ఒక కన్ను కనిపించకపోయినా ప్రేక్షకుల మనసు గెలుచుకున్న బల్లాలదేవుడు  

0

అప్పటిదాకా హీరోగా 18 సినిమాలు చేసి, హిందీలో తెలుగులో ఏకకాలంలో మాచో హీరోగా పేరు తెచ్చుకుని, అంతలోనే హీరో ఇమేజ్ ని పక్కన పెట్టి నెగెటివ్ కేరక్టర్ ని ఒప్పుకోవడమంటే మాటలు కాదు. అందునా తెలుగు సినీ పరిశ్రమలో ఇమేజ్ తాలూకు చట్రం, కుటుంబ నేపథ్యం తాలూకు లెక్కలు నటుడిని కదలకుండా చేస్తాయి. వాటన్నిటినీ కాదని బాహుబలిలో బల్లాలదేవుడు అనే విలన్ పాత్ర పోషించి జయహో అనిపించాడు. ప్రభాస్ కి దీటుగా, తను తప్ప మరెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరేమో అన్నంతగా, తన నటనతో మెప్పించాడు.

రానా మొదట్నుంచీ అంతే. ఇమేజ్ కి దూరంగా ఉండేవాడు. సినిమాను ఒక ప్యాషన్ గా, ప్రొఫెషనల్ గా మాత్రమే చూసేవాడు. స్టార్ స్టేటస్ అనో, రామానాయుడు మనవడు అనో, స్టార్ట్ ప్రొడ్యూస్ తనయుడనో, ఎక్కడా అహం ప్రదర్శించలేదు. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో తనకు కుడి కన్ను కనిపించదని, ఎడమ కంటితో మాత్రమే చూసేవాడినని తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఆ స్థాయిలో ఉన్న ఏ నటుడైనా తన పర్సనల్ విషయాలు బయటపెట్టడు. కానీ రానా అలా అనుకోలేదు. నలుగురికీ ఆదర్శంగా ఉండాలనే తపనతో, పదిమందికైనా మనోధైర్యం నింపాలన్న భావనతో తన కుడి కంటి రహస్యం చెప్పాడు.

చిన్నప్పుడే కంటిచూపు పోతే, ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఎవరో దాత ఇచ్చిన కంటితో ఆపరేషన్ చేశారు. ఇప్పటికీ నా ఎడమ కన్ను మూస్తే ఏమీ చూడలేను అని రానా ఆమధ్య చెప్పిన మాటలు ఇప్పుడు నెట్లో చక్కర్లు కొడుతున్నాయి.

నిండైన రూపం, కండలు తేలిన దేహం వెరసి రానాని ఆజానుబాహుడిగా కీర్తించింది ప్రేక్షకలోకం. ఆ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ద మోస్ట్ ప్రామిసింగ్ న్యూకామర్ ఆఫ్ 2011 సర్వేలో టాప్ వన్ పర్సనాలిటీగా నిలిచాడు. 2011లో మోస్ట్ డిజైరబుల్ మగవాళ్ల జాబితాలో టాప్ 20లో, 2012లో చేసిన సర్వేలో 10వ వ్యక్తిగా నిలిచాడు.

2010లో లీడర్ సినిమాతో తెరంగేట్రం చేసిన రానా, మొదటి సినిమాతో బెస్ట్ మేల్ డెబ్యూ కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డ్ అందుకున్నాడు. 2015లో దమ్ మారో దమ్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టాడు. రానా కేవలం నటుడే కాదు, విజువల్ ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ కూడా. 2006లో బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్ కేటగిరీలో సైనికుడు సినిమాకుగాను నంది అవార్డు అందుకున్నాడు. బొమ్మలాట సినిమాకు జాతీయ అవార్డొచ్చింది.

నా లెక్క ప్రకారం సినిమా అంటేనే విభిన్నం. బాహుబలితో నా మార్కెట్ వాల్యూ పెరిగింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ అనుకున్నంతగా ఆడకపోతే ఘాజీ సినిమా కోసం ఇంకా శ్రమించాల్సి వచ్చేది. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది కథలు చెప్పడానికి వస్తున్నారు. ప్రేక్షకులకు నామీద నమ్మకం కూడా పెరిగింది. భవిష్యత్ లో మరిన్ని మంచి సినిమాలు చేస్తాననే విశ్వాసం పెరిగింది- రానా దగ్గుబాటి 

Related Stories

Stories by team ys telugu