ఇచ్చట అన్నిరకాల పనులు చేసి పెట్టబడును!

వడపావ్ డెలివరీ నుంచి.. టెలిఫోన్ బిల్లుల చెల్లింపుల వరకు..అన్ని రకాల పనులు చేసిపెడ్తున్న గెట్ మై ప్యూన్

ఇచ్చట అన్నిరకాల పనులు చేసి పెట్టబడును!

Tuesday August 18, 2015,

3 min Read

కాలం గ్లోబల్ గుర్రాలెక్కి పరుగులు పెడతోంది. మనిషి దైనందిన జీవితం ఉరుకుల పరుగుల మయమైంది. పట్టుమని పదినిమిషాలు లీజర్‌గా గడపలేక పోతున్నాడు. ఎంత బిజీ అయ్యారంటే-కనీసం పచారీ సరుకులు కూడా తెచ్చుకోలేనంత బిజీ అయ్యాడు. ఇక ఇంటిపని సరేసరి. మన లైఫ్ స్టయిల్ చూసి రిలెటివ్స్ కూడా మొహం చాటేస్తున్నారు. 

ఇలా అయితే ఎలా? మన పనులు మనం చేసుకోకపోతే ఎలా? ఎవరు చేసి పెడతారు? తాతచుట్టం ఎవరైనా ఉన్నారా? ఇదిగో.. ఇక్కడే మీరడిగిన ఆన్సర్ ఉంది. చుట్టం కాదుగానీ- చుట్టం లాంటిదే. దానిపేరు గెట్ మై వ్యూన్‌. ముంబై బేస్డ్‌ సంస్థ. వడపావ్ డెలివరీ నుంచి ఎయిర్ పోర్టులో గెస్టుని రిసీవ్ చేసుకునే వరకు. అన్ని పనులూ చేసి పెడుతుంది.

ఈ రోజుల్లో బిజీగా లేనిది ఎవరు? అందరికీ అన్ని పనులు. ఆఫీస్ పని సరే. మరి ఇంటి పని, బయటపని ఎవరు చూడాలి? సరిగ్గా అలాంటి వారికోసమే ఈ కాన్సెప్టు. బిజీగా ఉన్నవారందరికీ పెయిడ్ స‌ర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో గెట్‌మైప్యూన్‌ సంస్థ ఆవిర్భవించింది. ఎలాంటి సేవలనైనా సేమ్ డే డెలివరీ అందిస్తున్నదీ సంస్థ. ప్రొఫెషనల్ ఉద్యోగులతో పనిచేస్తున్న గెట్‌మై ప్యూన్.. చక్కటి, అన్ని రకాల సేవలను ఆఫర్ చేస్తున్నది.

ఎలాంటి ప‌నిచేసేందుకైనా సిద్ధం: గెట్ మై ప్యూన్ వ్య‌వ‌స్థాప‌కుడు భ‌ర‌త్‌

ఎలాంటి ప‌నిచేసేందుకైనా సిద్ధం: గెట్ మై ప్యూన్ వ్య‌వ‌స్థాప‌కుడు భ‌ర‌త్‌


గెట్‌మైప్యూన్ ప్రారంభమై మూడేళ్లు దాటింది. ‘గెట్‌ థింగ్స్ డన్’ అనేది వారి ట్యాగ్‌లైన్. ముంబైలోని ఓ ఫుడ్‌స్టోర్ నుంచి వడాపావ్‌ను తీసుకురావ‌డం నుంచి ఎయిర్‌పోర్టులో క్లయింట్‌ను రిసీవ్ చేసుకోవడం, క్లయింట్ తరఫున వారి బంధువులను ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనులను చేస్తున్నది సంస్థ. ప్రతి ఒక్కరి దైనందిన జీవితాల్లో అవసరమయ్యే సేవలను అందిస్తున్నది గెట్‌ మై ప్యూన్.

2012లో సంస్థ ప్రారంభమైనప్పటికీ ఇటీవలే ఈ సంస్థకు కోటిన్న‌ర సీడ్ ఫండ్ లభించింది. ఈ సంస్థ గురించి గెట్ మై ప్యూన్ సీఈవో భరత్ అహిర్‌వార్ ఇలా చెప్తారు...

‘‘చిన్నచిన్న పనులు చేసుకోలేని వ్యక్తులకు సాయం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించాం. అందరికీ అందుబాటులో ఉండే సర్వీస్‌గా మారింది. పర్సనల్ నుంచి ఆఫీస్ వర్క్ వరకు ఎలాంటి పనులనైనా చేసి పెడ్తాం. కేక్స్, పార్సిల్స్, గిఫ్ట్స్, వెడ్డింగ్ కార్డ్స్, కొరియర్స్, లేదా సర్వీసింగ్ సెంటర్ నుంచి కార్/బైక్‌ను తీసుకోవడం, పని ఏదైనా కావొచ్చు. చేసేందుకు మేం సిద్ధం. అన్ని రకాల సేవలను అందిస్తున్నాం. ఇప్పుడిప్పుడే వస్తున్న ఫండ్స్ సంస్థ మరింత బాగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి’’ అని భరత్‌ చెప్తున్నారు.

పెట్టుబడిదారుల నుంచి వచ్చిన నిధులతో సంస్థ మౌలిక వసతులను మెరుగుపర్చనున్నారు. టెక్నాలజీ, వాహనాలు కొనుగోలు చేయడం, మరింత మంది సిబ్బందిని నియమించుకోవడంతోపాటు మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. అలాగే ఇతర నగరాలకు సైతం సేవ‌ల‌ను విస్తరించాలనుకుంటున్నారు.

గెట్ మై ప్యూన్ వ్య‌వ‌స్థాప‌కుడు భ‌ర‌త్‌

గెట్ మై ప్యూన్ వ్య‌వ‌స్థాప‌కుడు భ‌ర‌త్‌


20 వేల పెట్టుబడితో..

గెట్‌ మై ప్యూన్‌ది ఆసక్తికర స్టోరీ. 2012లో ప్రారంభైనప్పటి నుంచి ఇప్పటివరకు 35 వేల పనులను విజయవంతంగా పూర్తి చేయగలిగింది. అలాగే ముంబై, థానే, వశీ నగరాల్లో 15 వేల మందికి సేవలందించింది. ఈ సంస్థకు ప్రస్తుతం 60 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ప్రతిరోజు 150 నుంచి 200 వరకు పనులను చేసి పెడుతున్నది. ఒక్క పనిచేసేందుకు రూ.200 నుంచి రూ. 1500 వరకూ వసూలు చేస్తున్నది. 2012లో కేవలం ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీల్లో మాత్రమే ప్రచారం చేసేవారు. తర్వాత 2013లో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో 4500 మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. సంస్థను మొదట్లో కేవలం రూ.20 వేలతో ఆరంభించారు. క్లయింట్స్ పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతూ వస్తున్నది. ఇప్పుడు పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తుండటంతో ఇన్‌కమ్‌ బాగా పెరిగింది.

క్లయింట్ల అవసరాలను దృష్టిలోపెట్టుకుని అత్యుత్తమ సేవ‌ల‌ను గెట్ మై ప్యూన్ అందిస్తున్నది. పిక్ అప్ అండ్ డ్రాప్ వెడ్డింగ్ ఇన్వైట్స్, అద్దెకు సిబ్బంది, రిపేర్స్, ఎయిర్‌పోర్టు నుంచి అతిథులను రిసీవ్ చేసుకోవడం, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు చెల్లించడం వంటి సేవలు అందిస్తున్నదీ సంస్థ. ఫోన్ కాల్స్, ఈమెయిల్ ద్వారాలనే కాకుండా వాట్సప్ యాప్ మొబైల్ మెసెంజర్, ట్విట్టర్ ట్వీట్స్ ద్వారా ఆర్డర్లను స్వీకరిస్తున్నది.

విస్తరణ వ్యూహం..

ప్రస్తుతానికైతే ఈ రంగంలో నేరుగా ఎలాంటి పోటీ లేదు. టైమ్ సేవర్స్, గ్రోఫెర్స్ వంటి సంస్థలు కొన్ని పనులు చేస్తున్నప్పటికీ గెట్ మై ఫ్యూన్‌కు ప్రస్తుతం ఎదురు లేదు. ఈ రంగంలో ఇతరుల నుంచి పోటీపై భరత్ ఇలా చెప్తారు.

‘‘ గెట్ మై ప్యూన్ మిగతా సంస్థల కంటే విభిన్నం. శిక్షణ పొందిన, గుర్తింపు కలిగిన సిబ్బంది ఉన్నారు. ఒప్పుకున్న పనులను 90 నిమిషాల్లో పూర్తి చేయడమే మా లక్ష్యం. క్లయింట్స్ అవసరాలకు తగ్గట్టుగా మమ్మల్ని మేం మార్చుకుంటాం. క్లయింట్ల వ్యక్తిగత, ప్రొఫెషనల్ పనేదైనా, నగరంలో ఎక్కడైనా పూర్తి చేసేందుకు మేం సిద్ధం’’ అని ఆయన వివరించారు.


గెట్‌మైప్యూన్ వెబ్‌సైట్ హోంపేజ్‌

గెట్‌మైప్యూన్ వెబ్‌సైట్ హోంపేజ్‌


సంస్థ భవిష్యత్ ప్రణాళికలు కూడా చాలానే ఉన్నాయి. త్వరలోనే గెట్ మై ప్యూన్ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. పూణె, బెంగళూరు, ఢిల్లీలో కూడా వీరి సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరికల్లా అంతర్జాతీయ నగరాల్లో కూడా సంస్థను విస్తరించాలని భరత్ భావిస్తున్నారు.

వెబ్‌సైట్: www.getmypeon.com