రెండు స్టార్టప్‌ లను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహిస్తున్న నీల్మా

రెండు స్టార్టప్‌ లను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహిస్తున్న నీల్మా

Monday December 28, 2015,

6 min Read

లైట్స్, కెమెరా, యాక్షన్, ఈ సౌండ్స్ వింటుంటే నీల్మా దిలీపన్ మనసు పులకరించిపోతుంది. ఎందుకో ఆ శబ్దాలు ఆమెను మైమరపింపజేస్తాయి. క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, తమిళ స్టార్ సూర్య వంటి సెలబ్రిటీలతో కలిసి నీల్మా పనిచేశారు. ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టించిన అనూ ఆంటీ వీడియో సృష్టికర్తలలో నీల్మా దిలీపనే కూడా ఒకరు.

27 ఏళ్ల నీల్మా పుట్టింది కేరళలోని తిషూర్‌లోనైనా.. పెరిగింది మాత్రం బెంగళూరులోనే. మౌంట్ కార్మల్ కాలేజి నుంచి కమ్యూనికేషన్ స్టడీస్‌ లో డిగ్రీ పొందారు. బెంగళూరులోని యెల్లో అంబ్రెల్లా ప్రొడక్షన్‌ కు ఆమె ప్రొడ్యూసర్ కమ్ ఓనర్. అలాగే విత్ లవ్, నీల్మా పేరుతో ఈవెంట్ స్టయిలింగ్ సంస్థను కూడా రన్ చేస్తున్నారు.

image


వ్యవస్థాపకుల కుటుంబం..

నీల్మా తల్లిదండ్రులు సుమారు 30 ఏళ్ల పాటు ఓ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీని నడిపించారు. ప్రస్తుతం నీల్మా తల్లి కూర్గ్‌ లో ఏకో ఫ్రెండ్లీ హౌజ్‌ ను నిర్మించే పనిలో ఉన్నారు. నీల్మా సోదరి కూడా కొడైకెనాల్‌ లో త్వరలోనే ఓ కెఫ్‌ ను ప్రారంభించనున్నారు. ‘అంటర్‌ప్రెన్యూర్‌ షిప్ మా బ్లడ్‌ లో లేదు. అంట్రప్రెన్యూర్లతో కూడిన కుటుంబం మాది’’ అంటారు నీల్మా నవ్వుతూ.

అంత్రప్రెన్యూర్‌ గా ప్రయాణం..

నీల్మా ప్రొడ్యూసర్‌ గా తన కెరీర్‌ ను 2009లో మొదలుపెట్టారు. ఓ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌజ్‌ లో ప్రొడ్యూసర్‌ గా చేరారు. అయితే అందులో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు. తనకు ఇష్టంలేని పనులు అప్పజెప్పిన కారణంగా ఆ సంస్థకు రాజీనామా చేశారు. ఆ సంస్థను వదిలినా ఆ రంగం నుంచి మాత్రం ఆమె బయటపడలేదు. బెంగళూరులోని ఎవీ ప్రొడక్షన్‌ లో 2010లో చేరి అందులో నాలుగేండ్లపాటు పనిచేశారు. ఈ సమయంలో ఆమె ప్రపంచమంతా చుట్టేశారు. ‘‘ఆ సంస్థలో ఎంతో విలువైన అనుభవం సంపాదించాను. విదేశాలకు వెళ్లిన సమయంలో నిద్ర కూడా ఉండేది కాదు. విమానం నుంచి దిగిన క్షణం నుంచే మా పని ప్రారంభమయ్యేది. జెట్‌ లాగ్‌ ను కూడా పట్టించుకోకుండా అక్కడి ప్రజలతో కలిసి పనిచేశాం’’ అని నీల్మా అన్నారు.

image


వివిధ దేశాల ప్రజలతో పనిచేయాల్సి రావడంతో, వారి విలువైన పనికాలాన్ని గౌరవించడం నేర్చుకున్నారు నీల్మా. ‘‘ఒక్కరు కూడా ఆలస్యంగా వచ్చేవారు కాదు. నేను వెళ్లిన దేశాల్లో ఎక్కడ కూడా పెద్ద అడ్డంకులు ఉండేవి కావు. డైరెక్టర్‌ తో సమానంగా లైట్ బాయ్‌ ను గౌరవించేవారు’’ అని ఆమె తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు.

తను కూడా ప్రతి ఒక్కరిని సమానంగా చూసేవారు. షూటింగ్ సమయాల్లో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, అందరు చక్కగా పనిచేస్తేనే షూట్ సక్సెసవుతుందని ఆమె బలంగా నమ్మేవారు.

ఎంవీ ప్రొడక్షన్ హౌజ్‌ లో నాలుగేళ్లు సంతోషంగా గడిచినప్పటికీ, నీల్మా సంతృప్తి చెందలేదు. ఇంకా ఏదైనా సాధించాలన్న పట్టుదల ఆమెలో రోజు రోజుకు పెరిగిపోయింది. బృందం మొత్తానికి నాయకత్వం వహించాలని, బాధ్యతలు స్వీకరించి ఏదైనా సృష్టించాలని కోరుకునేవారు. నీల్మాకు మేనేజ్‌మెంట్, కో ఆర్డినేషన్ స్కిల్స్ సహజంగా చిన్నప్పుడే అలవడ్డాయి. తన పనులన్నింటినీ ఒక్కరే పూర్తిచేసుకునేవారు నీల్మా.

అలా విత్ లవ్, నీల్మా పేరుతో తొలి స్టార్టప్‌ను ఆగస్టు 2014లో ప్రారంభించారు. ‘‘నా ఫ్రెండ్స్ అంతా పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కంటుంటే, నేను స్వతంత్రంగా వారి పెళ్లిళ్లకు డెకరేషన్ ఏర్పాట్లు చూసేదాన్ని, చిన్నారుల ఆలనా పాలనా చూసేదాన్ని. దీంతో నా శ్రమను అందరూ గుర్తించడం మొదలుపెట్టారు. ఇది స్టార్టప్ కంపెనీని పెట్టేందుకు నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది’’ అని నీల్మా వివరించారు.

చిన్న పిల్లల బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు, బ్యాచిలర్ పార్టీలు, డిన్నర్లు.. అలా అన్ని రకాల కార్యక్రమాలను నీల్మా నిర్వహించేవారు. ఒక్క బెంగళూరులోనే కాదు ఎక్కడైనా పార్టీలు నిర్వహించేందుకు అంగీకరించేవారు.

పేరు వెనుక కథ..

‘‘విత్ లవ్ నీల్మా అని పేరు పెట్టడం వెనుక ఓ స్టోరీ ఉంది. ఎవరైనా పార్టీని నిర్వహించమని అప్పగించారనుకోండి.. ఆ పార్టీతో సంబంధం లేదన్నట్టుగా పూర్తి చేయకుండా, సొంత పార్టీలా దాన్ని నిర్వహిస్తాను. ఫంక్షన్ నాదే అన్న కాన్సెప్ట్‌ తో ప్రేమతో పనులు చేస్తాను. అందుకే విత్ లవ్, నీల్మా అని సంస్థకు పేరు పెట్టాను’’ ఆమె చెప్పారు.

నీల్మా చుట్టూ ఉన్న ప్రపంచం, ఆమెకు వివిధ పెళ్లిళ్లు, ఈవెంట్లలో డెకరేషన్ ఏ విధంగా ఉన్నదో వివరిస్తారు. కొత్త ఐడియాలు, ఇన్నోవేటివ్ డిజైన్లను గుర్తుంచుకుని మరీ ఆమె దృష్టికి తీసుకొస్తారు.

సహజత్వం ఉట్టిపడేలా, అందరికీ నచ్చే ఓ థీమ్‌ ను తీసుకుని డెకరేషన్ చేస్తారు నీల్మా. అందరూ చక్కని మూడ్‌ లో ఉండేలా ఆమె డెకరేషన్ ఉంటుంది. ఆమె చేసిన అన్ని ఈవెంట్లు దాదాపుగా అందరికీ నచ్చేలానే నిర్వహించారు.

ప్రస్తుతానికైతే ఏకో ఫ్రెండ్లీ వెడ్డింగ్ ట్రెండ్ నడుస్తుందని నీల్మా అంటారు. ‘‘చాలామంది క్లయింట్లు ఇప్పుడు పర్యావరణానికి పెద్ద పీట వేస్తున్నారు. డెకరేషన్‌ లో ప్లాస్టిక్‌ ను తక్కువ స్థాయిలో ఉపయోగించాలని కోరుతున్నారు. అలాగే మిగిలిపోయిన ఆహార పదార్థాలను కూడా ఎన్జీవోలకు ఇవ్వాలని సూచిస్తున్నారు’’ అని నీల్మా వివరించారు.

ఒకేసారి రెండు సంస్థల నిర్వహణ..

‘‘సొంతంగా వ్యాపారం నిర్వహించుకోవాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. దాన్నే నా బేబీలా పిల్చుకుంటాను’’ అని ఆమె చెప్పారు. ఒంటరిగా వ్యాపార రంగంలో ముందుకెళ్లేందుకు నీల్మా తల్లిదండ్రులు కూతురికి చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ‘‘ఒక్క బేబీతోనే సంతృప్తి చెందకుండా, రెండు కవల సంస్థలను ఒకే సారి నిర్వహిస్తున్నాను’’ అని నీల్మా నవ్వుతూ చెప్తున్నారు.

image


ఒక కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ, నీల్మా మాత్రం కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు. సంస్థ అభివృద్ధికి తానెంతో చేయాల్సి ఉందని ఆమె అంటారు. రెండు సంస్థలను ఒంటరిగా నిర్వహిస్తున్నప్పటికీ ఆమెకు ప్రొడక్షన్ రంగమంటేనే ఇష్టం. తొలి వెంచర్‌ లో పనిచేస్తున్న సమయంలోనే ఆమెకు ఎన్నో అభినందనపూర్వక కాల్స్ వచ్చాయి. అంతేకాదు తమ షూట్లను కూడా నిర్వహించాలని కొందరు ఆఫర్లు కూడా ఇచ్చారు. ఈవెంట్ల మధ్య సమయంలో ఆమె ఈ పనులను పూర్తిచేసేవారు. ఆఫర్లు పెరగడంతో సంస్థను ప్రారంభించాలన్న ఆలోచన ఆమె మదిలో మెదిలింది. అలా గత ఏడాది డిసెంబర్‌లో యెల్లో అంబ్రెల్లా ప్రొడక్షన్‌ ను ప్రారంభించారు. అడ్వర్టయిజింగ్‌ లు, ప్రమోషనల్ ఫిల్మ్స్‌ ను ఈ సంస్థ రూపొందిస్తున్నది.

ప్రస్తుతం బిజీ అయిపోవడంతో కొన్ని తన పనులను కట్ చేసుకున్నారు నీల్మా. షూటింగుల కోసం లొకేషన్లు వెతకడం, షూటింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయడం వంటివి నిర్వహిస్తున్నారు. అకౌంటింగ్, మార్కెటింగ్, బిల్లింగ్ వంటి పనులను ఇతరులకు అప్పగించారు.

‘‘కొలిగ్స్ జీనా, నాగరాజ్, అబినీత్, మా తల్లిదండ్రులు నాకు ఎంతో సప్టోర్టివ్‌ గా ఉంటున్నారు. షూటింగ్‌లకు కానీ, ఈవెంట్లకు కానీ ఎవరైనా స్టాఫ్ తక్కువైతే మా తల్లిదండ్రులు సాయం చేస్తున్నారు. వారి సహకారం లేకుండా నేను ఇంత దూరం ప్రయాణిచడం అసాధ్యం. మా అమ్మే అన్నీ నాకు. అకౌంట్లను హ్యాండిల్ చేసేందుకు ఆమె ఎంతో సహకరిస్తారు. టీడీఎస్, సర్వీస్ ట్యాక్స్ వంటి వాటి గురించి ఆమెకు చక్కటి అవగాహన ఉంది. నేను ఆర్ట్స్‌ లో డిగ్రీ పూర్తి చేశాను. అకౌంట్స్‌ కు సంబంధించిన విషయాలు నాకు కాస్త ఇబ్బంది. ఇప్పుడైతే ప్రత్యేకంగా ఓ అకౌంటెంట్‌ను నియమించుకున్నాం. అన్ని పనులూ ఆయనే నిర్వహించుకుంటారు’’ అని నీల్మా వివరించారు.

సెలబ్రిటీలతో కలిసి..

వివిధ రకాల ప్రొఫెషనల్స్‌ తో కలిసి నీల్మా పనిచేయాల్సి ఉంటుంది. పెయింటర్లు, కార్పెంటర్లు, లైట్ బాయ్స్, టెంపో డ్రైవర్స్ నుంచి క్రికెటర్లు, మూవీ స్టార్లు, రచయితలు, మ్యూజిషియన్స్ వరకూ అందరితో కలిసి పనిచేశారు. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, ఐపీఎల్ క్రికెటర్లు, టీమ్స్, కేరళ బ్లాస్టర్స్ సాకర్ టీమ్, అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ లోబో వంటి సెలబ్రీటీలతో కలిసి కూడా పనిచేశారు నీల్మా. ఎన్నో హిట్లను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు కూడా..

గాంధీగిరీ..

ఒకేసారి రెండు స్టార్టప్‌ లను నిర్వహించడం అంత సులభం కాదు. అంటర్‌ప్రెన్యూర్‌గా వివిధ రకాల వ్యక్తులతో వేర్వేరుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇవన్నింటినీ ఆమె ఓవర్‌ కమ్ చేయగలిగారు.

image


‘‘కొన్నిసార్లు పనులను చక్కగా పూర్తిచేసేందుకు కొందరితో కఠినంగా, దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే అలా వ్యవహరించడం నా నైజం కాదు. గత ఏడాది నా ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకున్నాను. మా వెండర్ల నుంచి మంచి సర్వీసును, లేదంటే క్లయింట్ల నుంచి సరైన సమయంలో పేమెంట్లను పొందేందుకు నేను గాంధీగిరీ (మున్నాబాయ్) స్టయిల్‌ ను ఫాలో అవుతున్నాను. చెల్లింపులు ఆలస్యమైతే క్లయింట్లను తిట్టడం, అరవడం చేయడం కాకుండా, ఓ ఫ్లవర్ బోకేతో వారికి గుర్తుచేస్తున్నాను. ఇప్పుడది మంచి ఫలితాలు అందిస్తున్నది’’ అని ఆమె చెప్పారు.

రెండు సంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ, ఫైనాన్స్‌ ను మేనేజ్ చేయడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒప్పందం కుదుర్చుని షూటింగ్స్ జరుపుకున్న కొన్ని సంస్థలు సరైన సమయానికే చెల్లింపులు జరుపుతాయి. అయితే అందరూ ఒకేలా ఉండరు. కొందరు క్లయింట్లు నెలల పాటు చెల్లింపులు చేయరు. దీంతో తన పొదుపు చేసినవాటి నుంచి నుంచి ఇతరులకు నీల్మా చెల్లించాల్సి వస్తుంది

జీవితమే ఒక పరుగు..

రెండు స్టార్టప్‌ లను ఒకేసారి నిర్వహించడం చాలా కష్టం. ఇదే విషయాన్ని ఆమెకు గుర్తు చేస్తే నవ్వుతూ సమాధానమిచ్చారు. ‘‘రెండు సంస్థలను ఏర్పాటు చేయడం అలా జరిగిపోయింది. ముందుగా అనుకుని ప్రారంభించినవి కావు. నా సంతోషం కోసం ప్రారంభిస్తే, ఇప్పుడది నా రోజువారీ జీవితమైపోయింది. వివిధ వర్గాల ప్రజల నుంచి పనులు కోరుకోకుండానే వచ్చేవి. దీంతో అదే నా ఫుల్‌ టైమ్ వ్యాపారంగా మారిపోయింది’’ అని ఆమె వివరించారు.

రెండు వ్యాపారాలు ఒకేసారి చేయాల్సి రావడం కారణంగా ఆమె జీవితం చాలా బిజీగా గడిచిపోతున్నది. ఉదయం నాలుగు గంటలకే ఆమెకు రోజు ప్రారంభవుతుంది. డెకరేషన్ల కోసం కావాల్సిన వస్తువులు, ఇతర సామగ్రిని ఉదయమే తరలిస్తారు. అలా ప్రారంభమైన రోజువారీ జీవితం క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంది. ఆ రోజు ఎన్నిగంటలకు నిద్రపోతారో ఆమెకే తెలియదు. మొత్తం పనులన్నీ పూర్తయిన తర్వాతే ఆ రోజును ముగిస్తారు. ఎంత ఆలస్యమైనా పనులు పూర్తి చేసిన తర్వాతే నిద్ర పోతారామె. ‘‘ఆరంభంలో వచ్చిన అన్ని ఆఫర్లను అంగీకరించేదాన్ని. కానీ ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నవి, ఇష్టమైన వాటిని, కంపెనీకి గుర్తింపు తెస్తాయని అనిపించేవి, సంస్థ అభివృద్ధికి తోడ్పడేవి మాత్రమే ఒప్పుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్క మంచి ఆఫర్‌ నూ అంగీకరిస్తున్నాను. జీవితం ఓ రిథమ్‌ లో ఉంటేనే లైఫ్ బ్యాలెన్స్ అనేది గుర్తుకు వస్తుంది’’ అని నీల్మా వివరించారు.

ఫ్యూచర్ ప్లాన్స్..

ప్రస్తుతానికైతే నీల్మా నిర్వహిస్తున్న రెండు సంస్థలు కూడా ఆమె సొంత మూలధనంతో ఏర్పాటు చేసినవే. అంతేకాదు ఓ పెద్ద ఆఫీసును అద్దెకు తీసుకోవాలన్నయోచనలో కూడా ఆమె ఉన్నారు. తమ సామగ్రి, స్టాఫ్‌ కు పూర్తిస్థాయిలో సరిపోయే కార్యాలయం అద్దెకు తీసుకునేందుకు ట్రైచేస్తున్నారు. ఈ రెండు సంస్థలు గాడిలో పడితే మూడో వెంచర్‌ను కూడా ప్రారంభించాలనుకుంటున్నారు. ఆమె ఆశలు నెరవేరాలని కోరుకుందాం..