ఆత్మీయ బంధాల వేదిక ఐక్రష్‌ ఐఫ్లష్

విప్ల‌వం ప్ర‌పంచాన్ని కుగ్రామంగా మార్చేసినా.. ద‌గ్గ‌రున్న మ‌నుషులు మాత్రం దూర‌మ‌వుతున్నారు. ఐతే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక‌ర‌క‌మైన అభిరుచులు, అల‌వాట్లు ఉన్న వారిని ద‌గ్గ‌ర‌చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ది ఐ క్ర‌ష్ ఐ ఫ్ల‌ఫ్‌.. త‌న యాప్ ఐ క్ర‌ష్ ఐ ఫ్ల‌ఫ్‌ను ఆత్మీయ బంధాల‌కు వేదిక‌గా మార్చి ఒకేర‌కంగా ఆలోచించేవారిని ఒక్క‌చోటికి చేరుస్తున్నారు సీమా ఓరా ...

Monday May 18, 2015,

4 min Read

టెక్నాలజీ రాజ్యమేలుతున్న యుగమిది. చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ తన మాయాజాలంలో టెక్నాలజీ కట్టిపడేస్తున్న కాలమిది. సమాచార విస్పొటనంలో ప్రపంచం మొత్తం మునకలేస్తున్న సమయం. సోషల్ మీడియా విప్లవంతో ప్రపంచ గమనమే మారిపోయింది. ఏ ఇద్దరు కలిసినా వాట్సప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియా కబుర్లే. నిజానికి సమాచార విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసినా పక్కపక్కనే ఉన్న మనుషుల మధ్య దూరం పెరిగిపోవటమే నేటి విచిత్రం. ఆ దూరాన్ని దగ్గిర చేయటానికి ఇప్పుడు కుప్పలుతెప్పలుగా సామాజిక అనుసంధాన వేదికలు పుట్టుకొస్తున్నాయి. కానీ వాటితో వ్యక్తిగత స్వేచ్ఛ, భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సరిగ్గా అక్కడే ఆమె ఆలోచన ఆగింది. సమాజంలో ఒకే రకంగా ఆలోచించేవాళ్లు, ఒకే ఆకాంక్షలు, అభిరుచులు, అలవాట్లున్నవాళ్ల మనసులు పెనవేసే ఒక సామాజిక టెక్నాలజీ బంధం ఉంటే బాగుండును అనే ఆలోచన ఆమె మెదడును తొలచటం మొదలుపెట్టింది. ఆ లోచనలోంచి పుట్టిందే ఐక్రష్‌ఐఫ్లష్ యాప్.. ఆ అద్భుత ఆలోచనకు రూపునిచ్చిన సాధకురాలే సీమా ఓరా..

మనసులు కలిపే బంధం

యాప్.. ఈ పదానికి ఇప్పుడు యువతలో ఉన్న క్రేజ్ అంతాఇంతాకాదు. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలోకి తీసుకొచ్చిన స్మార్ట్‌ఫోన్ల యుగంలో యాప్‌దే లీడ్‌రోల్. యాప్.. యాప్.. యాప్.. లెక్కకు మిక్కిలి యాప్‌లు. ప్రతీ అంశానికీ ఒక యాప్. దేనికదే ప్రత్యేకం. ఐక్రష్‌ఐఫ్లష్ యాప్‌ కూడా అలాంటిదే. ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారికైనా.. ఎక్కడ ఉన్నవారితోనైనా ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచే యాప్.. అందునా భారతీయ మానవీయ విలులే పునాదిగా రూపుదిద్దుకున్న యాప్. సమాజాన్ని, ప్రజలను సన్నిహితం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న సీమా వోరా కొత్త ఆలోచన ఈ యాప్‌ను సృష్టించింది. అదిప్పుడు సామాజిక చైతన్యం కోరుకొనేవారికి ప్రధాన అనుసంధాన వేదిక అయ్యింది. భర్త అమిత్‌వోరా సహకారంతో సీమా వోరా స్థాపించిన ఈ ఐక్రష్‌ఐఫ్లష్ యాప్ అనితికాలంలోనే లక్షల మంది అభిమానాన్ని చూరగొన్నది. యూనివర్సల్ ఎక్స్‌పీరియన్స్ (యూఎక్స్) నియమాల విషయంలో రాజీ పడకుండా అతితక్కువ ఖర్చుతో పనిచేసే ప్రత్యేకతతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుత యువత ఆకాంక్షలను వారి వృత్తిగత జీవితాన్ని చక్కగా అర్ధంచేసుకొన్న సీమా.. అందుకు అనుగుణంగా ఈ యాప్‌కు రూపకల్పన చేశారు.

అన్నీ ప్రత్యేకతలే..

మార్కెట్లో ఇప్పుడు బోలెడన్ని యాప్‌లున్నా ఐక్రష్‌ఐఫ్లష్ ప్రత్యేకతలేవేరు. వినియోగదారుల వివరాలకు పూర్తి భద్రతతోపాటు వాటిని గోప్యంగా ఉంచటం దీని ప్రత్యేకతల్లో ఒకటి. అందుకే కేవలం పదివారాల్లోనే లక్షా 5 వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొన్నారు. అంతా 40 ఏండ్ల లోపువాళ్లే. ఈ యాప్ ద్వారా మూడున్నర కోట్లమంది పరిచయం పెంచుకొన్నారు. 75 వేల మందికి పరస్పర అనుబంధం ఏర్పడింది. కోటీ 70 లక్షల అభిప్రాయాలు షేర్ చేసుకొన్నారు. దాదాపు పది లక్షల బహుమతులు పరస్పరం ఇచ్చిపుచ్చుకొన్నారు. 25 లక్షల మందికిపైగా చాటింగ్‌చేశారు. అందుకే దేశంలో అత్యంత పోటీని తట్టుకొని టాప్‍‍‍‍ ‍‍‍‍‍‍‍‍‍‍15 ఉచిత షోషల్ యాప్‌లో ఐక్రష్‌ఐఫ్లస్ స్థానం సంపాదించింది.

చాటింగ్.. మెసేజ్.. గిఫ్ట్స్..

ఈ యాప్ మొబైల్‌తోపాటు డెస్క్‌టాప్ వర్షన్‌లో కూడా లభిస్తుంది. ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా ఈ యాప్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ సమయంలోనే వినియోగదారుడి అభిరులు, ఆకాంక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుపాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ఆ నెట్‌వర్క్‌లో అదే అభిరులు, అలవాట్లున్నవారి ప్రొఫైల్స్ ప్రత్యక్షమవుతాయి. వినియోగదారుడు ఇష్టపడితే ‘క్రష్’ గుర్తును ఎంచుకోవాలి. నచ్చకపోతే ‘ఫ్లష్’ అన్న బటన్ నొక్కాలి. యూజర్ క్రష్ చేసిన ప్రొఫైల్ వినియోగదారులు కూడా తిరిగి క్రష్ చేస్తే వారిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడుతుంది. వారిక చాటింగ్ చేసుకోవచ్చు.. మెసేజ్‌లు పంపుకోవచ్చు. ఇవేకాకుండా ఇందులో ఇంకా అనేక ప్రత్యేకతలున్నాయి. ఇష్టపడ్డవారు పరస్పరం ఆ వేదిక ద్వారానే బహుమతులను ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా తమ వివరాలను పరస్పరం తెలుపుకోవచ్చు. ఈ బహుమతులు పంపుకొనేందుకు ‘సీఎఫ్’ అనే ఇన్-యాప్ కరెన్సీ ఉంటుంది. వినియోగదారుడు రిజిస్టర్ చేసుకొన్నప్పుడే బహుమతులు పంపుకొనేందుకు 500 సీఎఫ్ లభిస్తుంది. ఇక అప్పటి నుంచి యూజర్‌కు ప్రతి క్రష్‌కు 20 సీఎఫ్, ప్రతి ఫ్లష్‌కు 10 సీఎఫ్ లభిస్తుంది. స్నేహంకోసం ఇతరులను ఆహ్వానిస్తూ పంపే సందేశం ద్వారా 50 సీఎఫ్ లభిస్తుంది. ఆ సందేశాలను ఎంతమంది ఆమోదిస్తే అన్ని వేల సీఎఫ్‌లు లభిస్తాయి. ఉత్సవాలు, పుట్టినరోజు తదితర ప్రత్యేక దినోత్సవాల్లో బోనస్ కూడా పొందవచ్చు. సీఎఫ్‌లు లేనిపక్షంలో క్రెడిట్, డెబిట్ కార్డుద్వారా సీఎఫ్‌లు కొనుక్కోవచ్చుకూడా. వినియోగదారుడు తనకు లభించే బహుమతుల విలువలోంచి కూడా సగం సీఎఫ్‌లు తీసుకొనే అవకాశముంది. ఇద్దరు యూజర్ల మధ్య జరిగే సంభాషణలు, వారి ప్రొఫైల్స్ అత్యంత ర‌హ‌స్యంగా ఉంచ‌డం ఈ యాప్ ప్రత్యేకత.

ఆరుగురు వ్యక్తులతోనే అద్భుతం..

ఐక్రష్‌ఐఫ్లష్ యాప్ రూపకల్పనలో పాలుపంచుకున్నది కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమేనంటే చాలామంది నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం. టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో ఎవరికి వారే సాటిరాగల మేధావులతో సీమా వోరా తన టీంను రూపొందించుకొన్నారు. అనూప్ కృష్ణ, అతుల్‌సింగ్, రతీశ్ వీఆర్, రూపేశ్‌పాటిల్, ప్రవీణ్‌కుమార్, మార్టిన్ ఫిలిపోస్, శ్రేయా రంకా. వీళ్లే సీమా బృదం. సాకెట్ ఆధారిత ప్రోగ్రామింగ్‌లో పదేండ్ల అనుభవం ఉన్న అనూప్ కృష్ణ మెసేజింగ్ మాడ్యూల్ బాధ్యతలు చూసుకుంటే.. ప్రోగ్రామింగ్, డెలివరీ అప్లికేషన్స్‌లో ఐదేండ్ల అనుభవజ్ఞడైన అతుల్‌సింగ్ ఆండ్రాయిడ్ యాప్ అభివృద్ధి బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఐఓఎస్‌పై ట్రిపుల్ ఏ గేమ్స్ అభివృద్ధి చేయటంలో ఆరేండ్ల అనుభవం ఉన్న రతీశ్ ఐఓఎస్ యాప్ అభివృద్ధిని చూసుకుంటున్నారు. సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లో నిష్ణాతుడైన రూపేశ్‌పాటిల్ బ్యాకెండ్ మొత్తాన్ని పర్యవేక్షిస్తారు. ఐక్రష్‌ఐఫ్లష్‌కు హృదయంలాంటి అత్యాధునిక రికమెండేషన్ మాడ్యూల్‌ను సృష్టించింది అతనే. ఇక ప్రవీణ్‌కుమార్ యూఐ, యూఎక్స్ హక్కుల బాధ్యతలను చూసుకొంటే.. మార్టిన్ ఫిలిపో విశ్లేషణ, బిజినెస్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు చూసుకొంటారు. సీమాకు అత్యంత సన్నిహితంగా ఉండే శ్రేయారంకా ఉత్పత్తి నాణ్యత, ఆరోగ్య విభాగాల బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ప్రైవసీకి పెద్దపీట..

ఐక్రష్‌ఐఫ్లష్ యాప్‌పై వినియోగదారుల నుంచే కాకుండా టెక్నాలజీ దిగ్గజాల నుంచి కూడా ప్రశంసల వర్షం కురుస్తున్నది. ఇందులో వినియోగదారుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటంతో యూజర్స్ అమితంగా ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా 2జీ, 3జీ నెట్‌వర్క్‌ల ద్వారా ఇందులో చిత్రాలను అత్యంత వేగంగా పంపుకొనే అవకాశముండటం అందరినీ ఆకట్టుకొంటున్నది. దీనిని మరింత అభివృద్ధి చేయటానికి ఐక్రష్‌ఐఫ్లష్ టీం నిరంతరం కృషిచేస్తున్నది. ఇందులో యూజర్లందరి ఇష్టాలను అందరూ చూసే అవకాశం ఉండదు. అయితే, అందరి ఇష్టాయిష్టాలను తెలుసుకోవాల్సి అవసరం ప్రతి ఒక్కరికీ ఉండదన్న ఉద్దేశంతోనే ఈ విధంగా డిజైన్ చేసినట్లు అమిత్ ఓరా చెప్తారు. ఈ యాప్‌లో వినియోగదారలే తమనుతాము పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని యాప్స్ కన్నా వినియోగదారులకు పూర్తి స్వేచ్ఛ ఉండటమే ఐక్రష్‌ఐఫ్లష్ విజయరహస్యమని చెప్పవచ్చు. ఈ యాప్‌పై వినియోగదారుల అభిప్రాయాలను App Friday, Pursuit of APPiness వెబ్‌సైట్లలో చూసే అవకాశముంది.