మహిళల సురక్షిత ప్రయాణానికి మాజీ ఆర్మీ అధికారి క్యాబ్ సేవలు

మహాత్ముడు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడది ఒంటరిగా నడిచే స్వాతంత్ర్యం ఇంకా రాలేదని పన్నెండేళ్ళు సైన్యంలో పని చేసిన శైలేంద్రకి వేరే చెప్పక్కర్లేదు. కాలేజి నుంచో, ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి ఆడపిల్లలకి క్యాబ్‌లు ఏర్పాటు చేస్తారే తప్ప, ఆ క్యాబ్‌లలో భద్రత మాత్రం అంతంత మాత్రమే. క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు రోజుకొకటి హెడ్ లైన్లవుతున్న ఈ రోజుల్లో ఈ సమస్యకి తనదైన పరిష్కారం చెప్పాలనుకున్నారు శైలేంద్ర.

0

కాలేజీ నుంచో, ఆఫీసు నుంచో కాస్త చీకటి పడ్డాక బయలుదేరిన అమ్మాయిలు అక్కడ బండెక్కినప్పటి నుంచీ, ఇంటికి చేరేదాకా ..తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. ఎక్కడ ఏ అఘాయిత్యం జరుగుతుందో, ఏ డ్రైవరు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఆడపిల్లల పరిస్థితి ఇంత దయనీయంగా వుండడం మనందరం సిగ్గుపడాల్సిన విషయమే అయినా.. ఒప్పుకోవాల్సిన వాస్తవం. ఈ భయంకరమైన నిజానికి విరుగుడేంటి ? ఈ ప్రశ్నకు సమాధానమే విమెన్ క్యాబ్స్. మహిళలే క్యాబ్ డ్రైవర్లుగా వుండడం వల్ల ఇటు ప్రయాణీకులుగా మహిళలకు భద్రత కల్పించడమే కాదు.. అటు డ్రైవర్లుగా కూడా కొందరు మహిళలకు ఉపాధి కల్పించవచ్చు. ఈ లక్ష్యంతోనే ఆర్2ఆర్ (రోజీ టు రోటీ) వెంచర్స్ మొదలైంది. ఓలా లాంటి భారీ సంస్థల నుంచి, ఏంజెల్ క్యాబ్స్ లాంటి చిన్న సంస్థల వరకు ఎంతో పోటీ వున్న క్యాబ్స్ మార్కెట్‌లోకి R2R విమెన్ క్యాబ్స్ కూడా ప్రవేశించాయి.

కస్టమర్‌తో మహిళా డ్రైవర్లు
కస్టమర్‌తో మహిళా డ్రైవర్లు
‘‘మా దగ్గర చాలా మంది మహిళా డ్రైవర్లు సమాజంలోని అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారే. అయితే, మగాళ్ళ కంటే మేమేం తీసి పోలేదని నిరూపించుకోవాలనే తపన మాత్రం వారిలో పుష్కలంగా వుంది’’ అంటారు R2R వ్యవస్థాపకుడు శైలేంద్ర సింగ్.

నేపథ్యం

పన్నెండేళ్ళు సైన్యంలో పనిచేసాక సత్యం, ఐబిఎం లాంటి కొన్ని ఐటి సంస్థల్లో కూడా పని చేసారు శైలేంద్ర. ఇలా ఏడేళ్లు కార్పొరేట్ ఉద్యోగాలు అయ్యాక, సమాజానికి ఉపయోగపడే వ్యాపారమేదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఐఐఎంలో రెండేళ్ళ కోర్స్ చేసారు శైలేంద్ర. ఈ కోర్స్ చేస్తున్న రోజుల్లోనే మహిళకి ఉపాధి కల్పించే విధంగా ఏదైనా చేయాలని ఆయన అనుకున్నారు.

సైన్యంలో పనిచేసిన అనుభవం శైలేంద్రకు సమాజహితాన్ని కోరుకోవడం నేర్పింది. అందుకే ఇటు మహిళలకు భద్రత కల్పించి, అటు మహిళలకు ఉపాధిగా కూడా మారే విమెన్ క్యాబ్స్ ఆలోచన ఆయనకు చాలా ఉత్తేజాన్ని ఇచ్చింది. విలాసాలకు లోటులేని ఆధునిక జీవితంలో కనీస భద్రతకు మాత్రం నోచుకోకపోవడమేంటని ఆయన ప్రశ్నిస్తారు. మహిళలు తలచుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరని R2R విశ్వాసం. అందుకే డ్రైవింగ్ కూడా వారికి పెద్ద కష్టం కాబోదని ఆయన నమ్మారు.

సవాళ్ళ సవారీ

విమెన్ క్యాబ్స్ ఆలోచన 2011 నవంబర్‌లోనే వచ్చినా.. దానికి పదును పెట్టి, ఆచరణలోకి తెచ్చేసరికి రెండున్నరేళ్లు పట్టింది. అలా 2014 అక్టోబర్‌లో 35 మందితో తొలి విమెన్ క్యాబ్స్ బ్యాచ్ రోడ్లపైకి వచ్చింది. డ్రైవర్లు కావాలనుకున్న వాళ్లను ఎంపిక చేయడం, డ్రైవింగ్‌లో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి క్యాబ్ డ్రైవర్లకు వుండాల్సిన మంచి, మర్యాద నేర్పడం వంటి వన్నీ ఈ రెండున్నరేళ్ళలో జరిగాయి.

దాదాపు రెండు నెలల పాటు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తారు. ఈ రెండు నెలల తర్వాత వాళ్ళు డ్రైవింగ్ వృత్తిలోకి వచ్చాక కూడా వారానికొక సారి వారికి మళ్ళీ రిఫ్రెషర్ ట్రైనింగ్ వుంటుందని శైలేంద్ర చెప్పారు. వీరిని పూర్తిస్థాయి ప్రొఫెషనల్స్ గా తయారు చేయడానికి మారుతి డ్రైవింగ్ స్కూల్‌తో పాటు మరికొందరు డ్రైవింగ్ నిపుణులు నిరంతరం కృషి చేస్తున్నారు.

ప్రయాణీకురాలితో పాటు మహిళా క్యాబ్ డ్రైవర్
ప్రయాణీకురాలితో పాటు మహిళా క్యాబ్ డ్రైవర్

క్యాబ్ డ్రైవర్ల భ్రదత కూడా ముఖ్యమే

ఈ క్యాబ్ డ్రైవర్లందరికీ డ్రైవింగ్‌తో పాటు, వెహికల్ మెయింటెనెన్స్, కస్టమర్లతో వ్యవహరించడం.. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మరక్షణలో కూడా వీరికి శిక్షణ ఇస్తారు. తమను తాము రక్షించుకోవడమే కాదు, అవసరమైతే, క్యాబ్‌లో ప్రయాణించే మహిళలను కూడా రక్షించే విధంగా ఈ డ్రైవర్లను తీర్చిదిద్దుతారు. కొందరు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఈ శిక్షణ నడుస్తోంది.

ఇటు కార్పొరేట్ , అటు రిటైల్ క్లయింట్లకు ఈ విమెన్ క్యాబ్స్ తన సేవలు అందిస్తోంది. వారమంతా కార్పొరేట్ క్లయింట్ల కోసం, వారాంతాల్లో కొందరు ఎంపిక చేసిన రిటైల్ క్లయింట్లకు తమ క్యాబ్స్‌ను నడుపుతున్నారు. ఈ క్యాబ్‌లలో జి.పి.ఎస్. సిస్టంతో పాటు అవసరమైతే, కంట్రోల్ రూమ్‌ను అలర్ట్ చేయడానికి ఒక అలార్మ్ కూడా అమర్చారు.

ఎంపిక

ఈ విమెన్ క్యాబ్స్‌లో డ్రైవర్లుగా చేరాలంటే కనీసం 21 ఏళ్ల వయసుండాలి. టెన్త్ పాస్ అయువుండాలి. ‘‘ వీళ్లంతా సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళే అయినా.. తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్న తపన వున్న వాళ్ళు. ’’ అంటారు శైలేంద్ర.

ప్రస్తుతం విమెన్ క్యాబ్స్ లో 65 మంది మహిళా డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ వివిధ స్థాయిల్లో శిక్షణ నడుస్తోంది. ఈ మధ్యే బెంగళూరులో విమెన్ క్యాబ్స్ సేవలు మొదలయ్యాయి. ప్రస్తుతం 5 క్యాబ్లు నడుస్తుండగా, జూన్ 2015 నాటికి వీటి సంఖ్య 25 కి పెంచాలని ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఆరునెలల్లో మరో రెండు మూడు నగరాల్లో 80 నుంచి వంద వరకు క్యాబ్స్ నడపాలని విమెన్ క్యాబ్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.