బ్రాండ్‌ బజాయించిన అకౌంటెంట్

ఈ-కామర్స్‌లో దూసుకెళ్తున్న మణి అగర్వాల్-

0

ఒక్కోసారి డాక్టర్ చదివి యాక్టరవుతారు. అంతేమరి- చదివిన చదువుకూ చేసేపనికీ- లంకె కుదరాలని బండరూలేం లేదు. డిగ్రీకి తగ్గ ఉద్యోగం చేస్తేనే సార్ధకత అనుకుంటే ఈ రోజుల్లో అమాయకత్వమే. అలా మడికట్టుకుని కూచుంటే పిసరంత కూడా మనగురించి చెప్పుకోడానికి ఏమీ ఉండదు. మణి అగర్వాల్ అలాగే ఆలోచించింది.

మణి అగర్వాల్
మణి అగర్వాల్

తండ్రికి తగ్గ తనయ

అమెరికా డెలాయిట్‌ లో మంచి ఉద్యోగం. కంపెనీలో మంచి ప్రొఫైల్. గౌరవానికి గౌరవం.హోదాకు హోదా. అకౌంటింగ్ డిగ్రీ చేసేందుకు కంపెనీ మరో అవకాశం ఇచ్చింది. కానీ జర్నీ చేసే రూట్ ఇది కాదనిపించింది మణిఅగర్వాల్‌ కు. మనసు ఉద్యోగాన్ని కోరుకోవడంలేదు. బ్రెయిన్ నిండా బిజినెస్‌ ఆలోచనలే. జీతాన్నీ- ప్రమోషన్నీ అలవోకగా పక్కకు తోశారు. కట్ చేస్తే- 250 మంది ఉద్యోగులతో ఒక ఎక్స్‌ పోర్ట్‌ కంపెనీ. తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్న మణి అగర్వాల్ సక్సెస్ స్టోరీ ఇది.

బ్రాండ్‌ బజాయించింది

ఫ్యాషన్ మీద మోజు- క్రేజే మణి అగర్వాల్‌ ను ముందుకు నడిపించాయి. ఐ వేర్ మై స్టయిల్ లేబుల్‌. మార్చి 2012లో మొదలైంది. ఢిల్లీ బేస్డ్‌ కంపెనీ. మొదట పెద్దగా పెట్టుబడి లేదు. అయినా ఫస్ట్ నెల రూ.60,000 ఆదాయం వచ్చింది. ఇప్పుడు లక్షల్లో ఉంది. తొలిరోజుల్లో నెలకు 800 పైన ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు వేలల్లో ఉన్నాయి. మారుతున్న కస్టమర్ల టేస్టు- డిజైన్‌ లో వస్తున్న చేంజ్‌- ఇలాంటివన్నిటినీ ఎప్పటికప్పుడు కంపెనీ ట్రాక్ చేస్తూ -అప్ డేట్ అవుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త ఫ్యాషన్‌ తీసుకురావడంలో ఎలాంటి ఆలస్యం చేయరు. 2012లో స్టయిల్‌ ట్యాగ్.కామ్‌ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఐ వేర్ మై స్టయిల్ నిలిచింది. 2013లో టాప్-10 ఈ-కామర్స్ వెబ్‌ సైట్లలో ఒకరోజు టర్నోవర్ లో అత్యధిక అమ్మకాలు జరిపిన బ్రాండ్‌ గా రికార్డుకెక్కింది. అద్భుతమైన కలెక్షన్, పక్కా క్వాలిటీ. ఇవీ ఐ వేర్ మై స్టయిల్ బ్రాండ్ ప్రత్యేకతలు. విదేశాల్లో తయారైన బట్టలనే అమ్ముతారు. అయినా ధర అందుబాటులో ఉంటుంది. అదే కంపెనీకి కలిసొచ్చే అంశం. సగటు ధర రూ.1,000-2,500 ఉంటుంది. ఇప్పటి వరకు వెనక్కి వచ్చిన బట్టలు 2 శాతం కూడా ఉండవు.

ఫేస్‌బుక్‌తో ప్రారంభం..

ఐ వేర్ మై స్టయిల్ మొదట ఫేస్‌ బుక్ ద్వారా అమ్మింది. తర్వాత లేబుల్‌ పాపులర్ అయింది. వెంటనే ఇ-కామర్స్ కంపెనీలు తోడయ్యాయి. ఇంకా బాగా పేరు రావడంతో వెబ్‌ సైట్‌ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఫేస్‌ బుక్ ఫాలోయర్లు సంఖ్య దాదాపు 40 వేలు. 20కి పైగా ఇ-కామర్స్ కంపెనీలతో వ్యాపారం ప్రారంభించినప్పటికీ, ఇప్పుడు వీటి సంఖ్య నాలుగు ఐదుకు పరిమితమైందంటున్నారు మణి అగర్వాల్.

కస్టమర్ కేంద్రంగా..

ఇ-కామర్స్ రంగం అంటే ఒడిదొడుకులు కామన్. అందుకే కస్టమర్ సెంట్రిగ్గా ఒక ప్లాన్ ప్రకారం కంపెనీ నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి కంపెనీలు ప్రస్తుతం అసోసియేట్‌గా ఉన్నాయి. గతంలో డెలివరీకి 10-15 రోజులు పట్టేది. ఇప్పుడు పోటీని తట్టుకోవడానికి ఒకటీ రెండు రోజుల్లోనే ఇస్తున్నారు. అలా కావాలంటే కొంత ఖర్చవతుంది .కానీ తప్పదు. స్టాక్‌ కోసం కూడా అదనంగా పెట్టుబడి కావాలి. త్వరలో ఆఫ్‌లైన్‌ లోకి వచ్చే ఆలోచన ఉందంటున్నారు మణి అగర్వాల్. రిటైలర్లతో కూడా భాగస్వామ్యానికి రెడీ అంటున్నారామె. వ్యాపారంలో ఇంకా రాటుదేలాలంటే ఇప్పుడున్న స్ట్రాటజీ సరిపోదు. ఏదైనా బిజినెస్ స్కూల్‌ లో చేరితే ఇంకా దూసుకుపోవచ్చనేది ఆమె ఆలోచన.

ప్రస్తుతం యూరోపియన్, అమెరికన్ ఫ్యాషన్‌ అందుబాటులో ఉంది. త్వరలోనే జివెల్రీ, ఫుట్‌వేర్, హ్యాండ్‌ బ్యాగ్స్, యాక్సెసరీస్‌ తోపాటు మగవాళ్ల రెడీమేడ్స్‌ కూడా పరిచయం చేయబోతోంది కంపెనీ.