారు.

యువర్ స్టోరీ విశ్లేషణ

గత ఐదేళ్లుగా ఈ కామర్స్ మార్కెట్ పరిధి విస్తృతమైంది. జనాలకు సుఖానికి అలవాటు పడి వీటివైపే మొగ్గుచూపుతున్నారు. లగ్జరీ అనేది ఈ సెగ్మెంట్లో కొత్తగా పుట్టుకొస్తోంది. కోటక్ రిపోర్ట్ ప్రకారం హెచ్ఎన్ఐలు తమ ఆదాయంలో 15-18 శాతం జ్యువెలరీ, అపెరల్స్ పైనే ఖర్చుపెడతారు. అదే ప్రభావం ఆన్‌లైన్‌ కూడా కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తోంది. 2014లో నెలకు 100 ఆర్డర్లు సేల్ చేసే స్టైల్ ట్యాగ్ ఇప్పుడు రోజుకు 200-300 ఆర్డర్లను ప్రాసెస్ చేస్తోంది.

ఆన్‌లైన్ జోరు, డిమాండ్, అవగాహన పెరుగుతున్న కొద్దీ మార్కెట్ విస్తరించక తప్పదు. రాబోయే రోజుల్లో మరింత మంది ఇందులోకి అడుగుపెట్టవచ్చు. అయితే వాళ్ల ప్రత్యేక ఏంటో చాటుకోవాలి. అప్పుడే నిలదొక్కుగోలరు. లగ్జరీ సెగ్మెంట్ స్పేస్‌ను ఇన్వెస్టర్లు ఎక్కువ కాలం పట్టించుకోకుండా ఉండలేని స్థితి వచ్చింది.

Graphics by Aditya Ranade

Original story written by ATHIRA A NAIR

Translated by Chanukya