లాంగ్వేజ్ ఎకానమీ సృష్టిస్తున్న హైదరాబాద్ కుర్రాళ్లు

లాంగ్వేజ్ ఎకానమీ సృష్టిస్తున్న హైదరాబాద్ కుర్రాళ్లు

Monday January 30, 2017,

2 min Read

పల్లవ్, దేవేందర్, జశ్వంత్. ముగ్గురూ హైదరాబాదీలు. భాషంటే వీళ్లకి ప్రాణం. మాతృ భాషను బతికించుకోవాలని ఈ యువకుల తాపత్రయం. నిజానికి భాష అనేది అంతరించిపోవడం లేదు. లాంగ్వేజ్లో కంటెంట్ అభివృద్ధి చెందడం లేదంతే. ఇప్పటికీ 70వ దశకం సాహిత్యాన్నే చదువుకుంటున్నాం. కొత్త లిటరేచర్ అందుబాటులోకి రావడం లేదు. కథ, కథనం, మాధ్యమం రూపంలో భాష ముందుకెళ్లడం లేదు. రాసే వాళ్లు లేరని కాదు. యువ రచయితలకు, కథకులకు ఒక చక్కటి వేదికంటూ లేకుండా పోయింది. దీన్ని గమనించిన హైదరాబాద్ కుర్రాళ్లు కహానియాను స్టార్ట్ చేశారు. దీని ద్వారా భాషను బతికించుకోవడమే కాకుండా.. లాంగ్వేజ్ ఎకానమీ సృష్టిస్తున్నారు. యువ రచయితలకు ఆర్థిక అవకాశాలను సృష్టిస్తున్నారు.

image


ఆన్ లైన్ సాహిత్య సంపుటి కహానియా. వెబ్ సైట్ లో మొత్తం 11 భాషల కథలు, కవితలు అందుబాటులో ఉన్నాయి. కామిక్, థ్రిల్లర్, మైథాలజీ, డ్రామా, ఫిక్షన్, పోయెట్రీ.. ఇలా అన్ని రకాల సాహిత్యం ఇందులో దొరుకుతుంది. ఆండ్రాయిడ్ యాప్ కూడా లాంఛ్ చేశారు. త్వరలో ఐవోఎస్ యాప్ తీసుకొస్తున్నారు. పాఠకులకే కాదు రచయితలకు కూడా ఇది బెస్ట్ ప్లాట్ ఫామ్. రెండేళ్లలో ప్రపంచంలోని వివిధ భాషల పుస్తకాలను, సాహిత్యాన్ని కహానియా ద్వారా భారతీయులకి అందించాలన్నదే వీళ్ల లక్ష్యం. భారతీయ సాహిత్యపు వైవిధ్యాన్ని ఇంగ్లిష్ లో ప్రపంచానికి అందించడానికి కూడా కృషి చేస్తున్నారు. ప్రాంతీయ భాషల్లో కొత్త రచనలు, కామిక్స్, ఆడియో కథల్లాంటివి కూడా తీసుకొచ్చే ఆలోచన ఉందంటున్నారు సీఈవో పల్లవ్.

ఆసక్తి ఉన్న రచయితలు వెబ్ సైట్ లోకి లాగిన్ అయి కథలు, కవితలు రాయొచ్చు. పదిహేను నిమిషాల్లోపు చదవ గలిగే వాటిని ఎంచుకోవాలి. పెద్ద కథ అయితే మూడు నాలుగు భాగాలుగా రాసుకోవచ్చు. రచయిత తన ఐటమ్కు తానే ధర నిర్ణయించుకునే వీలుంది. రీడర్స్ వాటిని కొనుగోలు చేసి చదువుకుంటారు. కొన్ని పుస్తకాలు ఫ్రీగా దొరుకుతాయి. తెలుగులో కామిక్స్ పెద్దగా లేవు. కథలకు బొమ్మలు వేసే వాళ్లు కూడా చాలా తక్కువ. కహానియా టీం అలాంటి వారిని వెతికి పట్టుకొని కథకులతో అనుసంధానం చేసింది. వచ్చే ఆదాయంలో ఎవరి వాటా వారికి ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్లు కథను ఆడియో రూపంలోకి మార్చి రచయితకు పంపొచ్చు. నచ్చితే ఇద్దరూ ఒప్పందం చేసుకొని ఆడియో బుక్ రూపంలో వెబ్ సైట్ లో పోస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఇద్దరికీ ఆదాయం సమకూరుతుంది. ఇన్నాళ్లు కాగితాలకే పరిమితమైన కొత్త కొత్త కథలు.. కహానియా ద్వారా ప్రపంచానికి పరిచయం అయ్యాయి.

యువ ఆంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. కహానియా స్టార్టప్ కూ సర్కారు నుంచి సంపూర్ణ సహకారం లభించింది. టీ-హబ్ ద్వారా కహానియా టీంకు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. దాంతో బిజినెస్ పది మందికీ తెలిసింది. అటు తెలంగాణ భాషా సంఘం ప్రోత్సాహం కూడా దొరికింది. ప్రభుత్వం వేస్తున్న సంకలనాలన్నీ కహానియా డాట్ కామ్లో ఉన్నాయి. ఇంత మంచి సహకారం అందిస్తున్న సర్కారుకు ధన్యావాదాలు తెలిపింది కహానియా టీం.

ప్రత్యేకంగా బుక్ షాపులకు వెళ్లేంత తీరిక లేని వారికి ఇదొక మంచి వేదిక. స్మార్ట్ ఫోన్ లో కూడా నచ్చిన పుస్తకం చదువుకునే వెసులుబాటు ఉంది. ఒక్కసారి వెబ్ సైట్ లోకి లాగిన్ అయితే.. మంచి మంచి కథలు చెప్తుంది కహానియా.