క్షయ వ్యాధి పట్ల జనంలో అవగాహన తెస్తున్న రిటైర్డ్ డాక్టర్  

0

టీబీ(ట్యూబర్క్యూలోసిస్). క్షయ అని కూడా అంటారు. ఇదొక అంటువ్యాధి. దీర్ఘకాలిక రోగాల్లో ఇదొకటి. ఎడతెరపిలేని దగ్గు దీని ముఖ్యలక్షణం. ఊపిరితిత్తులు మొదలుకొని మెదడు వరకు ఏ భాగానికైనా ఇది సోకుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ దగ్గర్నుంచి బిగ్ బీ అమితాబ్ వరకు ఎంతో మంది టీబీ బారిన పడ్డారు. ఈ మహమ్మారి దేశంలో అతిప్రమాదకర వ్యాధిగా పరిణమించింది. 2014 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 9.6 మిలియన్ మంది ప్రజలు క్షయ వ్యాధితో బాధపడుతున్నారు.

ఇప్పటికీ దేశంలో టీబీపై చాలామందికి సరైన అవగాహన లేదు. ఫలితంగా మంచానపడి ఎందరో తనువు చాలిస్తున్నారు. అలాంటి వారికోసం నడుం కట్టాడు డాక్టర్ లలిత్ కుమార్. ముంబైలోని సెవ్రీ టీబీ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసరుగా పదవీ విరమణ చేసిన లలిత్ కుమార్.. క్షయ మహమ్మారి బారినుంచి జనాన్ని బయటపడేసేలా, చేతనైన సాయం చేస్తున్నాడు. గత నాలుగేళ్లుగా సుమారు లక్షమందికి ఈ వ్యాధిపై అవగాహన కల్పంచడంలో సక్సెస్ అయ్యారు. ముంబైలె వీధి వీధి కలియతిరుగుతూ టీబీ గురించి, దానికి తీసుకోవాల్సిన చికిత్స గురించి, రాకుండా అరికట్టాల్సిన చర్యలు గురించీ చెప్తుంటారు.

ఎక్కడ నలుగురు వ్యక్తలు గుంపుగా కనిపించినా వారి దగ్గర వాలిపోతరు లలిత్ కుమార్. ఇలా వెళ్లి, అకస్మాత్తుగా టీబీ గురించి చెప్తే ఏమనుకుంటారో అని నామూషీ పడరు. నిస్సంకోచంగా వాళ్లకు అర్ధమయ్యేలా వివరిస్తారు. బస్సులు, రైళ్లు, ఇలా జనం సంచారం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. వ్యాధి గురించి చిన్నపాటి ప్రజెంటేషన్ ఇస్తారు. కారణాలు, నివారణ మార్గాలు కూలంకషంగా చెప్తారు. ఎవరైనా అదే పనిగా దగ్గినట్టు కనిపిస్తే చాలు, వారి దగ్గరికి వెళ్లి జాగ్రత్తలు చెప్తారు.

సెవ్రి టీబీ ఆసుపత్రిలో డాక్టర్ లలిత్ కుమార్ 27 ఏళ్లపాటు పనిచేశారు. రిటైర్డ్ అయిన తర్వాత ఈ గోలంతా నాకెందుకులే అని విశ్రాంతి తీసుకోలేదు. అలా చేస్తే అన్నేళ్ల కెరీర్ శుద్ధ దండుగ అని భావించారు. టీబీ గురించి జనంలో సంపూర్ణ అవగాహన తేవాలనే ఉద్దేశంతో 2013 నుంచి ముంబై మొత్తం రెక్కలు గట్టుకుని తిరుగుతున్నారు. సిగ్నల్ పడిదంటే చాలు, కారుదిగి, కనీసం నాలుగైదు వాహనాల దగ్గరికి వెళ్లి, టీబీ గురించి చెప్పందే అతని మనసు ఒప్పుకోదు.

రెసిడెన్షియల్ సొసైటీలు, కాలేజీలు, స్కూళ్లు.. ఇలా లలిత్ కుమార్ అడుగు పెట్టని చోటు లేదు. ఏదో చెప్తున్నాడులే చాదస్తం అని ఎవరూ అనుకోరు. అందరూ శ్రద్ధగా వింటారు. ఎందుకంటే డాక్టర్ కదా. ఆయన చేసే సమాజ సేవను అందరూ గౌరవిస్తారు. ముంబై వ్యాప్తంగా కనీసం కోటిన్నర మందికైనా క్షయ వ్యాధి అంటే ఏంటో క్షుణ్ణంగా తెలియాలనేది డాక్టర్ లలిత్ కుమార్ లక్ష్యం.   

Related Stories