టీచర్లకే టీచర్ GuruG

కొండకోనల్లో కారడవుల్లో, టెక్నాలజీ చేరని సుదూర ప్రాంతాల్లో టీచర్ల చేతిలో ట్యాబ్ కనిపిస్తోంది. స్కూల్లో ప్రొజెక్టర్లు కనిపిస్తున్నాయి. అక్కడ టీచర్ల తో పాటు గురూజీ కూడా బోధనలో పాల్పంచుకుంటున్నారు. ఎవరా గురూజీ.. ట్యాబ్లెట్లకీ, పాఠాలకీ మధ్య ఈ గురూజీకి సంబంధం ఏంటి.. ?

టీచర్లకే టీచర్ GuruG

Friday July 17, 2015,

4 min Read

విద్యా ప్రమాణాలు పడిపోతున్నయాని ప్రపంచ వ్యాప్తంగా ఒక ఆందోళన వుంది. అలా అని టీచర్లను నిందిస్తే ప్రయోజనం ఏంటి.. వాళ్ళ శక్తి యుక్తుల్ని పెంచడానికి ఏంచేయాలో ఆలోచించాలి..’’ ఇదీ గురూజీ (GuruG) వ్యవస్థాపకుడు శివానంద సల్గామె వాదన. అన్ రీజనబుల్ ఎట్ సీ (Unreasonable at sea) ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రపంచమంతా తిరిగి విద్యారంగంపై GuruG టీమ్ విస్తృతమైన అధ్యయనం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై ఓ అవగాహనకు రావడానికి ఈ అధ్యయనం ఉపయోగపడింది. మొత్తమ్మీద ఇప్పుడు ప్రపంచం అంతా అనుకుంటున్నది ఒకటే.. ‘‘ఏం చెప్తున్నామన్నది కాదు.. ఎలా చెప్తున్నామన్నదే’’ ముఖ్యం. బోధనాంశాలమీద కాకుండా బోధనా పద్థతులను మార్చడానికి ప్రయత్నించాలి.

ఈ దిశగా బోధనా పద్ధతుల్లో మార్పుతీసుకురావడానికి GuruG ఒక వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. పిల్లలపై మరింత మెరుగైన ప్రభావం చూపేలా ఆటపాటల ప్రాతిపదికన రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను టీచర్లకు అందిస్తోంది. బోధించాల్సిన కరికులమ్‌తో పాటు టీచర్ పని చేసే సాంస్కృతిక నేపధ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని రూపొందించిన టీచింగ్ ప్యాకేజిలు ఈ ప్లాట్‌ఫామ్ పై అందుబాటులో వుంటాయి. ఇటు ఆండ్రాయిడ్, అటు టాబ్లెట్ లపై పని చేసే ఈ సాఫ్ట్‌వేర్‌లో టీచర్ ఓ టాపిక్ సెలెక్ట్ చేసుకోగానే, అందులో వుండే పాఠాలు, అవి బోధించాల్సిన పద్ధతులు అన్నీ వచ్చేస్తాయి. విద్యార్థి అవసరాలకు తగ్గట్టు టీచర్ తనకు కావల్సిన పద్ధతిని (బొమ్మలు, వీడియో, ఆడియో) ఎంచుకోవచ్చు.

image


GuruG ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో వున్న స్కూళ్లను చేరాలనుకుంటోంది. ఇంతవరకు టెక్నాలజీ చేరని, ఇంగ్లీషు కూడా తెలియని ప్రాంతాల్లో మా సాఫ్ట్‌వేర్ ను పరీక్షిస్తున్నాం. ఇక్కడ సక్సెస్ అయితే, ఇంకెక్కడయినా ఎదురుండదు.’ అంటారు.. శివానంద.

ఇంకాస్త సాహసోపేతంగా వుండాలని GuruG బృందం మరింత దూరం వెళ్ళింది. 2012 లోఏకంగా కర్నాటక లోని బందిపూర్ , తమిళనాడు లోని మధుమలై అటవీ ప్రాంతాల్లోని 50 పాఠశాలలను ఎంచుకుని తమ సాఫ్ట్‌వేర్ ను వారికి అందించింది. ‘‘మేం అక్కడ వర్క్ షాపులను నిర్వహించాం. అక్కడ టీచర్లంతా మా టెక్నాలజీని చాలా ఆదరించారు. స్థానిక టీచర్లు, ఎన్‌జీవోలు, ప్రభుత్వ అధికారుల సాయంతో మా సాఫ్ట్‌వేర్‌లోని అంశాలను కన్నడ, తమిళ భాషల్లో కూడా అనువదించాం. మొత్తం మీద మా సాఫ్ట్‌వేర్ ఇక్కడ సక్సెస్ అయిందని చెప్పడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, అక్కడి టీచర్లు మా టెక్నాలజీని అంగీకరించారు. రెండు, వాళ్ళ రోజువారీ బోధనలో ఈ టెక్నాలజీని వాడుతున్నారు’’ అన్నారు శివానంద.

ఏం చదవాలో కాదు.. ఎలా చదవాలో తెలియాలి !

ఈ సక్సెస్‌తో GuruG మరింత ముందుకెళ్ళింది. మహరాష్ర్ట, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, పాండిచెరి రాష్ట్రాల్లోని పాఠశాలల్లోని దాదాపు వెయ్యి మంది టీచర్లు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. స్ట్రక్చర్డ్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ అనే ఆరు అంశాల ప్రాతిపదికగా ఈ టెక్నాలజీని రూపొందించామని శివనాంద చెప్పారు. ఒక టెక్ట్స్ బుక్ చూస్తే, ఏం చదవాలో తెలుస్తుంది. కానీ ఎలా చదవాలో తెలియదు. టెక్ట్స్ బుక్‌లో వున్న పాఠ్యాంశాలను విద్యార్ధులకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ ఆరు అంశాలూ టీచర్లకు ఉపకరిస్తాయి.

అసలు బోధనకు ఉపాధ్యాయుడు అవసరమా.. ? 2013లో టెడ్ ప్రైజ్ అవార్డు పొందిన స్కూల్ ఇన్ ద క్లౌడ్ లాంటి ప్రాజెక్టులు.. టెక్నాలజీని ఉపయోగించి టీచర్ లేని విద్యావ్యవస్థను ఏర్పాటు చేయవచ్చని చెప్తున్నాయి. అయితే, శివానంద మాత్రం టీచర్ ఉండాల్సిందే అంటారు. స్కూల్ ఇన్ ద క్లౌడ్ లాంటివి బాగా మేథస్సు వున్న వారికే తప్ప మామూలు విద్యార్థులకు పనికిరావని శివానంద అభిప్రాయం. సమాచారాన్ని సేకరించి దాన్ని విద్యార్ధులకు అర్థమయ్యే విధంగా రూపొందించడానికి ఒక వ్యవస్థ ఉండాల్సిందేనని శివానంద చెప్తారు. ‘‘అది టీచర్ కావచ్చు, మరో వ్యక్తి కావచ్చు. కానీ నేర్చుకునే క్రమంలో గందరగోళాన్ని నివారించే ప్రక్రియ ఒకటి వుండాలి’’ అంటారు శివానంద.

టీచర్లకూ చాలా భయాలున్నాయ్ !

టీచర్లు అవసరమని చెప్తూనే స్వతంత్రంగా నేర్చుకునే విధానం కూడా అవసరమేనంటారు శివానంద. ‘‘ లోతైన చర్చలు పెట్టడానికి టీచర్లు ఇష్టపడరు. ఎందుకంటే, తాము సమాధానం చెప్పలేని ప్రశ్నలను పిల్లలడుగుతారేమో అని భయం అలా అని మీరు అలాంటి సవాళ్లు తీసుకోవాల్సిందేనని మనం టీచర్లపై వత్తిడి తేలేం. అలాంటి సందర్భాల్లో GuruG ఉపయోగపడుతుంది. కష్టమైన చర్చల్లో కూడా ఈ సాఫ్ట్‌వేర్ టీచర్లను గైడ్ చేస్తుంది.

ఇప్పటి దాకా GuruG వాడుతున్న స్కూళ్లన్నిటిలోనూ అటెండన్స్ పెరగడం, విద్యార్థులు మరింత శ్రద్ధగా నేర్చుకుంటూ వుండడం GuruG సక్సెస్ అని చెప్పుకోవాలి. వచ్చే ఏడాదికల్లా వెయ్యి స్కూళ్లను చేరుకోవాలని, ఆఫ్రికా లాంటి అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించాలని GuruG లక్ష్యంగా పెట్టుకుంది.

ఫలితాలు ఆశాజనకంగా వున్నా, సంస్థ ఆర్ధిక పరిస్థితి మాత్రం అంత సంతృప్తికరంగా లేదు. ఎక్కువగా ఫౌండేషన్లు, ఎన్ జి వోలు, సి ఎస్ ఆర్ తదితర విరాళాల మీదే ఆధార పడి సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయి. ‘‘ఈ ఏడాది మేం కమర్షియల్ గా విస్తరించాలనుకుంటున్నాం. స్కూళ్లకు మా ప్రోడక్ట్ నేరుగా అమ్ముతాం. మరోవైపు అంతర్జాతీయంగా అత్యుత్తమ స్కూళ్ళు కొన్ని మా టెక్నాలజీని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా వున్నాయి’’అని తమ భవిష్యత్ ప్రణాళికలను వివరించారు శివానంద.

గురు జి సంస్థ అందించిన ట్యాబ్‌లతో పిల్లలు

గురు జి సంస్థ అందించిన ట్యాబ్‌లతో పిల్లలు


ఈ టెక్నాలజీ వాడకంలో మరో సమస్య వుంది. స్కూళ్ళలో పిల్లలు వాడే టాబ్లెట్స్ , స్మార్ట్ ఫోన్లు, ప్రాజెక్టర్ల ద్వారానే ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. మరి ఆ టాబ్లెట్స్ ఎంత కాలం పాడవకుండా వుంటాయి.. అవి పాడైతే, ఈ టెక్నాలజీ పరిస్థితి ఏంటి ? ‘‘ఎక్విప్‌మెంట్ బాగోగులకు మేం బాధ్యత వహించలేం. అయితే, కొన్ని స్కూళ్ళలొ ఒకటి రెండు, టాబ్లెట్లు పాడయినప్పుడు, స్కూలు అందరూ కలిసి డబ్బులు పోగేసుకుని మరొకటి కొనుక్కుంటున్నారు. అయితే, అన్ని స్కూళ్ళలో అన్ని ఎక్విప్‌మెంట్ విషయంలో ఇది సాధ్యం కాకపోవచ్చు.’’ అని శివానంద అన్నారు.

పిల్లలతో శివానంద

పిల్లలతో శివానంద


ఇలాంటి ఒకటి అరా సమస్యలున్నప్పటికీ తమ టెక్నాలజీని వాడిన స్కూళ్లలో మాత్రం గణనీయమైన ఫలితాలు కనిపించాయని GuruG టీమ్ చెప్తోంది. తమ టెక్నాలజీ ని పిల్లలు ఎంతగా ఇష్టపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ మధ్య ఒక పరీక్ష చేసారు. ఒక టీమ్ మెంబర్ ఓ స్కూలుకు వెళ్ళి టీచర్ దగ్గర నుంచి ట్యాబ్ ను లాక్కుని వచ్చేసాడు. వెంటనే క్లాస్ లో పిల్లలందరూ అతని వెంటపడి టాబ్లెట్ ఇవ్వమని ప్రాధేయ పడ్డారు.. దీన్ని బట్టీ తమ టెక్నాలజీ బ్రహ్మాండంగా పనిచేస్తోందని GuruG టీమ్ కి అర్థమయింది.