మధ్యతరగతి జీవితాలను మార్చే ఒక ఐడియా

చదువైపోయి, ఉద్యోగం వెతుక్కోడానికి హైదరాబాద్ వచ్చిన పూజారిణిని ఓ సమస్య బాగా వెంటాడింది. తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో ఉద్యోగం వచ్చే దాకా ఒక మంచి హాస్టల్ వెతు్కోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది 2005 నాటి మాట. ఆ తర్వాత కూడా తన స్నేహితులు చాలా మంది ఇవే ఇబ్బందులు పడడం తను కళ్ళారా చూసింది.. ఈ కష్టాలు భవిష్యత్తులో తన జీవితాన్ని ఓ మేలు మలుపు తిప్పుతాయని తనకి అప్పుడు తెలియదు.

మధ్యతరగతి జీవితాలను మార్చే ఒక ఐడియా

Saturday April 18, 2015,

3 min Read

జీవితమే.. అనుభవం..

మీకేమైనా పిచ్చా.. బిడ్డ భవిష్యత్తు ఆలోచించారా..? ఉన్న ఉద్యోగం వదిలేసి బిజినెస్ చేస్తానంటే.. తెలిసిన వాళ్ళంతా ఇలాగే అన్నారు. ఇక్ఫాయ్‌లో ఎంసిఏ చేసి అప్పటికే పదేళ్ళపాటు మైక్రోసాఫ్ట్, హెచ్.సి.ఎల్. లాంటి అగ్రశ్రేణి సంస్థల్లో ఉద్యోగం చేసిన బిస్వ పూజారిణీ మహాపాత్రకు ఉద్యోగాలంటే బోర్ కొట్టేసింది. ఏదైనా బిజినెస్ చేసి సొంతంగా తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. భర్త బాలకృష్ణ స్వెయిన్ కూడా ఇందుకు అంగీకరించడంతో ఇక టైమ్ వేస్ట్ చేయలేదు. ఒరిస్సాలోని ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిపెరిగిన పూజారిణికి మధ్య తరగతి అవసరాలు బాగా తెలుసు. ఈ అవగాహనే ఆమె వ్యాపారాలకు పెట్టుబడిగా మారింది.

పూజారిణీ మహాపాత్ర, HOSTELNPG.COM CEO

పూజారిణీ మహాపాత్ర, HOSTELNPG.COM CEO


‘‘మీకు కొత్త ఆలోచన ఎప్పుడొస్తే అదే మీరు కొత్త జీవితం మొదలు పెట్టడానికి మంచి టైమ్ అనుకోవాలి. ఈ ఆలోచన మీకే కాదు.. మరెందరి జీవితాల్లోనో వెలుగు నింపొచ్చు.’’ అంటారు పూజారిణి.

ఈ ఆలోచన తోనే ఇవాళ ఆమె Hostelnpg (హాస్టల్‌ ఎంపికకు చేసే హెల్పింగ్‌ అనే ఉద్దేశం ఈ పేరులో కనిపిస్తోంది) అనే సంస్థకు సిఇఓగా మారారు. తన భర్తతో కలిసి ఆమె ఈ సంస్థను స్థాపించారు. దేశంలో లోబడ్జెట్, ఎంట్రీ లెవెల్ హాస్టళ్ళకు, పేయింగ్ గెస్ట్ సదుపాయాలకు ఈ Hostelnpg ఒక వేదికగా మారింది.

Hostelnpg ఎందుకు?

సొంతంగా వ్యాపారం ప్రారంభించడం అంటే అంత తేలిక కాదు. తొలినాళ్ళలో తొట్రుపాట్లు తప్పవు. ఆరంభంలో వుండే చిన్నా చితకా ఇబ్బందులను అధిగమించిన పూజారిణి దంపతులు, ఆన్‌లైన్ సరుకుల వ్యాపారాన్ని మొదలుపెడదామనుకున్నారు. అయితే, అప్పటికి ఈ కామర్స్ ఇంకా అంత లాభసాటిగా లేదనుకుని ఆ ఆలోచనని విరమించుకున్నారు.

చివరికి ఉద్యోగవేటలో వున్నప్పుడు నివాసం కోసం తాను పడ్డ కష్టాలే స్ఫూర్తిగా వ్యాపారం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ఫలితమే Hostelnpg . మహానగరాల్లో ఉద్యోగం కోసమో, ఉన్నత చదువులకోసమో వచ్చే మధ్య తరగతి వాళ్ళకు వుండడానికి కాసింత మంచి వసతి సౌకర్యం దొరకడమే అతి పెద్ద సవాలు. ఈ సవాలునే పెట్టుబడిగా మార్చి పూజారిణి దంపతులు కొత్త వ్యాపారానికి పునాదులు వేసారు. దేశంలోని మహానగరాల్లో హాస్టల్ళు, పేయింగ్ గెస్ట్ వసతి సౌకర్యాలను సమకూర్చే Hostelnpg .. అలా రూపుదిద్దుకుంది.

ఏమిటీ Hostelnpg?

ఈ వెబ్ సైట్ లో కోరుకున్న బడ్జెట్ లో హాస్టల్, పేయింగ్ గెస్ట్, సర్వీస్ అపార్ట్ మెంట్ల వివరాలుంటాయి. భారీ అడ్వాన్సుల నుంచి, డిపాజిట్ల నుంచి జనానికి విముక్తి కల్పించి, అందుబాటు ధరల్లో వసతి సౌకర్యాలను వారికి అందించడమే ఈ B2C (business to customer) పోర్టల్ ఉద్దేశం. హాస్టళ్ళు, సర్వీస్ అపార్టమెంట్ల, పేయింగ్ గెస్ట్ సౌకర్యాల సమాచారం ఇవ్వడమే కాక, వాటి సమీక్షలు, అక్కడ దొరికే ఫుడ్ మెనూలు, అవి వుండే ప్రాంతాలకు సంబంధించిన సమాచారం, రేటింగ్స్, వాటిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం కూడా ఈ Hostelnpg పోర్టల్‌లో వుంటుంది.


ఇటు వినియోగదారులకే కాకుండా, ప్రాపర్టీ యజమానులకు కూడా ఉపయోగకరంగా వుండేలా ఈ పోర్టల్‌ను రూపొందించారు. వారి సేవలను ప్రమోట్ చేసుకునే వేదికగానే కాకుండా, వినియోగదారుల స్పందన వారికి తెలియజేయడం ఈ పోర్టల్ విశిష్టత. ఈ పోర్టల్‌కు అనుబంధంగా ప్రత్యేకంగా ప్రాపర్టీ యజమానులకోసం HOSMO( hostel management online) అనే వెబ్‌సైట్‌ను, HOSMO అనే మొబైట్ యాప్‌ను ఈ మధ్యే రిలీజ్ చేసారు. దీని ద్వారా ప్రాపర్టీ యజమానులు తమ హాస్టళ్ళ ఆన్‌లైన్ బుకింగ్స్‌ను మేనేజ్ చేసుకోగలుగుతారు. వీటికి సంబంధించి iOS, Windows వెర్షన్లను కూడా త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేస్తారు.

సవాళ్ళే.. నిచ్చెన మెట్లు

వ్యాపారం అంటేనే సవాళ్ళ మయం. పూజారిణీ అడుగడుగునా సవాళ్లు అధిగమిస్తూనే వున్నారు. ముఖ్యంగా ప్రాపర్టీ యజమానుల నుంచి వీరికి ఏ మాత్రం సహకారం అందదు. పూజారిణీ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘ హాస్టల్ కోసం తిరిగే వారికి ఎదురయ్యే చేదు అనుభవాలే మాకూ ఎదురవుతాయి. చదువు సంధ్యల్లేని ప్రాపర్టీ యజమానులతో వ్యాపారం చేయడం కొంచెం కష్టమే. అందుకే పెద్ద పెద్ద సంస్థలేవీ ఈ వ్యాపారంలోకి రావడంలేదు. నిజానికి ఇదో పెద్ద సవాలే అయినా.. దీన్నే మా వ్యాపారం అభివ్రుధ్ది చెందడానికి ఒక అవకాశంగా మార్చుకుంటున్నాం.’’ అంటారామె.

ఎన్ని సవాళ్ళున్నాయో పూజారిణికి భవిష్యత్తు మీద అన్ని ఆశలున్నాయి.. వచ్చే నాలుగు నెలల్లో మొత్తం రెండు వేల ప్రాపర్టీస్ ని తన పోర్టల్ లో చేర్చాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. Hostelnpgను ఒక బ్రాండ్ గా తీర్చిదిద్దాలని ఆమె ఆశయం.

‘నా పనే నాకు ప్రాణం.. జీవితంలో ప్రతి క్షణాన్నీ ప్రేమిస్తాను. ఎవరేమనుకుంటారనేదాన్ని పట్టించుకోను. భవిష్యత్తు మీద నాకు పూర్తి నమ్మకం వుంది..’ అని చెప్పే పూజారిణికి ఆ నమ్మకమే భవిష్యత్తులో బంగారు బాటలు వేస్తుందని ఆశిద్దాం....

‘నా పనే నాకు ప్రాణం.. జీవితంలో ప్రతి క్షణాన్నీ ప్రేమిస్తాను. ఎవరేమనుకుంటారనేదాన్ని పట్టించుకోను. భవిష్యత్తు మీద నాకు పూర్తి నమ్మకం వుంది..’ అని చెప్పే పూజారిణికి ఆ నమ్మకమే భవిష్యత్తులో బంగారు బాటలు వేస్తుందని ఆశిద్దాం....