హైదరాబాద్‌కు జైకొట్టిన ఐదు దిగ్గజ కంపెనీలు

హాట్ డెస్టినేషన్ గా మారిన భాగ్యనగరం

హైదరాబాద్‌కు జైకొట్టిన ఐదు దిగ్గజ కంపెనీలు

Saturday May 21, 2016,

4 min Read


ప్రపంచ పటంలో హైదరాబాద్ ఇప్పుడో హాట్ డెస్టినేషన్. దిగ్గజ సంస్థలకు కేరాఫ్ అడ్రస్. ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ వంటి సంస్థలకు దేశీయ ప్రముఖ సంస్థలన్నీ తమ అద్భుతమైన, సువిశాలమైన క్యాంపస్‌లను హైదరాబాద్‌లో నెలకొల్పాయి. మూడు, నాలుగేళ్ల క్రితం.. ఉన్న బ్యాడ్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిస్థాయిలో తొలగిపోయింది. ప్రపంచంలో పేరెన్నికగల సంస్థలన్నీ మళ్లీ భాగ్యనగరంవైపు ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నాయి. ప్రభుత్వ చొరవతో పాటు అనేక పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు హైదరాబాద్‌ను హైరేంజ్‌కు తీసుకెళ్తున్నాయి.

ఏడాదిలో గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు తమ అంగీకారాన్ని తెలపడంతో పాటు పనులు కూడా ప్రారంభించాయి. మొత్తమ్మీద ఇప్పుడు హైదరాబాద్ యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్ వంటి ఐదు దిగ్గజ సంస్థలకు మెట్టినిల్లులా మారింది.

image


తాజాగా యాపిల్ తన మ్యాపింగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు హైదరాబాద్‌లో శంకుస్థాపన చేసింది. యాపిల్ సీఈవో టిమ్ కుక్ స్వయంగా ఇక్కడికి వచ్చి మరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ సుమారు రూ. 600 కోట్ల విలువైన పెట్టుబడులు వస్తాయని సమాచారం. సుమారు 5000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.

కొద్ది రోజుల క్రితం అమెజాన్ కూడా తన క్యాంపస్‌కు శంకుస్థాపన చేసి.. పనులను వేగవంతం చేసింది. గూగుల్ కూడా అదే బాటలో అతిపెద్ద క్యాంపస్ నిర్మాణాన్ని చేపడ్తోంది. యూఎస్ వెలుపల మొదటిసారి పెద్ద కేంద్రాన్ని గూగుల్ నిర్మిస్తోంది. సుమారు రూ. 1000 కోట్ల పెట్టుబడితో 2019 నాటికి 13,000 మంది ఉద్యోగుల సామర్ధ్యం గల కార్యాలయానికి శ్రీకారం చుడ్తోంది.

రెండేళ్లలో మూడ్ మారింది

పదిహేను, ఇరవై ఏళ్ల క్రితం ఐటిలో మేటిగా ఎదిగిన నగరం హైదరాబాద్. బెంగళూరు, చెన్నై, ఢిల్లీతో పోటీపడీ మరీ విస్తరించింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు తమ స్థావరాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. సంయుక్త రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మూడేళ్ల క్రితం హైదరాబాద్‌పై కార్పొరేట్ కంపెనీల ఒపీనియన్ మరో రకంగా ఉండేది. విభజన వాదం, తరచూ ఏదో ఒక గొడవలు, అనిశ్చితి, ప్రభుత్వం పట్టు కోల్పోవడం వంటి నెగిటివ్ రిమార్కులు ఉండేవి. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం, సుస్థిరమైన ప్రభుత్వం రావడం, కేటీఆర్ వంటి ఆలోచనాపరుడు ఐటి శాఖ పగ్గాలు చేపట్టడం కలిసొచ్చాయి. అమ్మో హైదరాబాదా.. అన్న నోళ్లే.. వాహ్వా అంటూ కీర్తించడం మొదలుపెట్టారు. అందుకే పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు క్యూలో ఉన్నాయి.

బెంగళూరుకు ట్రాఫిక్ బెంగ, చెన్నైకి వరదల పోటు

ఒకరి ఇబ్బంది.. మరొకరికి వరంలా మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా ఆ అడ్వాంటేజ్‌ను తీసుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న రెండు ప్రధాన నగరాలూ మెల్లిగా స్టాగ్‌నేషన్ పాయింట్‌కు చేరుకున్నాయి. బెంగళూరు విషయానికి వస్తే.. అక్కడ ట్రాఫిక్ చుక్కలు చూపిస్తోంది. ఓవర్ క్రౌడెడ్‌గా మారి స్థానికులకే ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఒకప్పటి మాదిరి అక్కడి వాతావరణం కూడా లేదు. కూల్ సిటీ ట్యాగ్ మెల్లిగా చెదిరిపోతోంది. కాలుష్యం కారణంగా అక్కడ కూడా వేడి పెరిగి మిగిలిన నగరాల మాదిరే మారింది. గ్రోత్ ఆగిపోవడం, ప్రభుత్వం నుంచి లీడ్ తీసుకుని నడిపించే నాయకుడు లేకపోవడంతో కూడా మరో మైనస్ పాయింట్.

image


ఇక చెన్నై విషయానికి వస్తే.. వరదల ముప్పు బాధిస్తోంది. కొన్ని నెలల క్రితం వచ్చిన అనూహ్యమైన వరదలు కార్పొరేట్లను ఒకటికి పదిసార్లు ఆలోచించేలా చేస్తున్నాయి. బ్యాక్ ఆఫీస్ వంటి కీలకమైన ఆపరేషన్లకు చెన్నై సేఫ్ కాకపోవచ్చు అనే అనుమానం మొదలైంది.

ఈ రెండు ఫ్యాక్టర్స్ హైదరాబాద్‌కు ప్లస్ పాయింట్‌లా మారాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి వలస వస్తున్నాయి.

రియల్ ఎస్టేట్ చవక

ఎవరు అవునన్నా.. కాదన్నా.. హైదరాబాద్‌ చుట్టుపక్కల విస్తారమైన భూమి ఉంది. ఇతర ప్రాంతాల్లో అయితే అది సాగులో ఉండే అవకాశం ఉందేమో కానీ.. ఇక్కడ అలా కాదు. అనువైన భూమి విరివిగా లభిస్తోంది. ప్రభుత్వం దగ్గర కూడా పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఏదైనా పెద్ద కంపెనీ ఇక్కడికి వస్తామంటే ఎన్ని ఎకరాలైనా ఇచ్చి ఆహ్వానించే పరిస్థితి ఉంది.

ఇక అన్నింటికంటే మరో ముఖ్యమైన అంశం.. చవకైన రియల్ ఎస్టేట్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే కనీసం 30 శాతం తక్కువగా ఇక్కడ నిర్మాణం పూర్తయిపోతుంది. సిమెంట్, లేబర్, ల్యాండ్ అన్నీ తక్కువగా ఉండడం వల్ల నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. ఇతర మెట్రో నగరాల స్థాయిలో ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేయకపోవడంతో రేట్లు ఆ స్థాయిలో పెరగలేదు. మూడేళ్ల అనిశ్చితి కారణంగా కమర్షియల్ ధరలు కూడా పెద్దగా పెరగలేదు. కంపెనీలు ఏర్పాటు చేద్దామనుకునే వాళ్లకు ఇదో పెద్ద ప్లస్ పాయింట్.

image


టాలెంటెడ్ పూల్

టాలెంట్‌ పూల్‌కు హైదరాబాద్‌లో కొదువ లేదు. అధిక శాతం మంది ఇంజనీర్లకు ప్రొడ్యూస్ చేసే నగరం ఇదే. ఆరు స్టేట్ యూనివర్సిటీలు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీలు, రెండు డీమ్డ్ యూనివర్సిటీలు, మూడు సెంట్రల్ యూనివర్సిటీలకు హైదరాబాద్ స్థావరం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువత కొత్త కోర్సులను నేర్చుకునేందుకు ఇక్కడికి రావడం వల్ల టాలెంట్ అంతా ఒక్క చోటికి చేరుతోంది. రెడీమేడ్ టాలెంట్ ఉండటం కంపెనీలకు ప్లస్ పాయింట్. సంస్థ ఏర్పాటు పూర్తికాగానే.. ఏ మాత్రం ఆలస్యం లేకుండా, ట్రైనింగ్ అవసరం లేకుండా నైపుణ్యం సిద్ధంగా ఉంటోంది. దీని వల్ల సంస్థల ఖర్చు తగ్గడంతో పాటు తమ కార్యకలాపాలను త్వరగా ప్రారంభించేందుకు ఆస్కారం ఉంటుంది. టి - హబ్ వంటి ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు వల్ల యంగ్ టాలెంట్‌ డెవలప్ అవుతోంది.

image


ప్రభుత్వ చొరవ

అన్నింటికంటే ఇక్కడి తెలంగాణ ప్రభుత్వ చొరవ కంపెనీలను విరివిగా ఆకర్షిస్తోంది. ఐటి పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించడంతో పాటు సింగిల్ విండో విధానాన్ని సమర్థంగా అమలు చేయడం కలిసొస్తోంది. ఐటి శాఖ మంత్రి కె. తారకరామారావు స్వయంగా వివిధ దేశాలు సందర్శించి అక్కడి కంపెనీలతో భేటీ అవుతున్నారు. ఇక్కడ ఉన్న అవకాశాలను వివరిస్తూ.. ప్రభుత్వ ప్రోత్సాహకాలను తెలియజేస్తున్నారు. ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాత్ర కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

image


ఇలా వివిధ పాయింట్లు కలిసి రావడం హైదరాబాద్‌ను హాట్ డెస్టినేషన్‌గా మారుస్తోంది. యాపిల్ వంటి సంస్థలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంటే.. మరింతగా కలిసొస్తుంది. ఇప్పటికే వాల్డ్ మ్యాప్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని పదిలపరుచుకున్న హైదరాబాద్.. మరింత ఉత్సాహంతో ముందుకు దూకుతోంది.