కోటి ఆర్డర్ల “గోఆనియన్స్”

ఈరోజుల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు..! మనకు కావలసిన వస్తువులను.. ఉన్నచోటు నుంచే ఆన్ లైన్ లో బుక్ చేసి తెప్పించుకోగలుగుతున్నాము. అదేవిధంగా.. మనం రోజువారీ వినియోగించే తాజా కాయగూరలు, పళ్ళు మాంసం లాంటి పదార్థాలను కూడా ఆన్ లైన్ లో బుక్ చేసి తెప్పించుకోగలిగితే ఎంత బావుంటుంది. ఎప్పుడో ఓసారైనా ప్రతివారికీ ఇలా అనిపించక మానదు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో నివసించే వారు.. ఈరకమైన బిగ్ బాస్కెట్, లోకల్ బన్వా లాంటి సేవలను వినియోగించుకుంటున్నా... గుర్గావ్ ప్రాంతంలో మాత్రం అలాంటి సేవలు అందుబాటులో ఉండేవి కావు. ఇక ఇప్పుడు గుర్గావ్ వాసులకు ఆ చింత తీరిపోయింది.

0

గోఆనియన్స్ స్టార్టప్ ద్వారా.. గుర్గావ్ వాసులు తమకు కావలసిన రకరకాల పండ్లు, కాయగూరలు, చికెన్, చేపలు, రొయ్యలు, మాంసం మొదలైన ఆహారపదార్థాలను ఫోన్, వెబ్, ట్విట్టర్, వాట్సాప్ ల ద్వారా బుక్ చేసి తెప్పించుకునే సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది. లోకల్ బన్యా, బిగ్ బాస్కెట్ ల మాదిరిగా కాకుండా, మనేసార్, సోనా, ఫరీదాబాద్ సహా... గుర్గావ్ లోని ఎక్కడికైనా రెండంటే రెండు గంటల్లో అన్ని రకాల ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది... గోఆనియన్స్..! “గుర్గావ్ నగరవాసుల సమయాభావాన్ని.. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని గో ఆనియన్స్ ఆలోచన పురుడు పోసుకుంది” అంటారు.. రాఘవ్.

గో ఆనియన్స్.. అన్నది రాఘవ్ వోరా, కైలాశ్ త్రిపాఠి, శివాని కపూర్ ల మానసిక పుత్రిక. ప్రతిరోజూ.. ఉద్యోగాలు, వ్యాపారాల్లో సతమతమై పోతూ.. నిత్యావసర కూరగాయలు, పళ్ళు, మాంసం తదితరాలను కొనుగోలు చేసేంతటి సమయం లేక.. గుర్గావ్ వాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ మిత్రత్రయం గోఆనియన్స్ కు రూపమిచ్చారు.

సివిల్ ఇంజనీరింగ్ నుంచి రిటైల్ వైపు

రాఘవ్, కైలాశ్ త్రిపాఠిలు ఇద్దరూ సివిల్ ఇంజనీర్లు. సివిల్ ఇంజనీరింగ్ అప్లికేషన్ల వ్యాపారాభివృద్ధి, అమ్మకాల్లో సుమారు ఆరు సంవత్సరాల అనుభవం ఉంది. శివానికపూర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి.. వ్యాపార నైపుణ్యాల అభివృద్ధిలో దశాబ్దం పాటు కొనసాగారు. గతంలో ఈమెకు ఆన్ లైన్ మీడియాను నిర్వహించిన అనుభవమూ ఉంది.

మూడు నెలల క్రితమే ప్రారంభమైన ఈ గోఆనియన్స్ ప్రయోగం.. వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. “మేము ప్రతిరోజూ.. సగటున ఒక్కోటి రూ. 750 విలువ చేసే.. కనీసం 35 ఆర్డర్లను వినియోగదారులకు చేర్చగలుగుతున్నాము ప్రస్తుతం గోఆనియన్స్ సగటున ప్రతి నెలా రూ5 లక్షల రూపాయల ఆదాయాన్ని సముపార్జిస్తోంది. మా వద్ద సుమారు మూడు వేల మంది దాకా వినియోగదారులున్నారు. ఇందులో కనీసం 50 శాతం మంది ప్రతినెలా మాకు లాభసాటి ఆర్డర్లను ఇస్తుంటారు” అని శివాని చెప్పారు.

“ ఆన్ లైన్ లో ఆర్డర్ చేసే నిత్యావసరాల తాజాతనం, నాణ్యతల విషయంలో వినియోగదారులకు ఎన్నో అనుమానాలు ఉంటాయి. వాటిని తొలగించడం గోఆనియన్స్ కి పెద్ద సవాలే. వీటితో పాటు.. పదార్థాల నాణ్యతను పాటించడం, కచ్చితమైన సమయానికి సరుకులు అందజేయడం, సరైన మానవ వనరులను గుర్తించడం లాంటి ప్రాథమిక సవాళ్ళూ ఉన్నాయి” అని అంటారు రాఘవ్.

“గోఆనియన్స్ త్వరలోనే లాభాల బాట పట్టనుంది. భౌగోళికంగాను, ఉత్పత్తుల స్థాయి పరంగాను ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఈ మిత్రత్రయం భావిస్తోంది. గోఆనియన్స్ సంస్థ.. పర్యావరణానికి చేటు రాకూడదని గట్టిగా నమ్ముతోంది. అందుకే.. మా బృందం సభ్యులంతా.. ‘ఈ_బైక్స్’ నే వాడుతూ.. కాలుష్య రహిత, ఆరోగ్యకర పర్యావరణ పరిరక్షణకు కృత నిశ్చయులమై ఉన్నాము” అని వివరించారు రాఘవ్. ఉదయం ఏడుగంటల నుంచి రాత్రి పది గంటల లోపు... నాలుగు నిర్దిష్ట సమయాల్లో మా సభ్యులు ఆర్డర్లను వినియోగదారులకు చేరుస్తుంటారు. దీనికోసం మా బృందంలో.. సంస్థ ప్రతినిధులతో పాటు.. బయటి వారి సేవలనూ వినియోగించుకుంటున్నాము. మొత్తం రవాణాలో మా సంస్థ ప్రతినిధులు 30శాతం మేర, మిగిలిన 70శాతాన్ని బయటి వ్యక్తుల సేవలను వినియోగించుకుంటున్నాము. అని రాఘవ వెల్లడించారు. గుర్గావ్ మొత్తంగా.. మా సంస్థ తన విధివిధానాలు, విశిష్టమైన ప్రచార ప్రణాళికల ద్వారా ఓ సంచలనాన్ని సృష్టించిందనే చెప్పాలి. రూపాయికే కిలో ఉల్లి లాంటి పథకాలు సంస్థకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఈ పథకాన్ని మేము 2014 జనవరి 27 నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు నిర్వహించాము. కేవలం ఆరు రోజుల వ్యవధిలో మేము ఏడు వేల కిలోలకు పైగా ఉల్లిపాయలను పంపిణీ చేశాము. ఈ పథకం కింద సుమారు రెండు వేల మంది దాకా వినియోగదారులు మా వద్ద రిజిస్టర్ చేసుకున్నారు. అంటారు శివాని.

గోఆనియన్స్ ను వచ్చే ఆరు నెలల కాలంలో ఢిల్లీ అంతటా విస్తరించాలని, ఆతర్వాత, దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు వ్యాప్తి చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గోఆనియన్స్ మంచి ఫలితాలనే ఇస్తోంది. అయితే దీన్ని సక్రమంగా నడిపేందుకు, భారీగా విస్తరించేందుకు.. నిర్దిష్టమైన సాంకేతికతను సమకూర్చుకునేందుకు.. మరిన్ని పెట్టుబడులు అవసరం. పైగా, గోఆనియన్స్ తరహా వ్యాపారం ప్రారంభం కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో.. ఐబిఐబిఓ సంస్థ సీఈఓ ఆశిష్ కశ్యప్ గారి శ్రీమతి అనితాకశ్యప్ ఫుడ్ మండి ని ప్రారంభించారు. అయితే.. ఆ ప్రయత్నం ఆరు నెలలలోపే మూలపడింది. దానికి బిన్నంగా... గోఆనియన్స్ విజయపథాన దూసుకు పోతోంది.