ఈ అండర్ బ్రిడ్జి స్కూల్ ని చూస్తే.. మీరు రెండు చేతులెత్తి దండం పెడతారు..!!

ఈ అండర్ బ్రిడ్జి స్కూల్ ని చూస్తే.. మీరు రెండు చేతులెత్తి దండం పెడతారు..!!

Wednesday January 20, 2016,

3 min Read

మీరెప్పుడైనా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారా? లేదంటే ఈసారి వెళ్తే- యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ దగ్గర దిగండి. ఫ్లయ్ ఓవర్ కిందికి రండి. అక్కడ రెండు నిమిషాల పాటు చెప్పులు విప్పి నిలబడండి. ఒక అద్భుత దేవాలయాన్ని దర్శించుకున్న ఫీలింగ్ దేహంతా పరుచుకుంటుంది. నిజమైన దేవుళ్లంటే ఇలా వుండాలని మీ మనస్సులో గాఢమైన ముద్ర పడుతుంది. ఇంతకూ ఏంటా దేవాలయం..? ఎవరా దేవుళ్లు..?

image


ఢిల్లీ యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్. ప్రతీ మూడు నిమిషాలకోసారి ట్రైన్ దడదడమని శబ్దం చేసుకుంటూ వెళ్తుంది. కానీ ఆ రైలు శబ్దాలేవీ ఫ్లయ్ ఓవర కింద ఉన్న పిల్లలను చెవిని కూడా తాకవు. ఇంగ్లీష్ వర్డ్స్ మాథ్స్ టేబుల్స్ తో జతకలుస్తాయి. సైన్స్ లెసన్ జాగ్రఫీతో స్నేహం చేస్తుంది. హిస్టరీ- హిందీ జుగల్ బందీ ఆడుతుంది.

స్కూల్ ఇలా కూడా వుంటుందా అనిపిస్తుంది చూస్తే. క్లాస్ రూం లేదు. కూచోడానికి బెంచీ లేదు. బ్లాక్ బోర్డు లేదు. అసలేమీ లేకుండా ఒక బ్రిడ్జికింద -చుట్టుపక్కల బిల్డింగు గోడలే రక్షణగా -ఓ 50-60 మంది పిల్లలు అత్యంత ఏకాగ్రతతో చదువుతున్నారంటే- ఆ దృశ్యం ముందు ఎంతటి లోకోత్తర సౌందర్యమైనా దిగదుడుపే.

ఈ స్కూల్ సృష్టిక‌ర్త‌ కర్మ క్రియ రాజేశ్ కుమార్. అందరూ మాస్టర్ జీ ప్రేమగా పిలుస్తారు. ఆర్ధిక స్తోమత సరిపోక బీఎస్సీ మధ్యలోనే ఆపేశాడు. ఒక కిరాణా స్టోర్ పెట్టుకున్నాడు. బతకడమంటే ఇది కాదనేది అతడి అభిప్రాయం. ఎలాగూ తను చదువుకోలేకపోయాడు. తనలాగే చదువుకోలేని వాళ్లకు నాలగు అక్షరం ముక్కలైనా నేర్పించాలని తపన పడ్డాడు. రాజేశ్ మనసులో ఆలోచన రాగానే- పిల్లలు ఎవరైతే స్కూల్ కి వెళ్లడం లేదో- ఎవరైతే ఆర్ధిక స్తోమత సరిపోక బడికి పంపడం లేదో -వాళ్లందరినీ ఒకచోట గేదర్ చేశాడు. వాళ్లవాళ్ల పేరెంట్స్ ని ఒప్పంచాడు.

image


అంతాబానే వుంది కానీ స్కూల్ ఎక్కడ పెట్టాలి. ఇదొక ఆన్సర్ లేని క్వశ్చన్. అప్పుడే యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ కడుతున్నారు. ట్రైన్ సౌండ్ తప్ప పెద్దగా డిస్ట్రబెన్స్ లేని ఏరియా. బడికోసం ఇదే కరెక్టు ప్లేస్ అనుకున్నాడు. ఏరియాలో చెత్తాచెదారం ముళ్ల కంపలుండేవి. అవన్నీ సాఫ్ చేసి స్కూల్ మొదలు పెట్టాడు. స్టార్టింగ్ లో ఇద్దరు పిల్లలుండేవారు. మూడు నెలల్లో అండర్ బ్రిడ్జి స్కూల్ పిల్లలతో కళకళాడింది. దగ్గర్లోని మున్సిపల్ స్కూల్ ప్రిన్సిపల్ ని కలిసి పరిస్థితి వివరించాడు . ఒకసారి మా స్కూల్ కి రండి సర్ అని ఆహ్వానించాడు. అతని కోరిక మన్నించి వచ్చి చూసిన ప్రన్సిపల్ కు దిమ్మదిరిగిపోయింది. షాకయ్యాడు. ఇంతమంది పిల్లలు చదువుకు దూరమయ్యారా అని ఆవేదన వ్యక్తం చేశాడు. వాళ్లందరికీ విద్యాదానం చేస్తున్నందుకు రాజేశ్ కుమార్ ను మనసారా అభినందించాడు.

స్కూల్ కు ఒక సిలబస్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే దానికి గవర్నమెంటు అప్రూవల్ లేదు. స్కూల్ పెట్టిన ఉద్దేశమే వేరు కాబట్టి వాళ్లు అవేమీ ఫాలో అవరు. పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు. రెండు బ్యాచులు. ఇంగ్లీష్, హిందీ, మాథ్స్, సైన్స్ తో పాటు జాగ్రఫీ, హిస్టరీ, అన్నీ నేర్చుకుంటారు. ప్రతీ శనివారం స్పోర్ట్స్ సెషన్ వుంటుంది. చుట్టుపక్కల జనం కూడా సహకరిస్తారు. ఒక ఐదారుగురు వాలంటీర్ గా వచ్చి పనిచేస్తున్నారు. వాళ్లంతా చదువు చెప్తారు. ఆటాడిస్తారు. అమిటీ యూనివర్శిటీలో చదివే అన్షుల్ గుప్తా అనే లా స్టూడెంట్ ఇంగ్లీష్, సైన్స్ చెప్తాడు. సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఉమర్ ఇమామ్, ఒక ఐఐటీ కుర్రాడు, ఇంకో వాలంటీర్ టీచర్, మరో నలుగురు- డెయిలీ వచ్చి ఓ నాలుగు గంటలపాటు పిల్లలకు పాఠాలు చెప్తుంటారు.

కనీస మౌలిక సదుపాయేలేవీ లేకుండానే ఇంతమంది పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే మాటలు కాదు. వసతులు పక్కన పెడితే టాయిలెట్ పెద్ద సమస్య అయిందంటాడు రాజేశ్. పైగా పిల్లల్లో అమ్మాయిలు కూడా వున్నారు. వాళ్లకు మరుగుదొడ్డి లేకపోవడం చాలా బాధగా వుందంటాడు. ఆ విషయంపై స్థానిక ఎంపీకి చెప్పాడు. మెట్రో రైల్ వాళ్లకు ఈ స్కూల్ గురించి తెలిసి పెద్ద మనసుతో ముందుకొచ్చారు. టీచర్ నిలబడడానికి ఒక ప్లాట్ ఫాం కట్టించారు. గోడలకు నల్ల పెయింట్ వేయించారు. ఇంకొందరు శ్రేయోభిలాషులు పిల్లలకు షూస్, సాక్సులు, బ్యాగులు గట్రా ఇచ్చారు.

image


రాజేశ్ జీవితం ఇదొక్కటే కాదు. మధ్యాహ్నం రెండు తర్వాత కచ్చితంగా షాప్ చూసుకోవాలి. అప్పటిదాకా అక్కడ తన తమ్ముడు వుంటాడు. ఇతను వెళ్లి అతనికి రిలీవ్ ఇచ్చి రాత్రి పదింటిదాకా స్టోర్ లో వుంటాడు. రాజేశ్ కు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. పెద్దోడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. అతను కూడా స్కూల్ కు వాలంటీర్ గా వచ్చి లెస్సన్స్ చెప్తాడు. భార్య కూడా ఎంతో సపోర్టివ్ గా వుంటుంది. నేను ఎలాగూ చదువుకోలేక పోయాను. కనీసం పిల్లలకైనా చదువు చెప్తున్నాను జీవితానికి అంతకంటే ఇంకేం కావాలి అంటాడు రాజేశ్ కమార్. అంతేకదా చదువుకున్న చదువును నలుగురికి పంచినప్పుడే కదా దాని గొప్పతనమేంటో తెలిసేది.