అర్ధరాత్రి మోగిన ఆర్ధిక సంస్కరణల జేగంట

అర్ధరాత్రి మోగిన ఆర్ధిక సంస్కరణల జేగంట

Saturday July 01, 2017,

2 min Read

జీఎస్టీ జేగంట మోగింది. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అతిరథమహారథులు, వ్యాపార దిగ్గజాల నడుమ.. ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లోకి వచ్చింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో అట్టహాసంగా జరిగిన జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి జైట్లీ, అద్వానీ, మాజీ ప్రధాని దేవెగౌడ, కేంద్రమంత్రులు, ఎంపీలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ప్రెసిడెంట్ ప్రణబ్ చేతుల మీదుగా చిన్నపాటి ప్రోమో రూపంలో జీఎస్టీని లాంఛ్ చేశారు.

image


2009లోనే తొలిసారి చర్చ జరిగింది-రాష్ట్రపతి ప్రణబ్

14 ఏళ్ల సుదీర్ఘ శ్రమ నేటికి ఫలించిందని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. పన్ను విధానంలో జీఎస్టీ సమగ్రమైందని ఆయన అభిప్రాయ పడ్డారు. జీఎస్టీ రూపకల్పనకు సాధికారకమిటీ విశేషమైన కృషి చేసిందని ప్రణబ్ ప్రశంసించారు. 2009లోనే రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల కమిటీ జీఎస్టీపై ప్రథమ ముసాయిదా ఇచ్చిందని గుర్తు చేశారు. 2011,12లో మంత్రుల కమిటీతో తాను స్వయంగా చర్చలు జరిపిన విషయాన్ని ప్రణబ్ ప్రస్తావించారు. 18 సమావేశాల్లోనే నిర్ణయాలన్న ఏకాభిప్రాయంతో తీసుకోవడం గొప్ప విషయమన్నారు. పన్నుల మార్పు విషయంలో తాను కూడా ఎంతో ఉత్కంఠకు గురయ్యానని ప్రణబ్ చెప్పుకొచ్చారు.

image


ఆర్ధిక, సామాజిక సంస్కరణ - ప్రధాని మోడీ

జీఎస్టీ రూపకల్పనకు ఎందరో మహానుభావులు కృషి చేశారని ప్రధాని మోడీ అన్నారు. ఈ కొత్త వ్యవస్థ ఏ రాజకీయ పార్టీకో, మరే వ్యక్తులకో చెందింది కాదని ప్రధాని అభిప్రాయ పడ్డారు. దీన్ని సమష్టి విజయంగా ఆయన అభివర్ణించారు. ఎందరో మహనీయులు నడయాడిన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ ప్రారంభం కావడం సంతోషకరం అన్నారు. జీఎస్టీ కొలిక్కి రావడానికి 11 నెలల 17 రోజులు పట్టిందన్న మోడీ.. ఒకే పన్నుల విధానంతో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అభిప్రాయ పడ్డారు. జీఎస్టీ అనేది టీమిండియా సామర్ధ్యానికి నిదర్శనం అన్నారు. భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నట్టే.. జీఎస్టీ కూడా 18 సార్లు సమావేశం అయిందని పోల్చారు. భగవద్గీత మాదిరిగానే జీఎస్టీ కూడా భారత ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సంస్థానాలు ఏకమై జాతిని ఒక్కటి చేసినట్టే.. జీఎస్టీ ద్వారా కూడా అదే తరహా ఏకీకరణ సాధ్యమవుతుందని అన్నారు. 

image


సామాన్యుడిపై జీఎస్టీ వల్ల ఎలాంటి భారం పడదన్న మోడీ.. చిరు వ్యాపారులు కూడా లబ్ది పొందుతారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా ఇంత వరకు పేదల అవసరాలు తీర్చలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పేదల హితం కోసమే జీఎస్టీ రూపకల్పన చేశామన్నారు. ఇకపై నిరంతరం అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేదని, చిన్నపాటి సాఫ్ట్ వేర్ తో ఎవరి టాక్స్ వాళ్లే కట్టుకోవచ్చని మోడీ తెలిపారు. రూ. 20 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులకు పూర్తి విముక్తి లభిస్తుందని ప్రధాని అభిప్రాయ పడ్డారు. రూ. 75లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారులకు తక్కువలో తక్కువ పన్నుభారం పడుతందని తెలిపారు. కొత్త కళ్లజోడు పెట్టుకున్నప్పుడు చూపులో తేడా సహజమే అని చెప్పుకొచ్చారు. జీఎస్టీ కేవలం ఆర్ధిక సంస్కరణ మాత్రమే కాదు.. సామాజిక సంస్కరణ కూడా అని ప్రధాని మోడీ అభిప్రాయ పడ్డారు.

image


ఆర్ధిక సంస్కరణల్లో వేగం పెరుగుతుంది- జైట్లీ

జీఎస్టీతో దేశ ప్రయాణం కొత్తగా మొదలవుతుందని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇందులో ఏకాభిప్రాయం రావడం హర్షించాల్సిన విషయం అన్నారు. ప్రపంచం ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మనం ఇలాంటి ఘనత సాధించడం ఆనందంగా ఉందన్నారు. 15 ఏళ్ల ప్రయాసకు రాష్ట్రపతి ప్రణబే ప్రత్యక్ష సాక్షి అని గుర్తు చేశారు. జీఎస్టీ రూపకల్పనకు యశ్వంత్ సిన్హా విలువైన సూచనలు ఇచ్చారని జైట్లీ తెలిపారు. ఏకాభిప్రాయం రావడానికి స్టాండింగ్ కమిటీ పోషించిన పాత్ర ఎంతో విలువైందన్న ఆయన.. జీఎస్టీతో రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇచ్చారు.