ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా.. !

స్టోరీ టెల్లింగ్‌లో సెన్సేషన్ దీపా కిరణ్

ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా.. !

Thursday February 11, 2016,

4 min Read


ఒకప్పుడంటే ఉమ్మడి కుటుంబం. అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ, వాళ్ల అమ్మ. ఇల్లంతా సందడి సందడిగా ఉండేది. ఇక సాయంత్రమైతే చాలు పెరట్లో నవారు మంచం. అమ్మమ్మ చుట్టూ మనుమలు మనుమరాళ్లు.. చుక్కల రాత్రి.. చల్లని గాలి.. పేదరాశి పెద్దమ్మ కథ.. పరోపకారి పాపన్న కథ.. ఏడు చేపల కథ.. అవి వింటూ మధ్యమధ్యలో ఊ కొడుతూ పిల్లలు మెల్లగా నిద్రలోకి జారుకునేవారు.

కాలం మారింది. ఉమ్మడి కుటుంబం చెదిరిపోయింది. న్యూక్లియ్ ఫ్యామిలీస్ పుట్టుకొచ్చాయి. సింగిల్ చైల్డ్ పేరెంట్స్ ఎక్కువయ్యారు. ఉరుకులు పరుగుల జీవితానికి ఇద్దరెందుకు అనుకుంటున్నారు. సంపాదన, ఫ్యూచర్- ఈ లెక్కలను తట్టుకోలేక కథ ఏనాడో కంచికి చేరింది. ఏదైనా స్టోరీ చెప్పవా డాడీ అని పాప అడిగితే - కష్టం తల్లీ చెప్పలేను అనే తండ్రులు బోలెడుమంది. మమ్మీ ఒక కథ చెప్పవా అంటే- నాకేం తెలియదు పప్పాని అడుగు అని తప్పించుకునే తల్లులు ఎందరో. వెరసి ఈకాలం పిల్లలకు కథలేంటో, వాటితో తెలుసుకునే నీతేంటో బొత్తిగా తెలియదు. నిజంగా అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు.

image


టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. కాదనట్లేదు. కానీ పిల్లలకు సనాతన విలువలు కూడా తెలియాలి. ఎంతసేపూ కంప్యూటరు, ఇంటర్నెట్, వీడియోగేమ్సే కాదు.. కాసేపు పట్టువదలని విక్రమార్కుడి ప్రయాణం ఎలా సాగిందో కూడా తెలుసుకోవాలి. ఏడు చేపలు ఎందుకు ఎండలేదో అర్ధం కావాలి. ఆవు నిజాయితీకి పులి ఎందుకు దాసోహమైందో విడమరిచి చెప్పాలి. కనుమరుగైన కథ మళ్లీ చిన్నారుల చిట్టిబుర్రల్లో మొలకెత్తాలి. వారి బుద్ధి వికసించాలి. నైతిక విలువలు ఒంటపట్టించుకోవాలి. 

ఆవు, పులి, కోతి, నక్క, కాకి పాత్రల గుణగణాలు తెలియాలి. ఏది కుట్రో, ఏది నిజాయితో వారు తెలుసుకోగలగాలి. కష్టపడితే విజయం దానంతట అదే వరిస్తుందనే నీతి బోధపడాలి. పిల్లల్లో సృజనాత్మకత పెరగాలంటే కథ కంపల్సరీ. ఈ కాలం తల్లిదండ్రుల్లో ఆ లోటు తెలిసొస్తోంది. పిల్లలకు స్టోరీ టెల్లింగ్ ప్రాముఖ్యత ఏంటో అవగతమవుతోంది. అందుకే స్కూళ్లో అడపాదడపా స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్టు ఇస్తున్నారు. మెట్రో నగరాల్లో స్టోరీ టెల్లర్స్ నిపుణులు తయారవుతున్నారు. 

image


ముఖ్యంగా హైదరాబాదులో స్టోరీ టెల్లింగ్ ఇంపార్టెన్స్ పెరిగింది. స్కూళ్లో ప్రత్యేకంగా స్టోరీ టెల్లింగ్ సెషన్స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా మనం దీపకిరణ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

ఎవరీ దీప కిరణ్?

ఈవిడ ఒక ప్రొఫెషనర్ స్టోరీ టెల్లర్. ఎడ్యుకేషన్ కన్సల్టంట్, ఫ్రీలాన్స్ రైటర్ కూడా. కథలు అందరూ చెప్తారు. కానీ పరకాయ ప్రవేశం చేసి, వినేవాళ్ల మనసులో గాఢమైన ముద్రవేసి చెప్పడమంటే అందరివల్లా అయ్యేపనికాదు . అదొక ఆర్టు. ఆ కళలో దీప కిరణ్ ఒకరకంగా పీహెచ్ డీ చేశారనే చెప్పొచ్చు. కథకు సంగీతం మిక్స్ చేస్తారు. డాన్స్ యాడ్ చేస్తారు. శ్రుతిలయలు రంగరించి వినసొంపుగా రాగయుక్తంగా చెప్తారు. ఒక మామూలు కథను..ఇంత అందంగా చెప్పొచ్చా అనిపిస్తుంది- ఆమె చెప్పే తీరు చూస్తే. వినేవాళ్లను ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ల రియాక్షన్ కు తగ్గట్టుగా కథను సీరియస్ గా లోతుల్లోకి తీసుకెళ్తూ, ఒక హరికథలా ఆలపిస్తారు. ఒక డ్రామాలా నడిపిస్తారు. ఒక పాటలా ఆవహిస్తారు. ఆమెదొక యూనిక్ స్టయిల్. స్కూళ్లు, లైబ్రరీలు, కల్చరల్ సెంటర్లలో దీపకిరణ్ స్టోరీ టెల్లింగ్ వర్క్ షాప్ప్ నిర్వహిస్తుంటారు. పిల్లలకు కథలు ఎలా చెప్పాలో టీచర్లకు నేర్పిస్తారు. ఏ వయసు వారికైనా సరే దీప కిరణ్ ఇట్టే కనెక్ట్ అయిపోతారు. గొంతులో మాధుర్యంతో కథలో మమేకం చేస్తారు.

ఈ స్టోరీ కూడా చదవండి

స్టోరీ టెల్లర్ కాకపోయి ఉంటే టీచర్ ని అయి ఉండేదాన్ని. ముందు నుంచి నాకు టీచింగ్ ఫీల్డ్ ఇష్టం. అయినా ఇలా కూడా టీచర్నే అయ్యాను కదా- దీప
image


ఎయిత్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడే ఐవాంట్ టు బికమ్ అ స్టోరీ టెల్లర్ అని దీప తన డైరీలో రాసుకున్నారట. మొన్నీమధ్య అలమారాలో తన చిన్నప్పటి రాత చూసి ఆశ్చర్య పోయానని నవ్వుతూ చెప్పుకొచ్చారామె. గలగలా మాట్లాడటం . భాషపై మంచి పట్టు. ఈ రెండు క్వాలిటీస్ ఉంటే ఆటోమేటిగ్గా స్కూల్లో అయినా, కాలేజీలో అయినా వ్యాఖ్యాత అయినట్టే. దీప కిరణ్ కూడా సేమ్. ఎలాంటి అకేషన్స్ అయినా సరే కాలేజీలో ఆమెనే హోస్ట్. అదీగాక నాటకాలు వేశారు. రేడియో జాకీగా పనిచేశారు.ఇప్పుడు ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్ గా రాణిస్తున్నారు.

image


అయితే, స్టోరీ టెల్లింగ్ అనుకున్నంత ఈజీ కాదు. నాటకాల్లో అయితే ఒక పాత్ర కాకుంటే మరో పాత్ర. ఆడియెన్స్ అటెన్షన్ డైవర్ట్ అవదు. స్టాండప్ కామెడీలో ఎలాగూ హాస్యం ఉంటుంది కాబట్టి స్టే ట్యూన్డ్. సింగింగ్, డ్యాన్సింగ్ విషయంలోనూ అంతే. కానీ స్టోరీ టెల్లింగ్ అలాకాదు. కథ నచ్చకుంటే హుష్ కాకి. ముఖ్యంగా మొబైల్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో కథ చెప్పడం, చెప్పేదాన్ని అవతలివాళ్లు వినేలా చేయడం, అంత తేలిక కాదు. మొబైల్, వాట్సాప్ నుంచి ఆడియెన్స్ ని డైవర్ట్ చేయడం చాలా కష్టమైన పని అంటారామె. కథలో ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ వాళ్లు కనెక్టవ్వరనేది దీప అభిప్రాయం. పిల్లల విషయంలో కొంత డ్రామా కూడా వుండాలంటారు. ఎందుకంటే చిన్నపిల్లలు కథ వింటూ నిద్రలోకి జారుకుంటారు. ఆ ప్రమాదం లేకుండా, కొంత యాక్షన్, హావభావాలు కలపాలంటారు. 2009లో దీప మొదటి పబ్లిక్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అప్పటి నుంచి నిరంతరాయంగా కథలు చెబుతునే ఉన్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

దీప ఇప్పటికే స్టోరీ టెల్లింగ్ ఇనిస్టిట్యూట్ ని ఏర్పాటు చేశారు. కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్ ఇస్తారు. టీచర్ల కోసం ప్రత్యేకంగా కోర్స్ ఏర్పాటు చేయాలనేది తన ప్లాన్. విద్యార్థులకు పాఠాలు చెప్పడాన్ని ఓ కధలా మార్చి చెబితే ఆశించిన ఫలితాలు వస్తాయనేది దీప అభిప్రాయం. స్టోరీ టెల్లింగ్ ప్రక్రియ విద్యారంగంలో ఒక నూతన ఒరవడి తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు. వెబ్ సైట్ , ఫేస్ బుక్ పేజీ ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న దీప , వెబ్ సైట్ లో మరిన్ని ఆప్షన్స్ ఏర్పాటు చేసి ఆన్ లైన్ కోర్స్ ను ప్రారంభించాలని చూస్తున్నారు. దేశ విదేశాల్లో స్టోరీ టెల్లింగ్ సెషన్లలో కథలు చెప్పి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎన్జీఓలతో కలసి అనేక అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నా అభిరుచులన్నింటినీ కలగలిపిన కెరియర్ ఇది, నేను స్టోరీ టెల్లర్ కావడానికి గర్వపడుతున్నా అని ముగించారు దీప.

వెబ్ సైట్

ఈ స్టోరీ కూడా చదవండి