ప్రయాణికులతో సూపర్ అనిపిస్తున్న హోపర్

ప్రయాణికులతో సూపర్ అనిపిస్తున్న హోపర్

Monday December 28, 2015,

3 min Read

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో తమదైన ముద్రవేస్తున్నాయి పలు స్టార్టప్స్. ప్రజా రవాణా వ్యవస్థలో లోపాలను సవరిస్తూ, అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. అలాంటిదే హోపర్. కోల్ కతాలో షటిల్ సర్వీస్ అందిస్తున్న స్టార్టప్ ఇది. భారతదేశం దశ, దిశ మార్చేస్తున్న స్టార్టప్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టింది పారిశ్రామిక రాజధాని కోల్ కతా. ఇక్కడ నాస్కామ్ సెంటర్లు ప్రారంభించిన తర్వాత స్టార్టప్ లు ఒక్కో అడుగు ముందుకేస్తున్నాయి. ఐఐఎం-కోల్ కతా ఆధ్వర్యంలో తరచూ స్టార్టప్ వీకెండ్ ఈవెంట్లు జరుగుతున్నాయి. ఈ ఈవెంట్లలో పాల్గొంటూ తమ ఐడియాలకు మెరుగులు దిద్దుతున్నారు ఔత్సాహికులు. ఇలాంటి ఈవెంట్లలో పాల్గొనేవారిలో ఏడు శాతం మంది మాత్రమే వారి ఐడియాలను అమలుపరుస్తున్నారన్నది ఓ అంచనా.

హోపర్ టీమ్

క్యాబ్స్ కావాలంటే సులువుగా దొరుకుతున్నాయి కానీ... ప్రయాణికులకు సరైన బస్సులు లేవని గుర్తించాడు హర్షిత్ గోయల్. ఏదైనా పరిష్కారం కనుగొనాలనుకున్నాడు. అలా వచ్చిన ఐడియాను స్టార్టప్ వీకెండ్ లో వ్యక్తపరిచాడు. అక్కడే సంజిత్ రాయ్, అభిరూప్ కర్ లను కలుసుకున్నాడు. ప్రస్తుతం వీళ్లు ఆపరేషన్స్, టెక్నాలజీ వ్యవహారాలు చూసుకుంటున్నారు. సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేట్ అయిన హర్షిత్... ఉడాసిటీ కోర్సులతో కంప్యూటర్ సైన్స్ లో శిక్షణ పొందాడు. అందరూ కలిసి స్టార్టప్ వీకెండ్ లో మెంటర్స్ దగ్గరికి వెళ్లి మొదటి ప్రయత్నంలోనే అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రోడ్స్ అండ్ కాలేజీఫై ఫౌండర్ అయిన రోహన్ గనెరీవాల్, కో-ఫౌండర్ ఆదర్శ్ ఖండేల్ వాలా, మరో పారిశ్రామికవేత్త రాఘవ్ పొద్దర్ పరిచయంతో దశతిరిగింది. ఈ ముగ్గురూ సీడ్ క్యాపిటల్ సభ్యులు. స్టార్టప్ వీకెండ్ లో సక్సెస్ తో సీడ్ రౌండ్ నిధులు లభించాయి. ఇలాగే నిపుణుల సలహాలు తీసుకుంటూ హోపర్ ను జాతీయ బ్రాండ్ చేసేందుకు కృషి చేస్తున్నారు.

image


మొత్తానికి స్టార్టప్ వీకెండ్ లో సక్సెస్ సాధించింది హోపర్ టీమ్. హోపీస్ పేరుతో ఎయిర్ కండీషన్డ్ షటిల్స్ ద్వారా ప్రజా రవాణా వ్యవస్థలో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం వీరి సర్వీస్ కొన్ని రూట్లకే పరిమితమైంది. క్యాష్ లేదా, యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రతీ ప్యాసింజర్ కు సీటు గ్యారెంటీ అన్న కాన్సెప్ట్ తో సేవలందిస్తోంది. టికెట్ ప్రారంభ ధర 20 రూపాయలు. హోపీ మినీ, హోపీ మ్యాక్సీ పేర్లతో ప్రస్తుతం రెండు రకాల వాహనాలను నడిపిస్తోందీ కంపెనీ. ప్రతీ వాహనంలో వైఫై సదుపాయం ప్రయాణికులను ఆకర్షిస్తోంది. కోల్ కతా నగరంలోని బిజీగా ఉండే రెండు రూట్లలో సర్వీసులను నడిపిస్తున్నారు. యూజర్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

"మరో 100 రోజుల్లో 60 వాహనాలతో ఆరు ప్రధాన మార్గాల్లో బస్సులను నడిపించాలని అనుకుంటున్నాం. అంతే కాదు... టైర్ టూ నగరాలపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నాం. మరో ఐదు నగరాల్లో కంపెనీని లాంఛ్ చేయాలనుకుంటున్నాం. భారతదేశంలో రవాణా రంగంలో డిమాండ్ కు తగ్గట్టుగా సేవలను విస్తరించేలా వ్యూహం రచిస్తున్నాం" అంటాడు హర్షిత్.
image


మార్కెట్ సైజ్...

భారతదేశంలో బస్ సర్వీస్ మార్కెట్ 60-70 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. యూబర్, ఓలా, బ్లాబ్లాకార్, కార్ పూలింగ్ లాంటి వివిధ కంపెనీలు ఈ రంగంలో అడుగుపెట్టి సేవలందిస్తున్నాయి. కాస్త భిన్నంగా మార్కెట్లోకి వచ్చింది హోపర్. అయితే ఇలా బస్ సర్వీసులు అందిస్తున్న కంపెనీల్లో హోపర్ తొలి కంపెనీ కాదు. ఇటీవల షటిల్ రెండు కోట్ల నిధుల్ని సేకరించింది. ఢిల్లీలో ఇలాంటి కాన్సెప్ట్ తోనే సర్వీసులు నడుపుతోంది. ఇక ఈ రంగంలో ముంబైకి చెందిన ఆర్ బస్, సిటీఫ్లో, బెంగళూరుకు చెందిన జిప్ గో కూడా ఇలాంటి స్టార్టప్సే. భారతదేశంలో ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. సరైన బుకింగ్ విధానం లేదు. రద్దీగా ఉండే వాహనాలతో చికాకు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగవట్లేదు. దీంతో ప్రయాణికులు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చూస్తున్నారు. హోపర్ లాంటి స్టార్టప్ లు ప్రారంభమవడానికి అదే కారణం.

యువర్ స్టోరీ టేక్

కోల్ కతాలో జనం సమస్యలు తీర్చే స్టార్టప్ లు రావడం ప్రోత్సహించదగ్గ విషయం. స్టార్టప్ ల జయాపజయాలన్నీ ప్రజల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడిప్పుడే టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సక్సెస్ అవుతున్నారు కోల్ కతా వాసులు. నిజం చెప్పాలంటే ప్రయాణికులు టెక్నాలజీని ఉపయోగించుకోవడం పెద్ద సవాల్. ఒకవేళ హోపర్ వినూత్న విధానాలతో బిజినెస్ మోడల్ ను రూపొందించి... వారి మొదటి నగరంలో సరైన యూజర్లను సంపాదించుకోగలిగితే... ప్రజారవాణా వ్యవస్థలో బెస్ట్ అనిపించుకోవడం ఖాయం.