పెద్దనోట్ల రద్దుపై బిల్ గేట్స్ ఏమన్నారంటే..  

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మైక్రోసాఫ్ట్ ఫౌండర్

0

ప్రధాని మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కొందరు వ్యతిరేకిస్తున్నారు. మరికొందరు సమర్ధిస్తున్నారు. మోడీ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వస్తున్న నేపథ్యంలో బిల్ గేట్స్ డిమానిటైజేషన్ మీద తన మనసులో మాట బయటపెట్టారు.

ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా అనే అంశంపై నీతి అయోగ్ లో ప్రసంగించిన బిల్ గేట్స్.. మోడీ తీసుకున్న పాత కరెన్సీ రద్దు నిర్ణయం హర్షణీయం అన్నారు. ప్రధాని ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇప్పటికిప్పుడు కాదుగానీ, ఒక ఏడేళ్లలో డిజిటైజ్డ్ ఎకానమీ ఫలితాలు కళ్లముందు ఉంటాయని అభిప్రాయ పడ్డారు. ప్రత్యేకంగా ఇంతశాతం అని చెప్పలేను గానీ అనుకున్నదాని కంటే ఎక్కువ శాతమే ఫలితాలు చూడొచ్చన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని పట్టిపీడిస్తున్న షాడో ఎకానమీని పారదోలి ఆర్ధిక వ్యవస్థను మరింత పారదర్శకంగా చేస్తుందని అభివర్ణించారు.

ఆధార్ కార్డ్ సిస్టమ్ పైనా బిల్ గేట్స్ పాజిటివ్ గా స్పందించారు. ఆధార్.. వ్యవస్థను పక్కాగా స్ట్రీమ్ లైన్ చేస్తుందని, అన్ని రంగాలను ఏకతాటిపైకి తెచ్చే తిరుగులేని ఆయుధం అని కొనియాడారు . తలతిక్క పేపర్లతో, గజిబిజిగా మారిన అకౌంట్ తెరిచే ప్రక్రియను ఒక్క కార్డు ముక్క 30 సెకన్లలో డిజిటలైజ్ చేస్తుందని అభిప్రాయ పడ్డారు.

జన్ ధన్ యోజనపైనా బిల్ గేట్స్ ఇంప్రెస్ అయ్యారు. అట్టడుగున ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను పైకి తెచ్చేందుకు ఇదొక తారకమంత్రం అన్నారు. ముక్కలు ముక్కలుగా ఉన్న ఆర్ధక వ్యవస్థను సింగిల్ పీస్ లా అతికిస్తుందని తెలిపారు.

ఇన్ఫమేషన్ టెక్నాలజీ రంగంలో ఇండియా గణనీయమైన ప్రగతి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. సరికొత్త ఆవిష్కరణల దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు.  

Related Stories