పాఠాలను కథల రూపంలో చెప్పేందుకు పదిహేనేళ్ల కృషి చేసిన కథాలయ

కథల రూపంలో పాఠ్యాంశాలుపిల్లల్లో ఆసక్తి పెంచేందుకు కథాలయ కృషిబట్టీ పద్ధతికి ప్రత్యామ్నాయం

పాఠాలను కథల రూపంలో చెప్పేందుకు పదిహేనేళ్ల కృషి చేసిన కథాలయ

Wednesday July 15, 2015,

4 min Read

అనగనగా ఒక రాజు...వేటకి వెళ్లి ఏడు చేపలు తెచ్చాడు. వాటిలో ఆరు చేపలు ఎండాయి. ఒకటి ఎండలేదు...చేపా...చేపా నువ్వెందుకు ఎండలేదు అని రాజు అడిగాడు...చిన్ననాటి నుంచి మనం తరచుగా వినే కథ. ఒక్కసారి వినగానే ఈ కథను ఇంక మర్చిపోలేం. మనదేశంలో ఈ కథ తెలియని పిల్లలే ఉండరు. కథలో నీతీ ఉంటుంది. కథ చెప్పే విధానంలో ఓ సృజనాత్మకత ఉంటుంది. చివరికి ఏమవుతుందో అన్న ఆతృత ఉంటుంది. అందుకే ఎండని చేప కథ మన చిన్నారులందరి హృదయాలకు హత్తుకుపోయింది. ఒక్కసారి ఈ కథ విన్నవారెవ్వరూ దీన్ని మర్చిపోలేరు. కథలో ఉన్నది మామూలు విషయమే. దాన్ని ఆ రూపంలో మార్చటంలోనే దాగి ఉంది విజయ రహస్యం.

ఇక్కడ విషయాన్ని కథలా కాకుండా ఓ పాఠ్యాంశం రూపంలో చెబితే చదివిన వెంటనేనో, విన్న వెంటనేనో పిల్లలు, పెద్దలూ అందరూ మర్చిపోయేవారు. కథలా చెప్పటం వల్లే ఊహతెలియని వయసులో విన్నా ఇప్పటికీ అది అందరికీ గుర్తుండిపోయింది. అందులో అదీ గొప్పతనం. ఈ విషయాన్ని గమనించిన గీతా రామానుజమ్ అనే స్కూల్ టీచర్‌కు ఓ వినూత్న ఆలోచన వచ్చింది. పిల్లలు కష్టపడి విన్న పాఠ్యాంశాలను కొందరు తరగతి గది దాటిన వెంటనే, మరికొందరు ఓ రోజు గడిచిన తరువాతో మర్చిపోతుంటారు. ఎంత శ్రద్ధగా విన్నా ఎవరో కొందరు తప్ప ఎక్కువ మంది పిల్లలకు క్లాసులో పాఠ్యాంశాలు గుర్తుండవు. అందుకే వారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకునేందుకు పాఠ్యాంశాలను కథ రూపంలో చెప్పే పద్ధతి మొదలుపెట్టారు గీతా రామానుజమ్.

గీతా రామానుజ‌మ్‌

గీతా రామానుజ‌మ్‌


నిజానికి కథ చెప్పటం అనేది ఒక కళ. కొన్ని విషయాలను, మన ఆలోచనలను తెలియచెప్పటానికి అదో మంచి కమ్యూనికేషన్ విధానం. మాటల ద్వారానో, మరో రూపంలోనో ఇతరుల నుంచి మనకు అందే అనేక రకాల సమాచారం చివరకు ఓ కథలా రూపొందుతుంది. కథ ద్వారా మనం గతంలో జరిగిన వాటిని రకరకాల మనుషులు పాత్రధారులుగా ఉన్న అనేక వరుస సంఘటనల క్రమంలా తలచుకుంటాం. ఈ కథలను ప్రతిరోజూ మనం ఇతరుల నుంచో, మీడియా ద్వారానో వింటూనే ఉంటాం. జరిగిన విషయానికి మనం ఓ ఆకృతి ఇస్తాం. ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయానికి.. ఈ కథలు ఓ రూపం ఇస్తాయి. రకరకాల కథలు వినటానికి, చెప్పటానికి ఇంతగా ఉత్సాహం చూపే మనం, చదువు విషయానికొచ్చేసరికి బట్టీయం కొట్టి నేర్చుకోవటానికి ప్రాధాన్యం ఇవ్వటం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత్రలు, వాటి చర్యలు యధేచ్ఛగా ప్రత్యేకమయిన పదాలు, వాటి నిర్వచనాలు పద్ధతిలోకి మారిపోయేసరికి నిజానికి వాటి అర్ధం కోల్పోతున్నాయి.

మనం చదువు నేర్చుకుంటున్న అసహజ విధానాలకు గీతా రామానుజం స్థాపించిన కథాలయ ప్రత్యామ్నాయం కనిపెట్టినందుకు అందరూ కృతజ్ఞులై ఉండాలి. పాఠాలను కథల రూపంలో చెప్పే విధానాన్ని అందరూ ఊపయోగించుకునేలా చేసేందుకు దాదాపు 15 ఏళ్ల నుంచి కథాలయ... టీచర్లు, ఎన్జీవో ప్రతినిధులు, తల్లిదండ్రులతో కలిసి కృషిచేస్తోంది.

గీతా రామానుజమ్ కథాలయ స్థాపించటానికి కారణం ఆమె టీచర్‌గా పనిచేయటమే. రోజూ బోధించే పద్ధతుల్లో కొత్త దనం లేకపోవటం, టీచర్లు, విద్యార్థుల మధ్య సరైన అనుబంధం లేకపోవటం, మొక్కుబడిగా పాఠాలు చెప్పటం, వినటం వంటివి తను ఉపాధ్యాయురాలుగా పనిచేసే సమయంలో ఆమె గమనించారు. దీంతో పిల్లలకు, టీచర్లకు ఆసక్తి కలిగేలా ఏదన్నా చేయాలని తాను నిర్ణయించుకున్నానని గీత చెప్పారు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన తండ్రి మంచి మంచి చరిత్ర పాఠాలన్నీ తనకు కథలో రూపంలోనే వివరించారని గీత తెలిపారు.

కథాలయ 15 ఏళ్లగా దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నింటిలో పర్యటిస్తూ.. .. విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా, వారిపై ప్రభావం చూపించగలిగేలా కథ ఎలా చెప్పాలో తల్లిదండ్రులకు, టీచర్లకు, ఎన్జీవో ప్రతినిధులకు నేర్పిస్తోంది. స్టోరీ టెల్లింగ్ సెషన్లు, వర్క్ షాపులు, ట్రైనింగ్ సెషన్లు ఏర్పాటుచేస్తోంది. విద్యార్థులు కథను ఆసక్తిగా వినేందుకు అవసరమైన పుస్తకాలు అందిస్తోంది. ప్రత్యేకమైన పాఠాల నుంచి తయారుచేసిన కథలను సైతం వారికి అందిస్తోంది. కథలు నిజాలతో నిండి ఉంటాయంటారు గీత. మనం ఓ కథ చెప్పినప్పుడు దానిద్వారా అందులోని నిజాలను కూడా వారికి తెలియజేస్తాము. లేదంటే ఆ నిజాలను తర్వాతైనా చెప్తాము అంటారు గీత. వినేవాళ్లను అది మేల్కొలుపుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్సుకతను కథలు కలిగిస్తాయి. అవి చాలా ఉత్సాహంగా ఉంటాయి, ముందుకు సాగుతూ ఉంటాయి, చివరకు ముగింపు ఓ భాగం ఉంటుంది. వాటినిండా ఎంతో ఆశ్చర్యం నిండి ఉంటుంది అని కథల రూపంలో ఉన్న పాఠాల గురించి వివరించారు గీత.

కథాలయ విజయం సాధించటంతో పాటు...దాని పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలియటంతో దేశంలోని అనేక స్కూళ్లు స్టోరీ టెల్లింగ్ విధానాన్ని తమ పాఠ్యాంశాల్లో చేర్చాయి. సాంఘిక శాస్త్రం, సైన్సు వంటి సబ్జెక్టులను అర్థం చేసుకునేలా పిల్లల స్థాయిని పెంచటం, వారికి ఆసక్తి కలిగేలా చేయటం తో పాటు వారికి పర్యావరణ అవగాహన, భాషలో ప్రావీణ్యం కల్పించటంపైనా కథాలయ కార్యక్రమాలు దృష్టిపెడతాయి. భారత్ లోని సాంస్కృతిక భిన్నత్వాన్ని, ఇంగ్లీషులో అంత ప్రావీణ్యం లేని గ్రామీణ ప్రాంత విద్యార్థులను, టీచర్లను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను స్థానిక భాషల్లో కూడా రూపొందిస్తున్నారు.

క‌థాల‌య‌  బృందం

క‌థాల‌య‌ బృందం


కథల రూపంలో పాఠాలు చెప్పటంతో పిల్లలు క్లాస్ రూంలో ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుంటారు. చెప్పేవారు, వినేవారి మధ్య ఒక రకమైన ఉద్వేగంతో కూడిన బంధం ఏర్పడుతుందని గీత చెప్పారు. కథ రూపంలో పాఠం చెప్పే విధానం వినేవాళ్లని ఉద్వేగానికి లోనుచేసి వాళ్లను మేల్కొలుపుతుంది.

కథాలయ వారి కార్యకలాపాలు పురాతన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ప్రభావవంతంగా పనిచేస్తున్నప్పటికీ...ప్రస్తుత సమాజంలో అంతటా విస్తరిస్తున్న డిజిటల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎదుర్కోగలగటం ఆ సంస్థకు ఒక సవాలు వంటిది. క్లాస్ రూంలపై ఈ ఆధునిక టెక్నాలజీల ప్రభావం ఎంతగా పెరిగిపోతోందో గీత గమనిస్తున్నారు. విద్యార్థులు ఒక చోట కదలకుండా కూర్చుని, ఆ, ఊ, లులాంటి సమాధానాలు చెప్పటానికి పరిమితమవుతున్నారని గీత ఆవేదన చెందారు. ఏదన్నా చెప్పటం కానీ, తమ గురించి తాము చెప్పుకోవటం కానీ విద్యార్థులకు తెలియటం లేదని, కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కోల్పోతున్నారని గీత వివరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో కథాలయ చేపట్టిన కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనవి, అవసరమైనవి. దీన్ని గుర్తించిన కథాలయ స్టోరీ టెల్లింగ్ అకాడమీని నెలకొల్పింది. స్టోరీ టెల్లింగ్ కోసం ఏర్పడిన తొలి, ఏకైక అకాడమీ ఇదే. స్వతంత్ర సంస్థ అయిన ఈ అకాడమీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. కథాలయకు ఇది అనుబంధంగా పనిచేస్తుంది. అకాడమీని అర్ధం చేసుకుంటే కథాలయ లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కథాలయ విద్య పరిధిని దాటి విస్తరించింది. టీచర్లు, ఎన్జీవో ప్రతినిధులు, కార్పొరేట్ నిపుణులు...ఇలా ఏ నేపథ్యం ఉన్నవారైనా...స్టోరీ టెల్లింగ్ మీద ఆసక్తి ఉంటే అకాడమీ అందించే కోర్సులు చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ అవకాశముంటుందని గీత చెప్పారు. దాన్నో చదువుగా వారు భావించటం లేదని, వారు చేస్తున్న ఉద్యోగానికి ఇదో అదనపు అర్హతగా భావిస్తున్నారని ఆమె తెలిపారు.

అందుకే కథాలయ తమకు సంబంధించింది కాదని ఎవరన్నా భావిస్తున్నట్టయితే మరోసారి ఆలోచించుకోవాలి. నువ్వెవరన్నది, నువ్వు ఏ రంగంలో పనిచేస్తున్నావన్నదానితో సంబంధం లేకుండా స్టోరీ టెల్లర్ కావచ్చు. కమ్యూనికేషన్ గురించి పట్టించుకోవాలనుకునేవాళ్లు , తమ స్టోరీ టెల్లింగ్ సామర్థ్యాన్ని తెలుసుకోవాలనుకునేవాళ్లు ఏదో ఒక అంశం వినటం మాత్రమే కాకుండా...దాన్ని అర్ధం చేసుకుని, భావాన్ని గ్రహించాలి. ఎందుకంటే మనం ఒక కథ చెబుతున్నప్పుడు ఎదుటివాళ్లు ఆసక్తిగా వింటారు. అంతేకాదు...ఆ కథ నుంచి ఏదో ఒక విషయాన్ని గ్రహించి దాన్ని తమ మనసులో దాచుకుంటారు, అది చాలా అద్భుతమైన విషయమని గీత తెలిపారు.

పాఠాలు బట్టీ పడుతూ, తరగతి గదిలోనూ, బయట కుస్తీలు పడుతూ అవి గుర్తుండవని బాధపడే విద్యార్థులకు కథాలయ మంచి ప్రత్యామ్నాయం. కథ రూపంలో ఉన్న పాఠం కథలానే జీవితాంతం గుర్తుండిపోతుంది. విద్యార్థుల భవిష్యత్తును అది మార్చివేస్తుంది.