రవాణా కష్టాలు తీరుస్తామంటున్న స్టార్టప్స్‌

-ట్రాన్స్ పోర్ట్ రంగంలో స్టార్టప్ విప్లవం-ఆడ్-ఈవెన్ ఫార్ములాను అనుకూలంగా మలుచుకుంటున్న కంపెనీలు

రవాణా కష్టాలు తీరుస్తామంటున్న స్టార్టప్స్‌

Wednesday December 23, 2015,

3 min Read

అవసరాలు అవకాశాలు సృష్టిస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకునేవాడే అసలైన బిజినెస్‌ మేన్‌. కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో జనవరి 1 నుంచి అమలుకానున్న ఆడ్‌ - ఈవెన్‌ ఫార్ములా ఎన్నో ట్రాన్స్‌ పోర్ట్‌ స్టార్టప్స్ కి అవకాశాలు సృష్టించింది.

ఆడ్‌ ఈవెన్‌ ఫార్ములా

ఢిల్లీలో ఉండటమంటే గ్యాస్‌ ఛాంబర్‌లో బతుకడమేనన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్‌ ఢిల్లీ గవర్నమెంట్‌పై బాగానే ఎఫెక్ట్‌ చూపెట్టాయి. ఢిల్లీ మహా నగరాన్ని కాలుష్య భూతం నుంచి కాపాడేందుకు ఆమ్‌ ఆద్మీ సర్కారు ఆడ్‌ ఈవెన్‌ ఫార్ములాను తెరపైకి తెచ్చింది. రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ చివర సంఖ్య ఆధారంగా వాహనాలు రోడ్లపైకి వచ్చే విధానమే ఇది. అంటే వెహికిల్‌ నెంబర్‌లోని చివరి సంఖ్య సరి అయితే ఒకరోజు, బేసి సంఖ్య నెంబర్లున్న వెహికిల్స్‌ను తర్వాతి రోజు రోడ్లపైకి అనుమతిస్తారు. అంటే ఆడ్‌ ఈవెన్‌ ఫార్ములాతో రోజూ రోడ్లపైకి వచ్చే వెహికిల్స్‌ సగానికి తగ్గిపోనున్నాయి. జనవరి 1 నుంచి 15 వరకు ఆడ్ – ఈవెన్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించాలని ఆప్‌ గవర్నమెంట్‌ నిర్ణయించింది. ఈ విధానం విజయవంతమైతే వారంలో మూడు రోజులు ఢిల్లీలో సగం కార్లు ఇళ్లకే పరిమితం కానున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు 2000 సీసీ సామర్థ్యమున్న లగ్జరీ డీజిల్‌ కార్ల అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ రెండు నిర్ణయాలు ఢిల్లీలో ఆల్టర్నేట్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ సిస్టంకు మంచి రోజులు తెచ్చాయి.

ట్రాన్స్‌పోర్ట్‌ స్టార్టప్స్‌కు వరం

image


ఢిల్లీ గవర్నమెంట్‌ తీసుకున్న నిర్ణయం ట్రాన్స్‌ పోర్ట్‌ రంగంలోని స్టార్టప్స్‌ కు వరంగా మారింది. ముఖ్యంగా కార్‌ పూలింగ్‌, సెల్ఫ్‌ డ్రైవ్‌ లతో పాటు ఆన్‌ డిమాండ్‌ కార్‌ సర్వీసెస్‌ సంస్థలు అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రెడీ అయ్యాయి. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ రెంటల్‌ కార్‌ సర్వీసులను అందించే జూమ్‌ కార్‌ ఈ ఆడ్‌ ఈవెన్‌ సిస్టంను తమకు అనుకూలంగా మార్చుకుని సర్వీస్‌ ఎక్స్‌ పాన్షన్‌కు ప్లాన్స్‌ రెడీ చేస్తోంది. ఢిల్లీలో తమ సేవల్ని ప్రారంభించింది. కార్పొరేట్‌, ఆఫీస్‌ల కెళ్లే వారి కోసం జూమ్‌ కమ్యూట్‌ పేరుతో స్పెషల్‌ ప్యాకేజ్‌ డిజైన్‌ చేసింది. కంపెనీ అందిస్తున్న పాకెట్‌ ఫ్రెండ్లీ వీక్‌ డేస్‌ సర్వీస్‌ ఇప్పటికే కస్టమర్స్‌ ని అట్రాక్ట్‌ చేస్తున్నాయి. సెల్ఫ్‌ డ్రైవ్‌ కార్స్‌ మెయింటెన్స్‌ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని అంటున్నారు జూమ్‌ కార్‌ కో ఫౌండర్‌, సీఈఓ గ్రెగ్‌ మోరన్‌.

మరో స్టార్టప్‌ రేవ్ కూడా ఆడ్‌ ఈవెన్‌ ఫార్ములా ట్రయల్‌ పీరియడ్‌ కంపెనీ ఇన్‌కంను భారీగా పెంచుతుందని ఆశిస్తోంది. సెల్ఫ్‌ డ్రైవ్‌, కార్‌ పూలింగ్‌, షటిల్‌ సర్వీస్‌లకు డిమాండ్‌ భారీగా పెరుగుతుందని భావిస్తోంది. ట్రయల్‌ పీరియడ్‌లో బుకింగ్‌ డిమాండ్‌ దాదాపు 30శాతం వరకు పెరగొచ్చన్నది రేవ్‌ కో ఫౌండర్‌ కరణ్‌ ఝా మాట. రియల్‌ టైంలో డిమాండ్‌ను గమనించి కార్‌ పూలింగ్‌ సెగ్మెంట్‌ సర్వీస్‌ ను ఎక్స్‌ టెండ్‌ చేయాలన్నది రేవ్‌ ప్లాన్‌

ఆటో సర్వీసులకు మంచికాలం

కేవలం కార్‌ రెంటల్‌ సర్వీసులే కాదు... ఆటోరిక్షా సర్వీస్‌ ప్రొవైడర్స్‌ కూడా ఆడ్‌ ఈవెన్‌ ఫార్మలాపై ఆశలు పెట్టుకున్నాయి. అలాంటి సంస్థల్లో ఒకటి ఆన్‌ డిమాండ్‌ ఆటో రిక్షా ప్లాట్‌ఫాం జుగ్నూ. ఫుడ్‌, గ్రోసరీస్‌కు సంబంధించి హైపర్‌ లోకల్‌ డెలివరీ సర్వీసెస్‌ ను కూడా అందించే జుగ్నూ ఆడ్‌ ఈవెన్‌ ఫార్ములా తమకెంతో కలిసొస్తుందని ధీమాతో ఉంది. వాస్తవానికి కార్ల కన్నా ఆటో రిక్షాలపై ఆధారపడే వారే ఎక్కువ. ఢిల్లీలో దాదాపు వెయ్యి ఆటో రిక్షాల నెట్‌వర్క్‌ ఉన్న జుగ్నూ నాణ్యమైన సేవలందిస్తూ కస్టమర్ల మన్ననలు అందుకుంటామని చెబుతోంది. గవర్నమెంట్‌ తో పాటు పూచో యాప్‌ సర్వీస్‌ లతో టైఅప్‌ అయి సేవల్ని విస్తృతం చేయాలని భావిస్తున్నామని అంటున్నారు జుగ్నూ కో ఫౌండర్‌, సీఈఓ సమర్‌ సింగ్లా. నమ్మకమైన, సురక్షితమైన ప్రయాణాన్నందించేందుకు సిద్ధమైన జుగ్నూ డిమాండ్‌ ను బట్టి సర్వీసులు పెంచేందుకు సమాయత్తమవుతోంది. కస్టమర్లుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈజీ బుకింగ్‌ ప్రాసెస్‌ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది.

ఉబెర్‌, ఓలా, బ్లాబ్లా కార్‌, షటిల్‌ లాంటి కంపెనీలే కాదు ఇంకా ఇలాంటి సర్వీసులు అందించే కంపెనీలు అవకాశాన్ని అందిపుచ్చుకుని బిజినెస్‌ ఎక్స్ పాండ్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

ప్రస్తుతం బెంగళూరులో కార్‌ పూలింగ్‌ సర్వీసులు అందిస్తున్న ఉబెర్‌ ఢిల్లీలోనూ ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. సోషల్‌ గ్రూప్స్‌ లో పరిచయమున్నవారితో కలిసి ప్రయాణించేలా ఓలా షేర్‌ సిస్టంను అందుబాటులోకి తెచ్చిన ఓలా కంపెనీ సైతం ఢిల్లీలో సేవలు విస్తృతం చేసేందుకు ప్లాన్‌ రెడీ చేసింది. ఇక షటిల్‌ కంపెనీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి సంఖ్య విధానంపై జనానికి అవగాహన కల్పించేందుకు ఆడ్‌ఈవెన్‌ షటిల్‌ డాట్‌ కామ్‌ పేరుతో వెబ్‌ సైట్‌ ను ప్రారంభించింది.

మొత్తమ్మీద ఈ ట్రాన్స్‌ పోర్ట్‌ స్టార్టప్స్‌ అందిస్తున్న సేవలు ఢిల్లీలో కార్ల యజమానులకు ప్రత్యామ్నాయం చూపడంతో పాటు ఆయా కంపెనీలకు లాభాల పంట పండించనుంది. అంతేకాదు.. లక్షల మంది ప్రయాణీకులకు ప్రత్యామ్నాయం చూపలేక తలపట్టుకుంటున్న ప్రభుత్వానికి కాస్త రీలీఫ్‌ ఇస్తున్నాయి. ఢిల్లీలో రవాణా సమస్యకు సరికొత్త పరిష్కార మార్గం చూపుతున్న ఈ స్టార్టప్స్‌ పై ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా విధివిధానాలతో కూడిన పాలసీని రూపొందించడం శ్రేయస్కరం.