ఆటో గ్యారేజీలో పనిచేసే కుర్రాడు ఫార్ములా 4 ఛాంపియన్ అయ్యాడు

ఆటో గ్యారేజీలో పనిచేసే కుర్రాడు ఫార్ములా 4 ఛాంపియన్ అయ్యాడు

Tuesday August 08, 2017,

2 min Read

చేసే వృత్తిపట్ల నిబద్ధత చూపిస్తే అదృష్టం అడ్రస్ వెతుక్కుని మరీ తలుపు తడుతుంది. పాషన్ ఉండాలే గానీ ఫార్ములా వన్ అయినా, పానీపూరి బండి అయినా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది. చిత్తేశ్ మందోడి జర్నీ అలాంటిదే. ఒక ఆటోమొబైల్ గ్యారేజీలో పనిచేస్తూ ఫార్ములా ఫోర్ విజేతగా నిలిచాడు. జేకే టైర్ నేషనల్ రేసింగ్ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించాడు. ఎప్పటికైనా ఎప్ వన్ రేసర్ కావాలనేది అతడి ఆశయం.

image


మహారాష్ట్ర కొల్హాపూర్ కి చెందిన చిత్తేశ్ ఫ్యామిలీలో తాతల కాలం నుంచీ మెకానిక్ పనిచేసేవారు. 85 ఏళ్లుగా స్థానికంగా ఒక గ్యారేజీ నడిపిస్తున్నారు. అప్పట్లో కొల్హాపూర్ రాజులు వాడే కారుకి సర్వీసింగ్, రిపేర్లు గట్రా చేసేవాళ్లు. చిత్తేశ్ కి ఎనిమిదో ఏటనే డ్రైవింగ్ పై మక్కువ పెరిగింది. రోజూ తాతతో కలిసి గ్యారేజికి వెళ్లేవాడు. లగ్జరీ కారు రిపేరుకో సర్వీసింగుకో వచ్చినప్పుడల్లా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటానని పట్టుబట్టువాడు. అలా మొదలైన ప్యాషన్ డ్రైవింగ్ నేర్చుకునేదాకా వెళ్లింది.

రేసర్ కావాలంటే మాటలు కాదు. ముఖ్యంగా ఖర్చు. సాధారణ ఆటో మొబైల్ గ్యారేజీ నడిపే తన కుటుంబానికి అంత తాహతు లేదు. అంతమాత్రం చేత చిత్తేశ్.. తన డ్రీమ్స్ మాత్రం వదల్లేదు. 2007లో ఒకసారి అవకాశం వచ్చింది. శివాజీ మొహిత్ అనే ఓ వ్యాపారి, జేకే టైర్స్ వాళ్లు చిత్తేశ్ మీద నమ్మకంతో వెన్నుతట్టి ప్రోత్సహించారు. అనుకున్నట్టుగానే రొటాక్స్ జూనియర్ టైటిల్ సాధించాడు. ఇక అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

రేసింగ్ అంటే ఇతర క్రీడల్లా కాదు. ప్రభుత్వం పెద్దగా సపోర్ట్ ఇవ్వదు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చినా, ఆశించినంత ఉండదు. వాళ్లకూ పరిమితులుంటాయి. అందుకే చాలామంది రేసర్లు ఈ క్రీడ ఎంచుకోవడం పట్ల ముందూ వెనుకా ఆలోచిస్తుంటారు. ఇండియాలో మోటార్ స్పోర్ట్స్ ఇష్టపడేవాళ్లకు కొదవలేదు. కానీ ఎటొచ్చీ దానికయ్యే ఖర్చే పెద్ద గుదిబండ.

అయినా సరే చిత్తేశ్ చిత్తం నిండా ఫెరారీ కారే ఉంది. ఎప్పటికైనా ఫార్ములా వన్ టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ రేసర్ గా పేరు తెచ్చుకోవాలని తపన పడుతున్నాడు. తాను ఆరాధించే ఫెరారీ ఫినిష్ డ్రైవర్ కిమి రైకొనెన్ నిలువెత్తు పోస్టర్ ని తన గుండె గోడల మీద ప్రతిష్టించుకున్నాడు.