మనసున్న ట్రాఫిక్ ఎస్సై నాగమల్లు

0

ఎంతసేపూ పోలీసులంటే కాఠిన్యం, కరకుదనమే అనే మాటలే వినిపిస్తాయి. కానీ వాళ్ల గుండెలు కూడా సుతిమెత్తగా ఉంటాయని, వాళ్ల మనసు కూడా మానవత్వంతో పరిమళిస్తుందని రుజువైంది. ఎల్బీ నగర్ రింగురోడ్డు దగ్గర ఓ ట్రాఫిక్ ఎస్సై చేసిన సాయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్న హెల్పే అయినా ఎందరికో స్ఫూర్తి నింపింది. ఎస్సై నాగమల్లు తనకు ఎదురైన సంఘటనను ఫేస్ బుక్ లో ఇలా రాసుకున్నారు.

డియర్ ఫ్రెండ్స్! ఎల్బీనగర్ రింగ్ రోడ్డు దగ్గర నాకు నైట్ డ్యూటీ పడింది. అప్పుడు సమయం రాత్రి పది అవతోంది. అక్కడొక బాలుడు ఏడుస్తూ దీనంగా తిరుగుతూ కనిపించాడు. సుమారు పదకొండేళ్లుంటాయి. ఏమైంది బాబు అని అడిగాను. మా అమ్మమ్మ వాళ్లు హైదరాబాదులో ఉంటున్నారని వచ్చాను కానీ, వాళ్లు వేరే ఊరు వెళ్లారని తెలిసింది అన్నాడు. నీపేరు ఏంటని అడిగాను. నాని అని చెప్పాడు. చిన్నప్పుడే అమ్మ బావిలో పడి చనిపోయిందన్నాడు. నాన్న తాగుడుకు బానిసై కన్నుమూశాడని చెప్పాడు. వినుకొండ అనాధాశ్రమంలో ఉంటూ 6వ తరగతి చదువుతున్నా అని తెలిపాడు. ఎక్కడ బస్ ఎక్కాలో అర్థం కావట్లేదని గోడుగోడున ఏడుస్తున్నాడు. సరేగానీ నీ దగ్గర చార్జీకి డబ్బులు న్నాయా అని అడిగాను. 320 రూపాయలు ఉన్నాయి సర్ అన్నాడు. వినుకొండకు వెళ్లాలంటే రూ. 210 అవుతాయి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఏమైనా తింటే డబ్బులు అయిపోతాయని వెక్కివెక్కి ఏడ్చాడు. దగ్గరికి తీసుకుని ఓదార్చాను. ముందు పిల్లాడి ఆకలి తీర్చాలని అనుకున్నాను. పక్కన కూర్చోబోట్టుకుని అన్నం తినిపించాను. డబ్బులు కావాలా బాబూ అంటే, వద్దు సర్ అన్నాడు. అతడిలో నిజాయితీ నచ్చింది. దగ్గర్లో ఉన్న ఏటీఎంకి వెళ్లి 2000 డ్రా చేసి ఇచ్చాను. పుస్తకాలు, ఒక డ్రెస్ కొనుక్కోమని చెప్పాను. సాగర్ రింగురోడ్డు దగ్గరికి తీసుకెళ్లి వినుకొండ బస్ ఎక్కించాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయమని నంబర్ ఇచ్చాను. కళ్లలో నీటి సుడులు తిరుగుతుండగా బస్సులోంచి టాటా చెప్పి వెళ్లిపోయాడు. మనం చేసేది చిన్న సాయమే కావొచ్చు. కానీ, అది ఆపదలో ఉన్నవాళ్లకు కొండంత ధైర్యాన్నిస్తుంది.