ఈ-కామర్స్‌లో పదేళ్లుగా 'బజావో' హోరు

బజావో నడపడం భలే మజా అంటున్న అశుతోష్ పాండేపదేళ్లుగా సత్తా చాటుతున్న ఈకామర్స్ వెంచర్ బజావోమ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ విక్రయాల్లో అతి పెద్ద పోర్టల్తొలి ఆర్డర్ దగ్గరే ఎదురు దెబ్బ తిన్నా కోలుకున్న బజావోబ్రాండ్‌లతో కీలక ఒప్పందాల చేసుకున్న బజావో

ఈ-కామర్స్‌లో పదేళ్లుగా 'బజావో' హోరు

Thursday June 04, 2015,

5 min Read

దేశంలోనే అతి పెద్ద ఈకామర్స్ డీల్స్‌లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్, మింత్ర ఒప్పందం ఈ మధ్యనే కుదిరింది. మార్కెట్ అంచనాల ప్రకారం దీని విలువ అక్షరాలా రూ. 2వేల కోట్లకు పైగానే. 2005లో మొదలైన ఫ్లిప్‌కార్ట్‌ కంటే ముందే లాంఛ్ అయ్యి... ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న ఇలాంటి మరో ఈకామర్స్ కంపెనీ గురించే ఈ స్టోరీ. అతి చిన్న కంపెనీగా మొదలైన బజావో డాట్ కామ్ నెమ్మదిగా, నిమ్మళంగా వృద్ధి సాధిస్తూనే ఉంది.

అశుతోష్ పాండే, బజావో వ్యవస్థాపకులు

అశుతోష్ పాండే, బజావో వ్యవస్థాపకులు


26 ఏళ్ల వయసులో www.bajaao.comని ప్రారంభించారు అశుతోష్ పాండే. ప్రస్తుతం మన దేశంలో సంగీత సామాగ్రి విక్రయించే అతి పాతదైన, పెద్దదైన పోర్టల్ ఇదే. కంపెనీ ఇచ్చే సమాచారం ప్రకారం ఇందులో 12వేలకు పైగా ఉత్పత్తులు లిస్టింగ్ కాగా... ప్రతీ నెలా 15వేలకు పైగా ఆర్డర్లను ప్రాసెస్ చేస్తున్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి సీడ్ కేపిటల్‌గా రూ. 2.5లక్షలు సేకరించి ఈ కంపెనీని ప్రారంభించిన అశుతోష్... గతేడాది రూ. 13 కోట్ల టర్నోవర్ సాధించారు. ఈ కామర్స్ రంగంపై ముందుగానే అంచనా వేసి సక్సెస్ సాధించిన వ్యక్తి అశుతోష్ పాండే.

మ్యూజిక్ ఎందుకు ?

బజావో స్టార్టప్‌కు ముందు లండన్‌లోని ఓ పబ్లిషింగ్ హౌస్‌లో పని చేశారు అశుతోష్. కాలేజ్ సమయంలో ఓ బ్యాండ్‌కు ఈయన గిటార్ ప్లేయర్. స్నేహితులతో కలిసి క్సెనాన్, గ్రూవ్ ల్యాబ్ అనే బ్యాండ్‌లను నిర్వహించారు కూడా. “మేం అప్పట్లో దేశం మొత్తం తిరిగాం. అప్పటి మా బ్యాండ్‌లోని కొందరు మెంబర్స్... ఇప్పుడు దేశంలోని ప్రముఖ బ్యాండ్స్‌లో పని చేస్తున్నారు. నేను ఇప్పటికీ నా బెడ్‌రూమ్‌లో గిటార్ ప్లే చేస్తుంటాను” అంటూ నవ్వేశారాయన. మ్యూజిక్‌పై తనకున్న ప్యాషన్‌ను ఓ వెంచర్ ప్రారంభించానికి ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు అశుతోష్.

అశుతోష్ వెంచర్ ప్రారంభించిన కొన్నాళ్లకే మూత పడే పరిస్థితి వచ్చింది. వచ్చిన తొలి ఆర్డర్ విలువ రూ.80వేలు. అయితే అది క్రెడిట్ కార్డ్ మోసమని తెలిసి హతాశుడయ్యారు అశుతోష్. “అదో పీడకల లాంటిది. మాకు బ్యాంక్ నుంచి ఆ మొత్తం కట్టాలని ఫోన్ వచ్చాక కానీ... అది ఫ్రాడ్ అని తెలియలేదు ”అని గుర్తుచేసుకున్నారు అశుతోష్. ఈ ఆర్డర్‌కు సప్లై చేసేందుకు ఓ సప్లయర్ దగ్గర నుంచి ఎక్విప్‌మెంట్‌ను అప్పుగా తెచ్చారు అశుతోష్. జరిగిన మోసం గురించి అతనికి వివరిస్తే... మోసగాళ్ల పని పట్టాలని ప్రోత్సహించారు ఆ సప్లయర్.

image


మోసానికి పాల్పడ్డవారిని వెతికి పట్టుకున్నారు అశుతోష్. తాను సప్లై చేసిన మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ స్వాధీనం చేసుకుని.. పోలీస్ కేస్ బుక్ చేశారు. ఈ కేసును సాల్వ్ చేయడంలో అశుతోష్ చూపిన చొరవకు పోలీసుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఐటీ రంగంలో అశుతోష్‌కు ఉన్న పరిజ్ఞానం... క్రెడిట్ కార్డ్ మోసగాళ్లను పట్టుకోవడానికి ఉపయోగపడింది. నిజానికి ఇదే అతన్ని ఈకామర్స్‌లో ప్రవేశించేందుకు ప్రోత్సహించింది కూడా.


బజావో ప్రారంభం ఇలా

2005లో బజావో.కాం ప్రారంభమైంది. ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాల్లో వ్యాపారానికి అపార అవకాశాలున్నాయని గుర్తించారు అశుతోష్. మెట్రో నగరాల్లో ఈ తరహా ఎక్విప్‌మెంట్ కొనేందుకు చాలా అవకాశాలుంటాయి. అందుకే తర్వాతి స్థాయి నగరాలు ఎంచుకోవాల్సి వచ్చింది. “ కొన్నిసార్లు ప్రీ-సేల్ పీరియడ్ 6నెలలకు మించిపోయేది. అనుమానాలు తీర్చుకుని కొనుగోలుపై కస్టమర్లు నిర్ణయించుకోడానికి బాగా లేట్ అయ్యేది” అంటారాయన. అప్పట్లో బజావో.కాంలో కొనుగోలు చేయడమే వారికి తొలి ఈకామర్స్ అనుభవం. అందుకే వారికి దీనిపై అవగాహన కల్పించి, ధైర్యం చెప్పి, ట్రాన్సాక్షన్ పూర్తి చేయాల్సి వచ్చేది.

“ఆన్‌లైన్‌లో ఎప్పుడూ టూత్‌పిక్ కూడా కొనని వారితో... మా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయించాల్సి వచ్చేది. దీంతో ఈ ప్రాసెస్ చాలా ఆలస్యమయ్యేది” అంటారు అశుతోష్. బజావో సైట్‌లో సగటు లావాదేవీ విలువ రూ. 8వేలు. ఆర్డర్లలో చాలావరకూ కాన్పూర్, మిజోరం వంటి నగరాల నుంచే వచ్చేవి. ఆన్‌లైన్ విక్రయాల ఫ్యూచర్‌పై విపరీతమైన నమ్మకం ఉండడంతో... ఆఫ్‌లైన్ రీటైల్ విభాగం జోలికి కూడా వెళ్లలేదు బజావో.

“దేశం మొత్తం మీద అప్పట్లో 150మంది ఆఫ్‌లైన్ రీటైలర్లు ఉండేవారంతే. అలాంటిది మేం దేశవ్యాప్తంగా 2500 పట్టణాలకు సరఫరా చేయగలుగుతాం. పెద్ద నగరాల్లో పెద్ద ఆఫ్‌లైన్ స్టోర్లు బాగానే ఉండేవి. చిన్న సిటీల్లో ఇలాంటివి అసలు కనిపించవు కూడా. ఐజ్వాల్ లాంటి ఓ సిటీ నుంచి రూ.10 లక్షల వ్యాపారం రావడం... నాకు పర్లేదనిపిస్తుంది. అదే ఆఫ్‌లైన్ స్టోర్ నిర్వహిస్తే... దివాలాతీయడం ఖాయం” అంటారు అశుతోష్.

బ్యాండ్ బజాయించేందుకు నిధులు

ప్రారంభించాక ఐదేళ్లపాటు సొంతగానే నిర్వహించినా... 2010లో జేఎండీ టెలిఫిలిమ్స్ నుంచి నిధులు సేకరించారు అశుతోష్. “ మేం నిర్వహించే మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ప్రొఫెషనల్ వీడియో వంటి వాటికున్న మార్కెట్ చాలా స్వల్పం. చాలా ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు తమ ఇంట్రెస్ట్ చూపేవారు. అయితే ఈ రంగంతో పరిచయం లేని వ్యక్తులు నా వ్యాపారంలో అడుగుపెట్టేందుకు నేను అంగీకరించలేదు. వీలైనంతవరకూ సొంతగానే నిర్వహించుకోవాలనేది నా ఆలోచన” అంటున్నారు అశుతోష్. జేఎండీ టెలిఫిలిమ్స్ విషయంలో ఆ సంస్థ మ్యూజిక్ సంబంధిత వ్యాపారం నిర్వహించేంది. బహుశా అందుకే జేఎండీకి, బజావో ఒప్పందం కుదిరింది. 51శాతం వాటా కొనుగోలు చేయడంతో జేఎండీ టెలిఫిలిమ్స్‌కు అనుబంధ సంస్థగా మారింది బజావో. జేఎండీ టెలిఫిలిమ్స్ ఇప్పటికే లిస్టింగ్ కంపెనీ కావడంతో... దాని అనుబంధ సంస్థైన బజావో డీమ్డ్ లిస్టింగ్ కంపెనీగా మారింది.

తాజాగా ఇద్దరు వ్యక్తిగత పెట్టుబడిదారులు రూ.18 కోట్లను బజావోలో ఇన్వెస్ట్ చేశారు. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు అశుతోష్. “వార్టన్, హార్వర్డ్‌లలో పట్టభద్రులైన వారిద్దరూ కూడా మ్యూజిక్ లీడర్సే. వారిలో ఒకరు జాజ్ మ్యుజీషియన్ కూడా. మా మేనేజ్మెంట్ టీంలో వారిద్దరి చేరిక ద్వారా... ఇప్పుడు మా కంపెనీ మరింత బలోపేతం కానుంది.” అన్నారు అశుతోష్.

సంగీతంతో వ్యాపారం

మ్యూజికల్ సామాగ్రి విక్రయాలతోపాటే సంగీతానికి సంబంధిచిన ఇతర వ్యాపారాల్లోకీ అడుగు పెట్టింది బజావో. 2008లో స్టూడియో ఎక్విప్మెంట్, 2009లో పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం వ్యాపారాలు ప్రారంభించారు. మ్యూజికల్ ఈవెంట్ల నిర్వహణలోనూ బజావోకు భాగస్వామ్యం ఉంది. మార్చ్ 21, 2014లో జరిగి జాక్ డేనియల్స్ రాక్ అవార్డ్స్, త్రవాత ఇంటర్నేషనల్ జాజ్ ఫెస్టివల్, రాగస్థాన్, రెడ్‌బుల్ టూర్ బస్‌లతో పాటు బాలీవుడ్ మూవీ ఆషికి-2కి కూడా భాగస్వామ్యం ఉంది బజావోతో.

సూపర్‌డ్రై, డీజిల్, కాన్వర్స్, రే-బాన్, ట్రూ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వంటి బ్రాండ్లతోన ఈ కంపెనీకి ఒప్పందాలున్నాయి. హార్డ్‌రాక్ కేఫ్‌కు సంబంధించి పలు ఔట్‌లెట్లలో ఆర్టిస్టుల నిర్వహణ అంశాన్ని 2014నుంచి పర్యవేక్షిస్తోంది బజావో.

2006లో 24/7 జామ్ రూమ్ ప్రారంభించింది బజావో.కాం. బీ69పేరుతో హార్డ్ రాక్ & మెటల్‌తో కలిసి అండర్‌గ్రౌండ్ వెన్యూ నిర్వహిస్తోందీ సంస్థ. గత రెండేళ్లలో 200 ఇండిపెండెంట్ షోలను నిర్వహించారు ఇక్కడ. అయితే ఇలాంటి జామింగ్ రూమ్స్ పెరిగిపోవడంతో 2009లో దీన్ని మూసేశారు.

లైవ్ సౌండ్ విభాగం ఇప్పడు మరో రూపంలో నడుస్తోంది. అయితే బజావో.కాం వాటికి తమ సహాయ సహకారాలు మాత్రమే ఇస్తుంది. మ్యూజికల్ ఈవెంట్ల నిర్వహణలో పాలు పంచుకుంటుంది అంతే. “ఇవి రెండూ విభిన్నమైన వ్యాపారాలు. రెండు వ్యాపార మోడళ్లు ఒకే బ్రాండ్ నేమ్ ఉపయోగించుకుంటాయంతే. అయితే ఆదాయాన్ని సమకూర్చడంలో బజావో.కాం తమకు ప్రాథమిక వ్యాపారమంటారు అశుతోష్. ఈ-కామర్స్ రంగం బాగానే అభివృద్ధి చెందుతుండడంతో కన్సల్టింగ్ విభాగంపై అంతగా దృష్టి సారించలేదు బజావో. ఇప్పుడు ఆ వ్యాపారంలో మాతో కలిసి పనిచేసేందుకు తగిన భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నామ”ని చెప్పారు అశుతోష్.

2014మార్చ్‌లో వాల్ట్ పేరుతో.. సొంత మ్యూజికల్ ఉత్పత్తులు విక్రయించడం ప్రారంభించింది బజావో. వాల్ట్ ఉత్పత్తుల విక్రయాల ద్వారా తమ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నారు అశుతోష్. తన వ్యాపారం నడుస్తున్న తీరుపై సంతోషం ప్రకటిస్తున్నారు అశుతోష్. “మా ఇంట్లో వ్యాపారం చేసిన వాడిని నేనొక్కడినే. నన్ను నేనెప్పుడూ ఎంటర్‌ప్రెన్యూర్‌గా భావించుకోలేదు. నా రోజువారీ ఉద్యోగంగానే దీన్ని భావించా. నా దృష్టిలో ఓ కంపెనీకి ఓనర్ కావడం కంటే.. ఆ కంపెనీతో కలిసి పని చేస్తున్నామనే భావనే చాలా ముఖ్యం” అంటున్నారు అశుతోష్. ఇది ఈ సంగీత వ్యాపారి చెప్పే ఫిలాసఫీ.

2017నాటికి దేశంలో మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ వ్యాపారం 29 మిలియన్ డాలర్లకు చేరుతుందని అంచా వేస్తోంది బజావో. మొదటి, అది పెద్ద ఆన్‌లైన్ రిటైలర్ కావడంతో... ఇప్పటికీ బజావోకు చాలా అడ్వాంటేజ్ ఉందనే చెప్పాలి.