శేఖర్ నాయక్- అంధుల క్రికెట్ లో రెండు ప్రపంచ కప్పులు గెలిపించిన మరో ధోని !

అన్నీ బాగుండి.. ఆర్ధికస్తోమత సహకరించి.. ఏ కళలోనైనా,, క్రీడలోనైనా నైపుణ్యం సాధించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ.. రెండు కళ్లూ లేకపోయినా కూడా క్రికెట్‌లో రాణిస్తూ పేరుతెచ్చుకున్న ఓ కుర్రాడి కథ ఇది!

0

పట్టుదల, కృషి ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అందుకు శరీరంలో లోపాలు ఏమాత్రం అవరోధాలు కాదని నిరూపించాడో వ్యక్తి. రెండుకళ్లూ లేకపోయినా అతను మనోనేత్రంతోనే అన్నిటినీ జయించాడు. పుట్టుకతోనే అంధుడైనా.. పట్టులదలతో క్రికెట్ నేర్చుకున్నాడు. భారత్ పేరును అంతర్జాతీయ చిత్రపటం సువర్ణాక్షరాలతో లిఖించాడు. ఇది విధిని ఎదురించి ఓడించిన ఓ ధీరుడి కథ!

శేఖర్ నాయక్. అతను నిజంగా నాయకుడే! ఊరు కర్నాకటలోని షిమోగా. చిన్నతనంలోనే క్రికెట్ అంటే ఆసక్తి . తాను లోకాన్ని చూడలేకపోయినా.. అది ఏ మాత్రం అడ్డుకాదని అనుకున్నాడు. పట్టుదలతో కోచింగ్ తీసుకున్నాడు. 2000వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తన సత్తా ఏంటో ప్రపపంచానికి చూపించాడు. 46 బాల్స్‌లో 136 రన్స్ కొట్టి అందరిచేత శభాష్ అనిపించుకున్నాడు. ఈ రికార్డుతో శేఖర్ దశ తిరిగిపోయింది. కర్నాటక అంధుల క్రికెట్ టీంలో చోటు దక్కింది. ఫైనల్ మ్యాచ్‌లో కర్నాటక తరఫున ఆడి 249 పరుగులు సాధించి తన జట్టును దగ్గరుండి గెలిపించాడు.


శేఖర్ నాయక్
శేఖర్ నాయక్

ఆ మ్యాచ్ తర్వాత శేఖర్ వెనక్కు తిరిగి చూసుకోలేదు. తన కెరీర్‌లో అపజయమనే మాటే వినబడలేదు. లెక్కలేనన్ని మ్యాచ్లను ఒంటిచేత్తో గెలిపించాడు. 2006లో పాకిస్తాన్ తో వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓడిపోయినా కూడా టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. 2010లో భారత అంధుల టీంకు కెప్టెన్‌గా సెలెక్ట్ అయిన శేఖర్.. రెండేళ్ల తర్వాత మొట్టమొదటి టీ-20 వరల్డ్ కప్‌ అందించాడు. ఇంగ్లండ్‌తో ఆడిన ఆ మ్యాచ్‌లో 58 బాల్స్‌లో 134 రన్స్ చేసి..ఇండియాను ఛాంపియన్ గా నిలిపాడు.

అంధుల క్రికెట్‌కు ప్రజల్లో ఆదరణ లేకపోవచ్చుగానీ, ఆటలో రికార్డుల పరంగా అతను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు ఏమాత్రం తీసిపోడు. ఇవేగాక ఎన్నో అంతర్జాతీయ మ్యాచుల్లో భారత్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఘనత శేఖర్‌ది. ఈ స్ధాయికి చేరుకోవడం అంత ఈజీ కాలేదంటాడు శేఖర్. క్రికెట్‌ని ఒక మతంలా కొలిచే మన దేశంలో అంధుల క్రికెట్‌కు మాత్రం ఆదరణ లేకపోవడమే ఇందుకు కారణం.

"బీసీసీఐ ప్రపపంచంలోనే రిచ్చెస్ట్ బోర్డ్. వాళ్లకు వచ్చే ఆదాయంలో 3శాతం మాకు కేటాయిస్తే.. మమ్మల్ని కాస్త ఎంకరేజ్ చేస్తే.. నిజంగా మేమంటే ఏంటో చూపిస్తాం" అంటాడు శేఖర్.

అందుకే.. తనవంతుగా భవిష్యత్తులో అంధ క్రికెటర్లకు కోచింగ్ ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లే తనకు ప్రేరణ అంటాడాయన..

"మా అమ్మకు కూడా సరిగా కళ్లు కనబడవు. చిన్నతనంలోనే జీవితంలో ఏదొ ఒకటి సాధించాలనే తపనను నాకు నూరిపోసింది" అని గర్వంగా చెప్తాడు.


శేఖర్ నాయక్
శేఖర్ నాయక్

బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసిన శేఖర్ సమర్ధానం బ్లైండ్ ట్రస్ట్‌లో రూప అని తనలాంటి అమ్మాయిని ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. వాళ్లకు ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. ధోనీ మాదిరిగా తన సారథ్యంలో 2012లో టీ20 ప్రపంచకప్, ఒక వన్డే ప్రపంచ కప్ ను అందించిన 29 ఏళ్ల శేఖర్.. ప్రస్తుతం జీవనోపాధి కోసం అర్రులు చాస్తున్నాడు. ఓవైపు తిరుగులేని బ్రాండ్ వాల్యూతో ధోనీ ఏటా వందల కోట్లు సంపాదిస్తుంటే, శేఖర్ మాత్రం ఇల్లు గడవడానికి రూ. 15 వేల జీతానికి ఓ ఎన్జీవోలో పనిచేస్తున్నాడు.

Related Stories

Stories by Karthik Pavan