లింగ వివక్షతపై ఎక్కుపెట్టిన అస్త్రం ..స్వాతి వకారియా

లింగ వివక్షతపై ఎక్కుపెట్టిన అస్త్రం ..స్వాతి వకారియా

Saturday August 29, 2015,

4 min Read

స్వాతి తన భవిష్యత్తు కోసం.. భావి జీవితంలో సాధించబోయే విజయాల కోసం ప్రొఫెషనల్ కోర్సులు నేర్చుకుంటోంది. "నువ్వేం చేసినా.. ఎక్కడ పని చేసినా.. నీ పెళ్లయ్యేంత వరకే. ఒక సారి ముడి పడిందంటే ఆ తరువాత నీ భర్త-అత్తమామలు చెప్పినట్టు, నడుచుకోవాల్సిందే" అంటూ తల్లిదండ్రులు ఆమెకు విషయం అర్థమయ్యేలా విడమరచి మరీ చెప్పారు.

తన పెద్దన్నయ్య ఇంట్లో కూడా అంతే. తానేం ఏం చెయ్యాలి.. ? ఏం చెయ్యకూడదు .. ? ఇవన్నీ ఓ పే..ద్ద లిస్టు ఉంటుంది. అలాగని అవేమీ స్వాతి పాటించలేనంత కఠినమైన నియమనిబంధనలు కావు. కానీ ఆమె ఆలోచనా తీరుకు మాత్రం అవి చాలా భిన్నం. కష్టాలు, సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం , లింగ వివక్షను ఎదుర్కొంటున్న వాళ్ల కోసం తన విజ్ఞానాన్ని ఉపయోగించాలనుకుంది.

image


ఇప్పుడు తన అభిరుచుల్ని అన్ని విధాల గౌరవించి సపోర్ట్ చేసే భర్త , అత్తమామలు దొరకడం తన అదృష్టం అంటోంది స్వాతి. ఈ విషయంలో గుజరాత్‌లోఉన్న తన మిగిలిన స్నేహితులందరికన్నా తానే లక్కీ పర్సన్ అన్నది స్వాతి అభిప్రాయం. గుజరాత్‌ వడోదరాలో పుట్టి పెరిగిన స్వాతి వకారియా ఇప్పుడు విమెన్ ప్లానెట్ సంస్థకు సీఈఓ. స్త్రీల సమస్యలను ప్రస్తావిస్తూ.. నిపుణుల నుంచి సలహాలు అందిస్తూ మహిళల కష్టాలను తీర్చే ఓ ఆన్‌లైన్ బ్లాగ్ ఈ విమెన్ ప్లానెట్.

" నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు పెళ్లైన వెంటనే అప్పటి వరకు ఎంతో విజయవంతంగా కొనసాగించిన కెరీర్‌ను పక్కనబెట్టేస్తున్నారు. కారణం భర్త, కుటుంబ సభ్యులు అయిండొచ్చు. నాకు తెలిసినంత వరకూ అది ముమ్మాటికి తప్పే" అంటారు మూడు పదుల వయసున్న స్వాతి.

తాను చదువుకునే రోజుల్లో క్రీడలతో పాటు క్లాస్ రూం స్టడీస్ పైనా ఫోకస్ పెట్టారు. ఆ తరువాత ఎంబీఏ ఫైనాన్స్ చేశారు. అది పూర్తయిన వెంటనే టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు.

తన స్నేహితులతో కలిసి బ్లాక్ ఐడీ సొల్యూషన్స్ అనే ఓ ఐటీ సంస్థను ప్రారంభించారు. ఆ కంపెనీలో ఆన్ లైన్ మార్కెటింగ్ , సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించే అవకాశం వచ్చింది. వాళ్ల పని తీరు కారణంగా కొద్ది రోజుల్లోనే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మార్కెట్లో మంచి విజయం సాధించింది. ఏడేళ్లు పని చేసిన స్వాతి ఆ తరువాత తాను ఎన్నాళ్ల నుంచో కలలు కంటున్న కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించి అందులో సరికొత్త పాత్రను పోషించాలని నిర్ణయించుకున్నారు. అదే విమెన్ ప్లానెట్.

image


తన విజ్ఞానం మహిళల సేవకే అంకితం

" ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అంశంలో నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని ఉపయోగించి సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలని నేను నమ్ముతాను. అలాగని ఏదో ఒకటి చెయ్యాల్సిన పని లేదు " అంటారు స్వాతి. నిర్భయ ఘటన తరువాత యావత్ దేశం షాక్‌కు గురైన సమయంలోనే తన భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. స్త్రీ సాధికరిత ద్వారానే సమాజంలో వారికి తగిన రక్షణ దొరుకుతుందని భావించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ , సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ రెండింటిలోనూ స్వాతికి మంచి నైపుణ్యం ఉంది. అందుకే వాటిని ఉపయోగిస్తూనే మహిళల కోసం ఏదో ఒకటి చెయ్యాలని భావించారు. తన విమెన్ ప్లానెట్ ద్వారా వీలైనంత మంది మహిళల్ని ఆన్ లైన్లో ఒక్క చోట చేర్చి వారి అభిప్రాయాల్ని ఒకరికొకరు పంచుకునేలా చేశారు. విద్యకు దూరంగా ఉన్న స్త్రీలను విద్యావంతుల్ని చెయ్యడం , వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా చెయ్యడం తన సంస్థ ఉద్ధేశం. విమెన్ ప్లానెట్ సమస్యలను చర్చిస్తుంది. విస్తృతమైన అవగాన కలిగిస్తుంది. వాళ్ల అభివృద్ధికి సంబంధించి తగిన సలహాలు, సూచనలు కూడా అందిస్తుంది ".


'' ఈ విమెన్ ప్లానెట్ ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించే అవకాశం నాకు వచ్చింది. నా చుట్టూ ఉన్న వివిధ రకాల వ్యక్తుల్ని, నా మాదిరి ఆలోచించే వాళ్లను కలుస్తున్నప్పుడు కేవలం సంతోషం మాత్రమే కాదు.. కొత్త కొత్త విషయాలు కూడా తెలుస్తుండేవి " స్వాతి.

ఆ రోజుల్లో...

స్వాతి ..విమెన్ ప్లానెట్‌ను ఓ బ్లాగ్ లా మొదలెట్టినప్పుడు అందరికి అందుబాటులో ఉంచారు. వీక్షకులకోసం ఉద్దేశించిందే అయినా .. తనకు నచ్చినట్టు ఉండేది. అయితే తన ఆలోచనను మరింత నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలంటే అది సరిపోదనిపించింది. దీంతో ఆన్‌లైన్లోనే ఓ కమ్యూనిటీ, ఫోరం, డిజిటల్ మ్యాగజైన్ సిద్ధం చేశారు. ప్రింట్ మ్యాగజైన్ కూడా వస్తోంది. కానీ అది ఏడాదికి ఓ సారి మాత్రమే. వీక్షకులు తమ అభిప్రాయాలు షేర్ చేసుకునే హబ్ ఇది.

పితృస్వామ్య సమాజాన్ని ధైర్యంగా ఎదిరించిన స్ఫూర్తిదాయకమైన మహిళల జీవితాల గురించి ఇవ్వాలన్న అద్భుతమైన ఆలోచన వచ్చింది స్వాతికి. ఈ ఆలోచన ద్వారా లింగవివక్షతపై అవగాహన పెంచొచ్చు. భారతీయ సమాజం ఆలోచనా తీరును మార్చే దిశగా పని చేస్తున్నాం. గ్రామీణ భారతంలో అమ్మాయిలు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బయటకు చెప్పుకోడానికి బిడియపడే విషయాలకు సంబంధించి వారిలో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం.' అంటూ ఉంటారు స్వాతి.

కళ్లు తెరిపించిన సంఘటన

మన దేశంలోనే ఓ గ్రామంలో ఓ అమ్మాయికి పెళ్లయ్యింది. ఏడాది పాటు కాపురం బాగానే నడిచింది. ఆ తరువాత గర్భం దాల్చింది . అబ్బాయి పుడతాడని అందరూ అనుకున్నారు. కానీ పరీక్షల్లో అమ్మాయని తేలింది. నిజానికి పుట్టేది ఎవరన్న సంగతి సదరు ల్యాబ్ నిర్వహకులు చెప్పడం నేరం. అయినా సరే చాలా వరకు చెప్పేస్తున్నారు. దీంతో ఆమె భర్త, అత్తగారు కలిసి అబార్షన్ చేసుకోవాలని చెప్పారు. అంతే కాదు.. మళ్లీ గర్భం దాల్చినప్పుడు అబ్బాయిని కనలేదో.. విడాకులు తప్పవని హెచ్చరించారు.

ఈ లోకంలో ఓ స్త్రీ జాతి యొక్క గొప్పదనాన్ని మరో స్త్రీయే గుర్తించలేకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. చాలా సార్లు ఓ మహిళే సాటి మహిళను మనిషిగా గుర్తించడం లేదు. స్త్రీ సమానత్వం రావాలంటే ముందు స్త్రీని మరో స్త్రీ గౌరవించే పరిస్థితి రావాలి అంటారు స్వాతి.

ఈ సమాజంలో కాస్త కష్టపడి పని చేస్తే ప్రతి స్త్రీ.. తనకు తాను గుర్తింపు తెచ్చుకోవడమే కాదు మరి కొందరి జీవితాలను కూడా బాగు చెయ్యగలదు. స్ఫూర్తి కలిగించగలదు. యాసిడ్ దాడికి గురైన లక్ష్మి అలాంటి ఉన్నత భావాలు గల మహిళే. తన హక్కుల కోసం పోరాడింది. అలాంటి వ్యక్తిత్వం గలవాళ్లే స్వాతికి ఆదర్శప్రాయులు.