మానవత్వమా నీవెక్కడా అంటే..ఇదిగో ఇక్కడుంది..!!  

ప్రేమ విశ్వవ్యాప్తం అని చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా..

0

ప్రేమ గుండె గాయాన్ని మాన్పుతుంది! ఆప్యాయత మనిషితనాన్ని నిలుపుతుంది! అలాంటి ప్రేమ ఒక్క ప్రాణాన్ని బతికిస్తే చాలదా..! అలాంటి ఆప్యాయత ఒక్క మనిషిని చేరదీస్తే చాలదా..!! నాడు చెమర్చిన కళ్లు.. నేడు సంబ్రమాశ్చర్యాలతో విప్పార్చి చూసేలా చేసిన ఆ మంచిమనిషి పేరు అంజా రింగ్రెన్‌ లావెన్‌!

డెన్మార్క్ కి చెందిన అంజా సోషల్ వర్కర్. నైజీరియన్ల ఆకలి చావులు కదిలించాయి. ముడుచుకుపోయిన వారి పేగుల్లో నిరంతరం కురిసే అగ్నిధారలు ఆమెను ఆలోచింపజేశాయి. పండుటాకుల్లా మారిన పసిపిల్లలను చూసి గుండె తరుక్కుపోయింది. మూఢనమ్మకాలsy అభంశుభం తెలియని పసివాళ్లు అన్యాయమైపోతున్న తీరు ఆమెను కలచివేసింది

ఏడాది క్రితం అలా.. ఇప్పుడిలా.. 
ఏడాది క్రితం అలా.. ఇప్పుడిలా.. 

ఒక చిన్నారిది అదే యాతన. పుట్టగానే మంత్రగాడు అనే నెపం వేశారు. సమాజం నుంచి గెంటేశారు. అమ్మ పొత్తిళ్లలో పడుకోవాల్సిన చిన్నారి చెత్తకుప్పల పాలయ్యాడు. దేవుడు గొప్పోడు. అస్తిపంజరంలాంటి చిన్నారి దేహంలో ప్రాణాన్ని మాత్రం నిలిపాడు. పడుతూ లేస్తూ వీధుల వెంట తిరిగాడు. చెత్తకుప్పల దగ్గర దొరికింది తిన్నాడు. మురికినీళ్లు తాగాడు. మురికిలో మురికయ్యాడు. మట్టిలో మట్టయ్యాడు. ఎనిమిది నెలలు నరకయాతన. ఎండను మీదుకుని తిరిగాడు. వానను మోసుకుని నడిచాడు. చలిని కప్పుకుని పడుకున్నాడు. శుష్కించి, కుంచించుకుపోయాడు. శరీరం మీద పుండ్లకు పురుగులు పట్టాయి.

ఈ హృద‌య విదాకర దృశ్యం అంజా చెవినపడింది. అప్పటికే ఆమె ఈశాన్య నైజీరియాలో భర్త డేవిడ్ తో కలిసి ఆఫ్రికన్ చిల్డ్రన్స్ ఎయిడ్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్ నడుపుతోంది. క్షణం ఆలస్యం చేయకుండా పిల్లాడి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది. నాలుగు బిస్కెట్లు నోటికందించి కడుపునిండా నీళ్లు తాగించింది. అరకిలో బరువు కూడా లేని చిన్నారిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. ఏ సమాజమైతే మంత్రగాడు అని బయటకు నెట్టేసిందో.. ఆ సమాజాన్నే తిప్పికొట్టేలా పిల్లాడికి నమ్మకం(హోప్) అని పేరుపెట్టింది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన సంఘటన ఇది. ఆ ఫోటోలు, వీడియోలో వైరల్ అయ్యాయి. లక్షలాది మంది హృద‌యాలను కదిలించాయి.

అర్జెంటుగా పిల్లాడికి వైద్యం చేయించాలి. ముఖ్యంగా శిశ్నం దారుణంగా ఉంది. మూత్రద్వారం మూసుకుపోయింది. చికిత్స కోసం ఫండ్ కలెక్ట్ చేయాలని భావించింది. సరిగ్గా రెండు జానెలంత ఉన్న పిల్లాడు డాక్టర్ల చేతుల్లోకి వెళ్లాడు. దేవుడి దయవల్ల ట్రీట్మెంట్ సవ్యంగా జరిగింది. ఇప్పుడు హోప్ మామూలు మనిషయ్యాడు. స్కూలుకి కూడా వెళ్తున్నాడు. అంజా ఆనందానికి అవధుల్లేవు. ఏడాదిలో ఎంత మార్పు. ఆనాడు ఏ పరిస్థితుల్లో కనిపించాడో.. ఇప్పుడెలా చలాకీగా యూనిఫాంలో బడికి వెళ్తున్నాడో చెప్పేలా రెండు ఫోటోలని కలిపి సోషల్ మీడియాలో పెట్టింది. కాంట్రాస్ట్ ఇమేజ్ నమ్మశక్యం కాకుండా ఉంది. యావత్ ప్రపంచానికి హోప్ సుపరిచితుడయ్యాడు.

మానవత్వం మూర్తీభవించిన అమృత‌మయి సేవలను గుర్తించి, జర్మనీకి చెందిన ఊమ్ మేగజైన్ మోస్ట్ ఇన్ స్పైరింగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2016 అని కీర్తించింది. బారక్ ఒబామా, పోప్ ఫ్రాన్సిస్ ని కాదని అంజాను ఆకాశానికెత్తింది.

ఇవాళ హోప్ తనలాంటి 35 మంది అనాథ పిల్లలతో కలిసి పెరుగుతున్నాడు. విరాళాలతో ఆదుకున్న మనసున్న మారాజులందరికీ అంజా పేరుపేరునా నమస్కారాలు చేసింది.

మానవత్వమా నీవెక్కడ అంటే.. ఇదిగో ఇక్కడున్నా చెప్పింది అంజా.. మంచితనమా నీవాళ్లేరి అని ప్రశ్నిస్తే.. ఇదిగో వీళ్లే నా వాళ్లు అని చెప్పింది. ఎక్కడ డెన్మార్క్.. ఎక్కడ నైజీరియా. మంచి, మానవత్వం విశ్వవ్యాప్తం అని చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలదా..

Related Stories

Stories by team ys telugu