లాంతర్ వెలుగు, కృషి, పట్టుదలే ఇప్పుడే 19 వేల న్యూరో సర్జరీలు చేసే సక్సెస్‌ఫుల్ డాక్టర్‌ను చేసింది

ఆయన అపాయింట్‌మెంట్ కోసం ఎంతటి ప్రముఖులైనా గంటలకు గంటలు వేచి చూడాల్సిందే ! ఆయన హస్తవాసి బాగుంటుందని ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్లు ఎంత మందో ! ఆపరేషన్ థియేటర్‌ లైట్ల వెలుగులో.. గంటలకు గంటలు బ్రెయిన్ సర్జరీ విజయవంతమయ్యే దాకా ఆయన కష్టపడ్తూ ఉంటే రోగి కుటుంబమంతా ఓ దేవుడికి వేయి దండాలు పెడ్తూ ఉంటుంది. మనం ఇంతగా చెబ్తున్న అలాంటి వ్యక్తే.. డాక్టర్ రంగనాథం. అలాంటి ప్రముఖ వ్యక్తి.. లాంతర్ల కాంతిలో చదువుకుని ఈ స్థాయికి వచ్చారని తెలిస్తే ఆశ్చర్యపోతాం, ఆయన కృషి వెనుక ఎంత పట్టుదల ఉందో తెలిస్తే.. గర్వపడతాం. 

లాంతర్ వెలుగు, కృషి, పట్టుదలే ఇప్పుడే 19 వేల న్యూరో సర్జరీలు చేసే సక్సెస్‌ఫుల్ డాక్టర్‌ను చేసింది

Wednesday July 13, 2016,

10 min Read

అదో మారుమూల ఊరు. అక్కడ పాఠశాలల్లో బెంచ్‌లు లేవు.. టేబుల్స్ లేవు. అంతా నేలతల్లే. ఆమె అందరికీ చదువుని నేర్పించే సరస్వతి. కింద కూర్చునే చదవడం-రాయడం. పేరుకు స్కూల్ అని దాన్ని అనాల్సి వస్తోంది కానీ.. అది ఏడుగురు ఉండే ఓ ఇల్లు. అంతే. ఆ గ్రామంలో కరెంట్ కూడా లేదు. అందుకే కొవ్వొత్తులు, లాంతర్ల అక్కడి విద్యార్థులకు వెలుగుదివ్వెలు. వాళ్ల భవిష్యత్తుకు బాటలు వేసే దిక్సూచీలు. అందుకే బలమైన కాంక్ష ఉన్న వాళ్లు మాత్రమే వాటి వెలుగుల ముందు కూడా కళ్లు అరిగిపోయేలా చదువుకునే వారు. వాళ్లు మాత్రమే విజయలక్ష్మిని వరిస్తారు. అలాంటి కోవలోకే వస్తారు ఈ వ్యక్తి. పట్టుదలతో వైద్యుడిగా మారడం ఆయననే కాదు.. ఆయన ఊరివాళ్లను.. ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. ఐదు వేలు కాదు, పది వేలు కాదు ఏకంగా 19వేల మంది రోగులకు బ్రెయిన్ సర్జరీ చేయడంలో ఆయన కీలక పాత్ర. సున్నితంగా ఎంతో ఓర్పుతో, ఒడుపుతో శస్త్రచికిత్స చేసి రోగాలను దూరం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇంకో గొప్పతనం ఏంటంటే.. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం ఆయనది. పుట్టిన ఊరికి, పెట్టిన గ్రామానికి ఎంతో కొంత చేయాలనే తాపత్రయం ఇప్పటికీ ఆయనలో కనిపిస్తుంది. అందుకే తన గ్రామం నుంచో, జిల్లా నుంచి ఎవరైనా చికిత్స కోసం వస్తే ఫీజు కూడా తీసుకోకుండానే ఆయన వైద్యాన్ని అందించి.. ఆ కుటుంబంలో భరోసానింపుతారు. బ్రెయిన్ సర్జరీలో ఒన్ ఆఫ్ ది బెస్ట్ డాక్టర్ అయిన రంగనాథం కథ చదివితే మనమూ స్ఫూర్తి పొందుతాం. కనీసం ఒక్క మంచి అలవాటునైనా చేసుకోవాలని అనుకుని తీరతాం. 

image


పేద కుటుంబంలో పుట్టిన రంగనాధం చిన్నప్పటి నుంచే గ్రామీణుల కష్టాలను దగ్గరిగా చూశారు. పేదరికానికి దగ్గరగా, అభివృద్ధికి దూరంగా ఉండే అలాంటి గ్రామాల్లో వైద్య సేవలు అందడం అత్యాశే అవుతుంది. అలాంటి గ్రామంలో ఉన్న వ్యక్తులు చికిత్స కోసం వేచి చూస్తున్నపుడు, అనారోగ్యంతో కుంగిపోతున్నప్పుడు చూసి తానూ కుమిలిపోయేవాడు. లోలోపల బాధపడ్తూ ఏదో ఒకటి చేయాలని తపనపడేవారు. 

ఆ గ్రామంలో ఓ ప్రాథమిక చికిత్సా కేంద్రం ఉంది. కానీ అక్కడికి ఒక వైద్యుడు కూడా రాడు. నొప్పి తక్కువైనా ఎక్కువైనా.. రోగం చిన్నదైనా పెద్దదైనా.. చికిత్స కోసం ఆ గ్రామస్తులు కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లాల్సిందే. చాలా మంది దగ్గర ఈ మాత్రం డబ్బులు కూడా ఉండేవి కావు. బహుశా పేదరికమే అన్నిటికంటే పెద్ద వ్యాధి కావడం వల్లేనేమో.. దానిముందు ఇలాంటి చిన్న ఆస్పత్రులు కూడా పనికిరాకుండా పోయేవి. ముఖ్యంగా పిల్లల్లో చాలామంది కనీస చికిత్స కూడా అందక.. ఆ...వేదనతో బాధతో మూలుగుతూనే వంద ఏళ్లను వంద రోజుల్లోనే ముగించేసేవారు. ఇలా ఎంతో మంది కష్టాలను రంగనాధం దగ్గరి నుంచి చూసి చాలా తెలుసుకున్నారు.

పిల్లాడిగా ఉన్న సమయంలో ఈయన మనసు పాదరసంలా పరిగెెత్తేది. చదవడం రాయడంలో అపారమైన ప్రతిభ. గ్రామస్తుల నిస్సహాయతను నరనరాల్లో జీర్ణించుకున్న ఆయన.. భవిష్యత్తులో నరాల వ్యాధిని నయం చేసే డాక్టర్ అవుతానని ఊహించి ఉండకపోవచ్చు. కానీ చిన్నప్పటి నుంచే ఏదో ఒక రోజు తాను డాక్టర్ కావాలనే బలమైన సంకల్పం ఆయనలో ఉండేది. కష్టాలతో కునారిల్లిపోయే వాళ్లందరికీ కాస్తాకూస్తో సాయం చేయాలనే ఆలోచనే ఉండేది. అలాంటి సుదీర్ఘమైన లక్ష్యాన్ని అందుకునేందుకు ఆ పిల్లాడు ఓ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. పేదరికం, గ్రామీణ నేపధ్యం వంటివేవీ అతని చదువుకు, లక్ష్య సాధనకు అడ్డు రాలేదు. స్కూల్ - కాలేజీలలో జరిగిన ప్రతీ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో ఉన్నత స్థానంలో నిలిచేవాడు. అలా పదో తరగతి పాసవడమే కాదు.. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులను కూడా సంపాదించాడు. దీంతో గ్రామానికి దూరంగా పెద్ద నగరంలో రాష్ట్రంలోనే అతి పెద్ద కాలేజ్‌లో ప్రవేశం లభించింది. మెడికల్ కాలేజ్‌లో ప్రవేశానికి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం విశేషం. ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేశాక దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి అక్కడ ఎయిమ్స్‌లో న్యూరో సర్జరీ కూడా అభ్యసించారు. ఇప్పుడాయన దేశంలోనే అత్యంత ప్రసిద్థులైన న్యూరో సర్జన్లలో ఒకరు. 

ఇక్కడ మనం మాట్లాడుకున్న పిల్లాడి పూర్తి పేరు పేరు డాక్టర్ పైడిపెద్ది రంగనాధం. భారత దేశంలోనే ప్రఖ్యాత న్యూరో సర్జన్. ఈయనది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో కింతలి గ్రామం. తండ్రి ఓ పేద రైతు. తల్లే కుటుంబం ఆలనా పాలనా చూసుకుంటూ, పొలంలో భర్తకు సాయం చేస్తూ ఉండేది. వారి ఇల్లు ఓ గది మాత్రమే. అందులోనే తల్లి, తండ్రితో పాటు ఐదుగురు పిల్లలు. వంటగది, సామాన్ల గది, స్నానాల గది.. ఇలా పేర్లు ఎన్ని ఉన్నా.. అన్నీ ఆ గదిలోనే. రంగనాథం తల్లి నిరక్షరాస్యులైతే.. తండ్రి కనీసం సంతకమైనా పెట్టేవారు. తనకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉండేవారు. ఐదుగురు పిల్లల్లో రంగనాథం అందరికంటే చిన్నవాడు. వీరందరిలో అందరికంటే పెద్దన్న కంపార్ట్‌మెంట్‌లో మెట్రిక్ వరకూ చదివాడు. పిల్లలను స్కూల్‌కి నిరంతరాయంగా పంపించేంతటి ఆదాయ వనరులు ఆ కుటుంబానికి లేవు. చదువుల కోసం పుస్తకాలు కొనే స్థోమతా లేదు. మొత్తం ఐదుగురులో మిగిలిన ముగ్గురు తమ చదువు అంతగా అబ్బలేదనే చెప్పాలి. 

వాస్తవానికి రంగనాథం అదృష్టవంతుడు కావడం వల్లే స్కూల్‌కి వెళ్లగలిగాడు. గ్రామంలో ఉన్నపుడు ప్రభుత్వ పాఠశాలలోనే రంగనాథం చదవగా.. అక్కడి పరిస్థితులు తన ఇంటిలో మాదిరిగానే రంగనాథంకు కనిపించేవి. కానీ ఆయన అలాంటి ఇలాంటి విద్యార్ధి కాదు. చదువులో చాలా ఉత్సాహంగా ఉండేవాడు. ఆయన జ్ఞాపక శక్తి అమోఘమని టీచర్లు చెబుతుంటారు. ఒక్కసారి టీచర్ స్కూల్‌లో ఉన్న బ్లాక్ బోర్డ్‌పై పాఠం రాస్తే చాలు.. అది ఆ పిల్లాడికి కంఠోపాఠం అయిపోయేది. స్కూల్లో మాస్టారూ ఏది చెప్పినా, చదివినా.. అది మైండ్‌లో ఫిక్స్ చేసుకునే తెలివితేటలు ఆయన సొంతం. ఆ స్కూల్‌లోని ప్రతి ఒక్కరూ రంగనాథం ప్రతిభా పాటవాలను ప్రశంసించినవారే. అతని శ్రమ, కష్టపడే తత్వం, ప్రతిభలను చూసిన ఆ పాఠశాల అధ్యాపకులు.. ఏదో ఒక రోజు ఇతన కచ్చితంగా గొప్పవాడు అవుతాడంటూ ప్రశంసించేవారు. అందరూ ఇలా చెబుతుంటే రంగనాథం తమ తల్లిదండ్రులు ఏనాడూ తప్పుగా భావించలేదు. ఇదే సమయంలో వారిద్దరిలో కొత్త నమ్మకాలు బయల్దేరాయి. తమ పిల్లవాడు గొప్పవాడు అవుతాడని చెప్పిన మాటలపై గర్వపడకుండా... తమ బిడ్డ పెద్దవాడయ్యాక ఖచ్చితంగా తమ పిల్లల్లాంటి పేదల కష్టాలను తీరుస్తాడని విశ్వసించేవారు.

రంగనాథం తన వైపు నుంచి ఎటువంటి లోటు చేయలేదు. మనసంతా చదువుపైనే లగ్నం చేసేవారు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడ్డారు. కరెంటు సౌకర్యం కూడా లేని గ్రామమే ఆయన మనసు చెదరకుండా ఎప్పుడూ గుర్తుతెచ్చేది. ఆ ఆలోచనరాగానే వెంటనే మళ్లీ చదువులో లీనమైపోయేవారు. ఆయన కష్టానికి ఫలితం దక్కింది. ఆయన తెలివితేటలకు రాష్ట్రమంతా గుర్తింపు లభించింది. పదో తరగతిలో ఆయన రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కులను సాధించారు. దీంతో అతికొద్ది మందికి మాత్రమే లభించే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ దక్కింది. అప్పట్లో లయోలా కాలేజ్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేది. అక్కడ ఎవరికి సీటు దొరికినా వారు ఇంజినీర్ కానీ డాక్టర్ కానీ అయ్యేవారనే నమ్మకం ఉండేది.

'నేను డాక్టర్ కావాలనే కోరుకున్నాను. నాకు రాష్ట్రంలో మూడో ర్యాంక్ రాగానే నేను డాక్టర్‌ని కావాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రా లయోలా కాలేజ్‌నే ఎంచుకున్నాను '.

ఆ సమయంలో గ్రామంలోని ఎవరికి ఓ రోగం వచ్చినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవసాన దశలో ఉండడం ఆయనలో కసి పెంచింది. అందుకే డాక్టర్ అవాలని కోరుకున్నారు. ఆ రోజుల్లో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా దూర ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చేది. ఎంత దూరం వెళ్లినా సరైన చికిత్స దొరకని పరిస్థితులు రంగనాథంలో మరింత పట్టుదల పెంచాయి. గ్రామస్తుల కష్టాలు ఆయన మనసులోను మెదడులోను నాటుకుపోయాయి.

మొదట్లో ఆంధ్రా లయోలా కాలేజ్‌లో చదువుతున్నపుడు అనేకానేక సమస్యలు. ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సి వచ్చేది. కానీ వారు పదవ తరగతి వరకు మాత్రమే కాదు ఇంటర్మీడియట్‌లో కూడా తెలుగు మీడియమే. రంగనాథానికి అది కొంత నిరాశ కలిగినా.. ఏ మాత్రం పట్టుదల తగ్గించుకోలేదు. లక్ష్యం మార్చుకోలేదు. ఆంధ్రా లయోలా కాలేజ్‌లో మొదటి సెమిస్టర్ ఫలితాలు వచ్చినపుడు.. రంగనాథం పేరు మొదటగా ఉండడం విశేషం. మార్కుల విషయంలో ఇంగ్లీష్ మీడియం విద్యార్ధులను కూడా రంగనాథం దాటేయడాన్ని ప్రత్యేకంగా చెప్పకోవాలి.

image


రంగనాథానికి ఆ సమయంలో మరో పెద్ద సమస్య వచ్చింది. ఆ సమయంలో నక్సలైట్ ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉండేది. అందరు దాని గురించి ఎక్కువగా చర్చించుకునేవారు. రంగనాథం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, అక్కడ నక్సల్ ఆందోళన ఎక్కువగా ఉండేది. ఆంధ్ర లయోలా కాలేజ్‌లో కొందరు ఆయనన్ను 'శ్రీకాకుళం నక్సల్' అని పిలిచేవారు, వేధించేవారు. కానీ పరీక్షల్లో అపారమైన ప్రతిభతో ప్రతీ ఒక్కరి నోరు మూయించారాయన.

రంగనాథం భగవంతుడిని విపరీతంగా నమ్ముతారు. అందుకో ఆయన నుదుటిపై ఎప్పుడూ నామం ఉంటుంది. పేద కుటుంబం నుంచి వచ్చినవాడు కావడంతో హవాయి చెప్పులు, కాటన్ షర్టు-ప్యాంటు మాత్రమే ధరించేవారు. అవే ఆయన గుర్తులు కూడా.

ఆంధ్రా లయోలా కాలేజ్‌లో చదివేందుకు రంగనాథంకు హాస్టల్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ ఆయన నివసించే గ్రామానికి చాలా దూరం. కాలేజ్ మొదలైన రోజుల్లో అమ్మా-నాన్న, సోదర సోదరీమణులు, గ్రామస్తులు ఎక్కువగా గుర్తొచ్చేవారు. తనను తాను ఒంటరి అని భావించేవారాయన. నగర జీవితాన్ని అలవాటు పడేందుకు రంగనాథానికి ఎక్కువ సమయమే పట్టింది. ఆ మొత్తంలో ఆయనకు మంచి చేసిన ఒకటే ఒక విషయం ఏంటంటే.. హాస్టల్‌లో వేళకు భోజనం లభించేది. అలాగే చదువుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉండేది. అది కూడా కరెంట్ వెలుతురులో..! విద్య నేర్పించేందుకు, ఎలాంటి సందేహాలు వచ్చినా తీర్చేందుకు ఎంతో అనుభవజ్ఞులు ఉండేవారు. 

 జీవితంలో చెప్పుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకు తన తల్లిదండ్రులపై భారం పడనివ్వలేదు. పదో తరగతి పరీక్షల్లో ఉన్నత మార్కులు సాధించడంతో ఆయనకు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్ దక్కింది. అలా స్కాలర్‌షిప్ నుంచి వచ్చిన సొమ్ముతోనే చదువులు, ఖర్చులు పూర్తి చేసుకునేవారు. ఫీజులకు, నెలసరి ఖర్చులకు అవే సరిపెట్టుకునేవారు. ఇంటర్మీడియట్ చదువుతున్నపుడే మెడికల్ కాలేజ్‌లో సీటు కోసం రాయాల్సిన ప్రవేశ పరీక్షకు సంబంధించిన మెటీరియల్ కూడా చదివేసేవారు. ఊహించిన దానికంటే ఎక్కువ ర్యాంక్ రావడంతో మెడికల్ కాలేజ్‌లో సీటు చాలా తేలిగ్గా వచ్చింది. ఆ రోజులను తలుచుకుని రంగనాథం ఇప్పటికీ ఉత్సాహం పొందుతారు.

'ఆ రోజు మొత్తం మా గ్రామంలోని ప్రజలంతా మా ఇంటి దగ్గరే ఉన్నారు. ఒక పేదవాడి కొడుకు డాక్టర్ అవుతున్నాడని అందరూ చాలా సంతోషించారు'

ప్రవేశ పరీక్షలో పాసయ్యాక రంగనాథం విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజ్‌లో చేరారు. విపరీతంగా చదివేయాలనే కోరిక మాత్రమే ఆయన మనసులో ఎప్పుడూ ఉండేది. ప్రతీ ఏడాది ప్రతీ పరీక్షలోను అత్యుత్తమ మార్కులు, ర్యాంకుతో పాసయ్యేవారు. ఎంబీబీఎస్ పూర్తయ్యి ఇంటర్న్‌షిప్ చేయాల్సిన సమయంలో అందరినీ షాక్‌కి గురి చేసే ఓ నిర్ణయాన్ని రంగనాథం తీసుకున్నారు. ట్రైనింగ్‌లో ఆయన న్యూరో సర్జరీ తీసుకున్నారు. ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఈ న్యూరో సర్జరీ కోర్సు ఎంచుకునేవారు. దాని గురించి రంగనాథం ఇలా చెప్పారు.

న్యూరో సర్జరీనే ఎందుకు ఎంచుకున్నానంటే !

'80వ దశకం ప్రారంభంలో నేను న్యూరో సర్జరీ ఎంచుకున్నపుడు చాలామంది నవ్వుకున్నారు. నాపై జోకులు కూడా వేసుకునేవారు. అప్పట్లో న్యూరో సర్జరీ చేయించుకునేందుకు పంపడం అంటే.. అతని జీవిత చరమాంకంలో ఉండడమే. ఒక మనిషిని బతికించేందుకు చేసే ఆఖరి ప్రయత్నమే న్యూరో సర్జరీ అనుకునేవారు. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లిన వాళ్లు మళ్లీ శవమై బైటకు రావడమే అనుకునేవారు. ఇప్పుడు అందుబాటులో ఉన్నట్లుగా అప్పట్లో న్యూరో సర్జరీకి భారీ భారీ ఉపకరణాలు సాధనాలు లేవు. న్యూరో సర్జరీ కోసం ఒక మనిషిని పంపడం అంటే.. అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించడమే అనే భావన ఉండేది. ఎవరిదైనా చెయ్యి కాలు పడిపోతేనో.. ఎవరికైనా గొంతు మూగబోతేనో పంపేవారు. వికలాంగులుగా మారిపోయిన అనేకమందిని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపిన వైద్యులను నేను నా జీవితంలో చూశాను. అప్పుడే నేను ఇదే కోర్సు చేయాలని నిర్ణయించుకున్నా' అంటారు డా. రంగనాథం. 

ఎంబీబీఎస్ చదువు పూర్తయ్యాక 1981లో ఢిల్లీ ఎయిమ్స్‌ (ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌)లో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాశారు. అన్ని పరీక్షల మాదిరిగానే దీనిలో కూడా ప్రతిభ చాటారాయన. ఎయిమ్స్‌లో చేరే సమయంలో అక్కడి ప్రొఫెసర్లకు.. తాను న్యూరో సర్జరీలో నిపుణుడిని కావాలని కోరుకుంటున్నట్లు చెబితే.. ఓ నెల రోజులు ఆలోచించుకుని బాగా నెమ్మదించిన మనసుతో తిరిగి నిర్ణయించుకోవాలని డిపార్ట్‌మెంట్ హెడ్ సలహా ఇచ్చారు. ఈ నెల రోజుల్లో ఎయిమ్స్‌లోని మిగతా డాక్టర్లతో కలిసి ఔట్‌పేషెంట్ విభాగంలోను మరికొన్ని డిపార్ట్‌మెంట్స్‌లోను రంగనాథం పనిచేశారు. ఆ నెల తర్వాత మళ్లీ హెడ్ అడిగినప్పుడు తన నిర్ణయం న్యూరో సర్జరీ అనే చెప్పారు. మరికొందరు ప్రొఫెసర్లు కూడా ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే ఆ విభాగంలో సంవత్సరానికి కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు ఉండేది. కానీ రంగనాథం ఈ విషయంలో మాత్రం మొండి పట్టుదలను కొనసాగించారు. చివరకు తనకు నచ్చిన విభాగంలోనే సీటు దక్కించుకున్నారు. 

రంగనాథం ఇప్పుడు దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన న్యూరో సర్జన్లలో ఒకరు. 61 ఏళ్ల రంగనాథం ఇప్పటివరకూ 19వేలకు పైగా మెదడు, సంబంధిత ఆపరేషన్లలో భాగం అయ్యారు. వీటిలో సక్సెస్ రేటు ఎక్కువగా ఉండడం విశేషం.

'నాకు భగవంతుడే అన్నీ ఇచ్చారు. నా చేతిలో ఉన్న మహత్యం కూడా ఆయన ఇచ్చినదే. ప్రతీ ఆపరేషన్‌కు ముందు ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యాన్ని అందించాలని భగవంతుడిని కోరుకుంటాను. నేను మొదటి న్యూరో సర్జరీని ఎయిమ్స్‌లోనే చేశాను. అప్పుడు సీనియర్ రెసిడెంట్‌తో పాటు డ్యూటీ డాక్టర్ కూడా ఉన్నారు. రావత్ అనే పేషెంట్‌కి యాక్సిడెంట్ అయింది. అప్పటికే అతని పరిస్థితి క్షీణించింది. చాలా చోట్ల ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి. మెదడుకు పెద్ద గాయమే తగిలింది. ఆ సమయంలో రంగనాథాన్ని ఆపరేషన్ చేయాల్సిందిగా కన్సల్టెంట్ సూచించారు. ఆపరేషన్ సక్సెస్ అయింది.. ఆ రోగి బతికి బయటపడ్డాడు. అప్పుడు నాకు మంచి శుభారంభం లభించింది. నాలో నమ్మకం మరింత పెరిగింది' అంటూ పాత రోజులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు ఈ డాక్టర్. 

ఇప్పటివరకూ తాను చేసిన వాటిలో అత్యంత క్లిష్టమైన కష్టమైన ఆపరేషన్ గురించి కూడా రంగనాథం వివరించారు. మొదట్లో వెంకటరమణ అనే పేరుతో ఒక పేషెంట్ వచ్చాడు. అతని బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విరగ్గొట్టి తీయాల్సి ఉంటుంది. మొత్తం ఈ ఆపరేషన్‌కి 15 గంటల సమయం పట్టగా.. ఆ మొత్తంలో ఒక నిమిషం కూడా రంగనాథం రెస్ట్ తీసుకోలేదట. ట్యూమర్‌ని బయటకు తీసేందుకు ఆ 15 గంటలు కష్టపడుతూనే ఉన్నారట. ఆ ఆపరేషన్ చేసి 20 ఏళ్లు గడిచిపోయిందని.. అయినా వెంకటరమణ ఇప్పటికి తన దగ్గరకు రివ్యూల కోసం వస్తుంటాడని చెప్పిన రంగనాథం.. అతన్ని చూసినప్పుడల్లా సంతోషంగా ఉంటుందని అంటున్నారు.

ఎయిమ్స్‌లో ఉన్నత విద్య అభ్యసించి డిగ్రీ సంపాదించిన తర్వాత రంగనాథం హైద్రాబాద్ తిరిగి వచ్చారు. ఇక్కడ ప్రభుత్వాసుపత్రి అయిన నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో విధుల్లో చేరారు. న్యూరో సర్జరీ కన్సల్టెంట్‌గా తన విధులను రంగనాథం ప్రారంభించారు. కొన్నేళ్లు పని చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం మానేసి, కార్పొరేట్ ఆస్పత్రిలో తన సేవలను కొనసాగించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేయాలని తీసుకున్న నిర్ణయం.. తన జీవితంలో అత్యంత క్లిష్టమైనదిగా చెబుతారాయన. 'నేను ప్రభుత్వాసుపత్రిని వదిలేయాలని అనుకోలేదు. కానీ విధి నిర్ణయం, ఆర్థిక పరిస్థితుల కారణంగా కార్పొరేట్ హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది ' అని చెప్పారు రంగనాథం.

image


1992లో రంగనాథం యశోదా హాస్పిటల్‌లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ తన సేవలను అక్కడే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారి కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు.. తను కూడా డాక్టర్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాడు. తండ్రి మాదిరిగా న్యూరో సర్జరీ కాకుండా కార్డియాక్ సర్జరీని ఎంచుకున్నాడు. అంటే తండ్రి మెదడను బాగు చేస్తే.. బిడ్డ హృదయానికి అయ్యే గాయాలను మాన్పుడాతనమాట. ఓ ప్రశ్నకు సమాధానంగా రంగనాథం చెప్పిన మాట ఏంటంటే.. 'ప్రతీ ఒక్కరూ న్యూరో సర్జరీ చదవాలని లేదు కదా. డాక్టర్ వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది. వైద్యుడు రోగుల ప్రాణాలు కాపాడుతాడు. నా సలహా ఏంటంటే కొత్తవారు అన్ని రకాల వైద్య వృత్తులనూ అభ్యసించాలి. కళ్లకు కావచ్చు.. ముక్కుకు కావచ్చు.. చెవులకు కావచ్చు.. ప్రతీ అవయవానికి డాక్టర్లు ఉండాలి కదా. ఎవరికి ఏ పనిలో ఆనందం లభిస్తుందో.. ఆ కోర్సును ఎంచుకోమని చెబుతాను.'

రంగనాథానికి మరో ఆశ్చర్యకరమైన అలవాటు ఉంది. మిగిలిన వైద్యుల మాదిరిగా కాకుండా ఈయన జ్యోతిష్య శాస్త్రాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. జ్యోతిష్యం ఆధారంగానే పేషెంట్లకు ఆపరేషన్ చేసే టైమ్ నిర్ణయిస్తారు. దీనికి కూడా రంగనాథం దగ్గర సరైన సమాధానమే ఉంది.

'భారత దేశంలో అనేక పనులు జ్యోతిష్యం ఆధారంగానే జరుగుతాయి. పిల్లవాడి అక్షరాభ్యాసం జ్యోతిష్య పండితుడు చెప్పినట్లుగానే సరైన సమయాన్ని నిర్ణయిస్తాం. పెళ్లి కోసం కూడా మంచి ముహూర్తాన్నే ఎంచుకుంటాం. ప్రస్తుతం మన దేశంలోని రాజకీయ నాయకులు కూడా అనేక పనులను న్యూమరాలజీ లాంటి వాటి ఆధారంగానే చేస్తారు. అలాగే నేను ఆపరేషన్లకు కూడా జ్యోతిష్య శాస్త్రం ఆధారంగానే సమయం నిర్ణయిస్తాను' అంటున్నారు రంగనాథం.

అయితే అత్యవసర కేసుల్లో మాత్రం ముహూర్తం చూడబోనని.. అప్పుడు సరైన సమయం కోసం అన్వేషించడం సరికాదని కూడా ఆయనే చెబుతున్నారు. రంగనాథం మాటల్లో అయితే మంగళవారం ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సి రావడాన్ని అది అమంగళంగా పేషెంట్స్ భావిస్తారని చెప్పారు. అలాగే అమావాస్య రోజున ఆపరేషన్లు చేయించుకోరని తెలిపారు. మహిళలు తమ నెలసరి సమయంలో ఆపరేషన్లు చేయించుకునేందుకు ఇష్టపడరని వివరించారు రంగనాథం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓ ప్రముఖ దినపత్రిక ఈ మధ్య వివిధ కార్పొరేట్ ఆస్పత్రులు ఏ విభాగంలో ఏ స్థానంలో ఉన్నాయనే సమాచారాన్ని ప్రకటించింది. అందులో యశోదా ఆస్పత్రి న్యూరోసర్జరీ విభాగంలో దక్షిణాదిలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచింది. దీని వెనుక డాక్టర్ రంగనాధం 20 ఏళ్ల అవిరళ కృషే అధికంగా ఉంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

చిన్నపుడు తన గ్రామంలో తాను చూసిన ఎదుర్కున్న పరిస్థితులో తనను డాక్టర్‌గా మారేందుకు ప్రేరణ కలిగించాయని రంగనాథం అంటారు. అందుకే తన గ్రామంలోని వారికే కాకుండా.. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరు వచ్చినా ఫీజు తీసుకోకుండా చికిత్స చేస్తానంటారు. సర్జరీ మినహాయిస్తే.. మిగిలినవన్నీ వీరికి ఉచితంగానే అందించడం అభినందించాల్సిన అంశం. తాను పుట్టిన గడ్డకు, అక్కడ పుట్టిన మనషులకో ఎంతో కొంత సాయం చేయాలనే రంగనాథం ఆలోచనను ప్రోత్సహించాల్సిందే. డబ్బులే పరమావధిగా మారిన కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఇలాంటి కనికరం ఉన్నవాళ్లు ఎంతో కొంత మంది ఇంకా మిగిలే ఉన్నారనేందుకు డాక్టర్ రంగనాథం ఓ ఉదాహరణ. ఆయన ఇలానే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి మరింత మందికి చేరువై.. న్యూరో వ్యాధుల చికిత్సలో నూరు శాతం సక్సెస్ సాధించాలని మనమూ కోరుకుందాం.