ఏకాగ్రత కుదరడంలేదా? అయితే ఈ టొమాటో కిటుకు ట్రై చేయండి..

ఏకాగ్రత కుదరడంలేదా? అయితే ఈ టొమాటో కిటుకు ట్రై చేయండి..

Friday March 18, 2016,

2 min Read


చాలామందికి ఒక పనిమీద కొంత సేపు ఏకాగ్రత పెట్టడం సాధ్యం కాదు. పని ప్రారంభించిన ఐదు నిమిషాల్లోనే మెదడులో మరో ఆలోచన. అంతే అప్పటివరకు చేస్తున్న పనిని ఆపేసి పక్కకు వెళ్లిపోతారు. ఇలా చేయడం వల్ల చేయాల్సిన పని అలాగే మిగిలి పోతుంది. అది చదువు కావొచ్చు లేదా ఆఫీస్ పని కావచ్చు. టైమ్ వృథా అవుతుందే తప్ప పని కాదు. కానీ పనిమీద కాన్సంట్రేట్ చేసేందుకు ఓ అద్భుత టెక్నిక్ ఉంది. అదే పొమోదోరో టెక్నిక్. ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన ఆ టెక్నిక్ యువర్‌స్టోరీ పాఠకుల కోసం..

అనుకున్న పనులను పూర్తి చేసేందుకు నానా తంటాలు పడుతుంటాం. కొన్ని యాప్‌లు పనులను పూర్తిచేసేందుకు సాయం చేస్తాయి. అయితే వాటివల్ల కొన్ని నష్టాలున్నాయి. పని నుంచి దూరం జరగకుండా ఉండేందుకు మనసుపై తీవ్ర ఒత్తిడి తెస్తాయి. అలా కాకుండా పనిని ఆడుతూపాడుతూ పూర్తి చేసే విధానాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో అత్యుత్తమమైనది పొమోదోరో టెక్నిక్. ఇది చాలామందికి అనుకున్న ఫలితాలను ఇచ్చింది.

ఈ టెక్నిక్‌ను ఫ్రాన్సెస్ సిరిల్లో 1980లో అభివృద్ధి చేశారు. తను కాలేజీ చదివే రోజుల్లో రూపొందించారు. షార్ట్ టైమింగ్స్ కోసం ఆయన ఈ విధానాన్ని డెవలప్ చేశారు. 25 నిమిషాల పని, ఐదు నిమిషాల బ్రేక్. ఇలా టెక్నిక్‌ను వృద్ధి చేశారు. ఒకేసారి 20 నిమిషాలకు పైగా పనిమీద ఏకాగ్రత పెట్టలేని వారికి ఈ టెక్నిక్ అద్భుతంగా ఉపయోగపడుతుంది.

పొమోదోరో టైమర్

పొమోదోరో టైమర్


సిరిల్లో బుక్ ‘ది పొమోదోరో టెక్నిక్’ ప్రకారం ఈ విధానంలో ఆరు దశలుంటాయి..

1. మీరు చేయాలనుకున్న పనిని నిర్దేశించుకోండి

2. పొమోదోరో టైమర్‌ను n నిమిషాలకు సెట్ చేసుకోండి (సాధారణంగా n=25 నిమిషాలు)

3. టైమర్ రింగ్ అయ్యేవరకు పనిచేసుకోండి. ఈ సమయంలో మీ మనసులో ఏవైనా ఆలోచనలు వస్తే, వాటిని పేపర్‌పై రాసిపెట్టండి. కానీ వెంటనే పనిమీదకు మనసు మళ్లించండి.

4. టైమర్ రింగ్ అయిన తర్వాత పేపర్ మీద చెక్ మార్క్ పెట్టుకోండి.

5. నాలుగు చెక్ మార్క్స్ కంటే తక్కువ మాత్రమే చేయగలిగితే కొద్ది సేపు విశ్రాంతి (3-5 మినిట్స్) తీసుకోండి.. ఆ తర్వాత మళ్లీ స్టెప్ 1 నుంచి మొదలుపెట్టండి

6. నాలుగు చెక్ మార్క్స్ కంటే ఎక్కువ చేయగలిగితే సుదీర్ఘ విశ్రాంతి (15-30 నిమిషాలు) తీసుకోండి. ఆ తర్వాత చెక్ మార్క్‌ను మళ్లీ సెట్ చేసుకోండి. జీరో నుంచి మొదలుపెట్టండి. స్టెప్ 1 నుంచి ప్రారంభించండి.

పొమోదోరో అంటే ఇటలీ భాషలో ‘టొమోటో’ అని అర్థం. సిరిల్లో తను యూనివర్సిటీలో చదివే రోజుల్లో ఉపయోగించిన మెకానికల్ కిచన్ టైమర్‌ను పోలి ఉండటంతో దానికి ఆ పేరు పెట్టారు. అయితే అందరూ మెకానికల్ టైమర్‌లను కొనుక్కోలేరు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించేందుకు ఇతర పద్ధతులు కూడా ఉన్నాయి. ఆన్‌లైన్ టైమర్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు. 25 నిమిషాలు పూర్తయిన తర్వాత ఆటోమెటిక్‌గా టైమర్ రింగ్ అవుతుంది. అప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుని, మళ్లీ పని ప్రారంభించొచ్చు. పని ప్రారంభించే ముందు ఈ ఆన్‌లైన్ టైమర్ వెబ్‌సైట్‌ను రిఫ్రెష్ చేస్తే చాలు మళ్లీ టైమర్ సెట్ అవుతుంది.

అడ్డంకులను అధిగమించి, ఒక పనిపై ఏకాగ్రత పెట్టేందుకు ఈ టెక్నిక్ అత్యుత్తమమైనది. మనసుపై ఒత్తిడి పెంచే ఇతర యాప్‌ల మాదిరి కాకుండా మనను మనం 25 నిమిషాలపాటు కట్టడి చేసుకునేందుకు ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఇదో రివార్డు బేస్డ్ సిస్టమ్. ఈ టెక్నిక్‌లో ఒక్కో సైకిల్ పూర్తయిన తర్వాత కాసేపు మనకు నచ్చిన పనిని చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా వాట్సప్‌లలో కొద్దిసేపు గడపొచ్చు. ఆ తర్వాత మళ్లీ పొమోదోరో టెక్నిక్‌ను ఉపయోగించి పనిమీద దృష్టి సారించొచ్చు.

ఈ టెక్నిక్‌ను మేం ఉపయోగించాం. మాకు చాలా ఫలితమిచ్చింది. మీరూ ట్రై చేయండి. మీకు కూడా ఫలితమిస్తుందని మేం భావిస్తున్నాం. ఒకవేళ అనుకున్నది సక్సెస్ అయితే మీ అభిప్రాయాన్ని యువర్‌స్టోరీకి తెలియజేయండి.