ఎదురుదెబ్బలే ఎత్తుకు తీసుకెళ్తాయ్ ! జీవితసూక్ష్మం చెబ్తున్న పండిట్ జస్‌రాజ్

ఎదురుదెబ్బలే ఎత్తుకు తీసుకెళ్తాయ్ ! జీవితసూక్ష్మం చెబ్తున్న పండిట్ జస్‌రాజ్

Sunday November 29, 2015,

5 min Read

ఏ విజయం వెనుక చూసినా ఓ బలమైన, సుదీర్ఘమైన సంఘర్షణ దాగే ఉంటుంది. కానీ కొన్నిసార్లు మాత్రమే అలాంటి కష్టాలు బయటి వారికి తెలియొచ్చు. కానీ ఎక్కువ సార్లు.. ఆ వ్యక్తికి సిద్ధించిన విజయం వెనుక అవన్నీ తెరమరుగైపోతాయి. ఎవరెన్ని చెప్పినా కష్టం తర్వాతే విజయం పాదాక్రాంతమవుతుంది. సంఘర్షణ తర్వాతే అది సిద్ధిస్తుంది. హిందుస్తానీ సంగీతంలో అత్యున్నత స్థితికి చేరి.. చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని నిలుపుకుని.. చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఓ వ్యక్తి పండిట్ జస్‌రాజ్. ఓ సాదాసీదా వ్యక్తి.. ఇప్పుడు ప్రపంచం మెచ్చే స్థాయికి ఎదగడం వెనుక కూడా అలాంటి కృషి, పట్టుదల, మొండి ధైర్యమే దాగుంది. అంతే కాదు.. ఏడాదంతా.. తన ప్రదర్శనలతో ఎంత బిజీగా ఉన్నా.. క్షణం తీరిక లేకున్నా.. వయోభారం బాధిస్తున్నా.. ప్రతీ ఏడాదీ నవంబర్ ఆఖరున మాత్రం ఆయన హైదరాబాద్ వచ్చే తీరుతారు. అలా ప్రతీ ఏడాదీ.. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా.. పాత స్మృతులన్నీ గుర్తుచేసుకుంటున్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఈ స్థాయికి వచ్చిన వైనమంతా కళ్లముందు కదలాడుతుంది. ఆ స్థలం.. ఏ ఇల్లో.. లేక సంస్థో.. వ్యవస్థో కాదు. అది రుద్రభూమి. తండ్రి సమాధి ఉన్న స్థలమే పండిట్ జస్‌రాజ్‌కు దేవాలయం. తనను విడిచి వెళ్లిన తండ్రే.. సాక్షాత్తూ పరమాత్ముడు. అలా ప్రతీ సారీ.. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు.. ఆ సమాధిని దర్శించుకుని.. గంటల సేపు అక్కడ గడిపి.. తన పాటలతో తండ్రి ఆత్మకు శాంతిని చేకూరుస్తూ.. తానూ సంతృప్తి పొందుతారు. నాలుగైదేళ్ల వయస్సులో ఎవరికీ పెద్దగా స్మృతులేవీ ఉండవు. కానీ పండిట్ జీవితంలో మాత్రం.. అదో అద్భుతమైన కాలం. తండ్రి నుంచి అప్పటికే ఎన్నో పాఠాలు నేర్చుకుని.. బాగా దగ్గరవుతున్న తరుణంలోనే కాలం వాళ్లను విడదీసింది. తండ్రిని కోల్పోయిన ఈ చిన్న బిడ్డడు.. అప్పటి నుంచి పడిన తాపత్రయం, చేసిన కసరత్తే.. ఈ స్థాయికి చేర్చింది.

కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన పండిట్‌ను అంబర్‌పేట్‌లోని శ్మశాన వాటికలో యువర్ స్టోరీ మేనేజింగ్ ఎడిటర్ అర్‌వింద్‌ యాదవ్ కలిశారు. తాను ఈ జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సంఘటనలను ఈ వయస్సులో కూడా ఎంతో ఓపికగా ఆయన విడమర్చి చెప్పారు. తండ్రి లేని పిల్లాడి దశ నుంచి పద్మవిభూషణుడి స్థాయికి ఎదిగిన రోజు వరకూ.. ప్రతీ రోజూ.. ఓ సంఘర్షణేనని వివరిస్తారు పండిట్.

image


అమ్మ మందుల కోసం మెడికల్‌ షాపులో అప్పు

ఇప్పుడు మేం చెప్పబోయే కథ.. కోల్‌కతాలో ని ఇరుకైన వీధుల నుంచి ప్రారంభమవుతుంది. తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు.. మందుల కోసం మైళ్ల కొద్దీ దూరాన్ని నడిచిన బాల జస్‌రాజ్ దగ్గర మొదలవుతుంది. ఈ రోజులను గుర్తుచేసుకుంటూ.. 'మా నాన్నకు ఎటూ సేవ చేసుకోలేకపోయాను. తోడున్న అమ్మ కూడా కేన్సర్‌తో కుమిలిపోయేది. కానీ యాభై ఏళ్ల క్రితం ఆ వ్యాధి కేన్సర్ అని గుర్తించలేకపోయారు. డాక్టర్లు రాసిన మందులను వెతుకుతూ.. దక్షిణ కోల్‌కతా నుంచి మధ్య కోల్‌కతాకు నడిచి వెళ్లే వాడిని. కానీ అక్కడ ఎన్నో మందుల షాపులన్నా.. వాటిల్లో నాకు కావాల్సిన మందులు లభ్యం కాలేదు. ఒకచోట అవన్నీ ఉన్నా... నా జేబులో వాటిని కొనేంత డబ్బులేదు. అంత ఖరీదైన ఔషధాలవి. నా దగ్గరున్న డబ్బులన్నీ జేబులో నుంచి తీసి.. అక్కడ పెట్టా. మిగిలిన డబ్బును తర్వాత ఇస్తానని చెప్పా. అక్కడి వ్యక్తి.. ఎప్పుడైనా మెడికల్ షాపులో అప్పు ఇవ్వడం గురించి విన్నావా.. ? అని కొరకొరా చూశాడు. ఇంతలోపు ఎవరో వ్యక్తి వచ్చి.. నా భుజంపై చేయి వేశాడు. 'బాబుకు ఏం కావాలో ఆ మందులన్నీ పూర్తిగా ఇచ్చేయ్. ఎంత డబ్బుందో అంత తీసుకో. మిగిలిన డబ్బు నా ఖాతాలో రాసుకో' అన్నారు. ఆయనెవరో కూడా నాకు తెలియదు. కానీ తర్వాత తెలిసింది.. అతగాడు.. ఆ షాపు ఓనర్ అని'' అని ఆ జ్ఞాపకాలను అప్పటి నుంచి నెమరవేసుకున్నారు పండిట్ జస్‌రాజ్.

జీవితంలో ఎప్పుడైనా సరే... ఉన్నత స్థాయికి చేరాలంటే.. గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మంత్రం కష్టపడి పనిచేయడం. మన మనస్సును ధృడం చేసుకుని లక్ష్యంవైపు అడుగులు వేస్తూపోతే.. ఆ భగవంతుడు కూడా నీకు సాయం చేస్తాడు.

పండిట్‌ తన జీవితంలో ఎంతో మందికి ఉన్నతిని ప్రసాదించారు. వేలాది మంది ఆయన శిష్యులుగా చేరి.. ఎంతో లబ్ధి పొందారు. వృత్తిగతంగా ఆయన నైపుణ్యం కళను నేర్పిస్తే.. వ్యక్తిగతంగా ఆయన పడిన కష్టాలు, ఎదిగిన తీరు... మరెంతో మందికి స్ఫూర్తిని నింపింది. అలాంటి మరో ఘటనను ఆయన జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

ఏదో శక్తి.. ఆ డాక్టర్ పాటవినేలా చేసింది !

భయంకరమైన వ్యాధితో బాధపడ్తున్న తన తల్లికి చికిత్సకు ప్రతీ రోజూ రెండు సార్లు ఇంజెక్షన్లు ఇవ్వాలని డాక్టర్ చెప్పారు. ఒక్కో డోసుకు రూ.15 ఇవ్వాలన్నారు. అంటే రోజుకు రూ.30. ఇది అప్పట్లో చాలా పెద్ద మొత్తం. కానీ అది అమ్మ ప్రాణం. డబ్బుకు ఎలా వెనుకాడతాం ? కానీ ఎక్కడి నుంచి తీసుకురావాలి ? ఏదో తెలియని ధైర్యంతో డాక్టర్‌ను ఇంటికి రమ్మని చెప్పేశారు పండిట్. ఉదయాన్నే వచ్చి వైద్యం చేసి డాక్టర్‌

వెళ్లిపోతున్న సందర్భం అది. అప్పుడు తాను 'డాక్టర్.. ఈరోజు ఆల్ ఇండియా రేడియోలో నా ప్రోగ్రాం ఉంటుంది. నేను పాటలు పాడబోతున్నాను. తప్పకుండా వినండి' అని చెప్పారు. నాకు అసలు పాటలంటేనే ఇష్టం ఉండదు. అయినా ఏదో ఒక ఫంక్షన్ నిమిత్తం నేను మా బావ ఇంటికి వెళ్తున్నాం. నీ ప్రోగ్రాం వినడం కుదరదు.. అని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో ఆ బాల గాంధర్వుడి మనస్సు చిన్నబుచ్చకుంది, చివుక్కుమంది. సరే చేసేది లేక అలా దిగాలుగానే డాక్టర్‌ను సాగనంపారు.

కానీ మరుసటి రోజు ఉదయాన్నే వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్‌లో ఏదో మార్పు కనిపించింది. కర్కశంగా ఉన్న డాక్టర్.. కళ్లలో కరుణరసం ఉప్పొంగుతోంది. 'రాత్రి నీ ప్రోగ్రాం రేడియోలో విన్నానోయ్. మా బావ ఇంట్లో.. అందరం కలిసి విన్నాం. చాలా బాగా పాడావు. ఈ కుర్రాడి దగ్గర డబ్బు ఉండదని.. మా బావ నాతో అన్నారు'. (ఎందుకంటే.. సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదనే నానుడి కదా..). ఆ డాక్టర్ బావ గారు.. తర్వాతి రోజుల్లో.. గీతా దత్ పేరుతో గొప్ప గాయకులుగా ఖ్యాతి గడించారు. ఆ ప్రోగ్రాం విన్న తర్వాత డాక్టర్ అప్పటి నుంచి తన ఫీజును కేవలం రెండు రూపాయలకే పరిమితం చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇలా ప్రతీ సారీ ఏదో ఒక ఇబ్బంది ఎదురైనప్పుడల్లా.. ఏదో ఒక శక్తి నాకు మద్దతుగా నిలిచి.. ఒడ్డున పడేసేది.

అహం దగ్గరైతే.. అంతం మొదలైనట్టే !

తన ఇంటర్వ్యూలో... పదే పదే.. కష్టపడడం గురించే ఎక్కువగా మాట్లాడిన పండిట్.. ఈ తరానికి ఓ ముఖ్య విషయం సూచిస్తారు. పోరాటంతో విజయం సాధించిన తర్వాత 'నేను' అనే అహాన్ని దగ్గరకు రానీయొద్దంటారు. ఎప్పుడైతే మనిషి.. అహంతో విర్రవీగుతాడో.. అప్పుడు ఇక అతడి పతనం మొదలైందనే అర్థమని వివరిస్తారు. అహం ముందు అంత వరకూ పడిన కష్టం, ఆటుపోట్లు కూడా.. గుర్తుకురావు.

పండిట్ జస్‌రాజ్‌.. హైదరాబాద్‌తో కూడా సుదీర్ఘమైన అనుబంధమే ఉంది. బాల్యంలో ఆయనకు ఇక్కడి రోడ్లన్నీ చిరపరిచితమైనవే. గౌలిగూడ, నాంపల్లి ప్రాంతాలు ఒకప్పుడు ఆయనకు కొట్టిన పిండి. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లేటప్పుడు దారిలో ఉన్న ఓ హోటల్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే.. ఆ హోటల్ బయట మోగుతున్న రేడియోలో బేగం అక్తర్ గజళ్లు వింటూ మైమరిచిపోయి.. స్కూలును కూడా మరిచిపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఇలా గజళ్లపై మొదలైన ప్రేమ.. చివరకు స్కూల్ వదిలిపెట్టేంత వరకూ వెళ్లింది. ఆ పై ఆ మక్కువ తబళా ప్లేయర్‌గా మార్చేసింది. అలా ఎన్నో మెట్లు ఎక్కుతూ.. ఎన్నో మలుపులు తిరిగిన ఆ పయనం చివరకు లాహోర్‌లో ఓ స్టేజీపై కళాకారుడిగా మొదటి ప్రోగ్రాం ఇచ్చేంత వరకూ సాగింది. ఈ మధ్యలో ఎన్ని ఒడిదుడుకులో.. ఎన్ని ఆటుపోట్లో.. !

85 ఏళ్ల వయస్సులో పండిట్‌జీ ఓ అమూల్యమైన మాట చెప్పి ముగించారు.

''ఇంత సుదీర్ఘమైన వయస్సులో నేను నేర్చుకుంది ఒక్కటే. పనిచేయి, కష్టపడి పనిచేయి, మనసుపెట్టి చేయి. ఒక వేళ నీకు పాటడం ఇష్టమైతే... ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండు. నిత్యవిద్యార్థి అనిపించుకో. ఆ పై.. పైవాడి కృప కోసం ఎదురుచూడు..'' అంటారు.
image


ఇంత పెద్ద వయస్సులో పండిట్ జస్‌రాజ్‌ చెప్పిన ఉదాహరణలు రెండే కావొచ్చు. వాటిని గుర్తుచేసుకున్న సందర్భమూ కష్టమైనదే కావొచ్చు. కానీ అవి అమూల్యమైనవి. ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినవి. నిత్యం కష్టపడడం, మనకు నచ్చిన పనిపై మనసు పెట్టడం ముఖ్యమైన అంశాలైతే.. అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లకు పైవాడు కూడా సాయం చేస్తాడనేది మరో విషయం.

విజయమనేది.. ఊరికే సొంతమైపోదు. ఎన్నో ఉలి దెబ్బలు పడితే తప్ప శిల కూడా శిల్పం కాలేదు.