అమ్మచేతి కమ్మదనాన్ని మిస్సవుతున్నారా..?? అయితే మీలాంటివారి కోసమే జేకా కా తడ్కా !!

విజయ్ హల్దియా ఫుడ్ బ్లాగ్‌కు ఫుల్ క్రేజ్56ఏళ్ల వయసులో జోధ్‌పురి మహిళ అసామాన్య విజయం

అమ్మచేతి కమ్మదనాన్ని మిస్సవుతున్నారా..??       అయితే మీలాంటివారి కోసమే జేకా కా తడ్కా !!

Wednesday June 24, 2015,

4 min Read

అమ్మచేత్తో మంచినీళ్లిచ్చినా అమృతంలా ఉంటుందంటారు. అదేంటోగానీ, అమ్మ వేసే కారంలోనే తెలియని మమకారం ఉంటుంది. అదలా కడుపులోకి వెన్నపూసలా కమ్మగా జారిపోతుంది. చేయి తిరిగిన పెద్దపెద్ద చెఫ్‌లే అంటుంటారు.. నా ఫేవరెట్ డిష్ అమ్మచేతి వంట అని. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటిభోజనం తినే అదృష్టం ఎంతమందికి దక్కింది. ఉద్యోగ రీత్యానో, చదువు కోసమనో ప్రాంతంకాని ప్రాంతంలో, దేశంకాని దేశంలో ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే అమ్మ వంటింట్లో చేసే అద్భుతాలను మిస్సవుతున్నాం. స్టార్ హోటల్లో ఎన్ని వేలు ఖర్చుపెట్టి తిన్నా, అమ్మచేసిన గిన్నెడు పాయసం ముందు దిగదుడుపే. ఇలా ఏది తిన్నా, ఏది తినాల్సి వచ్చినా, ప్రతీసారీ అమ్మచేతి వంటతో పోల్చుకుని ఉసూరుమనడం తప్ప చేసేదేం లేదు.

ఒకసారి ఏమైందంటే..!!


విజయ్ హల్దియా

విజయ్ హల్దియా


విజయ్‌ హల్దియా. వయసు 56 ఏళ్లు. సొంతూరు జోధ్‌పూర్‌. కూతురు అమెరికాలో ఉంటోంది. ఆ మధ్య ఓసారి కూతురిని చూడ్డానికి వెళ్లింది. అక్కడ తన పాప స్నేహితులు చాలామందే పరిచయమయ్యారు. క్షణాల్లో దగ్గరయ్యారు. అంతవరకు బాగానే ఉంది కానీ, ఎటొచ్చీ వాళ్లు తినే ఆహారం విషయంలోనే ఆమె చాలా బాధ పడింది. ఎందుకంటే వాళ్లు వచ్చిన నేపథ్యం వేరు. తినే తిండి వేరు. అదొక ప్రహసనం. ప్రతీసారీ ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వడం. రుచీపచీ లేనివి కడుపులో వేసుకుని రోజులు గడపడం. చదువుకునే యువతే కాదు.. ఉద్యోగం చేసే భార్యాభర్తలూ అంతే. నచ్చిన వంట తినే అవకాశం లేక. నచ్చనివి తినలేక నానా యాతన.

 అలా మెరిసింది బుర్రలో ఐడియా !

ఆన్‌లైన్. బాగానే ఉంది. మరి అదే ఆన్‌లైన్‌లో ఎప్పుడూ మనం చూడని వంటలు కాకుండా.. అచ్చం అమ్మవండిన వంటలే ఆర్డరిస్తే! అవన్నీ సరిగ్గా మన అమ్మచేసినట్టే ఉంటే..? వావ్ ! వాట్‌ ఎన్ ఐడియా! అమ్మ ఆలోచన అద్భుతంగా ఉంది. ఆమె ఉత్సాహాన్ని కూతురు గమనించింది. క్షణ ఆలస్యం చేయలేదు. ఆన్‌లైన్ ద్వారా అమ్మచేతి కమ్మటి వంటకాల ప్లాట్‌ఫాం తయారైంది. అలా మొదలైందే జేకా కా తడ్కా.

అన్ని వంటలూ సూపర్‌

విజయ్‌ హల్దియా మాటల్లో చెప్పాలంటే ఇదంత పెద్ద కష్టమేమీ కాదు. పైగా రోజూ చేసే పనే. అన్నీ తానే తయారు చేస్తారు. వంట బాగా కుదిరితేనే ఆన్‌లైన్‌లో పెడతారు. లేకుంటే నిర్మొహమాటంగా తీసి పక్కన పెడతారు. వాస్తవానికి విజయ్‌ హల్దియా చేసిన ఏ రెసిపీ కూడా ఇంతవరకు బాగాలేదన్న మాట రాలేదు. దేన్నీ వృధా చేయొద్దన్నది కూడా ఆమె సిద్ధాంతం. ఒకటా రెండా. ఆమె చేసిన ప్రతీ వంటకం సూపర్ హిట్. " మిగిలిపోయిన పదార్ధాలతో తయారు చేసే రెసిపీలకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను.. పైగా అవే చాలా టేస్టీగా ఉంటాయి.. వృధాను తగ్గిస్తాయి"అంటారు విజయ్‌ హల్దియా.


వంటింటి ఘుమఘుమలు

వంటింటి ఘుమఘుమలు


ధైర్యే సాహసే విజయ్‌

ఒక కొత్త మార్గంలో నడిచేటప్పుడు ఒడిదొడుకుంటాయి. ఎత్తుపల్లాలు సహజం. కష్టాలు నష్టాలు కామన్. బాలారిష్టాలుంటాయి. వాటన్నిటినీ ఎదుర్కొని పోవడమే జీవితం. విజయ్‌ హల్దియా జేకా కా తడ్కా పెట్టిన కొత్తలో ఎన్నో అవరోధాలు. ఒక్కోసారి వండిన వంటలను ఎవరూ చూడని రోజులు కూడా ఉన్నాయి. అయినా అధైర్యపడలేదు. ఇష్టమైన దారిలో నడుస్తున్నప్పుడు అవన్నీ పెద్ద కష్టాలేం కాదు. "కష్టాన్ని నమ్ముకుని ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం దానంతట అదే వస్తుందం"టారు విజయ్‌ హల్దియా.

అమ్మ ఆదర్శం

ఉమ్మడి కుటుంబం. ఇంట్లో పెద్దలు పిల్లలు. సందడిసందడి వాతావరణం. ఎప్పుడూ ఏదో ఒకటి వండిపెట్టడం. అలా విజయ్‌ హల్దియాకు వంటలపై ఆసక్తి పెరిగింది. అమ్మకు సాయం చేసేటప్పుడే నేర్చేసుకున్నారు. అందుకే అంటారు విజయ్‌" అమ్మే నా రోల్ మోడల్" అని. ఇప్పుడు ఆమె చేసే ప్రతీ వంటకం వెనుక అమ్మ స్ఫూర్తే ఉంది. అలా అలా వండటం అనేది ఒక అభిరుచిగా మారిపోయింది. ఆ వ్యాపకానికి మరిన్ని సుగంధ ద్రవ్యాలు అద్ది హోమ్ సైన్స్‌లో బ్యాచిలర్స్ పట్టా కూడా తీసుకున్నారు.


"రుచిని పూర్తిగా అర్ధం చేసుకునేందుకు, వంటకాలకు మరింతగా టేస్ట్ అందించేందుకు నా గతం నాకు ఎంతో ఉపయోగపడింది. సుగంధద్రవ్యాలను ఏ పరిమాణంలో వాడితే... రెసిపీలకు రుచి పెరుగుతుందో నాకు తెలుసు”

జేకా కా తడ్కా వర్డ్‌ప్రెస్ పోర్టల్‌కు, అదే పేరుతో ఉన్న ఫేస్‌బుక్ కమ్యూనిటీకి ప్రస్తుతం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇది విజయ్ హల్దియా కష్టపడి సాధించిన విజయానికి తార్కాణం. వయసు మీద పడుతున్నా ఈ వెంచర్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు . ఆమె అనుభవం ఈ ఫుడ్ బ్లాగ్ సక్సెస్‌కు తోడ్పడింది. వెంచర్ ప్రారంభం నుంచే ప్రోత్సాహం లభించినా. సక్సెస్ అందుకునేందుకు మాత్రం కొంత సమయం పట్టింది. ఆ సమయంలో వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. వారివారి స్వభావాల రీత్యా అలా అని ఉండొచ్చనే స్థితప్రజ్ఞతే విజయ్‌ని విజయ తీరాలవైపు నడిపించింది. "ఎవరేం చెప్పినా.. మన మనసు చెప్పినదానికే కట్టుబడి ఉంటాను... దానికి అనుగుణంగానే ముందుకు పోతాను"అంటారు విజయ్ హల్దియా.

నెట్టింట్లో వంటిల్లు

నెట్టింట్లో వంటిల్లు


వంటింట్లో ఎన్నో సవాళ్లు

విజయ్ హల్దియాను నిరుత్సాహపరచే శత్రువులు లేకపోలేదు. అయితే అవతలి వారి వ్యక్తిత్వం, మనం నడిచే దారి సరైనదో కాదో తెలియాలంటే మాత్రం... ఇలాంటి వారు అవసరమంటారు విజయ్. ఆమె ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ కూడా వంటలకు సంబంధించిందే. వారికి కావలసిన వంటకాన్ని సూచించాల్సిందిగా బ్లాగ్ రీడర్లను అడిగినపుడు... ఆ లిస్ట్ చాంతాడంతకు చేరుకుంది. ఎవరినీ నిరుత్సాహపరచకుండా... అందరు అడిగిన డిష్‌లను తయారు చేసేందుకు బాగా శ్రమించాల్సి వచ్చింది. రోజుకు 4 చొప్పున రెసిపీలను పూర్తి చేయాల్సి వచ్చింది ఆ సమయంలో. సవాలే అయినా... చాలా ఎంజాయ్ చేశాను” అంటారు విజయ్ హల్దియా.

బ్లాగ్ విషయంలో సహాయం తీసుకున్నా... రెసిపీల తయారీలో మాత్రం సొంతగా ప్రిపేర్ చేయడం కారణంగా... జేకా కా తడ్కాకు ఎనలేని ఖ్యాతిని సంపాదించి పెట్టింది. తరగడం, వండడం, ఫోటోలు తీయడం సహా అన్నీ తానే చేస్తారు . ఇప్పుడామె భర్త రిటైర్ కావడంతో... కొంత సాయం చేస్తున్నారు. మన తల్లిదండ్రుల కాలంలో ఎలాంటి టెక్నాలజీ సహాయం లేదు. ఇప్పటి తరానికి సాంకేతిక రంగం చేస్తున్న సహాయం ఎంతో ఉంది. దీంతో అవకాశాలు అపారంగా పెరుగుతున్నాయంటారు విజయ్. కుటుంబసభ్యుల సహాయంతో.. టెక్నాలజీ విషయంలోనూ అప్‌డేట్ అయ్యారు విజయ్ హల్దియా.

“త్వరలో వెబ్‌సైట్ లాంఛ్ చేయబోతున్నాం. దీంతోపాటు రెస్టారెంట్ కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. అలాగే ఫుడ్ లవర్స్ కోసం మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చే యోచన కూడా ఉంది. చిన్న చిన్న ఈ-బుక్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం"


మనం అందుకోవాలనుకునే లక్ష్యం కోసం పూర్తిగా శాయశక్తులా ప్రయత్నించి... అంతో ఇంతో అదృష్టం కోసం ఎదురు చూడాలంతే. మన విధులు పూర్తిగా నిర్వర్తిస్తే.. విధి మనకు ఎప్పుడూ తోడుంటుంది. మనకు సాయం చేస్తుంది. నా వరకూ నేను లక్ష్యసాధన కోసం శ్రమ పడుతున్నాను. సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాను ” అంటున్నారు విజయ్ హల్దియా. విదేశాల్లో ఉంటున్న అనేకమంది భారతీయులకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. కుటుంబాలకు దూరంగా ఉన్నా... ఇంటివంటకు దగ్గరయ్యే అవకాశం దొరుకుతుందని చెప్పారు. అలా మొదలైందే జేకా కా తడ్కా.


కాలంతో పాటు మారడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ తరం మహిళలకు టెక్నాలజీ ఒక గిఫ్ట్ లాంటిది. సరైన సమయంలో అందుబాటులోకి వచ్చింది. భారతీయ మహిళలు ఇప్పుడిప్పుడే ఇంటినుంచి బయటకు వస్తున్నారు. అయినా ఈ తరం వనితలు ఇల్లు, ఉద్యోగాలకు సమ ప్రాధాన్యమిస్తూండడం విశేషం. ఉద్యోగ విధులు, ఇంటి బాధ్యతలను బేలన్స్ చేస్తూ జీవిస్తున్నారు. పరుగులు పెడతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కొత్త ఆలోచనలను సఫలీకృతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో విజయ్‌ హల్దియా ఒకరు.