హస్తకళల కాణాచి దస్తకారీ హాట్ క్రాఫ్ట్ బజార్

ఢిల్లీలో 15 రోజుల పాటు కొనసాగే హస్తకళల ప్రదర్శన-చేతి వృత్తుల వారి ప్రతిభకు మెరుగులద్దుతున్న దస్తకారీ హాట్ సమితి

0

కళాత్మక వస్తువులు, సృజనాత్మకత ఉట్టిపట్టే కళాకృతులు. రాజస్థాన్ నుంచి రంగూన్ వరకు ఒకటి రెండు కాదు కొన్ని వందల రకాల హస్తకళా వస్తువులతో కొలువుదీరింది దస్తకారి హాట్ క్రాఫ్ట్ బజార్. కస్టమర్ల మనసు దోచే అద్భుతమైన వస్తువులను ఒక్క చోట చేర్చి ప్రాభవం కోల్పోతున్న హస్తకళలకు కొత్త ఊపిరులూదుతోంది. న్యూ ఢిల్లీలోని దిల్లీ హాట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఏటా దేశం నలుమూలల నుంచే కాక పొరుగు దేశాల కళాకారులు తమ కళాకృతులను ప్రదర్శించడంతో పాుట విక్రయించి తమ పనితనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 170 మంది చేతి వృత్తుల వారు తమ హస్తకళా వైభవాన్ని ప్రదర్శించేందుకు వేదికగా మారింది దస్తకారి హాట్ క్రాఫ్ట్ బజార్.

భారత్ లో తయారయ్యే వస్తువులే కాదు.. మయన్మార్ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే రంగూన్ గొడుగులు, తోలు బొమ్మలు, వెల్వెట్ చెప్పులు, లక్క బొమ్మలు, పచ్చలు పొదిగిన నగలు ఇలా ఒక్కటేమిటి మయన్మార్ కళాకారుల చేతిలో పురుడు పోసుకున్న అద్భుత కళాకృతులు క్రాఫ్ట్ బజార్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. 

ఈ ప్రదర్శనలో ఏటా ఏదో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పిస్తుండగా.... ఈసారి ఆ ఛాన్స్ మయన్మార్ కు దక్కింది. భారత విదేశాంగ శాఖ, మయన్మార్ లోని ఇండియన్ ఎంబసీ సహకారంతో దస్తకారీ హాత్ సమితి ఈసారి ప్రదర్శనను నిర్వహిస్తోంది. బర్మా కళాకారులు గవ్వలతో రూపొందించిన వస్తువులు, వెదురు బుట్టలు, చాపలు, చేనేత వస్త్రాలు, వివిధ ప్రాంతాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఆభరణాలన్నీ సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.

“ఎక్స్ పోర్ట్స్, హ్యాండీ క్రాఫ్ట్స్, విదేశాంగ శాఖ అధికారుల సహకారంతో ప్రదర్శనను నిర్వహిస్తున్నాం. ఇది ఇరుదేశాల ప్రజల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. హస్తకళా ప్రదర్శనల ఏర్పాటుతో ఇరు దేశాలు మరింత దగ్గరవుతాయి. మన కళాకారుల నైపుణ్యాలను వారు, వారి పనితనాన్ని మనం నేర్చుకునే వీలు కలుగుతుంది.”- జయ జైట్లీ, దస్తకారీ హాట్ సమితి వ్యవస్థాపకురాలు.

దస్తకారీ హాట్ లో పాల్గొంటున్న భారత్, మయన్మార్ కళాకారుల పనితనానికి మరింత మెరుగులద్దేందుకు క్రాఫ్ట్ అండ్ స్కిల్ డెవలప్ మెంట్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ విభిన్నమైన ఉత్పత్తులను తయారుచేయడంలో మెలకువళను నేర్పుతున్నారు. కళాకారుల మధ్య స్నేహ బంధం పెంపొందడంతో పాటు వారి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేందుకు ఈ వేదిక ఎంతగానో దోహదపడుతున్నదంటున్నది జయ జైట్లీ అభిప్రాయం.

“ఇరు దేశాల కళాకారులు తమ పనితనాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుంది. రెండు దేశాల హస్తకళల్లో కొంత సారూప్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల నేత పని మయన్మార్ చేనేతను పోలి ఉంటుంది. మన దేశంలో హస్తకళలు అభివృద్ధి చెందుతున్నాయి. మార్కెట్ ను విస్తృతం చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.”- జయ జైట్లీ

దేశంలో చాలా చోట్ల హస్తకళా ప్రదర్శనలు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీ హాత్ లో జరిగే దస్తకారీ హాట్ క్రాఫ్ట్ బజార్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. మిగతా చోట్ల ముందే తయారుచేసిన వస్తువుల్ని ప్రదర్శించి విక్రయిస్తారు. కానీ ఇక్కడ మాత్రం సందర్శకుల ముందే వారి అభిరుచికి తగ్గట్లుగా వస్తువులు తయారు చేసి ఇస్తారు. ప్రదర్శనలో పాల్గొంటున్న 12 రాష్ట్రాల నేత పనివారు మగ్గాలపై లైవ్ డెమో ఇస్తున్నారు. అంతేకాదు... సందర్శకులకు వస్తువుల తయారీ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు తయారీకి సంబంధించి మెళకువలు నేర్పుతున్నారు.

“భారత్ కు చెందిన పలువురు చేనేత కళాకారులు ఇక్కడ తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. వారు ఏం తయారుచేస్తారు, ఎలా తయారు చేస్తారన్న విషయాలు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారు. ఒక వస్తువు ఎలా తయారవుతుందో ప్రత్యక్షంగా చూడటం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది”- జయ జైట్లీ

దస్తకారి హాట్ క్రాఫ్ట్ బజార్ లో కేవలం హస్తకళల ప్రదర్శన మాత్రమే కాదు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు, నృత్యకారుల ప్రదర్శనలు సందర్శకుల్ని మైమరిపింప జేస్తున్నాయి. రాజస్థాన్ జానపద సంగీతం, కల్బెలియా, భవై నృత్యం, బెంగాల్ సంప్రదాయ గిరిజన నృత్యం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేస్తున్నాయి. జనవరి 1న ప్రారంభమైన దస్తకారీ హాట్ క్రాఫ్ట్ బజార్ ఈనెల 15 వరకు కొనసాగనుంది.

Related Stories

Stories by uday kiran