వంద రోజుల్లో వంద ఊళ్లను నగదు రహిత గ్రామాలుగా మారుస్తాం..

అకోదర గ్రామ స్ఫూర్తితో మరో అడుగు వేసిన ఐసీఐసీఐ బ్యాంక్

వంద రోజుల్లో వంద ఊళ్లను నగదు రహిత గ్రామాలుగా మారుస్తాం..

Tuesday November 29, 2016,

2 min Read

గుజరాత్ రాష్ట్రం అకోదర గ్రామం గురించి తెలుసుగా..? దేశమంతా చిల్లర కోసం నానా తంటాలు పడుతుంటే- ఆ ఊరి ప్రజలు అసలు నోట్ల రద్దు గురించే పట్టించుకోలేదు. వాళ్లకు చిల్లర అసరమూ రాలేదు. నోట్లు మార్పిడి హైరానా పడలేదు. ఎందుకంటే ఆ ఊరు వందశాతం డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాం పై సగర్వంగా నిలబడింది. పోపు గింజల నుంచి పాల ప్యాకెట్ మీదుగా కరెంటు బిల్లుల దాకా అన్నీ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్సే. ఐసీఐసీఐ బ్యాంకు దత్తత తీసుకున్న ఆ గ్రామం ఇప్పుడు దేశానికే ఆదర్శం.

ఇప్పుడదే ఐసీఐసీఐ బ్యాంక్ అకోదర గ్రామ స్ఫూర్తితో మరో వంద గ్రామాలను దత్తత తీసుకోబోతున్నది. నూరు రోజుల్లో నూరూళ్లను డిజిటల్ హైవేపైకి ఎక్కించి పరుగులు తీయించాలన్నది బ్యాంకు సంకల్పం. డిజిటల్ ఇకో సిస్టమ్ దేశవ్యాప్తం కావాడానికి ఇదొక మంచి నిర్ణయమని బ్యాంకు భావిస్తోంది. ఆధార్ కార్డుల ద్వారా అకౌంట్లు తెరిచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ పేమెంట్లు చేసేలా ప్రోత్సహించడమే తమ లక్ష్యమని బ్యాంకు అంటోంది. రిటైల్ స్టోర్లకు కూడా మొబైల్ ట్రాన్సక్షన్ రూపంలో సొల్యూషన్ చూపించాలని చూస్తోంది.

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఐసీఐసీఐ గ్రూపు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా 10వేల మంది మహిళలను ఎంచుకుని.. వారు ఆర్ధిక స్వావలంబన సాధించే దిశగా పలు శిక్షణా కార్యక్రమాలు కండక్ట్ చేస్తోంది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. వాళ్లకు రుణ సదుపాయం కూడా ఇస్తోంది.

image


వేగంగా పరుగులు పెడుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థకు ఐసీఐసీ బ్యాంక్ ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తోంది. ఈ అభివృద్ధిలో టెక్నాలజీ ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ సాంకేతిక సామర్ధ్యాన్ని నమ్ముకునే మేం గుజరాత్ రాష్ట్రంలోని అకోదర గ్రామాన్ని దేశంలోనే తొలి డిజిటల్ గ్రామంగా ఈ- పేమెంట్ అనే పునాదిపై నిలబెట్టగలిగాం-చందా కొచ్చార్, ఎండీ, సీఈవో, ఐసీఐసీఐ బ్యాంక్.

ఈ నిర్ణయం బ్యాంకుల స్కేల్ పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుందని చందా కొచ్చార్ అభిప్రాయ పడ్డారు. 10వేల మందికి శిక్షణ ఇచ్చి వంద రోజుల్లో వంద గ్రామాలను డిజిటల్ గ్రామాలుగా మార్చడానికి మేం తీసుకున్న నిర్ణయం ప్రధాని మోడీ కలలుగంటున్న డిజిటల్ ఇండియా ప్రాజెక్టుకు ఎంతగానో దోహదం చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

టాబ్లెట్ సాయంతో కొద్ది గంటల్లోనే ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఆధార్ కార్డు అనుసంధానించి గ్రామాల్లో అకౌంట్స్ తెరిపిస్తామని చందా కొచ్చార్ తెలిపారు. ప్రతీ గ్రామంలో ప్రత్యేకంగా బ్రాంచీ ఓపెన్ చేసి ఏటీఎంను అందుబాటులోకి తెస్తామంటున్నారు. తద్వరా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ బెనిఫిట్ వారి అకౌంట్లోకి డైరెక్టుగా ట్రాన్స్ ఫర్ అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఐసీఐసీఐ అకాడెమీ ఫర్ స్కిల్స్-రూరల్ ఇన్షియేటివ్ అనే కార్యక్రమం కింద 100 గ్రామాల్లో ఐసీఐసీఐ ఫౌండేషన్ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించబోతోంది. ఈ ట్రైనింగ్ ప్రత్యేకంగా మహిళల కోసమే ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా 18 నుంచి 40 ఏళ్లున్న మహిళలను ఎంపిక చేసుకుని, లోకల్ ఎకానమీకి సరిపోయేలా వారికి ఆర్ధికంగా చేయూతనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.