మైక్రోసాఫ్ట్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

పల్లె సమస్యలకు సాంకేతిక పరిష్కారం..

మైక్రోసాఫ్ట్ ఇండియాతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

Friday November 18, 2016,

1 min Read

సాంకేతిక వినియోగాన్ని మారుమూల గ్రామాలకు విస్తరించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి, వైద్యం, వ్యవసాయం, విద్యా రంగాల పురోగతికి సాంకేతిక పరిష్కారాలు చూపేందుకు గాను టీఎస్ సర్కారు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది.

వాతావరణ పరిస్థితుల్లో మార్పు, వ్యవసాయరంగంలో తీసుకోవాల్సిన చర్యలు, పౌరసేవలు, ప్రజలకు సర్కారు పథకాల చేరవేత, విద్య, ఆరోగ్య పరిరక్షణ, టీఎస్ క్లాస్ (తెలంగాణ స్టేట్ కంప్యూటర్ లిటరసీ, స్కిల్స్ ఇన్ స్కూల్) అమలు, విద్యార్థుల నమోదు, విద్యా సంస్థల్లో మార్పును సాధించేందుకు సాంకేతిక పరిష్కార మార్గాలను మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తుంది.

image


డిజిటల్ తెలంగాణ సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. క్లౌడ్, మెషీన్ లెర్నింగ్, మొబైల్ టెక్నాలజీ సాయంతో విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

డెంగీ లాంటి వ్యాధులు ఎప్పుడు, ఎలా ప్రబలే అవకాశముందో కూడా అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫాం ద్వారా ముందుగానే అంచనా వేసేందుకు అవకాశాలున్నాయి. దీన్ని కూడా తాము ఉపయోగించుకుంటామని మైక్రోసాఫ్ట్ సంస్థ ఎండీ అనిల్ బన్సాలీ తెలిపారు. అలాగే టెలివిజన్ల ద్వారా పల్లెల్లో, సుదూర ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్ ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసింది. తెలంగాణలో దీనిపై పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భన్సాలీ అన్నారు.

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్, మైక్రోసాఫ్ట్ సంస్థ ఎండీ అనిల్ బన్సాలీ అవగాహన ఒప్పంద పత్రాలు అందజేసుకున్నారు.