సామాజిక అనుసంధానంతో ఔట్ సోర్సింగ్

శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పనకెరీర్‌లో ఎదిగేలా ప్రోత్సాహంఅద్భుత ఫలితాలు సాధిస్తున్న మట్టిలో మాణిక్యాలు క్లౌడ్ ఫ్యాక్టరీకి పెట్టుబడుల వెల్లువ

సామాజిక అనుసంధానంతో ఔట్ సోర్సింగ్

Wednesday July 15, 2015,

3 min Read

ప్రజల్నిసమన్వయ పరిచి, ఉత్సాహపరిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చు. దాగివున్న నైపుణ్యాలు బయటకు వచ్చి సమాజంలో విప్లవాత్మకర మార్పులు వస్తాయి. చేయీ చేయీ కలిపి సాగితే కొండంత లక్ష్యం కూడా చెంతకు చేరుతుంది. అక్షరాలా ఇదే చేస్తోంది క్లౌడ్ ఫ్యాక్టరీ అనే ఔట్ సోర్సింగ్ కంపెనీ.

సాధారణంగా కంపెనీ అంటే కొందరు ఉద్యోగులుంటారు. వారు పనిచేస్తారు. నెలకు జీతం తీసుకుంటారు. కంపెనీకి, ఉద్యోగులకు మధ్య ప్రత్యేక అనుబంధం ఏమీ ఉండదు. కానీ క్లౌడ్ ఫ్యాక్టరీ ఉద్యోగులను ఎంపికచేసుకోవటంలోనే వినూత్న వైఖరి అవలంబించిది. అదే కంపెనీ విజయసూత్రంగా మారింది. సమాజంలో అభివృద్ధిని, ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకునేవారు కొందరే. ఆర్థిక స్తోమత లేకో, వెనకబడిన ప్రాంతానికి చెందటమో, మరో కారణం చేతో అనేకమంది నైపుణ్యం మరుగున పడిపోతోంది. అలాంటి వారినే వెతికి పట్టుకుంటుంది క్లౌడ్ ఫ్యాక్టరీ. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి వారిని నిష్ణాతులుగా తీర్చిదిద్దుతోంది. అదే సమయంలో కంపెనీ లాభాలనూ ఆర్జిస్తోంది. దీనికి కంపెనీ అనుసరిస్తున్న ఏకైక సూత్రం సామాజిక అనుసంధానం.

తీసుకున్న అప్పులను ప్రజలు తిరిగి సక్రమంగా చెల్లించేలా చేయటానికి గ్రామీణ బ్యాంకు అనుసరించన విధానమే సామాజిక అనుసంధానం. ఈ పద్ధతిలో ప్రజల్ని ఉత్సాహపరచటం ద్వారా మొండి బకాయిలను సైతం రుణగ్రహీతలనుంచి రాబట్టుకుంది గ్రామీణ బ్యాంకు. ఈ విజయాన్ని గమనించిన క్లౌడ్ ఫ్యాక్టరీ ఇదే విధానాన్ని అనుసరించింది. నేపాల్ ఆధారంగా పనిచేస్తున్న క్లౌడ్ ఫ్యాక్టరీ డేటా ఎంట్రీ, ప్రాసెసింగ్ , కలెక్షన్, కేటగరైజేషన్ వంటి అన్ని రకాల కంప్యూటర్ సేవలు అందిస్తోంది. కొంత మంది కలిసి సొంతంగా ఏర్పాటుచేసుకున్న ఈ కంపెనీ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న నేపాల్ లో ఆణిముత్యాలను తయారుచేస్తోంది. సామర్థ్యం ఉండి వాటిని ఉపయోగించుకోలేకపోతున్న యువతీ యువకులను క్లౌడ్ ఫ్యాక్టరీ తన ఉద్యోగులుగా ఎంచుకుంటోంది. వారికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పించి, ఉపాధి కల్పిస్తోంది. ఉద్యోగులకు తగిన వేతనాలివ్వటంతో పాటు వారు కెరీర్ లో ఎదిగేలా సాయపడుతోంది.

ఖర్చు తగ్గింపు, సామర్థ్యం పెంపు, సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలను క్లౌడ్ ఫ్యాక్టరీ ఏకీకృతం చేస్తోంది. క్లౌడ్ ఆధారంగా పనిచేస్తుండటంతో అనేక రకాల ఖర్చుల భారం కంపెనీపై ఉండటం లేదు. ఉద్యోగులకు త్వరగా నేర్పించగల కంప్యూటర్ టాస్క్ లను క్లౌడ్ ఎంచుకుంటోంది. దీనివల్ల సామర్థ్యం పెంపు, డేటా సెక్యూరిటీతో పాటు అనేకరకాల ఉద్యోగాలకు అవకాశముంటోంది.

సామాజిక అనుసంధానం విధానం ద్వారా క్లౌడ్ ఫ్యాక్టరీ స్థానికత ఆధారంగా ఉద్యోగులను ఒక గ్రూప్ గా తయారుచేస్తోంది. పనితీరును సమీక్షించేందుకు వారం వారం ఉద్యోగులందరినీ ఒక చోట సమావేశపరుస్తుంది. ఉద్యోగులకు వ్యక్తిగతంగానూ, గ్రూప్ పరంగానూ ర్యాంకులు కేటాయిస్తుంది. ఎవరి వ్యక్తిగత పనితీరు సరిగ్గా లేకపోయినా...అతని గ్రూప్ మొత్తం పనితీరుపై అది ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా మొత్తం అతని కమ్యూనిటీ పైనా ప్రభావం ఉంటుంది. ఈ విధానం వల్ల ఉత్పత్తి తీరులో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది.

క్లౌడ్ ఫ్యాక్ట‌రీ బృందం

క్లౌడ్ ఫ్యాక్ట‌రీ బృందం


ఎంతో బాధ్యతతో కంపెనీ ప్రారంభించామని క్లౌడ్ ఫ్యాక్టరీ సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ టామ్ పుష్కరిచ్ చెప్పారు. “ క్లౌడ్ కార్యక్రమాలను మరో దేశంలో విస్తరించటానికో, కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించటానికో మాత్రమే మేమిది చేయటం లేదు. మా కమ్యూనిటీలో పనిచేసే ప్రజలందరిపైనా నేను ప్రత్యక్షంగా ప్రభావం చూపగలుగుతున్నాను” అని టామ్ తెలిపారు. గ్రూప్ పనితీరు సమీక్షల ద్వారా రేటింగ్స్ ఇవ్వటంలో భాగంగా క్లౌడ్ ఫ్యాక్టరీ క్యారెక్టర్ రేటింగ్స్ నూ ప్రారంభించింది. గ్రూప్ లోని సభ్యులు తమకు తాము నిర్దేశించుకునే లక్ష్యాలు, తమ కమ్యూనిటీలకు సేవ చేయటానికి వారు ఎంచుకునే విధానాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునే పద్ధతుల ఆధారంగా ఈ రేటింగ్స్ నిర్ణయిస్తారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువతీ యువకులు తమ కమ్యూనిటీలలో పేదరికాన్ని తొలగించేలా.. వారికి ఉద్యోగ కల్పన ద్వారా నాయకత్వ లక్షణాలను అలవర్చాలన్నది క్లౌడ్ ఫ్యాక్టరీ లక్ష్యమని టామ్ వివరించారు.

క్లౌడ్ ఫ్యాక్టర్టీకి తొలినాళ్లలోనే నిధులు సమకూరటమే కాకుండా అంతకంతకూ పెరుగుతున్నాయి. కంపెనీ లాభాలతో పాటు సామాజిక కోణమూ పెట్టుబడిదారులను ఎంతో ప్రభావితం చేస్తోందని టామ్ చెప్పారు. ఎంత పెట్టుబడులు పెరిగినా.. కంపెనీ అనుసరిస్తున్న సామాజిక దృక్పథాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ లాభాల కోసం వదిలివేయరాదన్నదే తమ లక్ష్యమని తెలిపారు. తమ దగ్గరకు వచ్చే పెట్టుబడిదారులకు తాము ప్రధానంగా చెప్పే విషయం ఇదేనన్నారు టామ్.

క్లౌడ్ ఫ్యాక్ట‌రీ లోగో

క్లౌడ్ ఫ్యాక్ట‌రీ లోగో


ప్రస్తుతం క్లౌడ్ ఫ్యాక్టరీలో 150 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా క్లౌడ్ ఫ్యాక్టరీ ఏడు రోజుల్లో 1,18,000 లక్ష్యాలను పూర్తిచేసింది. క్లౌడ్ ఫ్యాక్టరీ ప్రధాన పోటీదారుల్లో ఒకరైన మొబైల్ వర్క్స్ తాము పదిలక్షలు పూర్తిచేసినట్టు ఇటీవల ప్రకటించింది. సామాజిక దృక్పథంతో నడుస్తున్న క్లౌడ్ ఫ్యాక్టరీ వారానికి అందులో పదోవంతు లక్ష్యాలను సాధించిందని టామ్ చెప్పారు.

క్లౌడ్ ఫ్యాక్టరీ అనుసరిస్తున్న లాభదాయక పద్ధతి కంపెనీ అన్ని చోట్లా విస్తరించటానికి ఉపయోగపడుతోందని టామ్ స్పష్టం చేశారు. లాభం స్థిరత్వానికి దారితీస్తుంది. స్థిరత్వం వల్ల ఉత్పత్తిలో లోపాలు తొలగిపోతాయి. బాగా లాభాలు సంపాదించటమన్నది కంపెనీ ఉద్దేశం ఎప్పటికీ కాదని...ఆర్థిక ఒత్తిళ్ల వల్ల నిరుపయోగంగా మారిన నైపుణ్యాన్ని, విజ్ఞానాన్ని అన్ని ప్రాంతాల్లో వెలికి తీసి నాయకులను, నిష్ణాతులను తయారుచేయటమే తమ లక్ష్యమని వివరించారు టామ్.

క్లౌడ్ ఉద్యోగుల్లో అనేకమంది తమ జీవితకాలమంతా ఉద్యోగులగానే ఉండరు. వారు జర్నలిస్టులు కావొచ్చు, ఇంజనీర్లు కావొచ్చు లేదంటే...రాజకీయ నాయకులూ కావొచ్చు. తాము మొదటి నుంచి ఉద్యోగులకు ఎంత బాగా పనిచేయాలన్నది మాత్రమే నేర్పించమని, నాయకులుగా ఎలా మారాలో తెలియజేస్తామని టామ్ చెప్పారు. మొత్తానికి సామాజిక దృక్పథమే అంతస్సూత్రమైన క్లౌడ్ ఫ్యాక్టరీ పనితీరు అన్ని రకాల వ్యాపారాలకు, కొత్త తరం వ్యాపారవేత్తలకూ ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.