అన్ని స్విచ్‌లకూ ఒకటే రిమోట్.. హోం ఆటోమేషన్‌లో హైదరాబాదీ స్టార్టప్

అన్ని స్విచ్‌లకూ ఒకటే రిమోట్.. హోం ఆటోమేషన్‌లో హైదరాబాదీ స్టార్టప్

Monday October 12, 2015,

3 min Read


డ్రాయింగ్ రూంలో ఉండి బాల్కనీలోని లైట్ ఆన్ చేయాలంటే ఎలా ? సెపరేట్ స్విచ్ అరేంజి చేసుకుంటే సరిపోతుంది. బెడ్ రూంలో ఉండి కిచెన్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే ఎలా ? దీనికొక స్విచ్ పెట్టుకోవాలి. లేదంటే కిచెన్ దాకా వెళ్లక తప్పదు. కానీ వన్ కంట్రోల్‌తో అయితే ఎక్కడున్న వారు అక్కడి నుంచే అన్నీ ఆపరేట్ చేయొచ్చు. బాల్కనీలో బాతా ఖానీ కొడుతున్నప్పుడు బెడ్ రూంలో ఏసి ఆఫ్ చేయలేదన్న విషయం గుర్తొస్తే వెంటనే చేసేయొచ్చు. వన్ కంట్రోల్‌తో ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాన్నైనా మన కంట్రోల్‌లో పెట్టుకోవచ్చంటున్నారు ఆ సంస్థ సీఈఓ రాజేష్.

“సాధారణంగా ఈ హోం ఆటోమేషన్ విధానం శ్రీమంతులకు మాత్రమే అందుబాటులో ఉందని అనుకుంటున్నారు. కానీ సాధారణ మధ్య తరగతి జనాలకు కూడా మేం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం” - సీఈఓ రాజేష్ గాడే.
image


వన్ కంట్రోల్ ఫీచర్స్

వన్ కంట్రోల్ ఫీచర్ల విషయానికొస్తే... ముందుగా చెప్పుకోవాల్సింది దీని ధర. మిగిలిన వాటికంటే చవగ్గా లభిస్తోంది. మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌తో హైదరాబాద్‌లో ప్రారంభమైన సంస్థ ఇది. ప్లగ్ అండ్ ప్లే ఇందులో చెప్పుకోదగిన మరో ఫీచర్. దీనికోసం ప్రత్యేకంగా వైరింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా తొందరగా దీన్ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. టూ వే కంట్రోల్ మరో ఫీచర్. రిమోట్‌తో పాటు స్విచ్‌లను కూడా మనం వినియోగించుకోవచ్చు. అందుకే కంప్లీట్ కన్వినియన్స్ సాధ్యం. ఒక రిమోట్‌తో అన్నింటినీ కంట్రోల్ చేసేయొచ్చు. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సాధారణ టీవీ రిమోట్ ఆపరేట్ చేసినంత సులువుగా దీన్ని ఉపయోగించొచ్చు. డైరెక్ట్ నావిగేషన్ అనేది సరికొత్త ఫీచర్. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి కూడా కింద ఎంట్రస్ గేట్ దగ్గరున్న లైట్‌ను ఆపరేట్ చేయొచ్చు. మరో మెయిన్ ఫీచర్ మాస్టర్ కంట్రోల్. అన్ని స్విచ్‌లు ఒకేసారి బంద్ చేయాలంటే ఒక స్విచ్ నొక్కితే అన్నీ ఆగిపోతాయి. అదే స్విచ్ ఆన్ చేయడానికైనా ఉపయోగించొచ్చు. చిన్న చిన్న వర్తకులు షాప్ మూసివేసేటప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు.

image


వన్ కంట్రోల్ టీం

వన్ కంట్రోల్ పేరెంటింగ్ కంపెనీ ఎటిసి. ఈ కంపెనీ ఫౌండర్లతో పాటు మరికొంతమంది వ్యాపార వేత్తలు కలసి ప్రారంభించిన స్టార్టప్ ఇది. రాజేష్ గాదే సంస్థ సీఈఓ. ఆయనే ఆపరేషన్స్ చూస్తారు. ఆయనతో పాటు రిచర్డ్ మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. వీరితో పాటు మరో పదిమంది టెక్నికల్, నాన్ టెక్నికల్ టీం ఈ స్టార్టప్‌లో పనిచేస్తోంది.

image


వన్ కంట్రోల్ పనితీరు

వన్ కంట్రోల్ వెబ్ పేజీ ప్రారంభించి రోజు నుంచే మంచి స్పందన వస్తోందని టీం చెబ్తోంది. రోజుకి వందల సంఖ్యలో యూజర్లు లాగిన్ అవుతున్నారు. కంపెనీ ప్రారంభించి ఇప్పటికి ఐదు నెలలు పూర్తి చేసుకుంది. ఈ కొద్దిరోజుల్లోనే 10,000 మంది యాక్టివ్ యూజర్ బేస్‌ను ఏర్పాటు చేసుకుంది. సైట్ ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. పూర్తి స్థాయి ప్రమోషనల్ యాక్టివిటీ ఇంకా వీళ్లు మొదలుపెట్టలేదు. ఆన్ లైన్లో ప్రతి రోజూ మూడు నుంచి నాలుగు ఆర్డర్లు అందుతున్నాయి. వన్ కంట్రోల్ పై అప్పర్ మిడిల్ క్లాస్‌కు చెందిన యూజర్లు మక్కువ చూపిస్తున్నారని సీఈఓ రాజేష్ చెబ్తున్నారు.

image


సవాళ్లు

ఇటీవల ఈ రంగంలో చాలా స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. బెంగళూరుకి చెందిన ఒక స్టార్టప్ ఆరున్నర వేలకే ఇలాంటి ప్రాడక్టు ఇస్తోంది. ధర విషయంలో వన్ కంట్రోల్‌కు పోటీ ఇచ్చే స్టార్టప్ ఇదే కావొచ్చు. అయితే వన్ కంట్రోల్ పేరెంటింగ్ కంపెనీ పూర్తి స్థాయిలో మార్కెట్‌లో ఉండటం కలసొచ్చే విషయం. హైదరాబాద్‌లో వన్ కంట్రోల్ టార్గెట్ ఆడియన్స్‌ని రీచ్ కావడంలో మాత్రం ఒక రకంగా సక్సస్ అయ్యారనే చెప్పాలి.

భవిష్యత్ ప్రణాళికలు

సైట్ ట్రాఫిక్ చూస్తుంటే లాంచింగ్ రోజు నుంచే వన్ కంట్రోల్ కి ఫాలోయింగ్ ఉందనే విషయం మనం గుర్తించాలని రాజేష్ అంటున్నారు. ఇదిలా ఉండగా స్థానికంగా ఈవెంట్స్ లో పాల్గొని ప్రాడక్టును ప్రమోషన్ చేయాలనే యోచనలో ఉన్నారు. ఆన్ లైన్ తోపాటు యాప్ ఫ్లాట్ ఫాంలోకి రావాలని చూస్తున్నారు. ఆటోమేషన్ సొల్యూషన్ కి వన్ కంట్రోల్ కేరాఫ్ కావాలనే లక్ష్యంగా మరికొన్ని ప్రీమియం ప్రాడక్టులను లాంచ్ చేయాలని చూస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ స్టార్టప్ ఫండింగ్ వస్తే ఇతర మెట్రో నగరాలకు సైతం విస్తరించాలని చూస్తోంది.

website