ప్రోగ్రాం మీది.. అతిధులను చూసుకునే బాధ్యత మాది అంటున్న ఇద్దరు ఐఐటియన్లు

ప్రోగ్రాం మీది.. అతిధులను చూసుకునే బాధ్యత మాది అంటున్న ఇద్దరు ఐఐటియన్లు

Monday October 12, 2015,

3 min Read

బిలియన్ డాలర్ల విలువైన ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో ఇద్దరు ఐఐటీ పూర్వ విద్యార్థులు సంచలనం సృష్టిస్తున్నారు. అంతర్జాతీయ సంస్థల్లో మంచి ఉద్యోగాలను వదిలి పలు రకాల కార్యక్రమాలకు అతిధులను ఆహ్వానిస్తున్నారు. పెద్ద కార్పొరేట్ కార్యక్రమాల నుంచి స్కూల్ స్పోర్ట్స్ డే వరకూ కోరిన ప్రతి ఒక్కరికీ సేవలందిస్తూ ఈ రంగంలో దూసుకెళ్తున్నారు.

image


Image credit - Shutterstock

దేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న రంగాల్లో ఈవెంట్ ఇండస్ట్రీ కూడా ఒకటి. బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ కలిగిన ఈ రంగంలో అపార అవకాశాలున్నాయి. అవార్డ్ ఫంక్షన్లు, కాన్సర్ట్స్, వేలమంది అభిమానులు పాల్గొనే ప్రదర్శనలతోపాటు కాలేజీ కల్చరల్ ఫెస్ట్స్, పెళ్లిళ్లు, పుట్టినరోజు కార్యక్రమాల వంటివి ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు అవుట్‌సోర్సింగ్‌కు ఇస్తుంటారు. ప్రొఫెషనలిజం ఉంటుందని చాలా కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఈవెంట్లను బయటి వాళ్లకే అప్పగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు చాలామంది ఈ రంగంవైపు అడుగులు వేస్తున్నారు. సృజనాత్మకతకు తోడు కోరుకున్నంత స్వేచ్ఛ లభిస్తుండటంతో యూత్‌కు ఈ ఫీల్డ్ ఇప్పుడు ఫేవరెట్‌గా మారింది. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంలో ఢిల్లీకి చెందిన ఇన్వైట్‌మైగెస్ట్.ఇన్ ఇప్పుడు దూసుకుపోతోంది. ఆన్‌లైన్ ద్వారా సేవలందిస్తూ భారీగా కస్టమర్లను సంపాదించింది. ఆర్టిస్టులు, ప్రదర్శన కారులు. ఫొటోగ్రాఫర్లు, విద్యావేత్తలు, వక్తలు, వ్యాపారవేత్తలు, ట్రైనర్లతో ఒప్పందం కుదుర్చుకుంటూ అవసరమున్న ఈవెంట్లకు వాళ్లను పంపుతోంది.

ఐఎంజీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో దృశ్యం

ఐఎంజీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో దృశ్యం


‘‘ కోల్‌కతాలో ఐఐఎంలో చదువుతుండగా నాకు ఎదురైన అనుభవం నన్ను ఈ దిశగా నడిపించింది. క్యాంపస్‌ కార్యక్రమాలకు సెలబ్రిటీలను, వక్తలను, గొప్ప వ్యక్తులను ఆహ్వానించాల్సి వచ్చేది. ఇందుకు చాలా సమయం పట్టేది. గెస్టుల సమాచారాన్ని సేకరించేందుకే టైం సరిపోయేది. అంతగా గుర్తింపు పొందని మంచి గెస్టుల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. సరైన వాళ్లను ఆహ్వానించేందుకు, ఈవెంట్లకు హాజరవుతున్నవారికి మధ్య ఎంతో గ్యాప్ కనిపిస్తుంది ’’ అంటున్నారు ఐఎంజీ కో ఫౌండర్, ఐఐటీ ఖరగ్‌పూర్ పూర్వ విద్యార్థి వివేక్ పటేశ్వరి.

అక్షయ్ అగర్వాల్

అక్షయ్ అగర్వాల్


ఈ సంస్థ మార్కెటింగ్ వ్యవహారాలను వివేక్ పర్యవేక్షిస్తున్నారు. ఈ సంస్థ దోహా, ఖతార్ సహా ఐదు దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.. ఖతార్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించిన ఓ కార్యక్రమాన్ని వివేక్ నిర్వహించారు. అత్యంత ఖరీదైన, పెద్దదైన కార్యక్రమంతో పాటు కాన్సర్ట్‌ను కూడా నిర్వహించారు. ఐఎంజీని ఏర్పాటు చేయాలన్న ఐడియా వచ్చిన వెంటనే తన స్నేహితుడు.. ఐఐటియన్ అక్షయ్ అగర్వాల్‌తో పంచుకున్నారు వివేక్. అక్షయ్ కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అప్పటివరకు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి వీరిద్దరూ ఢిల్లీలో ఐఎంజీకి పూర్తి సమయాన్ని కేటాయించారు. ఆరంభంలో కేవలం విద్యా సంస్థలకే తమ సహాయ సహకారాలు అందించేవారు. ఆ తర్వాత దాన్ని మరింత విస్తరించి రకరకాల ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.

గొప్ప అవకాశం

ఈవెంట్ ఇండస్ట్రీకి ధీటుగా ఈ కామర్స్ రంగం రోజు రోజుకు విస్తరిస్తోంది. అయితే వీటికి తగ్గట్టుగా గెస్టులందరినీ ఒకే వేదికపైకి తెచ్చే ప్లాట్‌ఫామేది ఏర్పడలేదు. ఇంకోవైపు అంతగా అనుభవంలేని, విలువలు లేని దళారులు ఈ రంగంలో వేళ్లూనుకుపోయారు. IRCTC ఏర్పడకముందు, ఏజెంట్లు పెద్ద ఎత్తున టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్‌లో అమ్మినట్టుగా తయారైంది.

వివేక్ పటేశ్వరీ, ఐఎంజీ కో ఫౌండర్

వివేక్ పటేశ్వరీ, ఐఎంజీ కో ఫౌండర్


గెస్టులను ఆరెంజ్ చేయడమే కాదు ఈవెంట్ ఆర్గనైజర్ల వివరాలను కూడా ఈ ఇన్వైట్ మై గెస్ట్.ఇన్‌లో అందుబాటులో ఉంచారు. ఏ కార్యక్రమానికైనా క్యాటరింగ్ సర్వీసులను కూడా అందిస్తున్నారు.

బిజినెస్ మోడల్

అర్హత కలిగిన గెస్టులు తమ స్థాయికి తగిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సాయం చేయడంతోపాటు వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకుంటోందీ సంస్థ. తమ పోర్టల్ ద్వారా ఏవైనా అవకాశాలు వస్తే, గెస్టుల నుంచి నామినల్ ఫీజును వసూలు చేస్తుంది. ప్రస్తుత మార్కెట్ ఫీజుతో పోలిస్తే ఈ రుసుము చాలా తక్కువగా ఉంటుంది. ఐఎంజీ ఏర్పాటు చేసే ఏ కార్యక్రమానికైనా అటు ఆతిథ్యమిచ్చేవారికి, ఇటు గెస్టులకు కానీ ఐఎంజీ రిసీప్ట్/ఇన్వాయిస్ ఇస్తుంది. ఇలా పారదర్శకంగా వ్యవహరించడం వల్ల అటు ప్రభుత్వానికి కూడా ట్యాక్స్‌ల రూపంలో ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ వ్యాపారం మూడు ప్రోగ్రాములు, ఆరుగురు గెస్టుల్లా సాగుతోంది. ఇప్పుడైతే సర్వీస్ చార్జీలను మాత్రమే వసూలు చేస్తున్న ఈ సంస్థ ఫ్యూచర్‌లో మరిన్ని మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తోంది. సబ్‌స్క్రిప్షన్, యాడ్స్, ఫీచర్డ్ ప్రొఫైల్స్ ద్వారా రెవెన్యూ సంపాదించే ప్లాన్‌లో ఉంది.

క్యాంపస్ అంబాసిడర్ ప్రొగ్రామ్

ప్రస్తుతం ఈ వెబ్‌పోర్టల్‌తో ఇప్పటికే చాలామంది గెస్టులు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో రెండు నెలల్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్‌లను కూడా ఈ సంస్థ లాంచ్ చేయనుంది. వెబ్‌సైట్ బీటా వెర్షన్‌తోపాటు #Do The IMGపేరుతో ఓ క్యాంపైన్ ను కూడా నిర్వహిస్తున్నది. ఓలా క్యాబ్స్, సేఫ్ ఎక్స్‌ప్రెస్, యువర్‌స్టోరీల భాగస్వామ్యంతో దేశంలోని 17 ప్రధాన విద్యా సంస్థలు (ఐఐటీలు, ఐఐఎం)లలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. ఈ 17 విద్యా సంస్థల నుంచి ఒక్కో క్యాంపస్ అంబాసిడర్‌ను ఐఎంజీ ఎంపికచేస్తుంది. ఆ అంబాసిడర్ ఐఎంజీ, యువర్‌స్టోరీల తరఫున ఆ కాలేజీల్లో సోషల్ మీడియా, క్యాంపస్ స్పెసిఫిక్ ఈవెంట్లను నిర్వహించాల్సి ఉంటుంది. ఐఎంజీలో ఎన్‌రోల్ అయిన గెస్టులను వివిధ రకాల కార్యక్రమాల్లో పాల్గొనేలా ఒప్పిస్తారు. దేశంలోని ప్రధాన విద్యా సంస్థలన్నింటిని ఒక్కతాటిపైకి తీసుకురావడమే కాకుండా, వారి అవసరాలు, ఆలోచనలను ఈ కార్యక్రమాల ద్వారా సమాజానికి తెలియజేయడమే లక్ష్యంగా పెట్టుకుందీ సంస్థ. ఈ విద్యా సంస్థల్లో కాన్ఫరెన్సెస్, కల్చరల్ ఫెస్ట్స్, టెక్ ఫెస్ట్స్, సమ్మిట్స్, కాంక్లేవ్స్ వంటివాటిని నిర్వహించి అవసరమైన గెస్టులను అందిస్తున్నది.