విదేశాల్లో చదివి.. మురికివాడల్లో పిల్లలకు పాఠాలు

విదేశాల్లో చదివి.. మురికివాడల్లో పిల్లలకు పాఠాలు

Friday June 19, 2015,

4 min Read

2010లో టీచ్ ఫర్ ఇండియాలో ఫెలోషిప్ పూర్తి చేసిన అనూప్ పారిఖ్ ఇతర విద్యార్ధుల్లా తన మార్గం ఏదో తాను చూసుకోవాలని అనుకోలేదు. తాను అర్జించిన జ్ఞానాన్ని నలుగురికీ పంచాలని తద్వారా నవ సమాజ నిర్మాణానికి కృష్టిచేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే శిక్షణ పొందిన అనంతరం ముంబైలోని గోవండి మురికివాడలోని గీత్ వికాస్‌లో ఫుల్ టైమ్ టీచర్‌గా పనిచేస్తూ ఎందరో చిన్నారులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాడు. చిన్నవయసులోనే అతి పెద్ద లక్ష్యంతో సమాజ సేవ వైపు అడుగులు వేస్తున్న ఆ యువ ఉపాధ్యాయుడితో యువర్ స్టోరీ ముఖాముఖి.

అనూప్ పారిఖ్, టీచ్ ఫర్ ఇండియా

అనూప్ పారిఖ్, టీచ్ ఫర్ ఇండియా


TFI తో మీకు ఏ విధంగా అనుబంధం ఏర్పడింది ?

అనూప్ పారిఖ్ - ఓహియోలోని "వూస్టర్ కాలేజీ"లో కౌన్సిలర్‌గా పనిచేస్తున్నప్పుడు టీచ్ ఫర్ అమెరికా, టీచ్ ఫర్ ఇండియాకు సేవలు అందిస్తున్న కొంత మంది స్నేహితుల వల్ల నాకు TFI గురించి తెలిసింది. వారి స్ఫూర్తి మేరకే TFI ఫెలోషిప్‌లో జాయిన్ అయ్యాను. మన దేశంలోని విద్యారంగంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. నేను పుట్టి పెరిగిన చోటే నేను చేయాల్సింది ఎంతో ఉందని గ్రహించాను. అయితే.. అందుకోసం ఉపాధ్యాయునిగా మారతానని నేను ఎప్పుడూ ఊహించలేదు.

ఫెలోషిప్ గురించి మరింత వివరంగా తెలియజేయండి ?

నేను కనీసం కలలోనైనా ఊహించని పరిస్థితులను నేడు ధైర్యంగా ఎదుర్కొంటున్నానంటే.. అదంతా ఈ ఫెలోషిప్ వల్లే. భారీ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే స్వభావాన్ని నాకు నూరిపోసింది టీచ్ ఫర్ ఇండియానే. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ... మీరు వందశాతం కృషి చేయాల్సిందే..! ఇదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

TFIలో ఉపాధ్యాయునిగా మీ జీవితం ఎలా ఉండబోతుందో మీకు ముందే ఓ అంచనా ఉండి ఉంటుంది. మరి ఇక్కడి వాస్తవ పరిస్థితులు మీ అంచనాలకు సరితూగాయని మీరు భావిస్తున్నారా?

ఉపాధ్యయ వృత్తి నుంచి ఏం ఆశించాలన్నదానిపై నాకే ఓ అవగాహన లేదు. అయితే నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులతో ఎలా మెలిగేవాడినో గుర్తుచేసుకున్నాను. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయని ముందే అనిపించింది. అయితే, నేను పనిచేయాల్సిన పాఠశాలలోని పరిస్థితులు మరీ నేను ఊహించినంత దారుణంగా లేకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. కొన్నింటిలో మార్పుల అవసరాన్ని గుర్తించాను. కానీ, అదంత కష్టతరమైనదేమీ కాదు.

విలాసవంతమైన జీవితం, లాభదాయకమైన ఉద్యోగాన్ని వదిలేయడం వల్ల జీవితంలో ఇప్పుడు ఏదైనా మిస్ అవుతున్నానని భావిస్తున్నారా? ఈ వృత్తిని స్వీకరించేటప్పుడు మీ వాళ్లు ఎలా ూిిస్పందించారు ?

జీవితంలో మనకు నిజంగా అవసరంలేనిదంటూ ఏదైనా ఉందంటే అది లగ్జరీ మాత్రమే. ప్రస్తుతం నాకున్న సదుపాయాల్లో నేను చాలా సౌకర్యవంతంగా జీవిస్తున్నాను. లగ్జరీ అన్న పదాన్ని పక్కనపెట్టి చూస్తే.. జీవితం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అయితే నా కుటుంబ సభ్యులు, ఇతరలూ తరచూ నన్ను అడిగే ప్రశ్న ఒక్కటే. తరువాత ఏంటి? అని. సామాజం దృష్టిలో ఎప్పటికీ మాస్టర్‌గా ఉండిపోవడాన్ని వారు జీర్ణించుకోలేరు. కానీ, నేను ప్రతి ఏడాది 40-50 మంది చిన్నారులకు మార్గదర్శిగా వ్యవహరిస్తున్నాను. అయితే వీరిలో కనీసం ఏ ఐదుగురిలోనైనా మార్పు తీసుకురాగలిగితే... నేను జీవితంలో సాధించిన ఘనత అదే అయి ఉంటుంది.

ఇక్కడి చిన్నారులు... వారితో ముడిపడిన సవాళ్ల గురించి చెప్పండి?

ఇక్కడి చిన్నారులు ఎంతో సమర్ధవంతులు. అయితే.. వారు పెరిగిన వాతావరణం, పరిస్థితులు ఆ సామర్థ్యాన్ని మసకబారుస్తున్నాయి. తమ కుటుంబం, స్నేహితులు సాగిస్తున్న జీవితంలోనే తమ భవిష్యత్తను చూసుకుంటున్నారు వాళ్లు. మరి కొందరు.. అల్ట్రా రిచ్ లైఫ్ స్టైల్ వైపు చూస్తున్నారు. అయితే విలాసవంతమైన జీవితాన్ని అందుకోవాలన్న తపనతో..ప్రస్తుతానీ వారు ఆస్వాదించలేకపోతున్నారు. ఇదే ఎంతోమంది విద్యార్ధులను... చదువు మానేసి అసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపేలా చేస్తోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రతి చిన్నారీ...బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని, మంచి కుటుంబంతో... ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారు. అయితే.. తాము పుట్టిపెరిగిన వాతావరణంలో ప్రతిఒక్కరూ పేదరికంతో సహవాసం చేయడాన్ని చూసిన చిన్నారులు తమ జీవితాలూ అదే విధంగా మారిపోతాయన్న నిస్పృహతో బతికేస్తున్నారు. ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నా.. ఓ రకమైన భయం వారిని వెనక్కులాగేస్తోంది.

ఈ వ్యవస్థతో ముడిపడిన సమస్యలను వివరిస్తారా?

సమస్యలు అన్ని స్థాయిల్లోనూ ఉన్నాయి. పాఠశాల స్థాయి నుంచి ప్రభుత్వ పథకాల వరకూ ఎన్నో లోపాలు ఉన్నాయి. మంచి పథకాలు ఆచరణసాధ్యం కాకపోతే.. కనీసం ఆచరణ సాధ్యమైన వాటిని పరిష్కరించడాన్ని కూడా ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రతీ స్థాయిలోని మధ్యవర్తులూ సమిష్ఠిగా కృషి చేసినప్పుడే విద్యావ్యవస్థలో మనం ఆశించిన మార్పు వస్తుంది. ఇక ఈ వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు లేదు సరికదా... వారి కృషికి తగ్గ ఫలితమూ అందడంలేదు.

ఇక్కడ మీరు నేర్చుకున్నదేమిటి?

ఓర్పు. ఇక్కడి చిన్నారులే నాకు ఓర్పు నేర్పించారు. ఎందుకంటే ఈ పిల్లలు మీ సహనానికే పరీక్ష పెడతారు. ఇప్పుడు చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను నేను అర్ధం చేసుకోగలుగుతున్నాను. మార్పును ఆహ్వానించడం నేర్చుకున్నాను. అయితే ఇదంతా రాత్రికి రాత్రి జరిగే ప్రక్రియ కాదు. అపజయాలు పలుకరించినా మీరు చేయవలసింది చేస్తూనే ఉండాలి. అప్పుడే.. మనం అనుకున్న మార్పు వస్తుంది.

తన స్కూల్ విద్యార్థులతో అనూప్

తన స్కూల్ విద్యార్థులతో అనూప్


మీలో నిరంతరం స్ఫూర్తి రగిలించే అంశం ఏంటి?

చిన్నారులే..! చదువుకోవాలన్న వారి అభిలాష, తమ చుట్టూ చోటుచేసుకునే అంశాలపై వారు సంధించే ప్రశ్నలు, కొత్త పనులు చేయడంలో వారు కనబరిచే అత్యుత్సాహం నాకు నిరంతరం స్ఫూర్తిని అందిస్తాయి.

మీ భవిష్య ప్రణాళికలు ఏంటి?

జీవితాంతం ఉపాధ్యాయుడిగానే కొనసాగాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను.

మీ అతిపెద్ద కల ఏంటి?

నేడు దేశ ప్రజలందరూ సమిష్టిగా అపజయం పాలవుతున్నారని నాకు అనిపిస్తోంది. సమజాభివృద్ధిలోని కీలకాంశాలను మనం పూర్తిగా విస్మరించాం. ఆధునిక అవసరాల(బుల్లెట్ ట్రెయిన్స్, అభివృద్ధి కోసం మైనింగ్ చట్టంలో మార్పులు తీసుకురావడం, సైన్యం ఆధునీకరణ) నిమిత్తం అత్యవసరమైన జీవన ప్రమాణాలను (వైద్య సేవలు, విద్యా, పర్యావరణ పరిరక్షణను) విస్మరిస్తున్నాం. నా కల గురించి చెప్పడం చాలా కష్టం కానీ, ఓ ఉపాధ్యాయునిగా.. అవసరమైన మార్పులపై సమాజం దృష్టి సారించినప్పుడే మనం విజయం సాధించినట్టు లెక్క అని చెప్పగలను.

టీచ్ ఫర్ ఇండియా లక్ష్యం ఒక్కటే...! దేశంలోని చిన్నారులందరూ సమున్నతమైన విద్యను అందుకోవాలన్నదే TFI కల. సమిష్టి కృషి జరిగినప్పుడు మాత్రమే దీన్ని సాధించగలం. చిన్నారులందరూ స్వతంత్రంగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకున్నప్పడే తన కల సాకారమవుతుందని అనూప్ అభిప్రాయపడుతున్నాడు. దేశంలోని చిన్నారులందరూ రేపు మంచి మనుషులు అనిపించుకోవాలన్నదే అతడి సంకల్పం. వీలైనంత ఎక్కువ మంది పిల్లల్లో స్ఫూర్తిని రగిలించి.. విద్యావంతులుగా తీర్చిదిద్ది, వారిని మరింతగా ప్రోత్సహించాలన్నదే అనూప్ అభిమతం.

మార్పును కోరుకోవడం కాదు.. అందుకు నడుంబిగించినప్పుడే అసలైన మార్పు సాధ్యమవుతుందని నమ్మే అనూప్ కు హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే..!