సమయానికి ఇంటిభోజనం అందించే హైదరాబాద్ డబ్బావాలా బెంటోవాగన్

2

పిల్లలు ఎనిమిదిన్నరకల్లా స్కూల్‌కి వెళ్తారు! ఏడున్నరకే బ్రేక్ ఫాస్ట్ రెడీ చేయాలి. ఆ వెంటనే లంచ్ బాక్స్ ఏర్పాటు చేయాలి! ఎనిమిదంటిలోపు అట్లీస్ట్ రెండు కూరలైనా వండాలి. ఆ మధ్యలోనే పిల్లలకు స్నానాలు.. బట్టలు.. జుట్లేయడం.. షూ పాలిష్.. బ్యాగ్ సర్దడం! వాళ్లు అలా బయటకు వెళ్లగానే వెంటనే మళ్లీ శ్రీవారి టిఫిన్ కోసం, భోజనం కోసం తలమునకలు!

ఉదయం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర ఆమెకు వంటరూంలో ఊపిరిసలపదు. ఇంకా దారుణం ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకోడానికి కూడా సమయం చిక్కదు. మూడు గంటల షార్ట్ గ్యాప్‌లో ఇంటిల్లిపాదికీ యుద్ధప్రాతిపదికన వండిపెట్టాలి. ఈ తొందరలో వంటలు సరిగా కుదరవు. రుచీపచీ లేకుండా తయారవుతాయి. మధ్యాహ్నానికి పాడైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పిల్లాడు స్కూల్ నుంచి లంచ్ బాక్స్ తినకుండా పట్టుకొస్తే ఆ తల్లి మనసు చివుక్కుమంటుంది. అప్పుడనిపిస్తుంది ఇంకొంచెం టైముంటే వంట కుదిరేదేమో అని! ఇంకొంచెం సమయమిస్తే ఇంకో వెరైటీ చేసిపెట్టేదాన్నేమో అని!

టైం..! ఇది చాలా ఇంపార్టెంట్! ముఖ్యంగా వంట విషయంలో! ఎంత ఇంటిభోజనమైనా సరిగా కుదరకపోతే ఫాయిదా లేదు. అందుకే మీరు తీరిగ్గా వండండి.. టైంకి మేం దాన్ని తీసుకెళ్లి మీ పిల్లాడికిస్తాం.. మీ ఆయన ఆఫీసులో అందజేస్తాం.. అంటూ వచ్చింది బెంటోవాగన్ అనే స్టార్టప్. ముంబై డబ్బావాలా మాదిరి ఇది హైదరాబాద్ డబ్బావాలా. పూర్తిగా ఇంటి భోజనాన్ని అందించే స్టార్టప్. స్కూల్లోగానీ, ఆఫీసులోగానీ లంచ్ సమయానికి బాక్స్ అందించే పూచీ వీళ్లది. ఇంటి దగ్గరకి వెళ్లి పికప్ చేసుకుని దాన్ని వర్క్ ఏరియాలో అందజేస్తారు. ఈ కాన్సెప్టులో చాలానే స్టార్టప్స్ వచ్చాయి కానీ, అవన్నీ సొంతంగా వండి తీసుకొచ్చేవే. కానీ ఇది మాత్రం పక్కా ఇంటి భోజనం అందించే స్టార్టప్.

ఇంకా చెప్పాలంటే ఇది విమెన్ ఓరియెంటెడ్ స్టార్టప్. ఒక మహిళ పొద్దున లేచింది మొదలు పది పదిన్నర దాకా ఆమెకు కిచెన్‌లో ఊపిరిసలపదు. చిన్న గ్యాప్ కూడా ఉండదు. అదే కాస్త టైమిస్తే అంతకంటే అద్భుతంగా వండుతుంది. ఈ గ్యాప్‌ని పూరించాలనే ఉద్దేశంతో.. సునీల్ కుమార్ తన సాఫ్ట్ వేర్ ప్రొఫెషన్‌ని వదిలేసి స్టార్టప్ కోసం కొంత గ్రౌండ్ వర్క్ చేశారు. కొన్ని స్కూళ్లకు వెళ్లి ఐడియా షేర్ చేసుకున్నారు. వాళ్ల నుంచి పాజిటివ్ రెస్పాండ్ వచ్చింది. కొన్నిసార్లు పిల్లల లంచ్ బాక్సులో అన్నం, కూరలు పాడైపోయేవని వాళ్లు చెప్పుకొచ్చారు. వాళ్ల సూచనలు, లోటుపాట్లు బెంటో వాగన్ స్టార్టప్ కి మరింత ఊతమిచ్చాయి.

బెంటో వాగన్ అనేది జపనీస్ నుంచి వచ్చిన పదం. జపనీస్ లో బెంటో అంటే అందంగా ముస్తాబు చేసిన లంచ్ బాక్స్ అని అర్ధం. వాగన్ అంటే వాహనం. ప్రస్తుతానికి సొంత డబ్బులతోనే స్టార్టప్ మొదలుపెట్టారు. సిటీలోని కొన్ని ఏరియాల్లో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఐదు కిలోమీటర్ల వైశాల్యంలో నెలకు రూ. 500 సబ్ స్క్రిప్షన్ చొప్పున లంచ్ బాక్స్ అందిస్తున్నారు. దూరం పెరిగితే కొద్దీ కిలోమీటర్ కి ఇంత అని అదనంగా తీసుకుంటారు. ప్రస్తుతానికి వందమంది క్లయింట్స్ ఉన్నారు. టీంలో 15 మంది వరకు పనిచేస్తున్నారు. త్వరలో యాప్ వెర్షన్ తేవాలనే ప్లాన్ లో ఉన్నారు. స్థాపించి దాదాపు ఏడాది అవుతున్న ఈ స్టార్టప్ విస్తరణ కోసం ఫండింగ్ కోరుతోంది. 

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Stories